Previous Page Next Page 
నిశాగీతం పేజి 19


    వెళ్ళినవాళ్ళు డాక్టర్ తో  తిరిగోచ్చేసరికి, వాళ్ళ నాటకం క్లైమాక్స్  కు  చేరుకుంది.
    దెయ్యాలూ, భూతాలూ, కొరివిదెయ్యాలూ, నిప్పులుచెరిగే కళ్ళూ....ఇవన్నీ  వాళ్ళసామాగ్రికాగా నన్ను బెదిరించి పంపించిదెయ్యాలని పథకం పన్నారు. నాతోపాటు మానసీ, శివరామయ్యకూడా మళ్ళీ ఇల్లువదిలి వెళ్ళిపోతారు.
    ఇక తోటా, ఇల్లూ___వాళ్ళ ఇష్టారాజ్యంగా అవుతుంది.
    బుచ్చిబాబు గది అంతా వెదికాను. వాడి బట్టలఅలమరాతో సహాగాలించాను. 29వ తేది సర్కస్  టికిట్. అంటే నిజంగా నిన్న బుచ్చయ్య సర్కస్ కు  వెళ్ళాడా? మరి ఆ రాత్రి జరిగినాదంతా....? అడివయ్యా, వీరభద్రుడూ చేశారా? కాని వాళ్ళిద్దరూ నా కళ్ళముందే వున్నారే?
    మరోవ్యక్తిలేకుండా ఇదంతా ఎలా సాధ్యం అవుతుంది?
    ఆలోచించిన కొద్దీ అంతా  అయోమయంగా వుంది.
    బుచ్చయ్య గదిలోనుంచి బయటికి వచ్చేసరికి సాయంకాలం అయిదు అయింది.
    నేను తోటలోకి వెళ్ళాను.
    అడివయ్య పాకముందు నిలబడి అతడ్ని పిలిచాను.
    "బాబుగారూ! మీరింకా  ఇక్కడే వున్నారా?" అని అడిగాడువాడు.
    "ఏం పారిపోతాననుకొన్నావా?"
    "అట్లా అనికాదు. వెళ్ళిపోతే బాగుంటాడని అనుకొన్నా."
    "ఎందుకలా అనుకోన్నావ్?"
    "ఆ ముదనష్టపు దెయ్యాలు తవరిమీదా కసిపెట్టుకొన్నాయి. పొద్దున చూశారుగా? బావిలోకి తోసింది. సమయానికి నేనక్కడ లేకపోతే ఏమయ్యేది బాబూ! ఆఁ హాఁ! కోపగించుకోవద్దు."
    "ఏమయ్యేది?"
    "మీ గుండె దైర్యం మాలావు బాబూ. అయినా చూస్తూ చూస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడం ఏం మంచిపని? ఏ తల్లి గన్నదో ఏమో ఇంతపెద్ద డాక్టరయ్యారు. పదికాలాలపాటు సల్లంగా వుండాలి ఎల్లిపోండి బాబూ నామాటిని."
    "నన్ను బావిలోకి తోసిందెవరూ?"
    "ఇంకెవరు బాబూ.....అమ్మాయిగారే."
    "మానసా?"
    "అమ్మాయిగారంటే___అమ్మాయిగారి వెనకున్నోళ్ళే."
    "అంటే?"
    అడివయ్య తికమకపడ్డాడు.
    "అమ్మాయిగార్ని పట్టి పీడుస్తున్న దెయ్యం బాబూ. ఆ దెయ్యమే మనసమ్మగోరిచేత ఆ పని చేయించింది."
    అడివయ్య మళ్ళీ మొదటికొచ్చాడు.
    నాకు లీలగా అర్థం అయినట్టు అన్పించింది.
    అంతలోనే అడివయ్యమాట మార్చాడు. మళ్ళీ దెయ్యాలకథ వల్లిస్తున్నాడు. పైగా నన్ను వెళ్ళిపొమ్మని సలహాకూడా ఇస్తున్నాడు. సానుభూతి చూపిస్తున్నాడు. ప్రాణభయం చూపిస్తున్నాడు. దెయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఇదేనేమో?
    "వీరభ్రదుడెక్కడా? పొద్దుట్నుంచి కన్పించలేదే" అని అడిగాను.
    "ఇంజన్ ఆయిల్ కొనుక్కురావడానికి పట్నం ఎల్లాడు బాబూ!"
    "బుచ్చయ్య   ఎక్కడా?"
    "బుచ్చిబాబా? అరటి తోటలో వున్నట్టున్నాడు పిల్చుకు రమ్మంటారా?"
    "వద్దు నేనే వెళ్ళి చూస్తాలే."
    "అరటితోటలో గెలలు కోస్తూ బుచ్చిబాబూ కన్పించాడు.
