Previous Page Next Page 
క్లైమాక్స్ పేజి 18

అందరూ కదిలారు. వాళ్లతో పాటు కదిలారు నాయకుడూ, హరీన్, కరుణా కూడా.
"ఆగండి ....మీరు ఎక్కడికి?" అంది చిక్ లీ.
వాళ్ళు ముగ్గురూ ఆగిపోయారు.
ఆరోపణగా ఇలా అంది చిక్ లీ.
"నేను నేరం మోపింది నాయకుడు ఒక్కడిమీదేకాదు. జింబురూ, అతనితో కూడా వచ్చిన ఈ పట్నంపిల్ల కూడా అపరాదులే. కులగురువు తీర్పు చెప్పేవరకు వీళ్ళు ముగ్గురూ ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోకూడదు. ముగ్గురూ కలిసి గూడుపుఠాణీ చేసే అవకాశం వుండకూడదు"
ఆమె అలా అంటుంటే ఆమె వైపు పరిశీలనగా చూశాడు హరీన్. నాయకుడు తాత్కాలికంగా బలహీనపడ్డ ఈ సమయాన్ని తమకు మరింత అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఈ చిక్ లీ, దేశింగ్ కూడా! మంచి ఎత్తుగడే!


    చిక్ లీ మాటలు చెవిన పడగానే ఆగ్రహంతో కంపించిపోయాడు నాయకుడు. అయినా కూడా అతి ప్రయత్నం మీద కోపాన్ని అదుపులో పెట్టుకుని, ఏమీ మాట్లాడకుండా పెద్ద పెద్ద అంగలు వేస్తూ దూరంగా వెళ్ళిపోయాడు.
వెంటనే హరీన్ వైపు విషపుదృక్కులు సారించాడు దేశింగ్. నాయకుడి తర్వాత తనకు మళ్ళీ అంతటి శత్రువు ఈ జింబురూనే.
వారసత్వ వివాదంలో, ప్రేమ పోరాటంలో కూడా ఇతను తనకు ప్రత్యర్ధి. ఇతన్ని కూడా సమయం చూసి మట్టు పెట్టెయ్యాలి తను.
హరీన్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు దేశింగ్. హరీన్ తిరగాబదకుండా కనిపెట్టి వుండటానికన్నట్లు.
దేశింగ్ చర్యలను గమనిస్తూనే, కరుణ వైపు చూశాడు హరీన్. ఆమె భీత హరిణేక్షణలా అతనివైపే దీనంగా చూస్తోంది. ఆమె విశాల నేత్రాలలో భయం తాలూకు నీడలు కదులుతున్నాయి. కరుణ పక్కనే చిక్ లీ నిలబడి ఉంది.
కరుణ భయం చూసి గుండె కరిగిపోయింది హరీన్ కి. ఆమె వైపు ఒక్క అడుగు వెయ్యబోయాడు.
వెంటనే వెనకనుంచి అతన్ని బలంగా వాటేసుకున్నాడు దేశింగ్.
కష్టం మీద తమాయించుకున్నాడు హరీన్. సమయం చూసి తిరగాబడాలి తను ఇప్పుడే కాదు. ఆగిపోయి, మరేం భయంలేదు! నీకు నేను తోడున్నాను' అన్నట్లు సాభిప్రాయంగా కరుణవైపు చూశాడు.
అది చిక్ లీ కంటపడింది. అలవోకగా నవ్వి ఎకసెక్కంగా అంది చిక్ లీ.
"హొయ్ హొయ్ హొయ్! భయపడకు మొనగాడా! నీ పట్నం పిల్లని నేనేం కొరుక్కుతిననులే!"
ఆ తర్వాత ఇష్టము, కోపమూ, అసూయా అలకా అన్నీ కలిసిన వాడి తూపులాంటి చూపు ఒకటి హరీన్ కేసి సారించి కరుణని అవతలకి నడిపించుకుపోయింది చిక్ లీ. దూరంగా వున్న ఉడల మర్రి చెట్టు కింద ఆమెని కూర్చోబెట్టి ఒక చిన్న బండమీద తన కుడికాలు ఆనించి, ఠీవిగా నిలబడింది . కరుణా, చిక్ లీ, హరీన్ కి అస్పష్టంగా కనబడుతున్నారు - కానీ వాళ్ళ మాటలు మాత్రం అతనికి వినబడటంలేదు.
"ఇప్పుడు చెప్పవే వగలాడీ" అంది చిక్ లీ కచ్చగా "నా జింబురూని ఎట్లా వల్లో వేసుకున్నావు నువ్వు? ఎప్పుడూ? ఎక్కడ? ఎందుకు? చెప్పూ"
ఆదుర్దాగా చెప్పసాగింది కరుణ.
