Previous Page Next Page 
మానవత పేజి 18

 

    జానకికి ఏమీ అర్ధం కావడం లేదు. అంతా అయోమయంగా వుంది.
    "నీతి తప్పినవారికి ఇక్కడ స్థానం లేదు" అంది తిరిగి వురుముతూ శకుంతల.
    జానకికి మెదడు పనిచేయడం లేదు. కాళ్ళు నీరసించిపోతున్నాయి. బలంగా నిలదొక్కుకుంది. గుడ్లప్పజెప్పి చూస్తున్నది. సమాధానం ఏం చెప్పాలో అర్ధం కాలేదు.
    "మాట్లాడవేం? ఏమిటా ధైర్యం! చైర్మన్ను బుట్టలో వేసుకున్నననా?"
    జానకి మీద పిడుగు పడ్డట్టయింది. చీకటి గోయ్యరంలో ఉన్నట్లుంది. ఎక్కణ్ణించొ వినిపిస్తున్నాయి మాటలు. తనమీద నింద వేస్తున్నారు . తాను .....చైర్మన్ను .....బుట్టలో వేసుకుందిట! ఏమిటీ మాటలు.
    "ఏం చేశానండీ నేను?"
    "ఛీ! సిగ్గులేక ఇంకా అడుగుతున్నావా. అడదానివా? గాడిదవా?"
    "మాటలు సరిగా రానివ్వండి. మీరూ ఆడవారే" కేక పెట్టింది జానకి. ఉన్న బలం సాంతం కూడా దీసుకొని అరచినట్లుంది. ఆ కేక గదిలో ప్రతిధ్వనించింది.
    "అరిస్తే దాడుస్తారనుకున్నవా? సిగ్గులేక ఆ డాక్టరు వెంట తిరగడం నాకు తెలియదనుకున్నావా? కిరస్తానీ వెంట తిరుగుతావా! మీ నాన్న సంప్రదాయం గల వాడు. పెద్దవాడు. పండితుడు. ఇదేనా నువ్వు ఒరగబెట్టేది? నిన్ను ఉద్యోగం నుంచి ఊడపెరికెదాన్ని -- చైర్మన్ లేకుంటే. తెలివైనదానివి జాణవు. అతన్ని కట్టి వేశావు ముందే!"
    "ఆపండి!" జానకి అరిచింది. అంతే! మరి మాట్లాడలేకపోయింది . ముఖం నిండా చెమటలు పట్టాయి. పెదవి ఆదరసాగింది. కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి. "చైర్మన్ను బుట్టలో వేసుకున్నదేవరు? అది అందరికీ తెలుసు....."
    "ఏమీ! నన్నే అంటావ్?" గట్టిగా కేక పెట్టింది శకుంతల. లేచింది పులిలా. లాగి చెంప మీద కొట్టింది.
    జానకికి శక్తి లేదు. ఉద్రేకం పొంగింది. అది దుఃఖంగా మారింది. కంటి వెంట జలజలా నీరు రాలింది. అంతా అంధకారంగా ఉందామెకు. వళ్ళు తూలుతున్నది . తల బరువుగా ఉంది. కదలిక రావడం లేదు.
    గుమ్మంలో జనం కూడారు. అదీ గమనించలెదామే. గుమ్మం దాటింది. పిల్లలు తప్పుకున్నారు. వెళ్ళిపోయింది. వెళ్ళిపోతుంటే వినిపిస్తున్నాయి మాటలు - 'డాక్టరుతో కులుకుతుంది . డాక్టరు కావాలట దానికి.'
    

