Previous Page Next Page 
అథర్వ వేద సంహిత పేజి 19

 

5.    పరస్పర విరుద్ద భావముల వారిని విరుద్ద రహితులను, ప్రసన్నులను చేయుచున్నాను. మీ మాటలు, చేతలు, సంకల్పములను విరోధ భావ రహితులను, అనుకూలురను చేయుచున్నాను. ఇది వరకు మీరు చేసిన పరస్పర విరుద్ద కర్మములను అనుకూలము చేయుచున్నాను.
   
6.    మీ ప్రతికూల మనసులను నా మనసుచే అనుకూలము చేయుచున్నాను. మీరు సహితము నా చిత్తముతో అనుకూలురై వెంట సాగండి. నా పనులందు మీ మనసులు లగ్నము చేయండి. నేను నడుచు మార్గమున మీరు నా వెంట రండి.
   
                                           నాలుగవ సూక్తము -9
   
వినియోగము :-

   
    విఘ్న నివారణ కర్మమున 'అరలు' మణిని కట్టవలెను. సర్పము, కొమ్ములున్న, కోరలున్న     జంతువుల బాధా నివారణకు సంపాతిత వెదురు దండము ధరించవలెను. యుద్దమున శత్రువు రచించిన     మాయ మున్నగు విఘ్న నివారణకు సంపాతిత ఆయుధము ధరించవలెను. అన్ని పనులు     ప్రారంభించునపుడు విఘ్నశాంతికి 'ఫలీకరణ' ధూపము వేయవలెను.
   
1.    గిట్టలున్న, గిట్టలు లేని జంతువులకు ద్యావాపృథ్వులు తల్లిదండ్రులు అగుచున్నారు. దేవతలారా! వానిని మా మీదకు తోలినట్లే వానిని వెనుకకు రప్పించుకొనండి.
   
వ్యాఖ్య -    సింహశార్దూలాదుల తల్లిదండ్రులు ద్యావాపృథ్వులు  అయినందున వానిని నివారించుట మానవులకు సాధ్యపడునది కాదు. కావున దేవతలే నివారింప వలసి ఉన్నది.
   
2.    విఘ్న నివారణకు దేవతలు 'అరలు' మణిని ధరించినారు. మనువు కూడ ధరించినాడు. నేను ఆ మణిని ధరించి ఎద్దుకు వట్ట కొట్టినట్లు విఘ్నములను నిర్వీర్యము చేయుచున్నాను.
   
3.    అన్యులు కల్పించిన విఘ్నములు నివారించుటకు సాధకులు పింగళ వర్ణ సూత్రమున కట్టిన అరలు మణిని ధరింతురు. మేము ధరించిన "అరలు మణి" శ్రవస్యాన్నము, శోషకము, కుర్వర వర్ణ క్రూర జంతువుల బాధను నివారించును గాక.
   
4.    శత్రువును జయించి అన్నము సాధించదలచిన వీరులారా! మీరు యుద్దమున అసుర మాయామోహితులై ఉన్నారు. ఇతరులు చేసిన - దేవతలు చేసినటు వంటి - మాయలో పడి ఉన్నారు. కోతులు కుక్కలను తరిమినట్లు ఈ ఆయుధము ఆ మాయలను తరుమును గాక.
   
5.    మణీ! అన్యులు కల్పించిన విఘ్న నివారణకు నిన్ను ధరించుచున్నాను. 'కాబవ' నివారణకు నిన్ను ధరించుచున్నాను. వేగవంత అశ్వముల రథము ఆటంకములు లెక్కచేయక సాగినట్లు విఘ్నములను లెక్కింపక మా కార్యములు సాధింతుము గాక.
   
    (నూటఒక్క విఘ్నములలో 'కాబవ' ఒకటి.)
   
6.    భూమి మీద అనేక విధముల నూటఒక్క విఘ్నములున్నవి. వానిని నివారించుటకే దేవతలు ఈ మణిని సృష్టించినారు. కావున విఘ్ననివారక 'అరలు' మణిని నేను ధరించుచున్నాను.
   
                                           మొదటి సూక్తము - 10
   
వినియోగము :

   
    పుష్టి కొరకు. అష్టకా కర్మమున - మాఘకృష్ణ అష్టమి అష్టక యగును.
   
      1)  ఘ్రుతము, మాంసము, స్థాలీపాకము ఈ మూడింటిలో ఒక్కొక్క దానితో మూడు మూడు మారులు     ఆహుతి ఇవ్వవలెను. తొమ్మిది సార్లు సూక్తము చదువవలెను.
   