అతను జింబురూ అని మీరందరూ ఎందుకు అనుకుంటున్నారో నాకు తెలియదు. అతని పేరు హరీన్. అతను సినిమా హీరో" అంది నిజాయితీ ఉట్టిపడుతున్న గొంతుతో.
పరిహాసంగా నవ్వింది చిక్ లీ. అంతలోనే చటుక్కున నవ్వు మాయమయింది. తీవ్రంగా చూసింది కరుణవైపు.
"అసత్యాలు చెప్పే నీ నాలికను పీకి చీలికలు చేసెయ్యాలని చాలా ఆత్రంగా వుంది నాకు. ఆ మోజు తీరే అవకాశాన్ని నీ అబద్దాలు మరింత ఎక్కువ చేస్తున్నాయి. నువ్వు గొప్ప టక్కులాడివే కావచ్చు. కానీ నీ కిలాడీ వేషాలన్నీ మా మంత్రాల మల్లయ్య నేర్చిన టక్కుటమార గజకర్ణ విద్యలముందు ఆగవు - సాగవు! నీచేత నిజం కక్కిస్తాడు మా కులగురువు. నిజం చెప్పకపోతే నీ నోటి వెంట రక్తం కక్కిస్తాడు. ఎందుకు ప్రాణపాయం కొనితెచ్చుకుంటావు. నిజం చెప్పు - చెప్పూ!" అంది గర్జిస్తూ.
నిస్సహాయంగా చూసింది కరుణ "అతను హరీన్ అనే సినిమా హీరో అని తెలుసు నాకు. అంతే. మరేం తెలియదు" అంది బేలగా.
"ఏమి తెలియకుండానే అతనితో కలిసివచ్చావా ఏం?"
"ఒక నీచుడు నన్ను బలాత్కారం చేయ్యబోతుంటే తప్పించుకు పారిపోయాను నేను. అయినా వాడు నా వెంటపడి తరిమాడు. ఆ భయంతో ముందు వెనకా ఆలోచించకుండా ఒక రైలు బ్రిడ్జిమీదికి ఎక్కేశాను నేను. అప్పుడు ఈ హరీన్ గుర్రం మీద వచ్చాడు నన్ను కాపాడటానికి. వాడిని నదిలోకి నెట్టేసి నన్ను కూడా గుర్రం మీదికి ఎక్కించుకున్నాడు. ఈలోగానే బ్రిడ్జిమీదికి వచ్చేసింది రైలు. అదే సమయంలో నదికి వరద కూడా వచ్చింది. నాతొ, గుర్రంతో సహా సాహసంగా నదిలోకి దూకేశాడు హరీన్. వరదలో కొట్టుకుపోయి చివరికి ఈ లోయలో పడ్డాం. ఆ తర్వాత ఏం జరిగిందో మీకు తెలుసు."
అంతా విని, మాట్లాడకుండా ఊరుకుంది చిక్ లీ. అపనమ్మకం కనబడుతోంది ఆమె మోహంలో. "చెప్పు చెప్పు........ఇంకా అబద్ధాలు చెప్పు" అన్నట్లు చులకనగా చూస్తోంది కరునవైపు.
అది గమనించి నిస్సహాయంగా నిట్టూర్చింది కరుణ. "నేను అన్నీ నిజాలే చెప్పినా నువ్వు నమ్మకపోవడం నా దురదృష్టం."
"అసలు ఈ దురదృష్టం ఇప్పటిది కాదు. చిన్నప్పటి నుంచి వెన్నాడుతూనే వుంది నన్ను. ఎన్ని ఆపదలు - ఎన్నెన్ని అపనిందలు -" అని ఆగింది. దుఃఖంతో ఆమె గొంతు రుద్దమైపోయింది.
నిర్దయగా అంది చిక్ లీ "నీ కల్లిబొల్లి ఏడ్పులు చాలించు. చెప్పదలుచుకున్నది ఏదో సరిగా చెప్పి ఏడు!"
కళ్ళు తుడుచుకుంది . తర్వాత గతం గుర్తువస్తుండగా , కలవరిస్తున్నట్లు చెప్పడం మొదలెట్టింది.
"మా నాన్నగారి పేరు నారాయణమూర్తి. చాలా పెద్ద వ్యాపారం ఉండేది ఆయనకి. ఘరానాగా బతికినా మనిషి అయన. ఎన్నో ధర్మకార్యాలు చేశారు. ఎంతోమంది బీద విద్యార్ధులకు చదువు చెప్పించారు. దిక్కులేని కుటుంబాలను ఎన్నిటినో ఆదుకున్నారు. ధైవకార్యం ఏది వున్నా తనే ముందుండేవారు అయన. జీర్ణావస్థలో వున్న వేణుగోపాలస్వామి ఆలయాన్ని వుద్దరించి ఏటేటా వుత్సవాలు జరిపేవారు. ఉరందరి తలలో నాలిక మా నాన్నగారు."
"గోప్పలేందుకు ......జరిగిందేమిటో చెప్పు చాలు!"
