"మానసి చెప్పిందా?...."
"అవును బాబూ! భద్రయ్య పట్నం వెళుతున్నారుగదా, తమరికేమైనా కావాలేమో కనుక్కోమని మానసిమ్మగారు నాతో చెప్పారు. నేనొచ్చి చూశాను. బాగా పొద్దెక్కినా ఇంకా మీరు నిద్రపోతూనే వున్నారు. అమ్మగారితో తమరి వంట్లో బాగాలేదని నేనే చెప్పా....."
అడివయ్య చెప్పింది ఉదయ్ బుర్రకు ఎక్కలేదు.
అంతా ముళ్ళకంచెలా వుంది.
"సరే పద అయ్యాగారు పిలుస్తున్నారని చెప్పలేదూ? కదలవేం?"
అడివయ్యను హెచ్చరించాడు వీరభద్రుడు.
"నేను వస్తా బాబూ!" అడివయ్య కదిలాడు.
"ఈ ఆరాత్రికి ఇక్కడే పడుకుంటావేమోననుకున్నానే?"
ఉదయ్ అడివయ్య ముఖంలోకి పరిశీలనగా చూశాడు. అతడి ముఖం వెలిగిపోయింది.
"వస్తాను బాబూ వస్తాను. తమరి గదిముందే పడుకొంటాను. అయ్యాగార్ని చూసి, నూనె డబ్బాలు షెడ్డులోపెట్టి వస్తాను. చిటికెలో వచ్చేస్తాగా?" సంతోషంగా అన్నాడు.
అడివయ్య వెళ్ళిపోయాడు.
ఉచ్చు బిగించానని భావించిన ఉదయ్ కు ఆ ఉచ్చులో తనే బిగిసిపోతున్నట్టు అన్పించింది.
అడివయ్య అంత సంతోషంగాఎందుకు ఒప్పుకున్నాడు?
ఈ రాత్రికి వీడి ప్రాతేమిటో?
రంగస్థలం తన గది ముందేనా?
ఆలోచిస్తూ మూసివున్న డైరీని తెరిచాడు.
చివరి వాక్యాలు చదువుకొని మళ్ళీ రాయడం ప్రారంభించాడు.
"అడివయ్యా.....మానసి వచ్చి ఎంతసేపయింది?" శల్యపరీక్ష చేస్తూ అడిగాను__
"ఏమో బాబూ....నేను ఇప్పుడే చూశాను. తమరికోసం ఎదుకుతూ ఈ బావిదగ్గర కొచ్చారు అమ్మాయిగారు. ఆర్ని అరటితోట బయట నిలబెట్టి నేనిట్టా వచ్చాను."
"సరే పద..."
"ఆఁ" తృళ్ళిపడింది.
"బుచ్చికి నువ్వంటే చాలా చాలా యిష్టం. నువ్వు వరసకి అక్కవు కాకపోతే నిన్నే చేసుకోవాలని వుంది."
"డాక్టర్! వాడు మూర్ఖుడు. మీరు ట్రీట్ చెయ్యల్సింది ముందు వాడికేనేమో?" ముందుకు అడుగులువేస్తూ అన్నది.
"రాత్రిళ్ళు నీవెంట పడ్తున్నది బుచ్చిబాబేనేమో!" మానసి భుజం మీదగా చూస్తూ అన్నాడు.
"వెర్రివెధవ వాడలా చెప్తాడంటే నమ్మలేకపోతున్నాను డాక్టర్."
"వెర్రివాడు కాబట్టే అలా చేస్తున్నాడేమో?"
మానసి మౌనంగా నడక సాగించింది.
అరటితోట దాటి కొబ్బరితోటలోకి వచ్చాం.
కొబ్బరాకుల మధ్యనుంచి అస్తమిస్తున్న సూర్యకిరణాలు, వెండి జలతారుల్లా నేలమీద పడుతున్నాయి.
బావి దగ్గరకు దారితీస్తున్న నన్ను వారించింది.
"మళ్ళీ అక్కడికెందుకు డాక్టర్ గారూ ? నాకు భయం వేస్తోంది."
"భయమా? ఎందుకూ?"
ఆమె దూరంగా ఎటో చూస్తూ సమాధానం ఇవ్వలేదు.
"ఇప్పుడు ఇక్కడ అడివయ్యకూడా లేడు. మళ్ళీ నన్ను బావిలోకి తోసే అవకాశం నీకిద్దామని వుంది."
ఠక్కున ఆగిపోయింది.
"నేను మిమ్మల్ని బావిలో తోశానా?" మానసి ముఖం రంగులు మారింది.
