Previous Page Next Page 
క్లైమాక్స్ పేజి 17

విశ్వనాదాన్ని ఆపరేషన్ థియేటర్ లోకి తిసుకేళుతున్న సమయంలోనే అదే హాస్పిటల్ లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోంచి బయటకు తీసుకువస్తున్నారు ప్రముఖ నిర్మాత రఘుపతిని.

హరీన్ నటించిన "కేడి కిలాడీ" చిత్రం సిల్వర్ జూబ్లిలీ ఫంక్షన్ అడయార్ పార్క్ హోటల్లో అరేంజ్ చేస్తుండగా తెలిసింది రఘుపతికి ఆ షాకింగ్ న్యూస్ - ఎవరో అమ్మాయిని రక్షించబోయిన హరీన్ వరదలో కొట్టుకుపోయాడని! వెంటనే హైపర్ టెన్షన్ వచ్చేసింది రఘుపతికి. డాక్టర్ సలహా మీద అతన్ని హాస్పిటల్లో చేర్చారు.

ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లోనుంచి స్పెషల్ రూమ్లోకి మార్చారు రఘుపతిని.

సినిమారంగంలోని ప్రముఖులందరూ రఘుపతిని పరామర్శించడానికి బయట కాచుకుని వున్నారు. కానీ ఎవరినీ లోపలికి రావడానికి అనుమతించలేదు డాక్టర్లు.

రెండుగంటలసేపు అలా మగతలో వున్న తర్వాత కాస్త తేరుకున్నాడు రఘుపతి. వెంటనే డాక్టర్ తో అన్నాడు.

"డాక్టర్ .........నేను తక్షణం ప్రొడ్యూసర్ సుబ్బయ్యగారిని చూడాలి."

"లుక్ మిస్టర్ రఘుపతి! మీరీ సమయంలో శ్రమకి లోనుకావడం మంచిది కాదు" అనబోయాడు డాక్టరు.

అసహనంగా అతన్ని కట్ చేశాడు రఘుపతి.

"డాక్టర్.......నేను మృత్యువుని జయించి బయటపడ్డాను. ఇంక దేనికీ భయపడను. ఇది అత్యవసరమైన పని. వెంటనే సుబ్బయ్యగారిని పిలిపించండి."

"మీ ఇష్టం!" అన్నాడు డాక్టర్ ఉదాసీనంగా. "కానీ మీరు అయిదునిమిషాలకంటే ఎక్కువ మాట్లాడకూడదు."

కొద్దిసేపటి తర్వాత వృద్ద నిర్మాత సుబ్బయ్య స్పెషల్ రూమ్ లోకి వచ్చాడు.

"ఎంటిదీ! కొండకొమ్ములాగా దేనికీ జంకకుండా నిలబడిపోయేవాడివి. అట్లా అధైర్యపడిపోయావే! ఏమయిందని ఇప్పుడు! మేమంతా నీతో లేమా?" అన్నాడు చనువుగా రఘుపతిని మందలిస్తూ.

కృతజ్ఞతగా చూశాడు రఘుపతి. "అందరూ నాతొ వున్నారో లేదో తెలియదు గానీ మీరు మాత్రం ఎప్పుడూ నాతోనే వుంటారని తెలుసు సార్. ఆ ధైర్యంతోనే కోలుకున్నానేమో!"

"ఇంకేప్పుడూ అలా డీలాపడిపోక!"

కాస్త ఆగి , "హరీన్, మధుమతి కాంబినేషన్ తో కొత్త పిక్చరు అనౌన్స్ చేశాను" అన్నాడు రఘుపతి.

"అవున్లే! ఒక కోటి వెనకేశావుట గదా!"

"తొంభై లక్షలు"

"కర్ణాటకకి తరలించేశావా ఆ డబ్బు? నీ బీరు ఫ్యాక్టరీకి?"

ప్రశంశాపూర్వకంగా సుబ్బయ్యవైపు చూస్తూ తలపంకించాడు రఘుపతి. ఆవలిస్తే పేగులు లేక్కపెట్టగలడు ఈయన. ఎన్నియో యుద్దముల ఆరితేరిన వృద్ధమూర్తి!

