Previous Page Next Page 
అథర్వ వేద సంహిత పేజి 20

 

1.    ఈ అన్నముచే అజ్ఞాతముగ నీ దేహమున ప్రవేశించిన యక్ష్మను తొలగించుచున్నాను. నీవు చిరకాలము జీవించుటకు గాను నిన్ను రాజ యక్ష్మము నుండి విముక్తుని చేయుచున్నాను.
   
    ఇంద్రాగ్నులారా! పిశాచము ఈ బాలుని పట్టి పీడించుచున్నచో ఇతనికి పిశాచ, గ్రహ విముక్తి కలిగించండి.

2.    ఇతడు క్షీణాయువు అయినను, ఈ లోకము నుండి ప్రస్థానము చేయు వాడయినను, మృత్యువును చేరుకున్న వాడైనను, ఈ లోకమునకు ఈడ్చి తెచ్చెదను. నూరు శరత్తుల కాలము జీవింప చేయుదును.
   
3.    ఈ అన్నము చేత ఇతనిని వేల చూపులు గల వానిని, వందల వీర్యములు గల వానిని శతాయుష్కుని చేయుచున్నాను. ఇంద్రుడు ఇతని ఆయుక్షీణమునకు కారణములగు పాపములను తొలగించి నూరు శరత్తుల జీవింప చేయును గాక.
   
4.    శతం జీవ శరదో వర్దమానః శతం హేమన్తాన్ఛతము వసన్తాన్ |
    శతం త ఇన్ద్రో అగ్నిః సవితా బృహస్పతిః శతాయుషా హవిషా హార్షమేనామ్ ||

   
5.    విడిచిన, విడువనున్న ప్రాణాపానములు - ఎడ్లబండి తనగమ్యము చేరినట్లు - శరీరమున ప్రవేశించును గాక. విద్వాంసులు మృత్యుకారకములగు ఏ వందల వ్యాధులను చెప్పుచున్నారో వాటి నుండియు అన్య మృత్యు కారక వ్యాధుల నుండియు విముక్తి కలుగును గాక.
   
6.    ప్రాణాపానములారా! ఈ దేహముననే నిలువండి. తొందరపడి విడిచిపోకండి. ఇతని దేహమును, కలలు చేతులు మున్నగు అవయవములను వార్ధక్యము వరకు ధరించి ఉండండి.
   
7.    వ్యాధిగ్రస్తా! నిన్ను వార్ధక్యము వరకు జీవింప చేయుచున్నాను. వార్ధక్యము వరకు రోగముల నుండి రక్షించుచున్నాను. వార్ధక్యము నీకు శుభములు, సుఖములు కలిగించును గాక. విద్వాంసులు మృత్యు కారకములగు ఏ వందల వ్యాధులు చెప్పుచున్నారో అవి నీకు దూరముగ ఉండును గాక.
   
8.    వ్యాధిముక్తా! ఆబోతును పగ్గముతో కట్టినట్లు వార్ధక్యము నిన్ను కట్టిపెట్టును గాక. పుట్టుకతోనే మృత్యువు నిన్ను అకాల పాశమున బంధించినది. బృహస్పతి నిన్ను అకాల మృత్యు పాశము నుండి విడిపించును గాక.
   
                                         రెండవ సూక్తము - 12.
   
వినియోగము :-

   
      1) వాస్తోష్పత్య గణమున కొత్త ఇల్లు కట్టు నేలను నాగలితో దున్నవలెను.
   
      2) శాంత్యుదకాది చతుర్గణీ శాంతి ప్రయోగ మైనపుడెల్ల దీని వినియోగము.
   
      3) కొత్త ఇంటి కొరకు పాతునట్టి స్తంభములను ఈ సూక్తముచే అభిమంత్రించవలెను. 2 మంత్రములచే     భూమిని గట్టి పరచవలెను. 6వ మంత్రముచే నేతిలో  ముంచిన వెదురు బొంగులను స్తంభముల మీదకు     ఎక్కించవలెను.
   
      4) గృహ ప్రవేశము చేయునపుడు 8వ మంత్రముచే పూర్ణకుంభముతో స్త్రీ అడుగు పెట్టవలెను.
   
1.    ఇచటనే స్తంభము పాతుచున్నాను. స్థిరపరచుచున్నాను. ఈ గృహము కోరికలు తీర్చునది, అగ్ని భయ రహితము, క్షేమంకరము అగును గాక.
   
    గృహమా! నీ యందు గుణవంతులు, రోగ రహితులు, అరిష్ట రహితులగు పుత్రులతో కూడి నివసింతుము గాక.
   