"తమాషాకి అంటున్నాను. కాలు జారి నేనే పడ్డాను. అది తెలియక అడివయ్య నువ్వే తోసేశావనుకున్నాడు."
"అలా అని అడివయ్య చెప్పాడా?" ఆమెకళ్ళల్లోకి చూడటానికి ప్రయత్నించింది.
కాని ఆమె చూపులు చెదిరిపోతున్నాయి.
"అడివయ్య మీ నానగారికి నమ్మిన బంటునుకుంటాను?"
"నాన్నగారు అందర్నీ గుడ్డిగా నమ్ముతారు."
"ఓ.ఐ.సీ."
కొబ్బరితోటలో చీకట్లు ముసురుకున్నాయి. ఇంటివైపు దారితీసింది మానసి.
"నూరిబాబంటే నీ అభిప్రాయం?"
"ఎవరూ?"
"సూరిబాబంటే నీ అభిప్రాయం?"
"ఎవరూ?"
"సూరిబాబు.....నువ్వు రేపోమాపో పెళ్ళాడబోయే....."
"అలా అని నాన్నగారు చెప్పారా?"
"ఏం నీ కిష్టంలేదా?" నొక్కి అడిగాను.
"ఒక నెలలో వస్తాడట. నిన్ను పెళ్ళిచేసుకుని అమెరికాకు తీసుకెళ్తాడట" అని ఆమె ప్రతిస్పందనకోసం ఎదురుచూస్తూ ఆమె ముఖంలోకి పరిశీలనగా చూశాను.
కాని ఆమె ముఖంలో ఏ భావాలూ లేవు నిర్లిప్తంగా వుండి పోయింది.
ఇక్కడ ఏదో లింక్ మిస్ అయినట్టుగా నాకు తోచింది.
ఆ రాత్రి భోం చేస్తున్నప్పుడుకూడా మానసి ముభావంగా వుంది. ఆమె లేకుండా చూసి శివరామయ్యను అడిగాను....
పెళ్ళిసంగతి తను మానసికి చెప్పలేదన్నాడు. అడివయ్య గురించీ, బుచ్చయ్య గురించీ అడిగాను. శివరామయ్య వాళ్ళిద్దరిమీదా ఏమాత్రం అనుమానం లేదన్నాడు. వీరభద్రుడు అలాంటివాడు కాదన్నాడు. అదంతా మానసి మానసిక భ్రమేనన్నాడు.
నేను జనవరి ఫస్టుకు తిరిగి వెళ్ళిపోవాలనీ, ఇక్కడుండి నేను చెయ్యగలిగింది ఏమీ లేదనీ చెప్పాను.
శివరామయ్య అది విని నిస్పృహతో క్రుంగిపోయాడు.
ఎలాగయినా మరో రెండు రోజులుండమని ప్రాధేయపడ్డాడు.
రేపు ఒక్కరోజు అంటే డిసెంబరు31 వరకు మాత్రమే వుండగలనని చెప్పాను.జనవరి ఒకటిన నాతోపాటే మానసిని తీసుకొని బయలుదేరమన్నాను. అలా వీలుపడకపోతే ఒక వారం ఆగి రమ్మన్నాను.
నేను ఇక్కడికొచ్చాక మానసి మానసికస్థితి చాలావరకు బాగుపడిందనే నమ్మకాన్ని వెలిబుచ్చాడు.
"రా! అడివయ్యా!"
"శానా పొద్దుపోయింది. తమరింకా పడుకొనే లేదు."
"నీకోసమే చూస్తున్నాను."
సంతోషంగా ముఖం పెట్టాడు.
"బాబుగారూ! గదిలో పడుకోమంటారా?" చంకనవున్న పరుపు పట్టకింద పెట్టాడు.
"తలుపు పక్కగా ఆమూల చేత్తో చూపించాడు."
ఒకడ్ని గదిలో బంధించానని అనుకున్నాడు ఉదయ్.
మిగతా ఇద్దరు వీరభద్రుడూ-బుచ్చయ్య, రాత్రి వీళ్ళు ఆడబోయే నాటకంలో ఒక పాత్ర తగ్గిపోయింది.
"ఒరే! అడివయ్యా! ఏంటిరా బాబుగారి పక్కన పడకేస్తున్నావ్? తోటకు నీళ్ళేవరు పెడ్తార్రా?" వీరభద్రుడు గుమ్మంలో నిలబడి అడిగాడు.
"మార్చేపోయాను భద్రయ్యా" నడుం వాల్చబోతున్నా అడివయ్య లేచి నిటారుగా నిల్చున్నాడు.
