Previous Page Next Page 
వలపు సంకెళ్ళు పేజి 19

చెరో పది లక్షలు వస్తుందా?
తను మరీ ఒళ్ళు కూడా మరిచి పోతున్నాడు.
ఎక్కడ  పదిలక్షలు! చెరో కోటి రూపాయలు... ఉహు.... రెండు కోట్లు కావచ్చు!
నిండా ఇరవై ఏళ్ళు లేని, ఏడు మల్లెల ఎత్తు బరువులేని సుకుమారిలా కనబడే ఈ అమ్మాయి దాదాపు రెండు కోట్లరూపాయలు తాగుతుందా!
"ఫెంటాస్టిక్!"
ఆ కాంపౌండ్ లోనే అవుట్ హవుస్ లా కనబడుతున్న మరో చిన్న బిల్డింగు.
ఆ బిల్డింగులోకెళ్ళారు.
చిన్నదిగా, ఫాషనబుల్ గా, కనబడుతున్న ఆఫీసు అది. అద్దం, స్టీలూ, అల్యూమినియం, ప్లాస్టిక్ తో కలిసి శుభ్రంగా మెరిసిపోతోంది.
రివాల్వింగ్ ఛెయిర్ లో కూర్చుని ఉన్న ఒకతను తలెత్తి శ్రీమంత్ ను చూశాడు. గ్రేకలర్ టెర్రివూల్ సూటు, స్మార్ట్ గా ఉన్నాడు.
"నువ్వేనా... ఐ మీన్ మీరేనా శ్రీమంత్?"
"అఫ్ కోర్స్!" ఇంగ్లీషులోనే సమాధానమివ్వాలనిపించింది అతనికి.
అంతలో-
"జయదేవ్!" కత్తికి తేనె రాసినట్లు తియ్యగా, పదునుగా వున్న గొంతు వినబడింది.
"మృదుల!"
వెంటనే జయదేవ్ అనబడే ఆ మేనేజర్ మర్యాద ప్రకటిస్తూ లేచి నిలుచున్నాడు. మహేష్ తక్షణం నీడలాగా ఒక కప్ బోర్డు పక్కన ఒదిగి, వినయం, భయం, ఒలకపోస్తూ నిలబడ్డాడు.
మృదులవైపు చూశాడు శ్రీమంత్. మనుషుల్ని ఆకలిగా చంపి తినేసే రాక్షసిలా లేదు మృదుల. ఆమె మీది ఆకలితో చనిపోయేంత అందంగా, దేవకన్యలా వుంది.
"కొత్తకారు ఎప్పుడొస్తుంది?" అందామె.
ఒక్క గుటకేశాడు జయదేవ్.
"ఈసారి యస్.టి.పి.వాళ్ళు వేలం వేసినప్పుడు..."
"దీనినే వేలం వెర్రి అంటారు." అంది మృదుల వెక్కిరింపుగా. "వాళ్ళెవరో వేలంపాట మొదలెట్టేదాకా నేను ఏడాదిక్రితం కొన్న పోపుల డబ్బాలాంటి కాడిలాక్ లో తిరగాలా?" అని కాలెండర్ వైపు చూసింది. "ఇవాళ తొమ్మిదో తారీఖు... 17 తారీఖుకల్లా...అంటే మళ్ళీ సోమవారం నాటికి బ్రాండ్ న్యూ టొయోటా గారాజ్ లో ఉండాలి. పౌడర్ బ్లూ కలర్, కార్ స్టీరియో. తెలిసిందా? దెయ్యంలాంటి ఈ పెద్ద కారంటే అసహ్యం పుడుతోంది. చిన్న కారు కావాలి నాకు."    
"సరే మేడమ్!"
"నోట్ చేసుకో!"
అతను డెస్క్ పాడ్ మీద బాల్ పాయింట్ తో గబగబ రాసుకున్నాడు.
"ఇతనెవరు?" అంది శ్రీమంత్ ని అప్పుడే చూస్తున్నట్లు. తనని ఇంతకుముందుచూసినట్లు ఆమెకి గుర్తులేదని గ్రహించాడతను.
"ఇతని పేరు శ్రీమంత్!
మీకు పర్సనల్ కారు డ్రైవరు అవసరమని.."