2.    గృహమా! నీవు ఇచటనే అశ్వవతివి, గోవతివి, మధురవాక్యవతి వగుచు స్థిరపడుము. బలవతివి, పయస్వతివి, ఘ్రుతవతివి అయి మాకు మహాభాగ్యము కలిగించుము.
   
3.    గృహమా! నీ యందు భోగభాగ్యములున్నవి. మహాఛందో దేవతలున్నారు. అక్షయ ధన ధాన్యములున్నవి. నీలోనికి దూడలు, శిశువులు ప్రవేశించును గాక. సాయంకాలమైనంత పాలు చేపునట్టి గోవులు నిన్ను చేరును గాక.
   
4.    గృహ నిర్మాణమును ఎరిగిన సవిత, వాయువు, బృహస్పతి ఈ ఇంటిని చక్కగా నిలుపుదురు గాక. మరుత్తులు ఈ నేలను పాలతోను, నీళ్ళతోను తడుపుదురు గాక. భగదేవత ఈనేలను దున్నును గాక.
   
5.    గృహమా! నీవు దేవివి. వాస్తు పత్నివి. ధాన్య పోషకవు. తొలుత నిన్ను దేవతలు నిర్మించినారు. నీవు గడ్డిని కప్పుకున్న దానవు. మంచి మనసున్న దానవు నీలో నివసించు మాకు పుత్రసహిత ధనము కలిగించుము.
   
6.    వంశమా! - వెదురుగడా! నీవు ఇంటి నడిమి గుంజ మీద కదలక నిలిచి ఉండుము.
   
    గృహమా! నీలో ఉండువారు ఆర్తులు కారాదు. నీలో వసించు మేము పుత్ర పౌత్రులతో సంపన్నుల మై శత శరత్తులు జీవింతుము గాక.
   
7.    ఈ ఇంటికి పసి పిల్లలు, ప్రాయపు బిడ్డలు వచ్చెదరు గాక. గోవుల సహితముగా దూడలు వచ్చును గాక. పొంగి పొరలు తేనెకుండలు, పాల బిందెలు, పెరుగు కడవలు చేరును గాక.
   
8.    అమ్మా! ఈ కుండ అమృతమాయ జలము, తొణికిసలాడు తేనె, నేతులతో నిండి ఉన్నది. దీనిని ఇంటిలోనికి చేర్చుము. మనము ప్రవేశించుచున్న ఈ ఇంటిని ఆ కలశము లోని అమృత జలమున వెలుగొందించుము. మేము చేయు శ్రౌత, స్మార్త కర్మలు దీనిని చోరులు, అగ్ని నుండి రక్షించును గాక.
   
9.    ఈ కలశమందలి నీరు స్వయముగా యక్ష్మనాశని. నీ సేవకుల యక్ష్మను నివారించునది. ఈ పూర్ణ కుంభమును అక్షయ అగ్ని సహితముగ గృహమున చేర్చుచున్నాను.
   
వ్యాఖ్య -    ఈ వాస్తు సూక్తము మనసును చెమర్చుచున్నది. కంటిని నింపుచున్నది. హృదయమున అమృత కలశమును తొణికించుచున్నది.
   
    ఇటుకతో కట్టిన దెల్ల ఇల్లుకాదు. మనసులు కలసినది. మనసులు పరచినది ఇల్లగుచున్నది. ఇల్లు పూరిదా, పెంకులదా, సిమెంటుదా కాదు చూడ వలసినది. ఆ ఇంట మనసున్న మనుషులున్నారా? మనసుల కిలకిలలు ఉన్నవా? మనసులు వికసించి పరిమళించుచున్నవా? పసిపాపల అల్లరులున్నవా? ప్రాయపు వారి పరువములున్నవా? ముసలి తాతల బోసినవ్వులున్నవా? అవి అన్ని ఉన్న అది ఇల్లు. లేకున్న కొంప.
   
    ఇంటికి ఉండవలసిన లక్షణములను తొమ్మిది ఋక్కులలో వివరించినాడు. భౌతిక స్వరూపములు కాలానుగుణముగ మారవచ్చు. అంతరికముగా మంచి ఇల్లు ఏనాటికీ ఇంతకు మించదు. ఇది ఆదర్శము - నాటికి, నేటికి, రేపటికి!
   
    మానవుని సుఖ జీవనమును గురించి ఎంత అధ్యయనము చేసినారు!!!   
   