    యవల పేలాలు, పెరుగు కలిపిన సత్తు, పూరీ, పురోడాశము, క్షీరాన్నము, తైలాన్నములను     'అధిశ్రయణ' పర్వాగ్ని కరణముతో సంస్కరించి నేతితో కలిపి ఇరువది ముద్దలు చేయవలెను. పశువు     యొక్క కుడి భుజమును, వెంట్రుకలు లేని సచర్మ ఖురమును కడిగి ఈ సూక్తముచే దర్వి ద్వారా ప్రత్యేక     మంత్రముచే హోమము చేసి చివరన దర్విసహిత ఇరువది ఒక్క ఆహుతిని హోమించవలెను. దాని విధానం     బెట్టిదనిన :-
   
    1-5, 8, 9, 11 - 12 మంత్రములచే తొమ్మిది పిండములను ఆహుతి చేయవలెను. 10వ     మంత్రముచే యజించి స్వ్గాహా చేయవలెను.
   
    అనుషంగ సహితముగ ఎనిమిది తీరుల విభజించిన మంత్రముచే ఎనిమిది పిండములను హోమించవలెను.     13 వ మంత్రముచే పద్దెనిమిదవ ఆహుతి ఇవ్వవలెను.
   
    'అహోరాత్రిభ్యాం త్వాయజే స్వాహా' అను కౌశిక సూత్రమందలి 14 - 2 సౌత్రామంత్రముచే పందిమ్మిదవ     ఆహుతి ఇవ్వవలెను.
       
    6,7 మంత్రములచే పశువు కుడి భుజమును ఇరువదవ ఆహుతి ఇవ్వవలెను. అది లభించనపుడు     ఘ్రుతాహుతి ఇవ్వవలెను.
   
    7 వ మంత్రముచే సదర్వియగు ఇరువది ఒకటవ ఆహుతి ఇవ్వవలెను.
   
    యవల పేలాలు మున్నగు శేషమును ఈ పూర్ణ సూక్తముచే మూడు ఆహుతులు ఇవ్వవలెను.
   
      2) అష్టకా కర్మమున చేసిన హోమములు కాక, మరల అట్లే ఆహుతులు ఇవ్వ వలెను.
   
      3) సోమయాగమందు సోమక్రయణీయ పదహోమానుమంత్రణమున 6వ ఋక్కు వినియోగము.
   
      4) చాతుర్మాస్య హోమపు సాకమేధపు పూర్ణ దర్వీ హోమమున 7వ మంత్రపు ఉచ్చారణ.
   
      5) రాత్రి రాజుకు హారతి ఇచ్చునపుడు రెండవ ఋక్కు, పిండి బొమ్మను ఏర్పరచుటకు 3 మూడవ మంత్రము     ఉపయోగము.
   
      6) ఉప స్థానమున ఏడవ మంత్ర ప్రయోగము.
   
1.    తొలుత రాత్రింబవళ్ళు లేకుండెను. ఉషస్సులే వాటిని ఏర్పరచినవి. అవి పితరులకు ఏకాష్టక ధేనువులు అయినవి. అవి మాకు యశస్వినులు, ముందు ముందు ఉత్తమ ఫలితములు ఇచ్చునవి అగును గాక.
   
2.    ఇది ఏకాష్టక ధేను రూపరాత్రి. ఇది దరి చేరగా హవి ఆరగించు దేవతలు ప్రశంసింతురు. ఆ ఏకాష్టక సంవత్సరమునకు భార్య అగుచున్నది. ఆమె మమ్ము అనుగ్రహించును గాక. శుభములు కలిగించును గాక.
   
3.    రాత్రీ! నీవు సంవత్సరమునకు ప్రతిరూపమవు. నిన్ను మేము ఉపాసించుచున్నాము. ఆమె మమ్ము ఆయుష్మంతులను, ప్రజావంతులను, ధనవంతులను చేయును గాక.
   
4.    ఈమె యే ఉష. తొలుత రాత్రింబవళ్ళను ఏర్పరచినది. అంధకారమును దూరము చేసినది. ఈ ఉష ఇతర ఉషస్సులందు చేరి సంచరించును. ఈ ఉష మహా మహామహిమలు గలది. సూర్య, సోమ, అగ్ని మున్నగు దేవతలు ఈమె యందే ఉంటున్నారు.
   
