Previous Page Next Page 
యమదూత పేజి 17

 

    వైశాలి!
    
    ద ట్రెగ్రెస్ ఆన్ ద ప్రౌల్!
    
    "ఈపాటికి సేఠ్ బదరీ నారాయణ్ మీ దగ్గరికి వచ్చి వుండాలే!" అంది వైశాలి నవ్వుతూ.
    
    ఒకసారి సేఠ్ జీ వైపు ఓరగా చూసి అన్నాడు మెకానిక్.
    
    "అవును."
    
    "వజ్రాల గనులు.... వివరాలు కావాలి....అదేనా అతని ప్రాబ్లెం?" ఆమె పలుకుతున్న ప్రతి అక్షరం ఆపుకుంటున్న నవ్వులో తడిసి వెలువడుతున్నట్లు అంది.
    
    మాట్లాడకుండా వింటున్నాడు అతను.
    
    "ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి మీరేం శ్రమపడక్కరలేదు. నేను చెప్పేస్తాను. ఊరి బయట ఓ నవాబుగారి భూములు కొన్ని లేవూ? అవే మన వజ్రాల గనులు" అని గుర్తులు చెప్పింది వైశాలి నవ్వుతూ.
    
    వివరాలన్నీ మనసులోనే నోట్ చేసుకున్నాడు మెకానిక్.
    
    "కానీ అసలు విశేషం మరొకటి ఉంది!" అంది వైశాలి.
    
    "చెప్పు!"
    
    "అక్కడ గనులూ మణులూ ఏవీ లేవు. పిచ్చి చెట్లు మాత్రం చాలా పెరిగి వుంటాయి.
    
    "ఊహించాను ఇవన్నీ నాతో ఎందుకు చెబుతున్నావ్?"
    
    నేను మీకు కలిగించిన నష్టాన్ని భర్తీ చేయడానికి"
    
    "అంటే?"
    
    "ఇవాళ మా ఏజెంటు ఆ స్థలానికి అడ్వాన్సు పే చేసి కొనేస్తాడు. యాభయ్ వేలు! మీరిచ్చిన డబ్బే! కానీ ఎక్కడా నా పేరు ఉండదు. నా ఏజెంటు దగ్గరనుంచి ఆ స్థలాన్ని మీరు సేఠ్ జీ చేత కొనిపించండి పది లక్షలకి. నేను మీకు మూడు లక్షలు పే చేస్తాను."    
    
    జాగ్రత్తగా అన్నాడు మెకానిక్.
    
    "మూడు ఎందుకు?"
    
    "మీ దగ్గరనుంచి నేను కొట్టేసింది ఒక లక్ష! ఇప్పుడీ డీల్ సెటిల్ చేస్తున్నందుకు మీ కమీషన్ రెండు లక్షలు! దానితో మీకూ నాకూ క్విట్స్! మిస్టర్ మెకానిక్! నా మీద కోపం పెట్టుకోకండి! వ్యాపారంలో రాజకీయాల్లో పర్మనెంట్ ఫ్రెండ్స్ వుండరు. పర్మనెంట్ ఎనిమీస్ ఉండరు. అవసరాలు మాత్రమే శాశ్వతంగా ఉంటాయి. అవసరాలని బట్టి శత్రువులూ, మిత్రులూ మారిపోతుంటారు. లెటజ్ ఫర్ గెట్ అండ్ ఫర్ గివ్!"
    
    అతని పెదిమలు నెమ్మదిగా చిరునవ్వుతో విచ్చుకున్నాయి. విషపు నురుగులాంటి చిరునవ్వు అతని పెదిమల మీద కనబడింది.
    
    దిస్ గర్ల్ ఈజ్ ఏ జీనియస్! ఎక్స్ పర్ట్ ఇన్ సైకలాజికల్ వార్ ఫేర్!
    
    ఆమెని ఇంక తన గ్రిప్పులో పెట్టుకోక తప్పదు!
    
    సేట్ బదరీ నారాయణ్ వైపు చూశాడు మెకానిక్.
    
    భంగు తాగిన వాడిలాగా వజ్రాల మత్తులో ఉన్నట్లు కనబడుతున్నాడు సేట్ జీ.
    
    చిన్నగా అన్నాడు మెకానిక్ వైశాలితో.
    
    "నేనొక ప్రపోజల్ చేస్తాను"
    
    "చెప్పండి!"
    
    "నువ్వు వచ్చేసి నాతో చేరిపో! మనిద్దరం కలిస్తే వీ కెన్ డూ మిరకిల్స్!"
    
