5. దూర దేశమున ఉన్నరాజా! శీఘ్రముగ రమ్ము. ద్యావాపృథ్వులు నీకు శుభములు కలిగించును గాక. వరుణుడు నిన్ను రాజుగా సంబోధించును గాక. వరుణుడు నిన్ను ఆహ్వానించుచున్నాడు. నీవు రాజ్యమున అడుగు పెట్టుము.
6. పరమైశ్వర్య ఇంద్రా! వరుణుని సహితముగా ఈ రాజు రాజ్య ప్రవేశమునకు నీవు అనుమతించి ఉన్నావు. కావున నీవు ప్రజలముందునకు రమ్ము. ఇంద్ర వరుణుల అనుమతి పొందిన రాజు రాజ్య ప్రవేశము చేయును గాక. ప్రవేశించి దేవతలను యజించును గాక. అతడు ప్రజలను వారివారి పనులందు నియమించును గాక.
7. రాజా! సమృద్దములగు మార్గములందు హితము కూర్చు రేవతులను జలదేవతలు శుభములు కలిగింతురు గాక. వీరందరు ఏకమనస్కలై నిన్ను రాజ్యమునకు ఆహ్వానింతురు గాక. అప్పుడు నీవు ప్రచండ బలవంతుడవై వార్ధక్యము వరకు రాజ్యమును పాలింతువు గాక.
ఐదవ సూక్తము - 5
వినియోగము : ధన, బల, తేజోపుష్టికి మోదుగు చెట్టు మణిని ఈ సూక్తముచే వాసిత, సంపాతిత, అభిమంత్రణము చేసి కట్టవలెను. అంగీరసీ మహాశాంతి యందును.
1. పలాశ మణిని ఆహ్వానించుచున్నాను. అది సంపదలు ఇచ్చునది. శత్రువును వధించునది. ఈ మణి ఇంద్రాదుల బలము కలది. ఓషధుల సారము కలది. ఇది నన్ను విడువకుండును గాక. నన్ను తేజస్విని చేయును గాక.
2. పలాశమణీ! నా యందు బలమును ప్రవేశపెట్టుము. ధనము ప్రసాదించుము. నేను నా బలమున రాజ్యమును నా అధీనమున ఉంచుకుందును గాక. నేను ఉత్తముడను అగుదును గాక.
3. ఇది ప్రియమణి. దేవతలు దీనియందు ఓషధుల రహస్య రహస్య గుణములను చేర్చినారు. దేవతలు ఆ మణిని మమ్ము భరించనట్లును, ఆయుష్యము కలిగించునట్లును మాకు ప్రసాదింతురు గాక.
4. ఉగ్రబలసంపన్న సోమ మణి మాకు లభించును గాక. ఈ మణి మిరుమిట్లు గొలుపునది. ఇంద్రునిచే ఇవ్వబడినది. వరుణునిచే అనుష్టించ బడినది. దీనిని నేను 'దీర్ఘాయుత్వాయ శతశరదాయ' ధరించుచున్నాను.
5. ఈ మణి నాకు అనంత శుభములు కలిగించుచు చిరకాలము మాతో ఉండును గాక. మేము ఆర్యమను, సమాన బలవంతులను మించుటకు ఈ మణిని కట్టుకొనుచున్నాము.
6. మత్స్య కారులు, రథకారులు, కర్మకారులు మనీషులు వీరందరిని పలాశమణీ! నా చుట్టు చేరి సేవించు వారిని చేయుము.
7. అన్య రాజులు, రాజును చేయువారు, సూతులు, గ్రామణ్యులు వీరందరినీ పలాశమణీ! నా చుట్టు చేరి సేవించు వారిని చేయుము.
8. మణీ! నీవు అమృతమయ సోమమవు. దేహ రక్షకమవు. వీర్యవు. వీర్యమానవు. కావున నా సహజన్మవు.
"సంవత్సరస్య తేజసాతేనబద్నామి త్వా మణే" సూర్యుని తేజస్సుగా నిన్ను నేను కట్టుకొనుచున్నాను.
(మణి అనగా తాయెత్తు వంటిది.)
రెండవ అనువాకము
మొదటి సూక్తము - 6
వినియోగము :
1) అభిచార కర్మమున ఖదిరమున పెరిగిన అశ్వత్థ మణిని సంపాతన, అభిమంత్రణ చేసి కట్టవలెను. ఇంగిడాలంకృత పాచికలను సంపాతిత, అభిమంత్రణములు చేసి 'శత్రు మర్మము'న పాతిపెట్ట వలెను. పాచికలను సంపాతిత, అభిమంత్రణ చేసి 7వ మంత్రము, నదిలో వదల వలెను. అట్లే 8వ మంత్రముచే రావి కొమ్మకు కట్టవలెను.
6. అశ్వత్దమా! నీవు ఏ చెట్టు నందు పుట్టుదువో ఆ చెట్టును కొంచెపు దానిని చేయుచున్నావు. అట్లే మా శత్రువుల తలలను భేదించుము. వారిని లెక్క చేయకుము. నష్టపరచుము.