5.    ఏకాష్టకా! వృక్షరూపములగు రోలు, రోకలి నీకు సంవత్సరము వరకు కావాల్సిన వానిని దంచి, నూరి నీ కొరకు సుశబ్దములు కలిగించుచున్నవి. మేము మంచి సేవకులు, వీర పుత్రులు గలవారలమై ధనస్వాములను అగుదుము గాక.
   
6.    ఇళాదేవి ఘ్రుతపాదము జారుచున్నది. జాతవేద అగ్నీ! నీవు హవిస్సులను స్వీకరించుము. గ్రామ్య పశువులు అనేకములున్నవి. వాణిలో గోవు, అశ్వము, మేక, గొర్రె, గాడిద, ఒంటె ఈ ఏడింటియందు నాకు ప్రీతి కలిగించుము.
   
7.    రాత్రీ! నాకు ధన, పుత్ర పౌత్ర సమృద్ధి కలిగించుము. మేము దేవతల మంచి మనసులందు నిలిచెదము గాక.
       
    సాధనమవగు దర్వీ! హవి నింపుకొని మేము పూజించు దేవతల వద్దకు చేరుము. మా అభిమత ఫలములు నింపుకొని మా వద్దకు తిరిగిరమ్ము. సమస్త దేవతలను హవిచే సంతుష్టులను చేయుము. వారినుండి మాకు అన్నము, బలము తెమ్ము.
   
8.    ఏకాష్టకా! నీ భర్త యగు సంవత్సరము వచ్చినాడు. నీవు అతనితో సుఖించుము. మా పుత్ర పౌత్రాదులను ఆయుష్మంతులను చేయుము. మాకు ధనపుష్టి కలిగించుము.
   
9.    ఋతువులను యజించుచున్నాను. ఋతుపతిని యజించుచున్నాను. రుతువుల అవయవములను యజించుచున్నాను. సంవత్సరములను, మాసములను భూతముల పతిని యజించుచున్నాను.
   
10.    ఋతువుల ప్రసన్నతాకు రాత్రింబవళ్ళ ప్రసన్నతకు మాసముల సంవత్సరాముల ప్రసన్నతకు, ధాత విధాత సమృద్ది దేవతల ప్రసన్నతకు, భూతస్యపతి కొరకు ఏకాష్టకమును యజించుచున్నారు.
   
11.    మాంసము, ఉపస్తరణము, అభిఘార ఘ్రుత యుక్త హోమము చేయుచు దేవతలను యజించుచున్నాము. వారి అనుగ్రహమున సకల కోరికలు తీర్చగల, అనేక గోవులు నిండిన గృహమున సుఖముగ వసింతుము గాక.
   
12.    ఏకాష్టక అందరి స్వామిని. ఆమె తపస్సు చేసి మహిమాన్వితుడగు ఇంద్రుని కన్నది. ఇంద్రుని కన్నది. ఇంద్రుని ద్వారా దేవతలు శత్రువులగు అసురులను అణచి వేసినారు. శచీపతి వినాశకారులకు ఘాతకుడు అగును గాక.
   
13.    ఇంద్ర పుత్ర, సోమపుత్ర, ఏకాష్టక! నీవు ప్రజాపతి దుహితవు. మా హవిస్సులు స్వీకరించుము. మా కోరికలు తీర్చుము.
   
                                          మూడవ అనువాకము
                                      మొదటి సూక్తము - 11
   

వినియోగము :
   
      1) బాలగ్రహరోగము, నిరంతర స్త్రీ సంగమము వలన కలిగిన యక్ష్మకు చితపండు, చేపల అన్నమును ఈ     సూక్తముచే అభిమంత్రించి భోజన సమయమున తినిపించవలెను. అడవి నవ్వుల కట్టెతో కాచిన నీటితో ఉషః     కాలమున అడవిలో గాని ఇంటిలో గాని రోగికి స్నాన మార్జన, ఆచమనములు చేయించవలెను. అడవి     జనుము, అడవి పిడకలు, 'చిత్య' మున్నగు శాంతా ఔషధములతో కాచిన నీటితో రోగికి ప్రాతః     కాలమున స్నాన, మార్జన ఆచమనములు చేయించవలెను.
   
      2) సకల రోగ నివారణకు రోగిని తాకి ఈ సూక్తముచే అభిమంత్రణ చేయవలెను.
   
      3) అహోలింగ గణమున ఈ సూక్తపాఠము ఉన్నది.
   
      4) యజ్ఞమున జబ్బుపడిన యజమానికి చికిత్స కొరకు ఈ సూక్తమును చదువవలెను.

 Previous Page Next Page