"ఏం దాసీ!"
"ఈ ఎరున్నది చూసినావా?"
"చూసిన"
"దానిదెం మతం?"
"దానిదెం మతం?"
"దాసూ!"
"ఏం దాసీ!"
"ఈ చెట్లు , పిట్టలు చూసినవా?"
"చూసిన"
"వాటికేం మతం?"
"వాటిదెం మతం?"
"దాసూ!"
"ఏం దాసీ!"
"మనం ఎవరం?"
"దాసులం"
"మనదెం మతం?"
"మనకేం మతం ?"
"అట్లయితే ఆకాశం, ఏరు, చెట్లు -- ఇవే మన పెండ్లి చేస్తయి"
"అదెట్ల?"
"రా, పోదం" అని దాసును లాక్కొని పోయింది.
ఇద్దరూ ఏటి ముందు నుంచున్నారు.
ఇద్దరూ చేతులు జోడించారు.
"ఓ ఆకాశమా! ఓ భూదేవీ! ఓ చెట్లుల్లారా ! ఓ పిట్లల్లరా ! మేం పెండ్లి చేసుకుంటూన్నం . మా జంట కలకలం ఉండనియ్యండి" రమాదాసి అన్నది.
"ఓ ఆకాశమా! ఓ భూదేవీ! ఓ చెట్లుల్లారా ! ఓ పిట్లల్లరా ! మేం పెండ్లి చేసుకుంటూన్నం . మా జంట కలకలం ఉండనియ్యండి, దీవించండి." ఏసుదాసు అన్నాడు .
పక్షులు కిలకిల మన్నాయి.
ఏరు గలగల మన్నది.
చితచెట్టు పూత రాల్చింది.
ఆకాశం వెలిగింది.
"చూచినావా? అన్నీ దీవించినయి మన పెండ్లి అయింది!"
"పెడ్లంటే ఇంత తేలికా?" ఏసుదాసు ఆశ్చర్యం వ్యక్తపరిచాడు అతని కళ్ళు వెలిగాయి.
"అవుమల్ల! " సిగ్గు దొంతర్లు కనిపించాయి రమాదా ముఖంలో. తలవంచుకుంది, అన్నది "పేదొండ్ల పెండ్లంటే ఇంతే"
ఏసుదాసు చేయి చాచాడు. రమాదాసి చేయి అందించింది. ఏసుదాసు ఆమె చేయి అందుకున్నాడు. ప్రాణి గ్రహణం జరిగిపోయింది.
"రా, పోదాం." ఆమెను పట్టుకొని నడిచాడు ఏసుదాసు. ఇద్దరూ గట్టెక్కారు.
15
జానకి తొందరగా బయల్దేరింది స్కూలు నుంచి. ఆమె చకచకా నడిచింది మర్రి కిందికి వచ్చింది. అప్పటికే పాల్ వచ్చేశాడు. నేల మీద గీతలు గీస్తున్నాడు. పాల్ జానకిని చూచాడు.
"ఓ! వచ్చేశారా?"
"చాలా సేపైందా వచ్చి?"
"ఊహు! ఏం లేదు. కూర్చోండి"
జానకి కూర్చుంది పాల్ ముందు. ఏవేవో మాటల తరవాత వారి మధ్య వారి పెళ్ళి ప్రస్తావన వచ్చింది.
"మిమ్మల్ని కొన్ని విషయాలడగాలనుకున్నాను."
"అడగండి. సంకోచం ఎందుకు?"
"అది కాదు. మీకు మతం మీద నమ్మకం ఉందా?' జానకి పాల్ కళ్ళలోకి చూచింది. పాల్ కళ్ళు వెలిగాయి.
"ఉంది. నా మతం అంటే నాకు నమ్మకం. మరి మీకు"
"నేనూ అదే చెప్పాలనుకున్నాను మీకు. నాకు నా మతం మీద విశ్వాసం ఉంది. నేను ప్రతిరోజూ పూజ చేస్తాను. రాముడంటే నాకిష్టం. సీతమ్మ నాకు ఇష్ట దైవం."
"నాకు క్రీస్తు మీద విశ్వాసం. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను. నేను దాన్ని వదులుకోలేను."