"హరీన్ పోయాడు. కానీ ఆ డబ్బు తిరిగి ఇచ్చే ప్రసక్తి లేదు. హరీన్ లేకపోయినా సరే, పిక్చరుని అదే లెవల్లో లాగించేసి జూబిలీ కొట్టాల"

"వారేవా!" అన్నాడు సుబ్బయ్య. "అద్గదీ మొనగాడితనమంటే! మరి నీ కొత్త ఈరో ఎవడు?"

రఘుపతి సుబ్బయ్య మొహంలోకి తేరిపార చూశాడు. సుబ్బయ్య పెదిమలమీద చిరునవ్వు లాస్యం  చేస్తోంది - తను చెప్పబోయే పేరు అయన ముందే ఉహించినట్లుగా!

అందుకే సుబ్బయ్యగారంటే తనకి అంత గురి. తను అనవసరంగా తన అలొచనలన్నీ అనరితో చెప్పుకుని తేలికైపోడు. ఎంతో అలోచించి గానీ తను ఒక నిర్ణయానికి రాడు. ఆ నిర్ణయం సుబ్బయ్యగారికి చెబుతాడు. అయన తలపంకించాడంటే ఆ నిర్ణయాన్ని ఆచరణలో పెడతాడు. కనకవర్షం కురుస్తుంది.

ఇదంతా జనానికి తెలియదు. వాళ్ళ భాషలో తనకి 'సుడి' వుంది. తను తాకినదంతా బంగారం అవుతుంది.

దేన్నయినా తాకబోయేముందు తను ఎంత ఆలోచిస్తాడో, ఎన్ని రాత్రులు మేల్కొంటాడో ఎవరికీ తెలియదు.

ఇప్పుడు ఈ కొత్త హీరో విషయంలో కూడా అంతే!

"హరీన్ హరీన్' అందరూ హరీన్ వెంట పడుతున్నప్పుడే, ఒకవైపు అతనితో పిక్చర్లు తీస్తూనే, మరొకవైపు అన్వేషణ మొదలెట్టాడు తను.

ఒకవేళ హరీన్ కాకపోతే,

ఒకవేళ హరీన్ లేకపోతే,

ఆ తర్వాత ఎవరు? అని.

ఆ అన్వేషణ ఫలితమే ఈ.......

"కిశోర్ ఎలా వుంటాడు?" అన్నాడు రఘుపతి సుబ్బయ్యతో.

సుబ్బయ్య తదేకంగా కొద్ది క్షణాలపాటు రఘుపతి వైపు చూశాడు. తర్వాత అయన పెదిమలు విచ్చుకున్నాయి. విశాలంగా నవ్వి, రఘుపతి భుజం తట్టాడు.

అంతే!

ఆ క్షణంలో పుట్టాడు సరికొత్త సూపర్ స్టార్!

కిషోర్!

'రఘుపతిగారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు' అని ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి చెప్పే సమయానికి కిషోర్ ఒక అటో మొబైల్స్ షోరూంలో వున్న మోటార్ సైకిల్స్ ని చూస్తున్నాడు. క్రితం వారం అతని పిక్చరు ఒకటి షూటింగ్ పూర్తీ అయింది. పదివేలు ఇచ్చాడు నిర్మాత. ఆ పదివేలు ఇప్పుడతని జేబులో ఉంది. ప్రపంచాన్ని జయించినంత సంతోషంగా వుంది అతనికి.

పదివేలు! తన జేబులో!

ఈ పదివేలు ఈ ఏజెన్సీ దగ్గర డిపాజిట్ చేస్తాడు తను. ఇంకొకటి రెండు నెలలలో మళ్ళీ ఎవరన్నా నిర్మాత అడ్వాన్సు ఇస్తే బాలెన్సు పెచేసి ఆ నీలంరంగు మోటారు సైకిలు సొంతం చేసుకుంటాడు.