"ఒకసారి ఏదో వ్యాపారం పనిమీద సిటీకి వెళ్ళారు మా నాన్నగారు. ఆ వెళ్ళడం మళ్ళీ తిరిగిరాలేదు. అయన కనబడకుండా పోయి పదేళ్ళు దాటుతోంది. నన్నూ, అమ్మని తన రెండు కళ్ళలాగా చూసుకునే నాన్నగారు ఎందుకు తిరిగిరాలేదో, అయన ఏమయిపోయారో ఈనాటికీ తెలియదు నాకు!"
మళ్ళీ వువ్వెత్తున దుఃఖం వచ్చింది కరుణకి. కొద్దిసేపటి తర్వాత దుఃఖాన్ని అదుపులోకి తెచ్చుకుంది కరుణ. క్రమంగా ఆమె మోహంలో దైన్యం తొలిగిపోయింది. కోపంతో ఎర్రబడింది ఆమె మొహం. ఆగ్రహంతో కంపించడం మొదలెట్టాయి ఆమె లేత పెదిమలు.
"మా నాన్నగారికి ఏం ప్రమాదం వాటిల్లిందో నాకు తెలియదు కానీ నాకొక అనుమానం మాత్రం వుంది. లక్షల కొద్దీ రూపాయలు తీసుకుని రావలసి వుంది నాన్నగారు ఆరోజు. ఆ డబ్బుకి ఆశపడి ఆయనమీద ఎవరన్నా అఘాయిత్యం చేసి వుండవచ్చు" ఒక్కక్షణం ఆగి, మళ్ళీ చెప్పడం మొదలెట్టింది కరుణ. "ఆయనకి ఎవరన్నా ఏదన్నా అపకారం చేసివుంటే వాళ్ళెవరో తెలుసుకుని వాళ్ళనీ, వాళ్ళ కుటుంబాన్ని దుంపనాశనం చెయ్యాలన్నంత కసి పెరిగిపోయింది నాలో. ఆ కసి తీర్చుకోవడం కోసమే అష్టకష్టాలుపడి బతికాను ఇన్నాళ్ళు. లేకపోతే ఈ దౌర్భాగ్యజీవితాన్ని ఎప్పుడో అంతం చేసేసుకునేదాన్ని.
"ఇప్పుడు కూడా మీరు నన్ను చంపేస్తారేమోనన్న భయం నాకులేదు చిక్ లీ! నా భయమల్లా - నా తండ్రికి అపకారం చేసిన వాళ్ళెవరో కనిపెట్టి, వాళ్ళనీ, వాళ్ళ కుటుంబాలనీ నాశనం చెయ్యకుండా వెళ్ళిపోతానేమోనని అంతే!"
కరుణ రొప్పుతూ మాట్లాడుతుంటే పదతాడిత భుజంగం ఖస్సున పడగవిప్పి , బుసకొడుతూ, రోషకషాయిత నేత్రాలతో చూస్తున్నట్లు భ్రమకలిగింది చిక్ లీకి.
తన తండ్రిని చంపిన హంతకుడి కొడుకు తనకి కొద్దిదూరంలోనే వున్న హరీన్ అని తెలియదు కరుణకు. తను పగబట్టిన మనిషి కొడుకు చేతే తను రక్షించబడిందని కూడా తెలియదు ఆమెకి.
అలాగే, తన తండ్రి వల్ల నాశనమైపోయిన కుటుంబం తాలూకు అమ్మాయే తను అని హరీన్ కి కూడా తెలియదు.
విధి ఆడించే ఆటలు చాల చిత్రంగా వుంటాయి.
"సరే.......నిన్ను బలవంతం చేస్తూ వెంటపడిన ఆ మనిషేవ్వరు?" అంది చిక్ లీ కరుణ చెబుతున్నది నిజమో కాదో తేల్చుకోవడానికి మరి కొన్ని ప్రశ్నలు అడగడానికి ఉద్యుక్తురాలవుతూ.
చెప్పడం మొదలెట్టింది కరుణ.

                                                 16

"జరిగింది అంతా వివరంగా చెబితే గానీ నీకు సరిగా అర్ధం కాదు" అంది కరుణ. ఆమె గొంతులో ఎలాగైనా చిక్ లీకి తను చెబుతున్నదానిమీద నమ్మకం కలిగించాలన్న తహతహ వుంది.
చిక్ లీ తన మాటలు నమ్మితే ఈ గండం గడిచిపోతుంది . ముఖ్యంగా హరీన్ కి.
తను ఏమైనా ఫర్వాలేదు.
కానీ అభిమానులెందరికో ఆరాధ్యదైవం అయిన హరీన్ కి మాత్రం ఏ ప్రమాదం వాటిల్లకూడదు.
తనను రక్షించబోయి తనంతట తానుగా ప్రమాదంలోకి దూకాడు హరీన్. అతనికి తనవల్ల మరిన్ని ప్రమాదాలు కలగకూడదు.
అందుకని చాలా సిన్సియర్ గా, తన జీవిత చరిత్ర మొత్తం చిక్ లీకి చెప్పడం మొదలెట్టింది కరుణ.  

 Previous Page Next Page