Previous Page Next Page 
మానవత పేజి 19

 

    జానకి కళ్ళు తెరిచింది. పిట్టలు కిచకిచ మంటున్నాయి. వాకిట్లో ఊడుస్తున్న చప్పుడు వినిపించింది. జానకి లేచింది చూచింది. తండ్రి లేడు. వాకింగ్ కు వెళ్ళాడు. మంచి అదను అనుకుంది పాల్ ఇంటికి వెళ్దామనుకుంది, అన్నీ చేపుదామనుకుంది. కలలో వలె అతని భుజం మీద తల పెట్టి ఏడుద్దామానుకుంది. చప్పున తెలిసి వచ్చింది. జీవితం కల కాదని. పాల్ ఇంట్లో ఫాదర్ వుంటారు. తనను అడిగితె ఏమని చెపుతుంది? అయితే ఎలా మరి? రమాదాసి కనిపించింది. రమాదాసీతో చెప్పుకుంది. స్కూలుకు వెళ్ళడం - నరకంలోకి వెళ్ళడమే నన్నది. అయినా వెళ్తానన్నది. పాల్ ను రమ్మని చెప్పమన్నది. రమాదాసీ ఓదార్చింది. జానకి మనసు తనకు తెలుసునన్నది. పాల్ తో చేపుతానన్నది. ఇద్దరినీ కలుపుతానన్నది. రమాదాసి దేవతలా కనిపించింది జానకికి. జానకి రమాదాసిని కావలించుకున్నది. ముద్దులు కురిపించింది.
    జానక్కి తేలిగ్గా వుంది. ఏదో హాయిగా వుంది. చీకటి పొర విడిపోయినట్లుంది. వెలుగు రేఖ కనిపిస్తున్నట్లుంది. చకచకా పనులు చేసింది జానకి. కాఫీ కప్పు పట్టుకుని తండ్రి దగ్గరికి వచ్చింది. ముకుందంగారు వాలు కుర్చీలో కూర్చుని  వున్నారు. జానకిని చూచారు. కాఫీ కప్పు అందుకున్నారు. జానకిని కూర్చోమన్నారు.
    "ఇవ్వాళ నుంచి ఉద్యోగం మానెయ్యి. ఇల్లు కదలకు. బిచ్చం ఎత్తుకుని బతుకుతా. నిన్ను పని చెయ్యనివ్వను. బయటికి పోనివ్వను. తల ఎత్తుకు తిరిగేటు లేదు. ఆడదానికి అలుసు ఇచ్చాను. అనుభవిస్తున్నాను. ఆ కిరస్తానీ వెధవ....."
    "నాన్నా! అందరినీ వెధవలనే హక్కు....."
    "అవును, పొడుచుకొస్తుంది , ఎందుకు? వాడు మందు పెట్టాడు నీకు. మన ధర్మాన్నీ , సంప్రదాయాన్ని మంట కలపడానికి వచ్చారు వాళ్ళు. నీకు మైకం కమ్మింది. వాడు వట్టి వెధవ, చవట, దుర్మార్గుడు . లుచ్చా. వాడి నీడ ఇటు పడితే వాణ్ణి కూనీ చేసి జైలుకు పోతా. ధర్మం రక్షించినట్లవుతుంది. సంప్రదాయం కాపాడినట్లవుతుంది. ప్రాణం పోయినా సరే నిన్ను వాడి చాయలకు పోనియ్యను. విన్నావా! కదలొద్దు ఇంటి నుంచి, కదిల్తే ప్రాణం తీస్తా."
    "నాన్నా! మన ధర్మం ప్రాణాలు తీయమంటుందా?"
    "పిచ్చిగా వాగకు. వెధవగా పేలకు. నీకు కిరస్తానీ మతం తల కెక్కించాడు వాడు. నీకు మనకు సంబంధించిన వేవీ బాగనిపించవు , నిన్ను కిరస్తానీలో కలవనివ్వను. విన్నావా?"
    "వాదించేదేముంది? మీ కంటే నిజంగా ఆ కిరస్తానీలే నయం. నిజం నమ్ముతారు" అని చివాలున లేచి వెళ్ళిపోయింది జానకి.