కానీ ఆ క్షణంలో అతనికి తెలియదు - తను ఆ పదివేలూ అక్కడ కట్టిన సంగతి కూడా మర్చిపోయేంత బిజీ అయిపోతాడనీ, నెల తిరిగేసరికి తను ఇంపోర్టెడ్ కారు కొనబోతున్నాడానీను!

"రఘుపతిగారు రామ్మన్నారా?" అన్నాడు కిషోర్ ఉప్పొంగిపోతూ.

రఘుపతి దృష్టిలో పడాలని తపించిపోతూ వుంటారు కొత్త నటీనటులందరూ. అయన అడుగులకి మడుగులోత్తుతూ వెంట తిరుగుతుంటారు.

అలాంటిది, ఆయనే తన కోసం కబురంపడమా!

 అంత గొప్పవాడిని కలుసుకోబోతున్నానన్న భావం అతనికి కొద్దిగా భయాన్ని కలిగించింది. బిగుసుకుపోయి నిలబడ్డాడు రఘుపతి బెడ్ పక్కన.

తన ప్రొడక్షన్ మేనేజర్ వైపు సాభిప్రాయంగా చూసి చెయ్యి జాచాడు రఘుపతి.

అది అర్ధం చేసుకుని, సరికొత్త వందరుపాయల నోట్లకట్ట అతని చేతిలో వుంచాడు ప్రొడక్షన్ మేనేజరు.

"పెన్ను" అన్నాడు రఘుపతి.

పెన్ను అందించాడు ప్రొడక్షన్ మేనేజరు.

దానితో వందరుపయాల కట్టమీద సంతకం పెట్టాడు రఘుపతి. నోట్లకట్టను కిషోర్ కి అందించి, "ఇక నుంచి నువ్వు మా హీరోవి. ఇది వూరికే టోకెన్ అడ్వాన్స్. ఉంచుకో ........వృద్దిలోకి రా!" అన్నాడు.

తన చెవులని తానే నమ్మలేకపోయాడు కిషోర్. వినయంగా నమస్కరించి, "నా కృతజ్ఞత ఎలా తెలుపుకోవాలో తెలియటం లేదు" అన్నాడు ఉబ్బి తబ్బిబ్బయిపోతూ.

అతను ఇంటికి చేరేసరికి అప్పటికే పదిమంది నిర్మాతలు అతని కోసం కాచుకుని వున్నారు.

అందరూ ప్రముఖ నిర్మాతలే.

అన్నీ పెద్ద బెనర్సే!

రఘుపతి కిషోర్ ని తన పిక్చర్ లో హీరోగా బుక్ చేశాడన్న వార్త వాయువేగ మనోవేగాలతో పయనించింది పరిశ్రమలో.

కిషోర్ రఘుపతిని చూడటానికి హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు పరిశ్రమలో కాలునిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తున్న ఒక సీదాసాదా నటుడు.

హాస్పిటల్ నుంచి తిరిగి ఇంటికివచ్చే సమయానికి అతను విపరీతమైన డిమాండ్ లో వున్న ఒక సూపర్ స్టార్!

"గాడ్ ఈజ్ గ్రేట్!" అనుకున్నాడు కిషోర్.

"మన హీరోయిన్ మధుమతిని పిలిపించండి" అన్నాడు రఘుపతి హాస్పిటల్ బెడ్ మీద నుంచే.

"నో నో ! దిసీజ్ ద లిమిట్! మీరు ఇంక ఎవరినీ కలవడానికి వీల్లేదు. ఎగ్జయిట్ కాకూడదు" అన్నాడు డాక్టరు.

నిస్సహాయంగా చూశాడు డాక్టరు.

కొద్దినిమిషాల తర్వాత మధుమతి లోపలికి వచ్చింది. అప్పటికే ఆమెకు తెలిసినట్లుంది హరీన్ స్థానంలో కిషోర్ అనే కొత్త హీరో బుక్ అయ్యాడని బాగా ఏడ్చినట్లు ఎర్రబడి వున్నాయి ఆమె కళ్ళు.

జాలిగా ఆమె వైపు చూశాడు రఘుపతి.