                                                           *    *    *    

    ముకుందం గారు భాగవతం చదవటం లేదు. వ్యాసపీఠం ముందు కూర్చుని లేరు. ఇంట్లో పచార్లు చేస్తున్నారు. వేగంగా నడుస్తున్నారు. జానకి గుమ్మంలో అడుగు పెట్టింది. ఆగిపోయాడు ముకుందం గారు. జానకి ముకుందంగారిని చూచింది. ముఖం మీద కోపం కనిపించింది. తోడేలులా తోచారు.
    "ఉద్దరించావు, రా! విన్నావా? లోకం కోడై కూస్తున్నది. వాడితో కులుకుతావా? అందుకే అన్నారు ----ఆడదానికి చదువద్దని- స్వాతంత్యం వద్దని. స్త్రీ బుద్ది ప్రళయంతకం . ముసలివాడున్నాడని సైతం అనిపించలేదు. సంపాదిస్తున్నా ననుకున్నావు. కళ్ళు నెత్తికెక్కాయి. నీకు తండ్రి అవసరం లేదు. కుటుంబం అక్కరలేదు. కులం అక్కరలేదు. మతం అక్కరలేదు. వాడు కావాలి. ఆ కిరస్తానీవాడు కావాలి/ వాడు -- ఆ కిరస్తానీ కావాలి. సిగ్గు లేదు, శరం లేదు. వాడివెంట తిరుగుతావా? వాళ్ళు మనసు , మన సంప్రదాయాల్ని నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. వాడు వలపన్నాడు , నువ్వు అందులో పడ్డావు. నేను ఉరిబోసుకు చావాలి. వేరే గతి లేదు. 'జానకి గొప్పది తన తండ్రిని చంపింది ' అని లోకం నిన్ను స్తుతిస్తుంది. కానివ్వు , ఏం చేస్తాం? నా శవం మీంచి నడిచి వాడి దగ్గరికి వెళ్ళాలి , అంతే , ఈ బొందిలో ప్రాణం వుండగా సాగనివ్వను."
    జానకి వింటూ నుంచుంది. ప్రతి మాట బాణంలా గుచ్చుకుంటుంది. అయినా బొమ్మలా నుంచుంది. , పెదవి కదపలేదు. అక్కడనుంచి కదిలింది, లోనికి వెళ్తుంది.
    "మాట్లాడవు, ఎందుకు మాట్లాడతావు? చేసి చూపిస్తావు నువ్వు, అవును నన్ను పోషిస్తున్నావు, సంపాదించి పెడ్తున్నావు. నా మాట నీకేం లెక్క! ఎందుకు లెక్క చేస్తావు! నేను నీకు తండ్రినా? వాజమ్మను, తెభ్యను, దరిద్రుడిని , అగతికుడిని , నువ్వు పడేస్తే తింటున్నాను. భగవాన్! ఉన్నావా లేవా? చూస్తున్నావా? చూడ్డం లేదా! ఎందుకింకా ఉంచుకున్నావు తీసుకుపోవెం! తీసుకుపో - తీసుకుపో" అని చేతుల్తో తల బాదుకో సాగాడు.
    జానకికి ఏమీ వినిపించడం లేదు. కనిపించడం లేదు. ఆమె మనసు పని చేయడం లేదు. మెదడు పనిచేయడం లేదు. గుండె మాత్రం కొట్టుకుంటుంది. గదిలో కూలబడింది. ప్రతిమలా కూలబడ్డది. ఎంతసేపు కుర్చుందో తెలియదు. రమాదాసి లాంతరు పట్టుకొని గదిలో అడుగు పెట్టింది. జానకి వెలుగు చూచింది. తోడు చూచింది. దుఖం పొంగింది. రమాదాసిని కావలించుకుంది. ఏడ్చేసింది. కుమిలి కుమిలి ఏడ్చింది. రమాదాసికి తన సోద వెళ్ళబోసుకుంది. రమాదాసి మనిషిలా కనిపించింది. మనసున్న దానిలా కనిపించింది. రమాదాసి అనునయించింది. ఓదార్చింది. ధైర్యం చెప్పింది.
