అన్ని ముక్కలూ వేసి ఉప్మా తయారు చేసి, కొద్దిగా మసాలా పౌడర్ దానిమీద చల్లింది. ఈ మధ్యనే ఓ వారపత్రికలో మసాలా ఉప్మా అని ఒకామె రాసింది. అది చదివి సీత ఆ విధంగా మసాలా ఉప్మా చేసింది. ఆ ఉప్మా సీతకి, రామకృష్ణకి బాగా నచ్చింది.
ఇప్పుడు తేలికగా రామకృష్ణ ఇంటికి వచ్చేసరికి ఆ ఉప్మాయే చేసింది సీత.
రామకృష్ణ యింటికి వచ్చాడు. సీతని చూస్తూనే "అమ్మాయిగారు ఉషారుగా లేరు ఏమిటబ్బా!" అనుకున్నాడు.
రామకృష్ణ కాళ్ళు చేతులూ కడుక్కుని, డ్రస్ మార్చుకుని వచ్చేసరికి సీత రెండు ప్లేట్లలో ఉప్మా సర్దింది.
"రంగి చూశారా - ఎంత పని చేసిందో!" రామకృష్ణ ముందు ఉప్మా ప్లేటుపెట్టి, అంతవరకూ దాచుకున్న మాటని వదిలింది సేత.
"కొంపదీసి మొగుడు కొట్టినందుకు ఏ అఘాయిత్యం అయినా చేసుకుందా?" రామక్రిష్ణ ఆదుర్దాగా అడిగాడు.
"ఉహూ!"
"మరేం జరిగింది?"
"అదీ, మొగుడూ కలసి సినిమాకి వెళ్లారు."
రామక్రిష్ణ ఫక్కున నవ్వాడు. దాంతో పొలమారింది.
సీత కోపంగా చూసింది. అదే మరొకసారి అయితే తన చేత్తో రామకృష్ణ తలమీద మృదువుగా కొట్టి - "ఎందుకంత తొందర. ముందు మంచినీళ్ళు తాగండి. మీ బామ్మకి మీరు ముద్దుల మనవడు కదా - ఆమె తలుచుకుంటున్నారు కాబోలు!" అనేది. ఇప్పుడు సీత అలాంటి పనులేమీ చేయలేదు.
రామకృష్ణ తన చేత్తోనే తన తలమీద కొట్టుకుని, అరగ్లాసు మంచినీళ్ళు తాగి "ఏది, మళ్ళి చెప్పు - ఏం జరిగిందో?" అన్నాడు.
"రంగి తన మొగుడితో సినిమాకి వెళ్ళింది." సీత చెప్పింది.
"దాని మొగుడుతో అది సినిమాకి వెళ్ళింది. అందులో చెప్పుకోతగ్గ వింత ఏముంది - రంగి పరాయిదాని భర్తతో వెళితే ఆశ్చర్యపడాలి కాని!" అన్నాడు రామకృష్ణ.
సీత కోపంగా చూసింది.
"చూడమ్మాయ్! అలా చిర చిర లాడితే లాభంలేదు. విషయమేమిటో చెప్పు."
"పొద్దుటి విషయం మీకు గుర్తులేదా?"
"గుర్తు తెచ్చుకోండి."
రామకృష్ణ కాస్త ఆలోచించి గుర్తు తెచ్చుకున్నాడు. "రంగి ఉదయం నీతో ఏడుస్తూ ఏదో చెప్పింది - ఆ విషయమేనా?" అడిగాడు.
సీత ముఖం ఆనందంతో విప్పారింది.
"ఆ.....ఆ.....ఆ విషయమే. రాత్రి వాడు తాగొచ్చి కొట్టాడుట. నీవేం నాకక్కరలేదు, జయమాలిన్ని తెచ్చుకుంటానని కూడా అన్నాడుట. ఇంక వాడితో కాపురం చేయనని చెప్పి, కళ్ళనీళ్ళు పెట్టుకుంది. అలాంటిది ఈ మధ్యాన్నం గజ్జెల గుర్రంలా తయారయి వచ్చింది....." అంటూ రంగి విషయం చెప్పింది సీత.
రామకృష్ణ సాంతం విని,ఉప్మాతోపాటు సీత చెప్పిన విషయం కూడా చప్పరిస్తూ "పోనిలే సీతా!వాళ్ళిద్దరూ యే పొరపొచ్చాలు లేకుండా కలిశారు.మనం చెయ్యవలసింది సంతోషించడం-అంతవరకే!"అన్నాడు చాలా తేలిగ్గా.
"ఏమిటి,మళ్ళి చెప్పండి"అంది సీత.
మళ్ళి చెప్పాడు రామకృష్ణ.
"ఎంత తేలిగ్గా చెప్పారండి?"అంది సీత.
"అవును.అంతేగా మరి!"అన్నాడు రామకృష్ణ చెయ్యి కడిగేసుకుంటు
"అంతే మీకు అర్థమయింది."
"అంటే?"
"మీకు అర్థమయ్యిందో కాలేదో నాకు తెలియదు కానీండి -నాకు మటుకు చాలా భాధగా వుంది."
"వాళ్ళిద్దరూ కలసి సినిమాకి వెళ్ళినందుకేనా!"
"అమ్మయ్య!ఇప్పటికి అర్ధం చేసుకున్నారు!"సీత త్రుప్తిపడుతూ అంది.
రామకృష్ణ పక్కున నవ్వాడు.నవ్వడం అయిపోయిం తరువాత "పిచ్చి సీత!"అన్నాడు ఆప్యాయంగా.