Previous Page Next Page 
మధుకీల పేజి 19

    "దాచి పెడతావెందుకు అన్నపూర్ణా! నేను అంతా విన్నానులే! చిన్నప్పటినుంచీ పెంచి పెద్దచేసిన మొక్క కాయా పూతా పట్టేకాలంలో అది ఇతర్ల పాలవుతూ వుంటే బాధగానే వుంటుందిలే పూర్ణా! కానీ అదివిధి మనం దాన్ని తప్పించలేం."
    "మీరు ఊరుకోండి!"
    "నేను వూరుకోక చేసేది ఏముంది పూర్ణా! గుడ్డివాడిని గుడ్డివాడుగా అడుక్కోటానికి కూడా నేను అనర్హుడిని. దుక్కల్లా ఇద్దరు కొడుకులున్నారంటారు ఎవరయినా? కానీ... కానీ... మన దురదృష్టం..."
    "నాన్నగారూ!"
    "ఛీ! నన్ను పలుకరించొద్దు."
    "నాన్నా!"
    "అవున్రా? ముసలి ఎద్దుని ముసలివాళ్ళని బ్రతుకనిచ్చే దేవుడిదిరా తప్పు. ఏళ్ళకొద్ది వ్యవసాయం చేసి యజమానికి పుట్లకి పుట్లుపండించి ఇచ్చిన కోదె కాస్తా వయసు మీరి ముసలిదై పోయాక దాన్ని కసాయి వాడికి ఇస్తారు. మేమంతా అర్రుకడిగిన ఎద్దులంరా! నా కర్మ కొద్దీ వయసూ వచ్చింది. దానితోపాటే కళ్ళూ పోయాయి. పరభాగ్యోప జీవినై బ్రతకవలసి వస్తుంది."
    "డబ్బుంది. అమ్ముంది. తమ్ముడున్నాడు. మీకేం కొదవ నాన్నగారూ?"
    "ఛీ! సిగ్గులేక వాదిస్తున్నావు. వెళ్ళరా వెళ్ళు కృతఘ్నుడా! నీలాటి వెధవని నమ్ముకుని బ్రతికేకంటే గుక్కెడు విషం పుచ్చుకోవటం మేలు. నీవూ, నీ భార్యా హాయిగా బ్రతుకుపోండి. మేం అడుక్కుతిన్నా చచ్చినా మీకు పట్టదు. అక్కర్లేదు. సంబంధంలేదు, పో! వెళ్ళిపో"
    "ఏమండీ!"
    "పూర్ణా! భయపడకు పూర్ణా! ఈలాటి వెధవల ఆసరా నమ్ముకునేకంటే బిచ్చమెత్తుకోవటం మేలు."
    "అంత మాటనకండి. భగవంతుడంత నిర్దయుడుకాడు"
    "ఏమిటమ్మా! భగవంతుడంటున్నావు? ఎక్కడున్నాడమ్మా దేవుడు. మనుషులకీ మాటలకీ భయపడి గుళ్ళో తలుపుల వెనుక దాక్కున్నాడమ్మా ఆయన. మీలాటివాళ్ళు పిలిచినా పిలుపుకి అందనంత దూరంగా వున్నాడమ్మా" అన్నాడు అప్పుడే వచ్చిన సుధాకర్ నవ్వుతూ.
    ఎవరూ మాట్లాడలేదు.
    మధు తన సరంజామా అంతా సర్దుకు పోసాగాడు. అన్నపూర్ణ, జయప్రద నోట్లో గుడ్డ కుక్కుకుని రోదించసాగారు.
    అర్ధంకాలేదు సుధాకర్ కి.
    "ఏమిటమ్మా సంగతి?"
    జయప్రద అంది "పెద్దన్నయ్య వెళ్ళిపోతున్నాడు చిన్నన్నయ్యా. నీవయినా చెప్పు."
    షాకయ్యేడు సుధాకర్.
    "ఎక్కడికిరా మధూ?"
    మధు పలకలేదు.
    "అత్తగారింట సేవలు చేయటానికి వెళుతున్నాడ్రా మీ అన్న. తన జీతంలో మనలందర్నీ సాకటం కష్టమట. అందుకని మనగతికి మనల్ని వదిలేసి వెళుతున్నాడు."
    "నిజమా నాన్నగారూ! అవునట్రా మధూ! ఇటీజ్ టూ బాడ్. ఇల్లరికం అల్లుడంటే ఏమను కుంటున్నావురా? వ్యక్తిత్వం చచ్చిన మనిషిజీతం. బత్తెంలేని నౌకరు. తెలుసా?"
    "షటప్! నేను ఇల్లరికం వెళ్ళటంలేదు. నేనూ నా భార్యా కలిసి వుండబోతున్నాం అంతే! ఆవిడ ఇక్కడికి రాలేదు కాబట్టి నేను వెళుతున్నానంతే!"
    నవ్వేడు సుధాకర్.
    "దాని అర్దం అదేరా! ఇవన్ని మీ పాపరాజు డాడి ట్రిక్స్ రా! నాన్నకి ఉద్యోగం పోయిందని నేనింకా చదువుకుంటున్నానని జయకి పెళ్ళి కావాలనీ వీటి అన్నిటికీ నీబోడి సంపాదనే మెయిన్ సోర్స్ అనీ అనుకుని నిన్ను సేవ్ చేయాలని మీ ముసలినక్క ప్లాన్ రా ఇది. ఉద్యోగం ఇచ్చినట్లే ఇచ్చి కాని కట్నంలేకుండా నిన్ను అల్లుడిని చేసుకున్నాడు. యిప్పుడు కుటుంబాన్ని విడదీస్తున్నాడు."
    "ఆయన తప్పేంలేదిందులో-"
    "అవును తప్పులేదురా! మీలాంటి కొడుకుని కన్నందుకు మేమే దోషులం."
    "మీరూరుకోండి నాన్నగారూ! వీడికి బుద్ధి వస్తుంది త్వరలోనే! మళ్లీ త్వమేవ శరణం మమ అని వస్తాడు... అయినా నేనున్నానుగా మీకు భయమక్కర్లేదు. అవసరమైతే ఉద్యోగం రేపటినుంచే వెతుక్కుంటాను. ఇంక ఏడాది ఆగితే డిగ్రీ వస్తుంది ఎలాగూ! దిగులెందుకు."
    "ఇంకేం అలా చెయ్యరా సుధా! చూడు నాన్నగారూ అమ్మా వూరకే బెంబేలు పడుతున్నారు. నేనయినా మరో దేశం వెళ్ళటంలేదుగా? వూళ్లోనే వుంటాను"
    "థాంక్స్! అప్పుడప్పుడూ వచ్చి చూచి వెళుతూవుండు"
    "అలాగే"
    "ఛీ! ఛీ! బుద్ధిలేదురా మధూ నీకు నీవొక పప్పిట్ అయిపోయావు. వచ్చి వెళుతూ వుంటాడట. ఎందుకు కాఫీ దండుగ త్వరగా దయచెయ్"

 Previous Page Next Page