మాధుర్ పార్శిల్ అందుకుంటుండగా యజమాని అడిగాడు "ఏం చదువుకున్నావు బాబూ?" అని.
"ఎం.బి.ఎ. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేట్...." నిర్లిప్తంగా అన్నాడు మాధుర్.
గంగాధరరావు ఓ క్షణం ఉలిక్కిపడ్డాడు. "ఈ వ్యవస్థ మీద నీకు అసహ్యం కలగటంలో తప్పులేదు."
మాధుర్ ఉలిక్కిపడ్డట్లుగా వెనుదిరిగి చూశాడు.
ఎదురుగా గంగాధరరావు....!
"గుర్తుపట్టావా బాబూ?"
మాధుర్ పేలవంగా నవ్వుతూ-
"నేను మనిషిని సార్..... చేసిన మేలును మర్చిపోయే అధముడ్ని కాదు."
"మీ ఇద్దరికీ ఇదివరకే పరిచయం ఉందా?" హోటల్ యజమాని మాధుర్, గంగాధరరావులకేసి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు.
ఇద్దరూ మౌనంగా అవునన్నట్టు తలూపి బయటకు నడిచారు.
గంగాధరరావు ఆటోను కేకేశాడు.
ఆటో ఆగేలోపే "నా దగ్గర..." అంటూ మాధుర్ నసిగాడు.
"నీ దగ్గర లేవని తెలుసు బాబూ! త్వరగా వెళ్ళి ఆ భోజనం మీ అమ్మా నాన్నలకు అందిద్దామనే నా ఆరాటం."
మాధుర్ కృతజ్ఞత నిండిన కళ్ళతో చూశాడు గంగాధరరావువేపు.
మరికొద్ది క్షణాల్లో ఆటో రైల్వేస్టేషన్ కేసి దూసుకుపోయింది.
* * * * *
మరుసటి రోజు సరిగ్గా ఉదయం పదకొండు గంటలకు ఓ పురాతన బంగ్లా ముందు ఆటో దిగారు మాధుర్, గంగాధరరావు.
పురాతన వైభవపు ఛాయలు ఇంకా ఆ బిల్డింగ్ పై నుంచి మాసిపోలేదు.
పై పట్టు వూడి వేలాడిపోతున్న ఒక బోర్డ్ మాధుర్ దృష్టిని ఆకర్షించింది.
దగ్గరకు వెళ్ళి చూశాడు.
కల్పనా ఎడ్వర్ టైజర్స్ అనే అక్షరాలు అస్పష్టంగా చెదిరిపోయి కనిపిస్తున్నాయి.
"నా గత వైభవానికి యిదో చిహ్నం బాబూ!" గంగాధరరావు గతం తాలూకు స్మృతులకు క్రుంగిపోతూ అన్నాడు.
ఇద్దరూ మరికొంచెం ముందుకెళ్ళారు. ఉన్నట్టుండి ఓ గబ్బిలం భయంకరంగా అరుస్తూ, రెక్కలు టపటపలాడిస్తూ వాళ్ళ ముందు నుంచి దూసుకుపోయింది.
"ఎన్నాళ్ళయింది పాడుబెట్టి?" మాధుర్ ప్రశ్నించాడు. బిల్డింగ్ కేసే పరిశీలనగా చూస్తూ.
"సుమారు పదహారు నెలలయింది బాబు!"
ఒకప్పుడు రాజప్రసాదంలా కనిపించిన తన పూర్వీకుల నాటి భవనం. ఇప్పుడు తన అసమర్ద్తను వెక్కిరిస్తూ క్రమంగా తన అస్తిత్వాన్ని కోల్పోతుంది.
గంగాధరరావుకి గుండె చిక్కబట్టినట్లయింది.
అప్పటికప్పుడే మాధుర్ ఒక స్థిరమైన నిర్ణయానికొచ్చాడు.
సరిగ్గా అదే టైమ్ కి మౌనిక మాధుర్ జాడ తెలుసుకునేందుకు పట్టుదలగా బయలుదేరింది.