"మనసు చిక్కబట్టుకోవాలి మధుమతీ! పోయిన వాళ్లతో బాటు మనమూ పోలేము. ది షో మస్ట్ గో అన్! అది మన వృత్తిధర్మం!" అన్నాడు సానుభూతిగా.

"కానీ సర్.........హారీన్ చనిపోయిఉంటాడనీ నాకు అనిపించడం లేదు" అంది మధుమతి.

అవుననో కాదనో అర్ధంకాకుండా తలపంకించాడు రఘుపతి. తర్వాత నెమ్మదిగా మాటమారుస్తూ అన్నాడు -

"హాలివుడ్ నుంచి వచ్చాడు ఒక ఏస్ స్టంట్ ఫైలట్ టోనీ. బాంబేలో వున్నాడు ఇప్పుడు. నాలుగైదురోజులలో వెళ్ళిపోతాడు. మళ్ళీ అమెరికాకి. మన పిక్చర్ లో కొన్ని ఏరియల్ వ్యూస్, హెలికాప్టర్ సీన్సు కావాలి. వాటికోసం అతన్ని బుక్ చేశాను. రేపటినుంచే షూటింగ్ మొదలు."

"ఎక్కడ?" అంది అన్యమనస్కంగా.

జవాబు చెప్పబోతు ఆగి తాను చెప్పబోయే ఆ జవాబు తనకే ఆశ్చర్యం కలిగించినట్లు చిత్రంగా చూశాడు రఘుపతి.

"డెత్ వేలీ అని నిక్ నేమ్ వుంది చూడు! మృత్యులోయ! అందులోకే దూకుతుంది హరీన్ కొట్టుకుపోయిన నది. సరిగ్గా అక్కడే ఈ షూటింగ్ కూడా!"

వెంటనే ఉద్వేగంగా అంది మధుమతి.

"అయితే ఆ హెలికాప్టర్ తో బాటు నేనూ వెళతాను."

ఆమెను వారిస్తూ అన్నాడు రఘుపతి - "అక్కడ షూట్ చేసే సీన్లలో నువ్వు వుండవు. హీరో కిషోర్ వుంటాడు. నువ్వు వెళ్ళఖ్ఖర్లేదు. చాలా రిస్కీ షాట్స్ అవి."

ప్రాధేయపూర్వకంగా అంది మధుమతి-

"సర్! ఈ ఒక్క విషయంలో మాత్రం నాకు అభ్యంతరం చెప్పకండి. నేను ఆ హెలికాప్టర్ లో ఆ డెత్ వేలీ దాకా వెళతాను. హారీన్ గనక ఆ లోయలో ఉండి వుంటే, నాకు తప్పకుండా కనబడతాడు సర్.........కనబడి తీరతాడు!" అంది చాలా ఆత్మవిశ్వాసంతో.

కళ్ళార్పకుండా ఆమెవైపు కొద్ది క్షణాల పాటు చూశాడు రఘుపతి. తర్వాత ముక్తసరిగా అన్నాడు - "సరే .......నీ ఇష్టం!
    
                                               15

హరీన్ ని చూసి జింబురూ అని భ్రమపడుతున్న చిక్ లీ అతనితో తన పెళ్ళి జరిపించమని నిలదీయగానే అవాక్కయిపోయాడు నాయకుడు, అతనేం సమాధానం చెబుతాడా అని ఉత్కంఠ తో ఎదురుచూస్తూ నిలబడ్డారు అందరూ.

అప్పుడు ముందుకు వచ్చాడు దేశింగ్.

అక్కడున్నవాళ్ళలో చాలామందికి తెలుసు - దేశింగ్ తన జీవితంలో సాధించదలుచుకున్నవి రెండే లక్ష్యాలని . ఒకటి - ఆ లోయకి తనే నాయకుడు కావడం. రెండు - చిక్ లీని పెళ్ళి చేసుకోవడం. అందుకనే అతను అదును దొరికినప్పుడల్లా నాయకుడిని ఎదిరించి, తన ప్రతి నాయకత్వాన్ని బయట పెట్టుకుంటున్నాడు.

స్థిరంగా అన్నాడు దేశింగ్.