    "దటీజ్ టూ లేట్!" అంది వైశాలి తేలిగ్గా.
    
    "నేను ఆల్ రెడీ బిజినెస్ మాగ్నెట్ మహాజన్ తో చేరిపోయాను."
    
    "మహాజన్ అంటే ఆ రోజు నీతో ఛెస్ ఆడి ఓడించిన..."
    
    "అతనే!" అని, "జరిగింది అంతా చెప్పనా?" అంది వైశాలి నవ్వుతూ.
    
    మౌనంగా వింటున్నాడు అతను.
    
    "నాకు బిజినెస్ అంటే ఇష్టం! ఇదివరకోసారి మహాజన్ దగ్గరికి వెళ్ళి అతని బిజినెస్ ఎంపైర్ లో ఏదన్నా మంచి ఉద్యోగం ఇవ్వమని అడిగాను.
    
    అతను నవ్వి, నాతో ఏమన్నాడంటే "వైశాలీ! నీ క్వాలిఫికేషన్స్ ఏమిటన్నది నాకు అనవసరం! నాకు కావలసింది పని చేసే సామర్ధ్యం! ఫలితాలు చూపించగల మనుషులు అంతే! వ్యాపారం అంటే ఏమిటో తెలుసా వైశాలీ! డాగ్ ఈట్స్ డాగ్ అంటారే! అలాంటి లుచ్చాగాళ్ళతో లంపటం అన్నమాట! పక్కవాడిని పొడిచేస్తే తప్ప మనం బతకలేం. ఎవరు ఎలా సంపాదిస్తున్నారన్నది జనం కూడా పట్టించుకోవడం లేదు ఈ రోజుల్లో ఎవరు ఎంత ఎక్కువ సంపాదించారనేది మాత్రమే చూస్తున్నారు. ఎవరు ఎక్కువ సంపాదిస్తే, వాళ్ళకు గులాములై సలాములు కొడుతున్నారు. అందరూ అడ్డదారుల్లోనే సంపాదిస్తున్నారని జనానికి అర్ధమైపోయింది. అందుకని సంపాదన విషయంలో మనం మడికట్టుకుని కూర్చోవడం శుద్ద వేస్టు!"    

 

    అంచేత, నా దగ్గర చేరాలంటే నువ్వు నీ టేలంట్ నిరూపించుకో! ఏ పద్దతిలో అయినా సరే, ఒక లక్ష రూపాయలు సంపాదించి చూపించు. నేను నీకు ఇన్ షి యల్ గా ఏం పెట్టుబడి పెట్టను. కానీ నీకు కావలసిన సహకారం మాత్రం అందిస్తాను." అన్నాడు.
    
    ఆ తర్వాత అయన నాతో కలిసి క్లబ్బుకి రావడం, మీతో కలిసి ఛెస్ ఆడి ఓడిపోవడం, నన్ను ఓడించడం తర్వాత మీ అపార్టుమెంటు, అంతా అయిపోయాక కారులో వచ్చి నన్ను పికప్ చేసుకోవడం అన్నీ మీకు తెలిసినవే!
    
    నేను ప్లే చేసిన ట్రిక్కు మహాజన్ కి బ్రహ్మానందం కలిగించింది.
    
    కానీ ఉద్యోగం మాత్రం ఇవ్వలేదు ఆయన" అంది వైశాలి.
    
    "ఎందుకు?" అన్నాడు మెకానిక్ అప్రయత్నంగా.
    
    "ఆయన అన్నాడూ - "వైశాలీ! ఒక ట్రిక్కు ప్లే చేశావు అద్భుతమయిన ట్రిక్కే అది! కానీ అది విజయవంతం కావడం కాకతాళీయం కావచ్చు. నీ ఒంపుసొంపులు చూసి మెకానిక్ మైమరచిపోయి ఆట ఓడిపోయి ఉండవచ్చు"
    
    "అయితే నేనేం చెయ్యాలి?" అన్నాను నేను.
    
    "ఐ ఎక్స్ పెక్ట్ రిపీట్ ఫర్ ఫార్మెన్స్ ఫ్రమ్ యూ! బిజినెస్ లో ఇలాంటి ట్రిక్కులు రోజుకొకటి ప్లే చెయ్యగలిగిన వాళ్ళే అవకాశాన్ని అందుకోగలుగుతారు. నీకు చాలా పొటెన్ షియల్ ఉన్నట్లే అనిపిస్తోంది. ఇంకొక్కసారి నన్ను కన్విన్స్ చెయ్యి! అప్పుడు నీకింక తిరుగు ఉండదు. నా బిజినెస్ ఎంపైర్ కంతా నిన్ను చీఫ్ ఎగ్జిక్యూటివ్ ని చేస్తాను" అన్నాడు మహాజన్.
    