                                                             16

    పాల్ సాయంత్రానికి స్కూలు ప్రాంతానికి చేరాడు. ఇంకా వదల్లేదు. కాస్త దూరంలో నుంచున్నాడు. గడియలు రోజులుగా గడుస్తున్నాయి. అక్కణ్నుంచి బయల్దేరాడు. మర్రి క్రిందికి చేరాడు. కూలాబడ్డాడు. చెరువును చూచాడు. చెరువు కట్టను చూచాడు. పిట్టల్ను చూచాడు. చెట్లను చూచాడు. మొన్నా అన్నీ బావున్నాయి. ఇవ్వాళ ఏదీ బావుండలేదు. అన్నీ బావురుమంటున్నాయి. మర్రి ఆకు తీశాడు. ఈనెలు తీయసాగాడు. బడిగంట వినిపించింది. గుండెలో గంట కొట్టినట్లయింది. ఏదో ఆశ మొలకెత్తింది. జానకి వస్తుంది. తనతో మాట్లాడుతుంది. తన అనుమానాలు అబద్దం అని చెపుతుంది. జానకి నవ్వుతుంది. చెరువు నవ్వుతుంది. చెట్లు నవ్వుతాయి. పిట్టలు నవ్వుతాయి.
    పాల్ లేచి బాటవైపుకు నడిచాడు. నుంచున్నాడు. పిల్లలు వచ్చారు. వెళ్ళిపోయారు. వస్తున్నా ప్రతివారూ జానకి లాగే కనిపించారు. దూరం నుంచి . ఎవరూ జానకి కాదు. ఎక్కడా జానకి లేదు. చాలాసేపు నుంచున్నాడు. జానకి రాలేదు. కాళ్ళలో బరువు చేరింది. నిరాశ వ్యాపించింది. అంతా ఖాళీగా ఉంది. లోకంలో మనుషులు లేనట్లుంది. ఇంత లోకంలో తానొక్కడేనా? ఎందుకు రాలేదు జానకి? అసలు స్కూలుకే రాలేదా? ఏం? ఏమైంది? జానకి జబ్బున పడిందా? తాను డాక్టర్. ట్రీట్ మెంటు చేయలేడూ? జానకి ఇంటి వైపు బయల్దేరాడు. కొంతదూరం వెళ్లి నిలిచి పోయాడు. మంచిది కాదేమో! వెళ్ళకూడదేమో? అది నిజమే! వెళ్ళరాదు. సమాజం చాలా చెడ్డది. అది నిజాన్ని ఎన్నడూ గమనించదు. ప్రేమను అసలు సహించదు. అంతే. అలా అనుకున్నాడు . వెనక్కు వెళ్ళాడు. ఆస్పత్రిలో అడుగు పెట్టాడు. పేషెంట్లున్నారు, చాలా మంది ఉన్నారు. మనసు పేషెంట్ల మీద లేదు. మనసు ఉగ్గ పట్టుకున్నాడు. మరల్చుకున్నాడు . పేషెంట్లలో మునిగిపోయాడు. మందులు - మాత్రలు- ఇంజక్షన్లు గడిచిపోతుంది కాలం.
    అమాంతంగా ఏడుపు వినిపించింది. పాల్ బయటికి ఉరికాడు. ఒక అమ్మాయిని రిక్షాలోంచి దింపుతున్నారు. అమ్మాయికి స్పృహ లేదు, ఎత్తుకొచ్చి టేబుల్ మీద పడుకోబెట్టారు. ఆ అమ్మాయి నిద్రమాత్రలు మింగింది. ఎందుకు అంటే చెప్పలేదు. తనకు ప్రస్తుతం దాంతో నిమిత్తం లేదు. అమ్మాయి బతకాలి అమ్మాయితో వాంతి చేయించాడు. సూదులు పొడిచాడు. చాలాసేపు తంటాలు పడ్డాడు. అమ్మాయి కళ్ళు తెరిచింది. డాక్టర్ గెలిచాడు. డాక్టరు కు హాయిగా వుంది.
    "ఎందుకు మింగావు మాత్రలు?"
    "ఎందుకు బతికించారు డాక్టర్?"
    "ఏం? ఎందుకూ అంత నిరాశ?"
    "నేను ప్రేమించాను డాక్టర్?"
    "అయితే!"