7. కట్టు విడిచిన నావ నదిలో కొట్టుకొని పోయినట్లు మా శత్రువులు కొట్టుకొని పోవుదురు గాక. అశ్వత్దము! చీల్చి పుట్టిన ఖదిరమునకు పునరుత్పత్తి లేనట్లే మా శత్రువులు మరల తలెత్తకుందురు గాక.
8. మా శత్రువులను ధ్వంసము చేయుటకు మనోస్థానమునఉచ్చాటన చేయుచున్నాను. మంత్రములచే శత్రుస్థానమున ఉచ్చాటన చేయుచున్నాను. రావి చెట్టు కొమ్మ మీద నిలిచి శత్రువులను ధ్వంసము చేయుచున్నాను.
రెండవసూక్తము - 7
వినియోగము :-
1) క్షేత్రీయ, వంశానుక్రమ వ్యాధుల శాంతికి ఈ సూక్తముచే జింకకొమ్ము మణిని కట్టవలెను. కొమ్ము ముంచిన నీటిని త్రాగవలెను. జింక చర్మము మచ్చ భాగమును కాల్చి, నీటిలో కలిపి, ఆ నీటిని ప్రాతః కాలమున రోగి మీద చల్లవలెను. యవల హోమము చేసి అభిమంత్రిత అన్నము తినవలెను.
2) రోగియగు బాలకునకు ఈ సూక్తముచే కౌమారీ మహాశాంతి చేయవలెను.
1. వడివడిగ పరుగులిడు జింక తలలో మొలిచిన కొమ్ములు ఔషధము అగుచున్నది. ఆ కొమ్ము వంశానుక్రమముగా వచ్చు క్షయ, కుష్ఠు, అపస్మారములను అన్ని కోణముల నుంచి నష్టపరచును గాక.
2. వరము లివ్వ గల జింక కొమ్ము తన నాలుగు కాళ్ళచే వ్యాధులను మర్దించుచున్నది. అది ఈ రోగి హృదయమున గూడు కట్టిన క్షేత్రీయ వ్యాధులను నిర్మూలించును గాక.
3. ఇది జింక చర్మము. ఇది నలువైపుల వ్యాపించి ఉన్నది. రోగీ! దీనిచే నీలో నున్న క్షేత్రీయ వ్యాధులను సర్వాంగములందును "నాశయామసి".
4. ఆకాశమున సౌభాగ్యవంతులగు 'విచ్రుత' అను పేరుగల నక్షత్రములు ఉన్నవి. అవి రోగి యొక్క దిగువ, పై భాగముల నుండి క్షేత్రీయ వ్యాధి పాశములను తొలగించును గాక.
5. జలమే ఔషధము. జలమే వ్యాధి నాశకము. జలమే సమస్త భేషజము. కావున ఆ జలమే క్షేత్రీయ వ్యాధి నుండి విముక్తి కలిగించును గాక.
6. వ్యాధిగ్రస్తా! నీవు వాడిన అన్నపానాదుల వలన క్షేత్రీయ వ్యాధులు కలిగినవి. నాకు ఆ వ్యాధి నివారణ ఔషధములు తెలియును. వానిచే నీ వ్యాధులను నిర్మూలింతును.
7. నక్షత్రములు కనిపించని ఉషః కాలమున లేక తరువాత చేయు స్నానము మా నుండి సకల రోగములను దూరము చేయును గాక. క్షేత్రీయ వ్యాధులు మా నుండి సమూలముగ దూరమగును గాక.
మూడవ సూక్తము - 8
వినియోగము :-
1) ఈ సూక్తముచే ఉపనయనమున బాలకుని నాభిని తాకి అభిమంత్రించ వలెను.
2) ఆయుష్య గణమున ఈ సూక్త పాఠము కలదు.
3) 4వ మంత్రముచే వివాహము నందు శుల్కమును 'ఇదినాది' 'ఇదినీది' అని పంచవలెను.
1. మిత్రదేవత తన కిరణములచే భూమిని ప్రకాశవంతము చేయుచు, ఋతువులను కల్పించుచు, మాకు దీర్ఘాయువు కలిగించుచు 'ఆయాతు' - వచ్చును గాక. అట్లే వరుణుడు, వాయువు, అగ్ని మమ్ము గొప్ప రాజ్యమును పాలించు యోగ్యుని చేయును గాక.
2. ధాత, ఆర్యమ, సవిత నా హవిస్సులు స్వీకరింతురు గాక. ఇంద్రుడు, త్వష్ట మా స్తుతులు ఆలకింతురు గాక. శూరులగు పుత్రులు గల అదితిని ఆహ్వానించుచున్నాను. వారందరు నన్ను నా వారిలో శ్రేష్టుని చేయుదురు గాక.
3. సోముని, సవితను, అదితి యొక్క సమస్త పుత్రులకు నమస్కరించి ఆహ్వానించుచున్నాను. నా వారిలో నేను సదా ఉన్నతుడను అగుదును గాక. ఆహుతుల ఆధార భూత అగ్ని ప్రజ్వరిల్లును గాక.
4. అమ్మలారా! ఈ కన్య వద్దనుండి కదలకండి. వదలి వెళ్ళకండి. సర్వరక్షక పూష మీకు ప్రేరణ కలిగించును గాక. వరుని కోరిన వధువు వెంట విశ్వేదేవతలు ఉందురు గాక.