    ఆ రాత్రి ఎవరూ అన్నాలు తినలేదు.
    ఆ సాయంకాలం పాల్ కు ఒక సీరియస్ కేసు వచ్చింది. వెళ్ళకూడదని అనుకున్నాడు. ఒక ప్రాణం తీసిన వాడవుతాడు. త్వరగా ముగించుకుని వద్దమానుకుని బయలుదేరి వెళ్ళాడు.
    చీకటి పడే వేళయింది. అప్పటికి జానకి గుర్తు వచ్చింది . సైకిలు వేగంగా తొక్కాడు. స్కూలు ముందు దిగాడు. ఎవరూ లేరు. శకుంతల వచ్చింది చూచింది.
    "జానకి కోసం వచ్చారా? మీరెందుకు బాబూ ఆవిడకు. చైర్మన్ ఉన్నాడు నేనామాటే అన్నాను, ఒక్కరిని చూచుకొమ్మని , అంతే వెళ్ళిపోయింది స్కూలు నుంచి. కంప్లయింట్ చేస్తుందేమో నా మీద. ఉద్యోగం తీసేయిస్తుందేమో! పాపం. నిన్ను చుస్తే జాలి వేస్తుంది. ఏం చేస్తాం?"
    పాల్ వింటూ నుంచున్నాడు. అతనికి ఆకాశం అడుగుల కిందికి వచ్చినట్లనిపించింది. సముద్రంలో సూర్యుడు పొడుస్తున్నట్లనిపించింది.
    "ఎందుకు బాబూ! అలా చూస్తావూ! నేను చెప్పేది నిజం. ఆ పిల్లను నమ్మకు. అది చైర్మన్ తో కులుకుతుంది. మరిచి పో దాన్ని. నీకేం , డాక్టర్ వు -- కావాలంటే వేలమంది వస్తారు , దానికేముంది ...."
    తరవాత వినలేదు పాల్. సైకిలు ఎక్కలేదుమ నడిపించుకుంటూ ముందుకు సాగాడు. పాల్ వెనక శకుంతల నవ్వింది ......కాదు - నవ్వుకుంది. ఆ రాత్రి చాలాసేపు నిద్ర రాలేదు పాల్ కు. శకుంతల మాటలే అతన్ని వేధించసాగాయి.
    ఆ రాత్రి జానకికి నిద్ర రాలేదు! శకుంతల రక్కసిలా కనిపించింది ఎందుకు తన మీద పగ దానికి? తానెం చేసింది దానిని? పాల్ సాయంత్రం వచ్చి వుంటాడు. తానక్కడ వుండదు. నిరాశ చెంది వుంటాడు. అక్కడ శకుంతల కనిపిస్తే ! కనిపిస్తే ! ! కనిపిస్తే! ! ! శకుంతల కసి వెళ్ళబోసుకుంటే! అవును, తనకూ, చైర్మన్ కు సంబంధం వుందని చెప్తే ! చెప్తే!! చెప్తే!!! అవును . పాల్ ఏమౌతాడు? అనుమానపడడూ? తనను గురించి ఏమనుకుంటాడు? జానకికి కొండంత దుఖం కురిసింది. వెక్కెక్కి ఏడ్చింది. ఎప్పుడో నిద్ర పట్టింది. కలలో పాల్ కనిపించాడు. పాల్ తనకు దూరంగా ఉండమంటున్నాడు. అతన్ని బతిమాలుతుంది తాను. తాను నిర్ధిషినని చెపుతుంది. వినడం లేదు పాల్. మౌనంగా వున్నాడు. మాట్టాడాడు బొమ్మలా ఉన్నాడు. రాతి విగ్రహంలా ఉన్నాడు. తాను ఉరికింది , రాతి బొమ్మకు తల కొట్టుకుంది. రక్తం కారుతుంది. తల పగులుతుంది. ఆకాశవాణి పలికింది. అదృష్యవాణి మాట్లాడింది . 'జానకి నిర్దోషి. ఆమెను పరిగ్రహించు' రాతి బొమ్మకు ప్రాణం వచ్చింది. పాల్ తనను కౌగలించుకున్నాడు. తన తల పగిలి వుంది. రక్తం కారుతూనే ఉంది. అయినా బాధగా లేదు, హాయిగా వుంది. సుఖంగా ఉంది. ఎంత హాయిగా ఉంది! ఎంత సుఖంగా ఉంది!!

 Previous Page Next Page