`    "ప్రేమించిన వాళ్ళు బతక్కూడదు డాక్టర్! మా అమ్మా నాన్నకు ఇష్టం లేదు. తప్పు అతని దన్నారు. అతన్ని కొట్టారు. ఊళ్లోంచి వెళ్ళగొట్టారు. నేనెలా బతకాలి డాక్టర్! ఎందుకూ బతకడం? అతను లేడు. ఇంత విషం ఇవ్వు డాక్టర్ - డాక్టర్ బతకాలని లేదు."
    "తప్పు ఏ డాక్టర్ అలా చేయడు. బతికించడం డాక్టర్ పని. చంపడం సమాజం పని. నిరాశ చెందకు. అతను వస్తాడు. నిన్ను తీసికేళతాడు."
    "డాక్టర్! మీకు మందులు మాత్రమే తెలుసు, మనసులు తెలియవు."
    అమ్మాయి తల్లి దండ్రులు వచ్చారు. వాళ్ళతో ఏదో చెబుదామను కున్నాడు డాక్టర్.
    "తెలియక మాత్రలు మింగింది. రక్షించారు" అని కృతజ్ఞత చెప్పాడు తండ్రి.
    డాక్టర్ మాట మింగాడు.
    వాళ్ళు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు. పాల్ మనసు నుంచి ఆ అమ్మాయి పోలేదు. వయసు చిన్నదే - పదారు పద్దేనిమది ఉంటాయి. అప్పుడే జీవితం అంటే విసుగు! "ప్రేమించినవాళ్ళు బతగాకూడదు డాక్టర్" ఎంత అనుభవం లోంచి వచ్చిన మాట అది! ఇది అందరికీ వర్తిస్తుందా! లైలా - మజ్ను , షీరీ - ఫర్ధాద్ , పార్వతి - దేవదాసు ! ఎవరి ప్రేమ ఫలించింది సమాజంలో? వాళ్ళ ప్రేమ కధలు చెప్పారు రచయితలూ కాబట్టి తెలిశాయి. ఎందరు ఇలా బలి అయిపోతున్నారో! జానకిని కూడా నిర్భందించారు? ఏమో! మరి ఎందుకు రాలేదు? స్కూలుకే రాలేదా? రానివ్వలేదేమో? ముకుందంగారికి తెలిసిందేమో! ఏమో! మరి తానేం చేయాలి? ఏం చేయాలి?
    ఆలోచనలు ఊపిరి సలపనివ్వలేదు. పేషెంట్లు లేరు. వాలుకుర్చీలో కూర్చున్నాడు. కణతలు పగులుతున్నాయి. ధమనులు చిట్లేట్లున్నాయి. ఏసుదాసు కాఫీ అందించాడు. తాగుతున్నాడు, రమాదాసీ వచ్చింది. ఏదో వార్త వచ్చిందనుకున్నాడు. నిటారుగా కూర్చున్నాడు. కాఫీ కప్పు కింద పెట్టాడు.
    "జానకమ్మను కదలనివ్వటం లేదు అయ్యగారు. ఇల్లు కదిల్తే కాలిరక్కోడ్టా నన్నడు. ఎవరో చెప్పిన్రు అయ్యగారికి, నీ పాణం తీస్తనన్నడు'" కధ సాంతం వినిపించింది రమాదాసీ. కంటతడి పెట్టింది. కన్నీరు రాల్చింది. జానకి పరితపిస్తున్నదని చెప్పింది. ఏడ్చింది.
    పాల్ మనసు కుతకుత ఉడికింది. మతం అడ్డు రాకుంటే తాను జానకి  ఇంటికి వెళ్ళేవాడు. ఎవరు అవునన్నా కాదన్నా తెచ్చుకునేవాడు. ఇప్పుడలా కాదు తాను పోలేడు. జానకి రాలేదు ' ప్రేమించినవాళ్ళు బతగ్గూడదు డాక్టర్! ' తానింత విషం తిని, జానకికి ఇంత పంపితే! అంతటితో సరి. అంతా అయిపోతుంది. ఒక అధ్యాయం ముగుస్తుంది . అంతేనా? అది తప్పు , ప్రేమ గెలవాలి. ఓడడానికి వీల్లేదు. ప్రేమ పవిత్రం అయింది. అది మతాలకు అతీతం అయింది. కులాలకు అతీతం అయింది. దేశాలకు అతీతం అయింది. అది గెలవాలి. దాని గెలుపు మనిషి గెలుపు. దాని ఓటమి రక్కసికి గెలుపు! ప్రేమ గెలవాలి, గెలిచి తీరుతుంది.

 Previous Page Next Page