"ఆయిల్ లేక ఇరవై రోజుల్నుంచీ ఇంజన్ ఆడించలేదు. రాత్రి పగలూ ఆడించినా ఆ నీరు అరటితోటకే సరిపోదు. పద! పద! ఇంజన్ ఆడించు" అని చెప్పి వీరభద్రుడు గిర్రున తిరిగి వెళ్ళిపోయాడు.
"బాబుగారూ! జాగ్రత్త, అప్పుడప్పుడు వచ్చిపోతుంటా. తలుపు వేసుకొని పడుకోండి." ఉదయ్ సమాధానానికి ఎదురుచూడకుండానే వెళ్ళి పోయాడు.
ఇది నాటకంలో ఒక అంతర్నాటకం అన్నమాట! రంగం సిద్దమైంది. ఈ రాత్రి వీళ్ళ అంతు తేల్చుకోవాలి.
ఒక నిర్ణయానికొచ్చాడు ఉదయ్ .
తలుపు దగ్గరగా వేసి వాచీ చూసుకున్నాడు. పదకోండూ అయిదు నిముషాలు అయింది. మరో ఏభయ ఐదు నిముషాల్లో తెరలేస్తుంది.
అర్థరాత్రి.
దెయ్యాలు మనుషులై ఆడే నాటకం.
కాడి మనుషులు దెయ్యాలై ఆడేనాటకం.
అప్రయత్నంగానే కిటికీ దగ్గర కొచ్చాడు. రెక్కలు తెరచి బయటికి చూశాడు. చల్లటి గాలి ముఖాన్ని తాకింది. దూరంగా జువ్విచెట్టు తలలు విరబోసుకొన్న రాక్షసిలా కన్పించింది.....చుక్కల వెలుతుర్లో..... అష్టమినాటి గుడ్డి వెన్నెల్లో.
జువ్విచెట్టు చేరడానికి కనీసం ఇరవై నిముషాలన్నా పట్టొచ్చని అంచనా వేసుకొన్నాడు.
సూట్ కేస్ తెరచిబ్యాటరీ లైటు బయటకు తీశాడు. నొక్కి చూశాడు. వెలగలేదు. గాబరాగా విప్పి చూశాడు. బ్యాటరీ సెల్ప్ వున్నాయి. నర్సును తిట్టుకున్నాడు. సెల్ప్ మార్చమని చెప్పినా మార్చలేదన్నమాట.
మధ్య మధ్య హరికన్ లాంతరు వెలుగులో వాచీ చూసుకొంటూ కిటికీ దగ్గరే నిలబడ్డాడు.
సరిగ్గా పదకొండూ ముఫ్ఫె నిముషాలకు లాంతరు వెలుగు తగ్గించి, తలుపు దగ్గరగా వేసి గదిలోనుంచి బయటికి వచ్చాడు.
అరటితోట నీడల్లో దూరంగా నిలబడి చూశాడు. అడివయ్య బావి దగ్గరే ఉన్నాడు. తోట మధ్యలో ఒక మనిషి కాలువలోని మట్టితీసి జాలుచేస్తున్నాడు. వాడు వీరభద్రుడే అయివుంటాడని ఊహించాడు.
అరటితోట గట్టుమీద కొంతదూరం నడిచి డొంకలోకి వచ్చాడు. ఇరవై నిముషాల్లో జువ్విచెట్టు కిందకొచ్చి నిలబడ్డాడు. వాచీ రేడియం డయల్ రెండుముళ్ళూ పన్నెండుమీద ఉన్నాయి.
చెట్టుచుట్టూ తిరుగుతూ నిశితంగా పరిశీలించసాగాడు. మానుచుట్టూ ఏమీ కన్పించలేదు. తల పైకెత్తి చూశాడు.
వెలుగు!
గుండె దడదడలాడింది.
ఊపిరి బిగపట్టాడు.
దైర్యం కూడదీసుకొన్నాడు. మరుక్షణంలో....
ఇదీ సంగతి!
తేలిగ్గా గుండెలనిండా గాలి పీల్చుకున్నాడు.
జువ్విచెట్టు తొర్ర__ఆ తొర్రలో ఫంగస్.
కొమ్మలు చీలినచోట కొమ్మలచుట్టూ ఫంగస్.
తల పైకెత్తి చూస్తూ చెట్టుచుట్టూ తిరిగాడు...ఒక కోణంలో వెలుగు బాగా కన్పిస్తోంది. మరోవైపునుంచి చూస్తె కన్పించీ కన్పించకుండా వుంది.
ఇంకోవైపునుంచి చూస్తే ఏమీ కన్పించడంలేదు.
ఉదయ్ చంద్ర తిరిగి గదిలోకి వచ్చాడు. వస్తూ అడివయ్యా, వీరభద్రుడూ గదిలోనే వుండటం చూశాడు.
