Previous Page Next Page 
సృష్టి పేజి 20


    ట్రైన్ లో మీ చెల్లెలు ఏ పెయిన్ లేకుండా వుంది. మామూలు మనిషిలా నడిచింది. కారెక్కి ఇంటికొచ్చింది. ఇంటినుంచి ఇక్కడికొచ్చే సమయంలో మళ్ళీ ఈ వ్యాధికి గురై పోయింది. హిందీ హీరో అమితాబ్ బచ్చన్ కి కూడా దాదాపు ఇదే వ్యాధి వచ్చింది. ఈ వ్యాధి తీవ్ర దశలో వున్నదనడానికి ఏకైక గుర్తు నెత్తిమీద జుత్తు నెమ్మదిగా వూడిపోవడం ప్రారంభిస్తుంది. ఇది నందినిలో కనిపించడంలేదు కాబట్టి వ్యాధి పూర్తిగా ముదిరిపోలేదని అర్థం. ఒక వారం  రోజులపాటు ఆమెను అండర్ చెకప్ లో వుంచాలి. ప్రతి గంటకు ఆమె బ్లెడ్  ను  టెస్ట్  చేయాల్సి వుంటుంది. ఆ తర్వాత అమెరికన్ స్పెషలిస్ట్ ను కం సల్ట్ చేస్తాను. డోన్ట్ వర్రీ! నేను టేకప్ చేసిన కేనప్పుడూ ఫెయిల్యూర్ కాలేదు" అన్నాడాయన ధైర్యం చెబుతున్నట్లుగా.

 

    ఆ తర్వాత అభినవ్ గంటన్నరసేపు విజిటర్స్ హాల్లో గజిబిజి ఆలోచనలతో గడిపాడు.

 

    ప్రస్తుతం  అతను ఆలోచిస్తున్న విషయం తను భరించాల్సిన హాస్పిటల్ ఛార్జీల విషయం. తన దగ్గర వున్న సొమ్ము ఏ మాత్రం  సరిపోదని తెల్సు. మరి ఎలా? నందినిని అమెరికా తీసికెళ్ళాల్సి వస్తే....."

 

    ఆ ఆలోచనకే అతని వంటి నిండా చిరుచెమటలు పట్టేశాయి.

 

    సరిగ్గా  అదే సమయంలో దూరంగా వరండా చివర డ్యూటీరూంలో నుంచి బయటికొచ్చిన డాక్టర్ రమణ నేరుగా అభినవ్ దగ్గరకొచ్చాడు.

 

    "అభినవ్ మీరేనా?"

 

    ఆ తెలుగు మాటకు తలెత్తి చూశాడు అభినవ్.

 

    "నా పేరు రమణ. గుంటూరు. మీరు ఆర్టిస్టు అని, తెలుగువారని తుషార్ చెప్పారు" అని తనని తాను పరిచయం చేసుకుని" హరిహరన్ గారి దగ్గర్నించి మీకు ఫోన్ వచ్చింది" అని చెప్పి కారిడార్ లోకి నడిచాడు  డా||రమణ.

 

    లేచి డ్యూటీ రూం వైపు నడిచాడు అభినవ్.

 


                                      *    *    *

 

    అప్పటికి సరిగ్గా నలభై ఎనిమిది గంటల తర్వాత రాత్రి  ఎనిమిది  గంటలు దాటింది.

 

    మీనంబాకం  వంతెనకు కొంచెం దూరంలో వున్న పళని నర్సింగ్ హోం డ్యూటీ డాక్టర్ రూంలో అసహనంగా కూర్చుంది లిపి.

 

    అప్పటికి పగలు డ్యూటీ చేసిందామె. రావల్సిన రిలీవర్ రాకపోవడంతో సూపరింటెండెంట్ నైటు  డ్యూటీ వేశాడు.

 

    "చూడు లిపి! నైట్ టైమ్ లో పెద్దగా  కేసులు రావు. ఓ మూడు గంటలు కాలక్షేపం  చేస్తే చాలు. నిన్ను మీ ఇంటి దగ్గర  డ్రాప్  చేస్తాను కంగారుపడకు."

 

    ఆ మాటన్న సూపరింటెండెంట్ పద్మనాభన్ ముఖాన్ని గుర్తుకు తెచ్చుకుంటోందామె.

 

    తను సాయంత్రం ఆరుకల్లా యింటికి పోకపొతే తల్లి గింజుకు పోతుందన్న విషయం  గుర్తుకు రావడంతో చాలా అసహనంగా వుంది లిపికి.

 

    అడపా దడపా మగ డాక్టర్స్ తనవేపు అదోలా చూడటం, డ్యూటీలో వున్న నర్సులు, కొత్తవల్ల ఎక్కువ మాట్లాడకపోవడం, అందులోనూ ఆ మాట్లాడే తమిళం తనకు అర్థం కాకపోవడం అంతా వింతగా , కొత్తగా వుంది లిపికి.

 

    రాత్రి తొమ్మిది గంటలు దాటి ఇరవై నిమిషాలైంది.

