Previous Page Next Page 
వలపు సంకెళ్ళు పేజి 18

నిన్న లతకోసమొచ్చినతను ఎవరు?
ఆలోచిస్తూనే సిగరెట్ అంటించాడు శ్రీమంత్. అతనికి లతను తక్షణం చూడాలని ఉంది.
కానీ ఎలా?  
                                                                          * * *
    
మరునాడు మళ్ళీ ఎక్స్ ఛేంజికి వచ్చాడు.
ఆరోజుకూడా లత డ్యూటీకి రాలేదుట. "లతా ఎడ్రసు చెప్పగలరా" అని అడిగాడు ఫోన్లోనే. "ఏమో తెలియదు!" అని వ్యగ్యంగా చెప్పి డిస్ కనెక్టు చేశారు వాళ్ళు.
ఉసూరుమని వెళ్ళి రాజా జానీ కేఫ్ లో కూర్చున్నాడు.
"నమస్తే అన్నా!" అంటూ దగ్గరికి వచ్చాడు మహేష్.
"ఏమిటి విశేషాలు?" అన్నాడు శ్రీమంత్.
"డ్రైవర్ గా పనిచేస్తావా అన్నా?"
"ఏం కారు?" అన్నాడు శ్రీమంత్ నవ్వుతూ.
"కాడి లాక్ అన్నా! విమానంలాంటి కారు! అయినా కారునేం చూస్తావు, కార్లో కూర్చునే పిల్లని చూడాల!"
"ఎవరు?"
మహేష్ నవ్వాడు. "చూస్తావుగా! యస్సార్ తెలుసునా? బంజారా హిల్సులో ఎర్రబంగళా! ఆయన కూతురు."
"యస్సారా?" అన్నాడు శ్రీమంత్ సాలోచనగా. యస్సార్ అనే వ్యక్తి అతనికి తెలుసు. అతనే కాదు. ఆ ఊళ్ళో చాలామందికి తెలుసు. ఆ ఊళ్ళో ఉన్న ధనవంతులందరి లిస్టు తయారు చేస్తే, మొదటి పదిమందిలో ఉంటాడతను!
పెదిమ విరిచాడు శ్రీమంత్.
"లాభంలేదు బ్రదర్! ఇంతకు ముందే పెద్ద రికమెండేషన్ పట్టుకొని వాళ్ళింటికి వెళ్ళాను. ఆ అమ్మాయి అసలు వాళ్ళని కలుసుకోనీయకుండా తరిమేసింది."
"ఎవరి రికమండేషన్?"
'క్రికెట్ కంట్రోల్ బోర్డు మెంబర్.'
మహేష్ గర్వంగా చూశాడు. "అంత పెద్దవాళ్ళ రికమెండేషన్ కూడా చెల్లని చోట ఈ మహేష్ మాట చెల్లుతుంది."
అయితే, కారు డ్రైవరా తను?
'మిస్టర్ శ్రీమంత్, ఎం.ఏ. హిస్టరీ, రంజీట్రోఫీ ప్లేయర్, ఫోర్ హండ్రెడ్ మీటర్స్ పరుగు పందెం ఛాంపియన్'-
కోటీశ్వరుడు యస్సార్ కూతురికి కారు డ్రైవరా?
బావుంది! చాలా బావుంది!
చాలా చిత్రమైన పరిస్థితుల్లో పడెయ్యగలడు దేముడు! తనని డ్రైవర్ స్థానంలో ఊహించుకున్నాడు. తెల్లటి యూనిఫారం వేసుకుని, బట్టతో కారును తుడుస్తూ, ఆ అమ్మాయి చిటికెవేసి పిలిస్తే, డోర్ తెరిచి పట్టుకుని...