ఒక్కొక్క గదే దాటుకుంటూ ముందుకెళ్ళిపోతున్నాడు మాధుర్. ఆ వెనుకే గంగాధరరావు నెమ్మదిగా నడుస్తున్నాడు.
ఆ బిల్డింగ్ లో పాడుబడి, బూజుపట్టి, తుప్పుపట్టి శిథిలావస్థలో కనిపిస్తున్న వస్తువుల్ని, ఫర్నిచర్ ని చూస్తూనే వాటి తాలూకు గతకాలపు వైభవాన్ని క్షణాల్లో అంచనా వేయగలుగుతున్నాడు మాధుర్.
"ఎందుకిలా జరిగింది...?" మాధుర్ చుట్టుప్రక్కల పరిశీలనగా చూస్తూనే అడిగాడు.
"ఖర్మ బాబు... ఖర్మ సిద్దాంతాన్ని నేను నమ్ముతాను" గంగాధరరావు నిస్పృహగా అన్నాడు.
ఆ మాటలు వింటూనే మాధుర్ చటుక్కున ఆగిపోయి, తలమాత్రం వెనక్కి తిప్పి చిన్నగా నవ్వాడు.
"మీరేం అనుకోకండి. నేను స్ట్రెయిట్ గా వుంటాను. అలాగే మాట్లాడతాను. కలిసొస్తే అదృష్టం- నష్టపోతే ఖర్మ అని సరిపెట్టుకోవటం నాకు నచ్చదు..." ఒకింతసేపు ఆగి తిరిగి ముందుకు కదులుతూ అన్నాడు.
"ఇంతవరకు నేనేమిటో నాకు తెలీలేదు. నా అనుకున్నవాళ్ళకూ తెలీలేదు. కనీసం నేనేదయినా చేయగలనని నమ్మినవాళ్ళూ లేరు, కాని.... కాని ఇప్పుడు మీరు నన్ను గుర్తించారు. నేను తలుచుకుంటే ఏదయినా చేయగలనని నమ్మి నాకు, నా తల్లిదండ్రులకు ఓ ఆశ్రయం కల్పించారు. అదీ మీరు కష్టాల సుడిగుండంలో దిక్కుతోచని స్థితిలో మీ మాటనే నేనిప్పుడు నిజం చేస్తాను.
మీరు నిర్లిప్తతో నిర్మించుకున్న ఖర్మ సిద్దాంతానికి కాలదోషం పట్టిస్తాను.
కాలమైనా, ఖర్మమైనా నాతో నడవాలి. నేను చెప్పినట్లు వినాలి" మాధుర్ ప్రవర్తనలో, మాట తీరులో వచ్చిన మార్పును గమనించి ఒకింత ఆశ్చర్యపోయాడు గంగాధరరావు.
"ప్రపంచ ప్రచార రంగానికి ప్రాణ ప్రతిష్ట చేసిన న్యూయార్క్ మేడిసన్ ఎవెన్యూ వైభవాన్ని ఇక్కడ, ఇదే శిథిల భవనంలో పునః ప్రతిష్టిస్తాను. మీ పూర్వపు వైభవాన్ని మీ ముందు నిలుపుతాను. కరిగిపోయిన మీ కలలకు జీవం పోస్తాను. కేవలం... మీరు..... మీరొక్కరే నన్ను గుర్తించారు."
గంగాధరరావుకి నోటమాటరాక మాధుర్ చెప్పేది మౌనంగా వింటుండి పోయాడు.
"ఒక మనిషి తలుచుకుంటే సాధించలేనిది లేదని నిరూపిస్తాను. ఇంతకాలం జీవితానికో అర్ధం ఇవ్వలేని అలౌకికానుభూతుల్లో ఐక్యమై పోయాను. కమాన్ టెల్ మీ ది హిస్టరీ. మీ కల్పనా ఎడ్వర్ టైజింగ్ ఏజెన్సీ ఎలా ప్రారంభమయింది? ఎప్పుడు ప్రారంభమయింది? ఎందువల్ల నష్టపోయింది? మొత్తం వివరాలన్నీ నాకిప్పుడు కావాలి" పట్టుదల ధ్వనించే' కంఠంతో ప్రశ్నించాడు మాధుర్.