    వింటున్న మెకానిక్ కి అనిపించింది, మహాజన్ కూడా సరిగ్గా తనలాగే ఆలోచించాడని!
    
    "మిస్టర్ మెకానిక్! నేను నా రెండో టెస్ట్ ని కూడా సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసినట్లే! వచ్చేవారంనుంచి నేను చీఫ్ ఎగ్జిక్యూటివ్ కాబోతున్నాను ఇండియాలో అతి పెద్ద ఆర్గనైజేషన్స్ లో ఒకదానికి! ఓకే!"
    
    ఈ బెనిఫిట్ షోలో యాక్టర్స్ ఎవరెవరు?" అన్నాడు మెకానిక్ గూఢంగా.
    
    నవ్వింది వైశాలి.
    
    "అందులో బలిపశువు - మీకు తెలుసు - సేట్ బదరీ నారాయణ్! మిగతా పాత్రధారులు ఒక లాయరు, ఒక రియల్ ఎస్టేట్ ఏజెంటు, ఒక జియాలజిస్టు - ఒక డైమండ్ మర్చంట్ సేట్ మాణిక్ లాల్"
    
    వింటున్నాడు మెకానిక్.
    
    "ఇందులో లాయర్ మహాజన్ వాళ్ళ లాయరు. నేనేం చెబితే అది చెయ్యమని అతనికి ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చాడు మహాజన్. రియల్ ఎస్టేట్ ఏజెంట్ కూడా మహాజన్ మనిషే! కమీషన్ ఇస్తే చాలు. ఏం చెబితే అది చేస్తాడు. జియాలజిస్టు కి ఫీజు పే చేసి పిలిపించాను. ఒక నెంబర్ లైట్ శాంపిల్, నిజందే తెప్పించి రిపోర్టు రాసివ్వమన్నాను. ఉన్నది ఉన్నట్లు రాసిచ్చాడు అతను. ఇకపోతే సేట్ మాణిక్యలాల్. అతనికి ఈ ప్లాను గురించి ఏమీ తెలియదు. కేవలం నగల వ్యాపారి అతను. అతని దగ్గర్లో ఇరవైవేలు పెట్టి నగలు కొన్నాను. ఇంకా నగలు కొంటానని ఆశ పెట్టేసరికి ఒకటికి నాలుగుసార్లు నాకోసం తిరిగాడు. అతను అలా తిరగడం వల్ల నాకు నిజంగానే ఏదో డైమండ్ మైన్ దొరికిందని భ్రమపడ్డాడు బదరీ నారాయణ్.
    
    మిస్టర్ మెకానిక్! ఇప్పుడీ డీల్ పదిలక్షలకి సెటిల్ చెయ్యండి. మీకు మూడు లక్షలు. నాకు ఏడు లక్షలు! అదిగాక మీకు బదరీ నారాయణ్ ఇచ్చే కమీషన్ వేరే వుండనే ఉంటుంది. ఓకే! బట్ నో ఫీలింగ్స్!" అంది సంగీతం పాడుతున్నట్లు.
    
    మనసులోనే ఒక అశ్లీల పదం ఉచ్చరించి, అనుకున్నాడు మెకానిక్ "బ్లడీ బిచ్! నౌ యువర్ ఫేట్ ఈజ్ రియల్లీ సీల్డ్!"
    
    ఆ తర్వాత సేట్ బదరీ నారాయణ్ వైపు తిరిగి కూల్ గా అన్నాడు అతడు. "నువ్వు వెళ్ళు! నీకా స్థలం నేను ఇప్పిస్తాను. ఖర్చుకి తట్టుకోగలవా?"
    
    "ఒక అయిదారు లక్షలదాకా ఫర్వాలేదు"
    
    "పదిలక్షలకి రెడీగా ఉండు!" అన్నాడు మెకానిక్.
    
    బలికి తనని సిద్దం చేస్తున్నారని తెలియక గంతులేస్తున్న మేకలాగా, సంతోషంతో ఉబ్బితబ్బిబ్బయిపోతూ అక్కడనుంచి వెళ్ళిపోయాడు సేఠ్ బదరీ నారాయణ్.
    
                                                                       * * *

 Previous Page Next Page