Previous Page Next Page 
మధుకీల పేజి 18

    "కాలేజీ వదిలే వేళయింది. వేళకి ఇంటికి వెళ్ళకపోతే మా నాన్నగారు చీరేస్తారు."
    "అంతా పురాణం! ఒట్టి పిచ్చిదానిలా వున్నావ్- ఈ తల్లిదండ్రులు భయపడినన్నాళ్ళే బెదిరిస్తారు. మనం కాస్త ఇర్రెలవెంట్ గా వుంటే చూచీ చూడనట్టుగా వుంటారు. ఆల్ రైట్ మంచి కంపెనీ ఇచ్చినందుకు థాంక్స్ మరోసారి రావటానికి ఏమైనా అభ్యంతరమా?"
    "నాటెటాల్! ఇలా కాలక్షేపం చేయడానికేం, కానీ కాలేజీ---"
    "వెధవ పురాణం కట్టిపెట్టు- బోడి కాలేజి. యెక్కడికి పోతుంది అయినా నీవు బి.ఏ. పాసై ఏం చేయాలి? ఫేలయినా పాసైనా నీ గమ్యం పెళ్ళే. బి.ఏ. అని పక్కనున్న అమ్మాయి పేరుకంటే ఖాళీగా వున్న పేరే మా మగరాయుళ్ళకి నచ్చుతుంది. చదువుకున్న వాళ్ళకి గీర ఎక్కువని మా మొగాళ్ళనుకుంటారు" అని "కమాన్, వెళదాం పద" అని దారితీశాడు.
    బస్టాపులో దిగి వీధి మలుపు తిరుగుతూ "సీయూ" అని నవ్వుతూ వెళ్ళిపోయింది వసంత.
    దీర్ఘంగా చూసి "నెక్స్టు టైం బెస్ట్ లక్" అనుకున్నాడు సుధాకర్.
                                *        *        
    "మధూ!"
    "ఏమ్మా!"
    "నీ భార్యను తీసుకు తెచ్చుకో నాయనా?"
    "ఏమ్మా నా భార్యని అనకపోతే నీ కోడలని అనరాదూ! అయిన ఇష్టంలేని విషయాల్లో అలాగే వుంటారు లేమ్మా మీరు. పో
    కారణం అడగలేదు అన్నపూర్ణ.
    "వాళ్ళ నాన్నగారు వంటరిగా కూతురుని విడిచి వుండలేరమ్మా, భార్యతో పాట మామగారినీ పిలిస్తే మీరంతా ఏడ్చిపోతారని పిలవలేదు నేను"
    "మధూ! మాటలు విసరొద్దు బాబూ! ఎవరెక్కడికి వచ్చినా నేనేం పెట్టి పోషించాలయ్యా? సంపాదించే వాడివి నువ్వు- పోషించేవాడివి నువ్వు"
    "అందుకేనమ్మా-సంపాదించేవాడు ఒక్కడు అనుభవించేవాళ్ళు అయిదుగురు అయ్యారిప్పుడు ఇంకా వాళ్ళెందుకు?"
    "సంపాదించే మీ నాన్నగారు అలా అయిపోయారు. తమ్ముడు ఇంకా చదువుకుంటూనే వుండిపోయె, ఇక చెల్లెలు ఆడపిల్ల. పోతే నేనేకదరా మిగిలింది నేనూ సంపాదించాలా?"
    పలకలేదు అతను.
    "ఒరే నీ ఉద్దేశ్యం అర్ధమైందిరా? ఏనుగుల్లాంటి కొడుకులకంటే ఎలికలాంటి భర్త మేలన్నార్రా ఇందుకే! నెలకు రెండొందలు సంపాదించగానే నీకు కళ్ళు నెత్తికొస్తున్నాయ్ చిన్నప్పటినుంచి పెంచి పెద్దచేసి చదువు చెప్పించి ఉద్యోగం ఇప్పించినందుకు మాకు బాగానే బుద్ధి చెపుతున్నావు. మీ మామగారి నేర్పులా ఇవి? నీ పుణకనే పుట్టిన బుద్ధులా? నిన్ను అక్కడికే వచ్చెయ్యమనలా?"
    "అల్లుడు మామగారింటికి వెళితే తప్పేంవుందమ్మా! ఊరకే మీరు రాద్ధాంతం చేస్తున్నారుగానీ ఇద్దరు కుటుంబంలో పెరిగేదానికంటే ఒకరు తగ్గటం మేలుకదూ? ఖర్చు కలిసివస్తుంది."
    నిర్ఘాంతపోయింది అన్నపూర్ణ.
    "అసలు నేనే నీతో చెప్పాలనుకుంటూ వుండినానమ్మా! ఆవిడక్కడ నేనిక్కడ వుండటం బావులేదు. ఆవిడ రావటానికి వీల్లేనప్పుడు నే వెళితే మంచిది కదమ్మా. భార్యభర్తలు నెలకు మించి విడివిడిగ వుండరాదటమ్మా!"
    "భగవాన్! ఏమిటిదంతా?" అనుకుంది.
    "మీరంతా నన్ను అపార్ధం చేసుకుంటున్నారమ్మా! ఇల్లరికం వెళ్ళటం మనదేశంలో చాలా పాత ఆచారం ఇక్కడేముందమ్మా మనకు. ఈ ఇల్లు వకటే కదా? ఇందులో ఇద్దరికి వాటా ఎందుకు? తమ్ముడికే వుండనీ. ఆ ఆస్తికి నే వెళ్ళిపోతాను నేను సుఖపడటం మీకిష్టంలేదా?"
    టక్ టక్ మని చేతికర్ర శబ్దం వినిపించి గుండె జల్లుమంది అన్నపూర్ణకి.
    కళ్ళల్లోనీళ్ళు తిరుగుతూ వుండగా "బాబూ! మధూ! మీ నాన్నగారు వస్తున్నట్టున్నారు. ఆయనకీ సంగతి తెలిస్తే బాధపడతారు. కొంచెం వూరుకో నీకు పుణ్యం వుంటుంది" అంది బేలగా.
    అంతలో వచ్చేడు సుందర్రావు.
    "పూర్ణా!"
    "ఇక్కడే వున్నానండీ."
    "ఏమిటి మధు అంటున్నాడు?"
    "ఏమీ లేదండి."
    "ఏమీ లేదంటావేమిటి? మాటలు కొద్దికొద్దిగా వినిపిస్తూ వుండినయ్. తీవ్రంగా అంటున్నాడు? ఏమిటి సంగతి?"
    "ఏమీ లేదండి! ఏదో ఉద్యోగం విషయం."

 Previous Page Next Page