Previous Page Next Page 
జనపదం పేజి 17

 

    శివరావు సింహం అయినాడు. "బట్టలిప్పండి లంజాకొడుకులివి" ఆజ్ఞాపించాడు.
    చావబాది బట్టలు విడిపించారు పోలీసులు.
    "అడ, మగ , పిల్లా, జెల్లా అంతా నగ్నంగా నుంచున్నారు. వళ్ళు చిట్లింది. రక్తాలు కారుతున్నాయి. అయినా మౌనంగా నిల్చున్నారంతా దిశ మొలలతో.
    తరువాత ఏం చేయాలో అర్ధం కాలేదు శివరావుకు. అతనికి వాస్తవంగా కోపం రావడం లేదు. తప్పించుకుంటున్నాడు. తన ప్రతిభ చూపాలి. అందుకు ఏం చేయాలి?
    "నడిపించండి" గట్టిగా కేకపెట్టాడు.
    దినమోలల జనం వీధుల వెంట సాగారు. పోలీసులు నెట్టుతూ , బాదుతూ తీసుకెళ్తున్నారు. ఊరంతా తిప్పి గాంధీ బొమ్మ దగ్గరకు తెచ్చారు. చేతులు పైకెత్తి తలలు వంచి నిల్చున్నారు జనం.
    ఏం చెయ్యాలి? మళ్ళీ అర్ధం కాలేదు. శివరావు. ఎందుకు చేశాడు? అదీ అర్ధం కాలేదు. పోలీసు అధికారికి. అతనికి తెలిసిందల్లా ఏదో చెయ్యాలి. అంతే.
    "బోర్లా పడి మొక్కండి" అజ్ఞాపించాడు.
    అంతా మొక్కారు.
    "గాంధీజీకి జై" అనాలన్నాడు.
    ఆతడు "గాంధీజీకి " అన్నాడు.
    జనం "జై" అన్నారు.
    అలా మూడుసార్లు అనిపించాడు.
    నాయకులూ సంతోషించారు.
    అందర్నీ బట్టలు వేసుకొమ్మన్నాడు శివరావు. అరక్షణంలో అంతా వేసుకున్నారు. ఇండ్లకు పరిగెత్తమన్నాడు. తలుపులు వేసుకొని ఇండ్లలో కూర్చోవాలన్నాడు. ఒక్కడూ బయటికి వెళ్ళరాదన్నాడు.
    క్షణంలో సగం వీధులు నిర్మానుష్యం అయినాయి.
    అజ్ఞ తు.చ తప్పకుండా పాలించబడింది.
    మరికొన్ని అమానుష కృత్యాలు జరిగాయి. రాయడానికి రచయితకు సిగ్గుగా ఉంది.
    అనదికారమైన కర్ఫ్యూ విధించి అవతల పడ్డాడు శివరావు - లా - అండ్ ఆర్డర్ సుభేదార్ అప్పగించి.
    జీపులు బుర్ర్ మన్నాయి. ఊరు రామునికి అప్పగించి గాంధీజీకి ఒక దండం పెట్టి పట్నంలో పడ్డాడు బలరామయ్య. నాయకులందరూ పట్నం చేరి గాంధీజీ విగ్రహ ప్రతిష్టాపన గురించి గొప్పగా చెప్పుకున్నారు. పత్రికలు వారు చెప్పిందాన్నే ప్రకటించాయి. బలరామయ్య బొమ్మ కూడా వచ్చింది. అతనికి పలుకుబడీ, బలమూ హెచ్చాయి.
    ఊళ్ళో జనం వుడికిపోతున్నారు. గడపదాటి బయటికి రావడానికి వీల్లేదు.
    రామునిది వేదవాక్యం అయింది. కాబట్టి గడపదాటితే సారాయి దుకాణానికే. జనం సారాయి దుకాణానికి వెళ్ళవచ్చు. తాగిం తరువాత గడబిడ చేయవచ్చు. తరవాత మళ్ళీ ఇండ్లలలో దూరాలి. రామునుకి వ్యాపారం బాగానే ఉంది. రోజంతా దుకాణంలోనే ఉంటున్నాడు. ఒకనాటి ఉదయమే వచ్చాడు యాదగిరి.
    "ఏయ్ యాదగిరి! ఎటో వచ్చినవు?" అడిగాడు రాముడు.
    "ఇంకేడికి/ ఈడికే వచ్చిన"
    "ఏం సంగతి?"