                                               మూడవ సూక్తము - 13
   
వినియోగము :
   
      1) నదిని కోరిన చోటికి ప్రవహింపచేయుట.
            నదిని తీసుకొని పోవలసిన మార్గమును త్రవ్వి ఈ సూక్తముచే నీరు చల్లవలెను. కాశ, శైవల, పటేరక,     వేతసములలో ఒక కొమ్మను తెచ్చి ఈ సూక్తముచే అభి మంత్రించి గోతిలో పాతవలెను. ఏడవ మంత్రపు     మొదటి "ఇదం వా ఆపః" పాదము చదివి బంగారము పాతవలెను. "ఇయం వత్సః" అను రెండవ     పాదముచే కప్పను నలుపు, ఎరుపు దారములతో కట్టి గుంతలో అభిమంత్రించి ఉంచవలెను. 'ఇహేత్దమ్'     అను మూడవ పాదముచే కప్పమీద నీరు పారించవలెను.
   
      2) గ్రామాదులకు కొత్తనీటి వరద వచ్చినపుడు నదిని ప్రవహింపచేయుటకును ధాన్యచరు, ఆవుపాలు,     ఘ్రుతమును వేతస స్రువముచే వరుణునకు మూడు ఆహుతులు ఇవ్వవలెను. వేతస చమసమున వేతస     ఉపమంథినులతో దధిసత్తును మధించి బలిహరణము చేయవలెను.
   
      3) దూరము పోయిన నదిని మరలించుటకు ఈ సూక్తమును జపించుచు నదీప్రవేశ మార్గమున     శయనించవలెను.
   
      4) దీనితోనే మరుత్తులకు హోమము చేయవచ్చును. కాశ,. దివిధుక, వేతస ఓషధులను ఒక పాత్రలో     సంపాతిత అభిమంత్రణము చేసి నీటిలో ముంచి వదలవలెను.
   
      5) వర్షము కోరువారు కుక్కతల లేక మేక తలను అభిమంత్రిత జలమున ఉంచవలెను. మనిషి     తలవెంట్రుకలు, పాత చెప్పులను గడకు కట్టి, పచ్చి కుండను మంత్రజలముతో ప్రోక్షించి, ఉట్టికి కట్టి నీటి     మధ్యన పెట్టవలెను.
   
      6) అర్ధోత్థాపన విఘ్నశమన కర్మయందు ఈ సూక్తముచే ఘ్రుతాహుతులు ఇచ్చునది. సంపాతిత అభిమంత్రిత     జలముచే స్నానము, అభిషేకము చేయునది.
   
1.    జలమా! అభేద్యమగు మేఘమును భేదించినంత నీవు ఇటునటు ఉరికి నదించినావు శబ్దము చేసినావు. అందువలననే నీ పేరు 'నది' అయినది. జరుగు స్వభావము గల జలమా! 'అప్' ఉదకము అనునది సహితము సార్ధకముగనే ఏర్పడినది.
   
2.    వరుణరాజు ప్రేరణచే నీవు నాట్యము చేయుచు ఒకచోట చేరినావు. అప్పుడు ఇంద్రుడు నిన్ను 'ఆప్నోత్' అందుకున్నాడు. అందువలన నీవు 'అప్' అనబడుచున్నావు.
   
3.    జలములారా! మీకు ఇష్టము లేకున్నను కదిలిపోవు వారు. అట్టి మిమ్ము ఇంద్రుడు వరించి స్వాధీన పరచుకున్నాడు. అందువలన దేవేరులగు మీకు 'వారి' అను పేరు కలిగినది.
   
4.    ఉదకములారా! మీరు ప్రవహించు స్వభావము గలవారలు కదా! వీరుడగు ఇంద్రుడు మిమ్ము నిలిపి ఉంచినాడు. ఇంద్రునిచే బహూకృతలగు మీరు మహత్తు గలవారలయినారు. "తస్మాదుదక ముచ్యతే" అందువలన 'ఉదకము' అన బడినారు.
   
5.    జలము సుఖకరము, శుభప్రదము. జలము ఘ్రుతమగుచున్నది. ఘ్రుతము అగ్నికి ఆహుతి అగుచున్నది. మరల జలమగుచున్నది. జలము అగ్ని సోములను ధరించుచున్నది. జలము మధురము. తీవ్రరసము గలది. ఆ జలము అక్షయమై, ప్రాణమై, బలమై నా దేహమున ప్రవేశించును గాక.
   
వ్యాఖ్య -    జలము వలననే తృణాదులు కలుగుచున్నవి. అవి తిన్న గోవులు ఘ్రుతమును కలిగించుచున్నవి. ఘ్రుతము అగ్ని యందు చేరి జలము అగుచున్నది. ఇది ఒక ఆవర్తము. జలమే ఘ్రుతము - ఘ్రుతమే జలము అగుచున్నది.
   
    "అగ్నౌ ప్రస్తాహుతిః సమ్యగ్ ఆదిత్యం ఉపతిష్టతే |
    ఆదిత్యాజ్జాయతే వృష్టిః" అని మనుస్మ్రుతి.

 Previous Page Next Page