 

    "సూపరింటెండెంట్ సాబ్  పిలుస్తున్నారు" తమిళంలో చెప్పింది నర్స్ వచ్చి.

 

    నెమ్మదిగా లేచి కారిడార్ లో చివరలో వున్న పద్మనాభాస్ రూమ్ వేపు అడుగువేసింది లిపి.

 

    రూమ్ డోరు దగ్గరగా వేసుంది.

 

    "మే ఐ కమిన్ సార్?"

 

    ఆమె కోసమే ఎదురుచూస్తున్నట్లుగా పద్మనాభాన్  వెంటనే  డోరు  తెరిచి "కమిన్ బేబీ! గెటప్" అని రిలాక్సడ్ గా కూర్చున్నాడాయన.

 

    "టిఫిన్ తెప్పించాను తిను. అందుకే పిల్చాను" నెమ్మదిగా అన్నా డాయన.

 

    అదే సమయంలో గదిలో ఏదో వింత వాసన. అది మెడిసిన వాసన కాదని అరక్షణంలో గుర్తు పట్టింది లిపి.

 

    "థాంక్యూసర్! డ్యూటీ అయ్యాక ఇంటికెళతాను కదా" ఇంగ్లీషులో అంది లిపి.

 

    "కొంచెం లేటవుతుందేమోనని అంతే!" కాసేపు మౌనం.

 

    పద్మనాభాన్ కి తెలుగు బాగా వచ్చు. అతని అసలు పేరు పద్మనాభం చాలాకాలం క్రితం మద్రాసులో సెటిలవ్వడంవల్ల బ్రతుకుతెరువు కోసం పద్మనాభాన్ గా పేరు మార్చుకున్నాడు.

 

    "చూడు లిపి! ఐ లైక్ యువర్ ఫెర్ ఫార్మెన్స్ పేషెంట్స్ కూడా చాలామంది  కాంప్లిమెంట్ చేశారు. వాళ్ళ  బాధల్ని ఓపిగ్గా విన్నావని, ఐ లైక్  దట్ పెషన్స్. ఒక నెల రోజులు ఓపికపట్టు. నీ సాలరీతో పాటు నీ  హోదా కూడా పెరుగుతుంది" లేచి కుర్చీ వెనకనున్న కర్టెన్ వెనక్కివెళ్ళి రెండు నిమిషాల  తర్వాత  బయటికొచ్చి మళ్ళీ కుర్చీలో కూర్చున్నాడు.

 

    "అయితే టిఫిన్ చెయ్యనంటావ్" ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు పద్మనాభన్.

 

    ఏం మాట్లాడలేదు లిపి.

 

    "ఇవాళ నిన్ను వదిలేస్తున్నాను. రేపు రాత్రి నువ్వు నాతో టిఫిన్ చెయ్యాలి సుమా" చాలా క్యాజువల్ గా  వున్నాయి ఆ మాటలు.

 

    "నేను చూసుకుంటాను. నువ్వింటికెళ్ళిపో. డ్రైవరు నిన్ను డ్రాప్  చేస్తాడు."

 

    బతుకు జీవుడా  అంటూ  బయటికొచ్చింది లిపి. పద్మనాభన్ కేరెక్టర్ లో  ఎక్కడో, ఏదో లోపముందని ఆమెకు మనసులో ఏదో అనుమానం. కారులో  వస్తూ అదే విషయం గురించి ఆలోచించిందామె.

 

    
                                           *    *    *

 

    స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సెంట్రల్  ఆఫీస్.

 

    హరిహరన్  ఎదురుగా కూర్చున్నాడు అభినవ్.

 

    "భలేవాడివయ్యా నువ్వు. కావ్య నీ కోసం నాకు ఎన్నిసార్లు  ఫోన్ చేసిందో  తెలుసా? కనీసం ఆమెకు  చెప్పకుండా హైద్రాబాద్ నుంచి నీ  చెల్లెల్ని తీసుకుని వచ్చేశావట. నువ్వెక్కడున్నావో ట్రేస్  చెయ్యడానికి నాకు రెండు రోజులు  పట్టింది. నందిని  గురించి నువ్వేం  వర్రీ  కావద్దు. కుమారన్ తో నేను  మాట్లాడాను. ఒక రెణ్నెల్లు ఓపికపట్టు. షి విల్ బీ ఆల్ రైట్!" భరోసా యిస్తూ  అన్నాడు హరిహరన్.

 

    "అంతా బాగానే వుంది సార్! కానీ నందినిని అమెరికా తీసికెళ్ళాలంటే ఏం చేయాలో నాకు తోచడంలేదు" తన మనసులో బాధను నెమ్మదిగా వ్యక్తం చేశాడు అభినవ్.

 

    నవ్వాడు హరిహరన్.

 

    "మీ  ఆర్టిస్టులతో ఇదేనయ్యా గొడవ. చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెద్దగా చూసుకుని వర్రీ అయిపోతారు. నీకు  పికాసో  తెల్సు కదా?"

 

 Previous Page Next Page