వత్తి పెద్దదిచేసి డైరీ తెరిచాడు____
"కొరివి దయ్యాల భ్రమకు కారణం తెలిసింది. జువ్వి చెట్టుకున్న ఫంగస్ ను ఆధారం చేసుకొని అడివయ్యా దెయ్యాల కథలను సృష్టిస్తున్నాడా? లేక వాడు చీకట్లో ఆ నెలుగును చూసి నిజంగానే దెయ్యాలని భ్రమపడ్తున్నాడా?
ఇంకా తేలవలసింది పదమూడో మెట్టు మిస్టరీ.
ఇది చీకట్లో మెరిసే ఆ కళ్ళు?
బుచ్చిబాబువే ఆ కళ్ళు. ఆ కళ్ళకు ఏం పూసున్నాడో!
ఈ ముగ్గుర్నీ చేర్చి ఈ నాటకం మరో మనిషి ఎవడో ఆడిస్తూ వుండి వుండాలి.
ఎవరా నాలుగో మనిషి?
పన్నెండూ ముఫ్ఫె అయిదు నిముషాలు అయింది. కళ్ళుమూసుకుపోతున్నాయి. నిద్రముంచుకొస్తున్నది. ఈ 'రాత్రికి 'వేలియం; లేకుండా నిద్ర పొగలుగుతాను.....సంతోషంగా....కొంత మిస్టరీ తెలుసుకోగలిగినందుకు.
ఈ కేసు సైకియాట్రిస్టు పరిథిని దాటిపోయినట్టుగా వుంది. ఏ ప్రఖ్యాత డిటెక్టీ వో సాల్వ్ చెయ్యాల్సిన మిస్టరీ ఇది.
బెటర్ ఐ వాష్ మై హాండ్స్.
రేపు ఉదయం వెళ్ళిపోతాను."
డైరీ రాయడం ముగించి సూట్ కేసులో పడేశాడు.
గ్లాసు నిండుగానీళ్ళు వంపుకొని గడగడ తాగేశాడు. దుప్పటికప్పు కొని వెచ్చగాపడుకున్నాడు.
వెంటనే నిద్రపట్టింది.
14
మెత్తగా వెచ్చగా తగులుతోంది.
ముఖంలో ముఖంపెట్టి, గొంతునొక్కి పిలుస్తున్నట్టుగా వుంది.
విడుస్తున్న వేడిగాలి ముఖానికి తగులుతోంది.
ఆ అనుభవం ఎంతసేపట్నుంచి వవుందో తెలియడంలేదు.
ఏమిటిది?
మనిషా?
దెయ్యమా?
తృళ్ళిపడి తన మీదున్నదాన్ని ఒక్కతోపు తోసి లేచి కూర్చున్నాడు ఉదయ్.
లేస్తున్నప్పుడు ఆమె వక్షోజాలు ముఖానికి మెత్తగా వెచ్చగా తగిలాయి. రెండుచేతులూ ముందుకు చాచి ఆమెను వెనక్కు నెట్టాడు.
"ఎవరూ నువ్వూ?"
"డాక్టర్ అరవకండి....నేనే?" ఉదయ్ నోటిమీద చెయ్యి అడ్డం పెట్టింది చెవి పక్క నోరు పెట్టి రహస్యంగా అన్నది....
"వాడు మీ గది బయటే వున్నాడు. వాడినుంచి తప్పించుకొని మీ గదిలోకి వచ్చాను. నన్ను తరుముతూ మీ గదిదాకా వచ్చాడు. నేను మీ గదిలోకి రావడం చూసి గదిముందే ఆగిపోయాడు."
"భయపడకు. వాడు నిన్నేమీ చెయ్యలేడు నేనుండగా." మానసిని పక్కకు నెట్టి మంచంమీదనుంచి కిందకు దూకాడు.
"డాక్టర్....మిమ్మల్నేమైనా చెయ్యగలడు. మీరెళ్ళొద్దు, నామాట వినండి ప్లీజ్."
అప్పటికే ఉదయ్ గదిలోనుంచి బయటికి వచ్చాడు.
వరండా అంతా కలయచూశాడు.
ఎవరూ లేరు.
ఇదీ మానసి భ్రమే కావచ్చు.
ఇదంతా ఆమె ఊహాజనితమే. మానసి అతడి పక్కకొచ్చి నిలబడింది.
"వెళ్ళిపోయాడు....లే పద.....నీ గదిలో వదిలేస్తాను." అన్నాడు ఉదయ్.
"లేదు, లేదు. వాడు ఇక్కడే ఎక్కడో నక్కివుంతాడు" వణికిపోతూ అన్నది.