"నేను చెప్పలేదే!"
జయదేవ్ ఆమెవైపు సాభిప్రాయంగా చూశాడు.
కొద్ది క్షణాలు అతని మొహంలోకి ప్రశ్నార్ధకంగా చూసింది ఆమె.
ఆ తర్వాత ఏదో గుర్తొచ్చినట్లు,
"అవును! అవసరమే కదూ! మర్చిపోయాను" అంది.
తెరిపిన పడ్డట్టు చూశాడు జయదేవ్.
"సో! కారుకంటే డ్రైవర్ ముందోచ్చాడన్నమాట! జయదేవ్! ముందర పనులు వెనకా, వెనక పనులు ముందరా చెయ్యడంలో నీకు నువ్వే సాటి!"
ఆమె చేత తిట్టించుకోవడమే మహాభాగ్యమన్నట్లు చూస్తున్నాడు జయదేవ్. ఆమె వెనక్కి తిరిగి, అద్భుతమైన లయవిన్యాసంతో చకచక నడుస్తూ, ఉన్నట్లుండి ఆగింది.
నలిగిన బట్టలతో ఉన్న శ్రీమంత్ ని తన కారుమీదపడ్డ మరకని చూసినట్లు చూసింది.
"నీ పేరేమిటి..ఆ! శ్రీమంత్! మా దగ్గిర పనిచేసేవాళ్ళు షాబీగా, జిడ్డు కారుతున్న మొహాలతో ఉండకూడదు. జయదేవ్! అతన్ని బూల్ చంద్ కి తీసికెళ్ళి మంచి బట్టలు కుట్టించు. ఇంకెప్పుడూ నలిగిన బట్టలతో నా కళ్ళకి కనబడవద్దను." అంటూ త్వరత్వరగా నడిచి లోపలికి వెళ్ళిపోయింది.
గుండెలనిండా ఊపిరి పీల్చుకున్నాడు జయదేవ్.
శ్రీమంత్ కనుబొమ్మలెగరేశాడు.
డబ్బు! డబ్బు! డబ్బు!
డబ్బుంటే వారంరోజుల్లో పౌడర్ బ్లూ కలర్ టొయోటా కారు కొనొచ్చు. కొండమీద కోతిని కూడా కొనొచ్చు.
కొండంత మొగాళ్ళను కూడా ఎలుకల్లాగా మార్చవచ్చు.
డబ్బు!
క్రితంసారి తను వచ్చినప్పుడు ఈ అమ్మాయి మామూలుగానే మాట్లాడింది. మాటల్లో ఇంత దూకుడుతనం, దర్పం కనబడలేదు. ఒక రోజు ఉన్నట్లు మరో రోజు ఉండదా ఈ అమ్మాయి?
అదికూడా కాదు. క్రితంసారి వచ్చినప్పుడు తను ఉద్యోగంకోసం రికమండేషన్ పట్టుకొచ్చాడు. ఇంకా వీళ్ళ 'సర్వీస్' లో చేరలేదు.
ఇప్పుడు తనుకూడా సేవకుల బృందంలో చేరిపోయినట్లే లెక్క! అందుకే అంత చులకనగా మాట్లాడుతోందేమో తను!
భుజాలెగరేశాడు శ్రీమంత్.
స్ స్ స్
"ఎప్పుడొస్తుంది కారు?" అంది మృదుల జయదేవ్ తో.
జయదేవ్ వినయంగా నిలబడ్డాడు.
"బాంబే నుంచి రావాలమ్మా! ఎల్లుండికొచ్చేస్తుంది."
"బాంబే నుంచా?" అందామె. ఆమె మొహంలో సంతోషం కనబడుతోంది.
"అవును మేడమ్! బాంబే నుంచి తీసుకు రావాలి. మీరు అడిగినట్లే టొయోటా, పౌడర్ బ్లూ కలర్, కార్ స్టీరియో..."
"ఫెంటాస్టిక్!"
"ఫోన్ మీదే దేశమంతా గాలించాను మేడమ్. చివరికి సేఠ్ మూల్ చంద్ దగ్గర అలాంటి కారే ఉందని తెలిసింది." 

 Previous Page Next Page