    నన్ను చూసి కోసిన గెల కిందపెట్టి, కొడవలి చేత్తో పట్టుకుని దగ్గర కొచ్చాడు.
    అతడు  కొట్టిన అరటిచెట్లూ, అరటిగెలలూ కుప్పలు కుప్పలుగా పడివున్నాయి.
    "బుచ్చీ! ఏం చేస్తున్నావు?"
    "అరటిగెలలు కొడ్తున్నా....కాపట్టంలా?"
    "ఆఁ! కన్పిస్తూనేవుంది. అన్ని గెలలు కొట్టావ్....ఇవన్నీ ఏం చేస్తావ్?" ఏదోరకంగా మాటల్లో దించడానికి ప్రయత్నించాను.
    "పట్నం తీసుకెళ్ళి కొట్టుకేస్తాను."
    "ఏ కొట్టుకూ?"
    "అరటికాయలమ్మే కొట్టుకి. ఎప్పుడూ అక్కడే వేస్తాం. బాబాయ్ ఎల్లి డబ్బులు తెచ్చుకొంటాడు."
    "ఓహొ! డబ్బు నీ చేతి కివ్వరా?"
    "ఇయ్యరు. నేను ఆగం చేస్తానంట అందుకని,"
    "అరటిగెలలు తీసుకుని ఎప్పుడు వెళ్తావ్?"
    "తెల్లారుజామున బండి కట్టుకొని ఎల్తా"
    "అది సరేగాని మానసంటే నీకిష్టమేనా?"
    "హి! హి!" తమాషాగా, వెర్రిగా నవ్వాడు.
    "మానసిని పెళ్ళిచేసుకుంటావా?"
    "కళ్ళు పోతయ్యి...తప్పు.....తప్పు"చెంపలు వేసుకున్నాడు.
    "అని ఎవరు చెప్పారు?"
    "మా బాబాయి,"
    "ఏమని?"
    "నాకు అక్కయ్య అవుతుందటగా?"
    "నీకు తెలియదా?"
    "తెలుసు."
    "ఏమిటి తెలుసు?"
    బుచ్చిబాబు కొడవలి కొనతో బుర్ర గోక్కున్నాడు.
    కళ్ళు గుండ్రంగా తిప్పి, మెడ పక్కకు  తిప్పి ఓరగా చూశాడు.
    "మానసికి ఎర్ర  గులాబిలంటే  ఇష్టంలేదని తెలుసా?"
    "ఆ పిల్లకు పువ్వులంటే  ఇష్టం."
    "పిల్లా? మనసి నీకేమవుతుంది?"
    "హి! హి!" నవ్వి, "అక్క.....అక్క" మళ్ళీ వింతగా  నవ్వి తమాషాగా  చూశాడు.
    "కాదా?"
    "అవుతుందని బాబాయ్ చెప్పాడుగా? నువ్వు కాదంటావేం? బాబాయికి చెప్తానుండు" బెదిరిస్తున్నట్టుగా అన్నాడు బుచ్చయ్య.
    "బుచ్చిబాబూ! గెలలు దించడం పూర్తయిందా?" అంటూ అడివయ్య అరటిచెట్ల చాటునుంచి వచ్చాడు.
    వీడు కావాలనే  పనికట్టుకొని వచ్చాడని నాకు అన్పించింది.
    "బాబుగారూ! మానసమ్మ ఆగారు, మీకోసం నిలబడి వున్నారు."
    "ఎక్కడా?"
    "తోట బయట. జామ చెట్టుకింద నిలబడి  వున్నారు. మీ కోసం ఎదురు చూస్తున్నారు."
    బుచ్చిబాబుతో వంటరిగా మాట్లాడే అవకాశం అడివయ్య నాకివ్వడని అర్థం అయింది.
    వెర్రివాడు....ఏదైనా వాగేస్తాడేమోననే భయంతో అడివయ్య వాడి మీద ఓ కన్నువేసి  వుంచాడు."
    "బాబుగారూ."
    ఉలిక్కిపడ్డాడు. డైరీమూసి తలెత్తి చూశాడు.
    "మంచినీళ్ళు ఇక్కడ పెడ్తున్నా. ఇంకా ఏమైనా కావాలా?" అడివయ్య అడిగాడు.
    "ఏమీ వద్దుగాని, ఈ రాత్రి నువ్వెక్కడ పడుకుంటున్నావ్?"
    "నా పాకలోనే బాబూ-నిన్న రాత్రి మీగది పడుకుంటే వద్దన్నారుగా?"
    "నిన్న రాత్రి సంగతి వదిలేయ్. ఈ రాత్రి గదిముందు పడుకో"
    "సంతోషంబాబూ? ఈ రాత్రి దాని సంగతేదో తేల్చేసుకోవాలి బాబూ."