"నువ్వు పోరబడుతున్నావు చిక్ లీ! ఇప్పుడు నీకు న్యాయం చెయ్యగలవాడు మన నాయకుడు కాదు. ఎందుకంటే నాయకుడే ముద్దాయిగా మనముందు నిలబడివున్నాడు ఇప్పుడు. తనే దోషి, తనే ముద్దాయి, తనే న్యాయాధికారీ అయిన వ్యక్తీ నీకేం న్యాయం చెయ్యగలడు చిక్ లీ! ఈ విషయంలో తీర్పు చెప్పవలసింది నాయకుడు కాదు. అందుకు తగినవాడు మన కులగురువు మంత్రాల మల్లయ్య!"

తమ నాయకుడికి ఎదురునిలిచి, నిర్భయంగా మాట్లాడుతున్న ఆ కోడెవయసు యువకుడిని చూసి కొందరు ఈసడించుకున్నారు. కొంతమంది కోపగించుకున్నారు. మరికొంతమంది అతనివైపు ప్రశంసపూర్వకంగా చూశారు.

కాని అక్కడున్న వాళ్ళందరిలో ఒక్క చిక్ లీ మాత్రమే దేశింగ్ ఎట్టుగడనీ సరిగా అంచనా వెయ్యగలిగింది.

తమ నాయకుడికి వాగ్ధటీ వాక్చాతుర్యం కూడా ఎక్కువే. అతను మాట్లాడుతుంటే సమ్మోహితులై వింటారు జనం. చాలా సహేతుకంగా మాట్లాడతాడు నాయకుడు.

అతను నోరు విప్పితే ఇంక పెదవి కడపరు ఎవ్వరూ.

అందుకనే నాయకుడిని మాట్లాడనివ్వకుండా ముందుకాళ్ళకి బంధం వేస్తున్నాడు దేశింగ్. దానికి తోడు జరగబోయే వారసత్వపు పోరాటంలో, దేశింగ్ కి కులగురువు మంత్రాల మల్లయ్య ఆశీస్సులు వున్నాయని వినికిడి. అందుకే మంత్రాల మల్లయ్య తీర్పు కావాలని పట్టుబడుతున్నాడు దేశింగ్.

"ఏమంటారు ?" అన్నాడు దేశింగ్, ఆటవికుల వైపు తిరిగి - తనకు అడ్డం చెప్పే మొనగాడు ముందుకురమ్మని తోడచరిచి సవాలు చేస్తున్నట్లు వుంది అతని గొంతు.

గుంపులో వెనకనుంచి ఎవరో చిన్న గొంతుతో అన్నారు.

"దేశింగ్ చెప్పింది సత్యమే! ఈ విషయంలో నాయకుడు తీర్పు చెప్పేదానికన్నా కులగురువు తీర్పు చెప్పటమే సబబు."

అది విన్న దేశింగ్ మొహం వికశించింది.

కొద్ది క్షణాల పాటు తన ప్రజలవైపు తదేకంగా చూశాడు నాయకుడు. తర్వాత గంభీరంగా తలపంకించాడు.

"సరే....మీ ఇష్టప్రకారమే కానిద్దాం!"

"కులగురువు ఎక్కడ?" అన్నాడు దేశింగ్ - ఉరుముతున్నట్లు వుంది అతని గొంతు. తను సాధించిన ఈ చిన్న విజయమే అతనికి కొండంత ధైర్యాన్ని చేకూర్చింది.

"నాయకుడి తల్లి శవానికి పుయడానికి ఇంకా ఏవేవో పసర్లు కావాలని చెప్పి, ఆ మూలికలు తేవడానికి సివంగి కొనకి వెళ్ళాడు" అని బదులు చెప్పారు ఎవరో.

"సివంగికూనకి వెళ్ళాడంటే ఇప్పుడప్పుడే తిరిగి రాదన్నమాట! సరే .........మనం ఇప్పుడు విడిపోయి మళ్ళీ రెండు ఘడియల తర్వాత ఇక్కడే కలుసుకుందాం" అన్నాడు దేశింగ్.

 Previous Page Next Page