"యూనిఫాం వేసుకోవాలా?" అన్నాడు శ్రీమంత్. మామూలుగానే మాట్లాడాలనుకున్నా, అప్రయత్నంగా కటువుగా వచ్చింది మాట.
"అక్కరలేదన్నా?"
అతను స్పష్టంగా చెప్పకపోయినా, తనకు అర్ధమైపోతూనే వుంది.
మామూలు కారు డ్రైవరు కాదు వాళ్ళకి కావలసింది!
ఆ అమ్మాయికి, పర్సనల్ బాడీగార్డు లాంటి మనిషి, డ్రైవింగ్ తెలిసినవాడు కావాలి. ఆ అమ్మాయి కారులో షికారుకెళ్ళినా, షాపింగుకెళ్ళినా, ఎవరూ కిడ్నాప్ చెయ్యకుండా, ఆమె మీద ఎవరూ దౌర్జన్యం చెయ్యకుండా, నీడలా అంటిపెట్టుకొని వుండే మనిషి కావాలి.
మరీ గూండాలా కనబడకుండా, కొంచెం కల్చరున్నట్లు కనబడుతూ అవసరమొస్తే మాత్రం గూమ్దాలా ఎదుటివాళ్ళని భయపెట్టగలవాడు కావాలి.
డబ్బున్న మనుషులూ! వీళ్ళ డబ్బు భయాలూ!
అతని మనసు విరిగిపోతున్నట్లయింది.
తల అడ్డంగా ఊపాడు శ్రీమంత్. "ఎవరన్నా మంచి డ్రైవర్ కనబడితే పంపిస్తాను. థాంక్యూ!"
ఆశ్చర్యంగా చూశాడతను.
"జీతమెంతో తెలుసునా?"
మాట్లాడకుండా చూశాడు శ్రీమంత్.
"ఒకవెయ్యీ ఐదొందలు!"
తాగుతున్న టీ కప్పు కిందపెట్టాడు శ్రీమంత్. అతనికి హఠాత్తుగా తన పరిస్థితి గుర్తొచ్చింది.
 "ఎంతా?"
"ఒక వెయ్యీ ఐదొందలు. నైట్ క్వీన్ బార్ లో రోజూ భోజనం, ఒక క్వార్టర్ బాటిల్ విస్కీ, ఆ బార్ వాళ్ళదే. తిన్నంత తిని బిల్లు మేనేజర్ కిచ్చి వెళ్ళిపోవచ్చు."
విజిలేసి లేచాడు శ్రీమంత్!
పదిహేను వందలు జీతం! మైగాడ్! ఆఫీసర్ ఉద్యోగానికి కూడా అంత జీతం ఉంటుందో లేదో చెప్పలేం!
"పద!"
ఇద్దరూ మహేష్ స్కూటర్ ఎక్కి బంజారాహిల్స్ వైపు వెళ్ళారు.
అదే ఎర్రబంగళా.
శూలాలు గుచ్చినట్లున్న గేటు, డబ్బున్నవాళ్ళ యిల్లు!
చాలా మంది మనుషులకున్నట్లు శ్రీమంత్ కి కూడా బాగా డబ్బు సంపాదించాలనే కోరిక ఉంది.
"సౌఖ్యంగా, తడుముకోకుండా, సులభంగా రోజులు జరిగిపోవడానికి అవసరమైనంత డబ్బు."
అంతేగానీ వందలమంది కడుపులు కొట్టి, వంద తరాలకు సరిపడా సంపాదించాలనే తహతహ లేదు.
అలాంటి వాళ్ళని చూస్తే అతనికి అసహనం, అలుసు.
ఈ యస్సార్ కి ఇంకా ఎందుకు డబ్బు సంపాదించాలని కోరిక!
ఆయనా, ఆయన కూతురూనూ! ఆ ఇద్దరే వాళ్ళ కుటుంబంలో సభ్యులు!
ఇప్పటికే లెక్కకి అందనంత ఆస్థి ఉంది వాళ్ళకు.
ఆయన సగం ఆస్థి ఉంచేసుకుని మిగతాది కూతురుకిచ్చేస్తే...

 Previous Page Next Page