    "దేని సంగతీ?"
    "ఇంకా దేనిసంగతి బాబూ? ఆ దెయ్యం సంగతే. రాత్రి అంత అల్లరిచేసింది. పొద్దున్నే మిమ్మల్ని బాయిలోకి తోసింది. ఈ రాత్రికి ఏం చెయ్యాలనుకుంటుందో?" అడివయ్య చెపుతుంటే ఉదయచంద్ర వెన్ను జలదరించింది.
    వళ్ళు చెమటలు పట్టాయి.
    వీడు__ఈ అడివిగాడు___మయలమరాఠీలా వున్నాడు. అటు తిప్పి ఇటు తిప్పి తనను హడలు కొతాలని ప్రయత్నిస్తున్నాడు.
    ఈ రాత్రికే వీళ్ళు ఆడుతున్న నాటకానికి తెర  దించెయ్యాలి. మంగలహారతి పాడాలి.
    "అవును-అడివయ్యా, నిన్నరాత్రి నువ్వుచెప్తే నమ్మలేకపోయాను స్వయంగా చూశాను. పొద్దుట అనుభవించాను. పేరేమిటన్నావ్?"
    అడివయ్య చిదానందంగా నవ్వాడు.
    "దెయ్యాలకు పెర్లుంటయ్యా ఎక్కడన్నా బాబూ?"
    "మనిషి చచ్చిగదా దయ్యాలయ్యేది. మనిషిగా వున్నప్పుడు ఈ దెయ్యం పేరేమిటి?"
    పెల్లుబికి వస్తున్నా కాసిని తొక్కిపెట్టి, అమాయకంగా ముఖం పెట్టి అడిగాడు.
    "రాణీగారు!"
    "రాణీగారా!....పేరు?"
    "చంద్రావతమ్మగారు."
    రాణీగారట. వీడు కథ మారుస్తున్నాడు.  ఎత్తుకు పైఎత్తు వేస్తున్నాడు.
    నిజంగానే అయోమయంగా వుంది. ఉదయ్ చంద్రకు.
    "రాణీగారంటే?"
    "రాజాగారి భార్య."
    వీడి తెలివి అమోఘంగా వుంది. రాణిగారు, రాజాగారి  భార్యకాక, జట్కావాడి పెళ్ళాం అవుతుందా?
    "ఏ రాజాగారి భార్య?"
    అడివయ్య క్షణం ఆగి గది బయటకు తొంగిచూశాడు.
    "ఏమిటి చూస్తున్నావ్?"
    "అది వింటుందేమోనని!"
    "ఏది?"
    సన్నగా నవ్వాడు అడివయ్య.
    "ఎందుకు నవ్వుతావు?"
    "లేకపోతే ఏంది బాబూ! మళ్ళీ మొదటికే వచ్చారు."
    "సరిగ్గా మాట్లాడు. మెలికవేసి మాట్లాడటం మానెయ్ నా దగ్గిర."
    "మీరే సరిగా వినడంలేదు బాబూ. ఇంతకూ మీకు నా మీద నమ్మకం కుదర్లేదు  అందుకే  కాబోలు మా తాత అనేవాడు....."
   "ఏమని?"
    "గొర్రె గోల్లోడ్నే నమ్మ్దదనీ. కసాయోడ్ని నమ్ముద్దనీ."
    "అడివయ్యా!"
    ఇద్దరూ తృళ్ళిపడ్డారు.
    వీరభద్రుడు గదిలోకి వచ్చాడు.
    "అయ్యగారు పిలుస్తున్నార్రా నిన్ను" వీరభద్రుడు తలగుడ్డ విప్పిభుజాన వేసుకొంటూ అన్నాడు.
    "నువ్వేప్పుడొచ్చావురా భద్రా?" ఆశ్చర్యంగా అడిగాడు అడివయ్య.
    "ఇంతకుముందే."
    "ఆయిల్ తెచ్చావా?"
    "ఆ తెచ్చాను. షెడ్డుముందు వుంచాను. వెళ్ళి షెడ్డులో పెట్టు" అని చెప్పి ఉదయ్ వైపు తిరిగాడు వీరభద్రుడు.
    "ఎట్టావున్నారు బాబూ?"
    "వీడి ఉద్దేశ్యం ఏమిటి?
    తీవ్రంగా చూశాడు ఉదయ్.
    "నేను వెళ్ళేప్పటికి తవరింకా నిద్ర లేవలేదు. వంటో బాగోలేదని చెప్పారు. అందుకని అడుగుతున్నాను."
    "ఎవరు చెప్పారా మాట?" నిలదీసినట్టుగా అడిగాడు ఉదయ్.
    "అమ్మాయిగారు చెప్పారు."

 Previous Page Next Page