గంగాధరరావు చెప్పటానికి కొద్దిక్షణాలు సందేహించాడు.
"నా శక్తి సామర్ధ్యాల మీద అపనమ్మకమా...? జీవితం మీద ఇచ్ఛ నశించిందా?"
మాధుర్ సూటిగా ప్రశ్నించడంతో గంగాధరరావు కొద్దిక్షణాలు కలవరపడ్డాడు.
తిరిగి అంతలోనే తేరుకుంటూ "రెండూ కాదు బాబు... ఏ తల్లికన్నబిడ్డవో... నిన్ను ఈ శిథిలాలయంలోకి పూజారిగా రప్పించి మరో పాపాన్ని జత చేసుకోలేక ఆగిపోతున్నాను..." గంగాధరరావు మాటలు భారంగా వున్నాయి.
"అన్నంపెట్టి, ఆధారం చూపించి, యారా యిచ్చిన ఆ చేతుల్ని నిర్దాక్షిణ్యంగా నరికేసే స్పెసిమెన్స్ మన కళ్ళెదుటే కనిపిస్తుంటే, చూస్తూ మిన్నకుండడం మంచితనం కన్నా అసమర్దతే అవుతుంది. మీ వినాశనానికి ఎక్కడో- ఎవరో- ఏదో చేసుండవచ్చని నాకనిపిస్తోంది. దయచేసి మనసు విప్పి నాతో పంచుకోండి. ఇంతకాలం చదివిన చదువుకు అర్ధం కల్పించుకోలేక వయసు పైబడినా, బాధ్యతల్ని పట్టించుకోక, పాతిక సంవత్సరాల నా జీవితానికి తగిలించిన ప్రైస్ టాగ్ లో వ్యర్ధత అనే వేటును లిఖించుకున్నాను. ఆ టాగ్ పై ఇప్పుడిక అక్షరాలు కాదు- అంకెలు వేయాలనుకుంటున్నాను. చెప్పండి."
అప్పటికీ గంగాధరరావు నోరు విప్పలేదు.
"నేను కష్టాలపాలవుతాననే జాలితో అయితే మాత్రం చెప్పడం మానేయకండి. ఎందుకంటే- అన్నిటిలోకి నేను అసహ్యించుకునేది జాలినే. నేను సాధించలేనని మీకు ఖచ్చితంగా అనిపిస్తే అదయినా చెప్పండి. అక్కడితో మీ దారి మీది... నా దారి నాది... ఏదయినా వెంటనే తేల్చి చెప్పండి."
అప్పుడిక నోరు విప్పక తప్పలేదు గంగాధరరావుకి.
నిశ్శబ్దంగా స్మశాన వైరాగ్యాన్ని తలపింపజేస్తూన్న ఆ శిథిల భవనపు మధ్య హాల్లో వున్నారిప్పుడా ఇద్దరూ.
"భరద్వాజ.... ది క్రుకెడ్ ఇండస్ట్రియలిస్ట్.... పచ్చని వ్యాపారపు సౌధాల్ని పండుటాకులుగా మార్చి, తనలో కలుపుకోగల దుర్మార్గుడు వాడే... వాడి మూలంగానే నేనీనాడు ఇలా శిథిలమైపోయింది...." గంగాధరరావు చెప్పుకుపోతున్నాడు.
ఆయన ఆవేశంలో, ఉద్రేకంగా చెప్పుకుపోతూ మాధుర్ ముఖంలో వచ్చిన మార్పును గమనించలేదు.
అదే జరిగితే తప్పక అనుమానం వచ్చి వుండేది. అప్పుడు గంగాధరరావు ఖండితంగా మాధుర్ ని దూరంగా వుంచేవాడు అతని క్షేమం కోసం.
భరద్వాజ...
తన జీవితాన్ని సర్వనాశనం చేసిన దుర్మార్గుడు.