    "ఏమున్నది? ఇంట్లో ఏళ్ళుతలేదు. ఏమన్న పని చుపిస్తవేమోనని వచ్చిన నీదయ.'
    "అయితే దుకాణం ల కూర్చో. జీతమిస్త ఏమంటావ్?"
    "అంతకంటేనా అన్న. చాలు - పని చూపించినవు . నీ కడుపున పుడ్త"
    "అదంత ఎందుకులే గాని జర భద్రం గుండాలే. లెక్కలు గిక్కలు బాగరాయి . పైసెవ్వని తాన ఉన్నదిగని?" అని వ్యాపారానికి సంబంధించిన విషయాలన్నీ బోధించి యాదగిరిని కొట్లో కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళటం వెళ్ళటం కరణం ఇంటికి వెళ్ళాడు. తాళం తీసి లోపలికి వెళ్ళి చూచాడు. అంతా పాడుబడ్డట్లుంది. బాగుచేసి ఆ ఇంట్లో ప్రవెశించాలనుకున్నాడు. బలరామయ్య మీద ఆధారపడ్డం ఎందుకో ఇష్టం ఉండడం లేదతనికి ఈ మధ్య.
    రాత్రి అవుతే పోలీసులతో చీట్ల పేకకు కూర్చుంటున్నాడు. ఆటలో అతనిదే పైచేయి అంటున్నా కొద్దో గొప్పో పోతూనే ఉంది. అయినా లక్ష్యం చేయడం లేదతను. అతను ఆడేది ఆకట్టుకోవడానికి అది జరుగుతూనే ఉంది. పోలీసులు అతనికి గులాములయినారు. ఒకనాడు పేకాడుతూ అన్నాడు.
    "ఊళ్ళో వాళ్ళను కూడా ఆటకు పిలిస్తే?"
    "ఈ ఊళ్ళో పేకాట ఎవనికొస్తుంది? వెనకపడ్డ ఊరు'!" అన్నాడు సుభేదారు.
    "నేర్చుకుంటే అన్నీ వస్తాయి. నాకు మాత్రం వచ్చిందా మొదలు. వస్తే మంచిదేగా ఏమంటారు?"
    "సరే కానివ్వండి. మీరన్నది ఏది కాదన్నాను?"
    ఆనాటి నుంచి రాత్రి పూట పేకాటకు మాత్రం రావటానికి ఊళ్ళో వాళ్ళకు అనుమతి లభించింది. ఒకటి, అరతో మొదలై పది పదిహేను మంది దాకా ఆటకు రావడం సాగించారు. కొందరు ఆడదానికి కొందరు చూడటానికి రాసాగారు. కాని అట పట్టుబడ్డది శేషయ్యకే. వాస్తవంగా దోచేస్తున్నాడు. అయినా అతడు డబ్బు ఉంచుకొనే వాడు కాదు. తాగుడుకో తిండికో ఖర్చు పెట్టేవాడు. అందువల్ల అతడు తలలో నాలుక అయినాడు.
    ఊరికి సారాయి మైకం కమ్మింది. పేకాట పైత్యం తగిలింది. రాముడు వాటిని వాడుకున్నాడు. సారా నీళ్ళు పోసే కరణం ఇల్లు బాగు చేయించసాగాడు. లంకంత ఇల్లు. ఒకటి రెండు రోజుల్లో అయ్యే పనా? అవుతూనే ఉంది.
    రాముడు ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాడు. తలం చెవుల గుత్తి తిప్పుతూ ఉదయం ఒకసారి, సాయంకాలం ఒకసారి ఊరంతా కలయ తిరిగి వచ్చేవాడు. అనేకమందికి అనేక పనులు పడేవి అతనితో , గింజా, గిరుగూ, కూలి నాలి అన్ని ఏర్పాట్లు చేస్తుండేవాడు.
    ఒకనాడు ఉదయం రాముడు ఊరు సర్వ్ చేస్తున్నాడు. మంగమ్మ - చనిపోయిన జగ్గయ్య భార్య - తల అర బెట్టుకుంటున్నది. భర్త పోయిన్నాటినుంచి ఆమె తల దువ్వడం, తలంటుకోవటం మానేసింది. అవసరం అయింది కాబట్టి తల మీంచి స్నానం చేసింది. వెంట్రుకలు ఆర పెట్టుకుంటుంది. ఆమె వెంట్రుకలు మబ్బుల్లా చెదురుతున్నాయి. మళ్ళీ దగ్గరకు వస్తున్నాయి. చూస్తూ నిల్చున్నాడు రాముడు. ఆ మబ్బులు అతని గుండెల్లో చేరాయి. ఉరుములు, పిడుగులు కురిశాయి. రాముడు తదేకంగా చూస్తున్నాడు.