"బావుంది భవిష్యత్తు ఏంతో అందంగా ఉండేలా. ఉంది. మీరు చర్చికి వెళ్తారు. నేను పంపుతాను. నేను గుడికి వెళ్తాను. నన్ను మీరు సాగనంపుతారు. మీరేమంటారు?"
"వండర్ పుల్ అంటాను" అన్నాడు పాల్ నవ్వుతూ.
"ఇంతకూ మన వివాహాన్ని మన తల్లిదండ్రులు సమ్మతిస్తారా?"
"మా నాన్న వప్పుకోరు. మీ నాన్న అసలే వప్పుకోరు. అందుకే మనం దూరంగా ఉండాలి. పట్నం వెళ్ళిపోదాం. అక్కడ సమాజం ఇంత ఇరుకుగా ఆలోచించదు. నాకేం? ఎక్కడయినా ప్రాక్టీసు పెట్టుకోగలను. మీ ఇష్టం వుంటే ఉద్యోగం చేయండి. లేదా మానేయ్యండి. మీరు ఉద్యోగం చేస్తే మీ డబ్బు మీద నా పెత్తనం ఉండదు. మీరు మీ నాన్నగారికి పంపండి. పాపం ఆయనకు కష్టం అవుతుంది. నేను చెప్పానుగా- మనం మంచి మిత్రులుగా వుందాం."
"థాంక్స్! మెనీ మెనీ థాంక్స్!! మీ ఔదార్యం నన్ను ఆకర్షిస్తుంది. మనం కలిసి జీవించగలం. మన జీవితాన్ని పూలబాటగా మలచుకోగలం. కాని, మన పెళ్ళి ఎలా జరగాలి?"
"అవును ఎలా జరగాలి? ఎవరు చేయాలి?" ఆలోచనలో పడిపోయాడు పాల్. ఆలోచనలో పడిపోయింది జానకి.
క్షణాలు మౌనంగా దొర్లిపోతున్నాయి.
రమాదాసి , ఏసుదాసు అక్కడికి వచ్చారు.
"ఇక్కడున్నామని మీకెలా తెలిసింది?' పాల్ అడిగాడు.
"మేం పెండ్లి చేసుకున్నం" ఏసుదాసు తననూ, రమాదాసినీ చూపుతూ అన్నాడు.
రమాదసి సిగ్గు ఒలకబోసింది. తల వంచుకుంది. గోళ్ళు గిల్లుకుంటుంది. కాలి బొటన వేలుతో వలపు వలయాలు కలుపుతుంది.
"అవునా?" అడిగింది జానకి రమాదాసీని.
"అవును. చేసుకున్నం. మొక్కటానికి వచ్చినం" అని కూర్చున్న ఇద్దరి కాళ్ళు మొక్కరు నవదంపతులు.
దీవించారు ఇద్దరూ.
"ఎవరు చేయించారు పెళ్ళి" అడిగాడు పాల్.
"మేమే చేసుకున్నం" అని జరిగింది వివరించాడు ఏసుదాసు.
"బావుంది. మంచి పని చేశారు" అని జేబులోంచి కొంత డబ్బు తీసి అందించాడు పాల్.
డబ్బు అందుకున్నాడు దాసు. మళ్ళీ మొక్కారు ఇద్దరూ. వెళ్ళిపోయారు.
"చూశారా! వాళ్ళెంత చిత్రంగా పెళ్ళాడేరో!" జానకి అన్నది.
"అవును, వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది చాలా వుంది. వాళ్ళే నిజమైన మనుషులు"
ఇద్దరూ లేచారు. కొంత దూరం కలిసి నడిచారు. విడిపోయారు. శనివారం జానకి యింటిదగ్గర పూజ చేసుకుని, స్కూలు కి వెళ్ళేసరికి ఆలస్యమయింది. తను వెళ్ళేసరికే శకుంతల క్లాసురూం లో వుంది. మొహం ఎర్రబడి వుంది. కళ్ళు చింతనిప్పుల్లా వున్నాయి.
"ఇది స్కూలు . తెల్సా నీకు! " అంది ఆమె గర్జిస్తూ.