    మంగమ్మ అది గమనించలేదు. గుడిసెలో దూరింది.
    రాముని గుండె ఎగిరింది. గుడిసెలో దూరింది. రాముని కాళ్ళు గుడిసె ముందు దాకా సాగాయి. అతని నోరు పిలిచింది మంగమ్మా!"-
    మంగమ్మ బయటికి వచ్చింది.
    ఆమె చెక్కిళ్ళలో అద్దాలున్నాయి.
    రాముడు ఆమెను చూచాడు. అతని కళ్ళలో విషనాగులు బుస కొట్టాయి.
    మంగమ్మ రాముడ్ని చూచింది. కొలిచినది. అతని వుద్వేగం చూచింది. ఆరాటం చూచింది. కళ్ళలో బుసలు కొడ్తున్న కామాన్ని చూసింది. కలవరపడ్డది. తడబడ్డది. తోణికిసలాడింది. తల వంచుకుంది. "రామన్నా" అని కన్నీరు టపటప రాల్చింది.
    భోరుమని ఏడ్చేసింది. ఆమెకు భర్త గుర్తుకు వచ్చాడు - అతడుంటే!
    సలసల కాగిన రాముని రక్తం చల్లబడ్డది. మంగమ్మను ఓదార్చాడు. "ఏడవకు - ఏడుస్తే ఏమొస్తది ?" అంటూనే దగ్గరకు వెళ్ళాడు. తల నిమిరాడు.
    రాముడు మంగమ్మను చూశాడు.
    కొలకుల్లా ఉన్నాయి కళ్ళు.
    రాముని గుండెలో చిచ్చు పెట్టాయి.
    ఆరిన అగ్ని భగ్గుమంది.
    దూరం జరిగాడు రాముడు.
    "వస్త, జగ్గన్న ఒకడు నే నోకన్నిఅనుకోకు. ఏమన్న కావాల్నంటే అడుగు" అంటూ పెద్ద పెద్ద అంగలు వేస్తూ సాగిపోయాడు.
    మంగమ్మ వెర్రిగా అతణ్ణి చూస్తూ ఉండిపోయింది.
    ఆరోజు శనివారం . శనివారం రాత్రి పోలీసులు భజన చేస్తారు. డోలక్ హార్మోనియంతో భజన సాగుతోంది. ఆరోజు భజనకు ఊళ్ళో వాళ్ళనూ పిలిచారు. బాగా రాత్రికి మొదలయింది భజన. డోలక్ మ్రోగింది. హార్మోనియం శృతి కలిపింది. తాళాలు పడ్డాయి. "రఘుపతి రాఘవ రాజారాం' తో మొదలైన భజన సినిమా పాటల సహితంగా సాగుతుంది.
    రాముని కళ్ళు మంగమ్మ కోసం వెదికాయి. అసలు ఊళ్ళో వాళ్ళను భజనకు పిలిచింది అందుకే అతడు. మంగమ్మ కనిపించలేదు. రామునికి భగవంతుడు కనిపించలేదు.
    ఆ రాత్రికి రామునికి నిద్ర లేదు. మంగమ్మ అతని మనసులో కూర్చుంది. గుండె బరువైంది. సిగరెట్లు త్రాగాడు. గడీ మొత్తం సర్వ్ చేశాడు. అంతటా మంగమ్మే కనిపించింది. ఎక్కడా ఆమె కనుపించలేదు. పడుకున్నాడు. మంచంలో పల్లేర్లు పరచుకున్నాయి. లేచి తిరిగాడు. గాలి స్థంభించినట్లయింది. ఆ రాత్రే మంగమ్మ ఇంటికి వెళ్దామనుకున్నాడు. మెట్ల దాకా వచ్చాడు. ఆ తరవాత ధైర్యం చాలలేదు. మళ్ళీ వెనక్కు వెళ్ళాడు.
    ఆ రాత్రి అతి దీర్ఘం అయింది.
    అయినా సూర్యుడు మొలిచాడు.

 Previous Page Next Page