Previous Page Next Page 
వలపు సంకెళ్ళు పేజి 17

అదే మొదటిసారి జైల్లో ఉండడం!
ఇక ముందెప్పుడూ ఆ అవసరం రాదుకదా?
రాకూడదు! రాకూడదు! రాకుండా ఉంటేనే బావుంటుంది.
అంతలోనే శ్రీమంత్ కి చిత్రమైన ఆలోచన వచ్చింది.
ఒకసారి తనపేరు రికార్డుల్లోకి ఎక్కింది. ఇంకోసారి ఇలా జరిగితే తనని పాత కేడీలా ట్రీట్ చేస్తారా?
నవ్వుకున్నాడు.
"అన్నా!" అన్నాడు మహేష్ పక్కగా వచ్చి.
"చెప్పు మహేష్! ఏమిటి?"
"నీతో కొద్దిగా మాట్లాడాల!"
"ఏమిటి? చెప్పు!"
"చాయ్ తాగుతూ మాట్లాడుకుందామా?"
"పద!"
ఇద్దరూ ఇరానీ కేఫ్ లో కూర్చున్నారు. సమోసాలు ఆర్డరిచ్చాడు మహేష్.
"అన్నా! ఎక్కడన్నా కొలువు చేస్తున్నావా నీవు?"
"ఒక సంవత్సరంపాటు మిలటరీ ట్రక్కు డ్రైవరుగా పని చేశాను. తర్వాత వాళ్ళే నన్ను తీసేశారు."    
"ఎందుకు?"
"డిసిప్లిన్ అంటే పడదు మనకు. అందుకు!"
కాస్త సందేహించి "ఇంకేమన్నా వ్యాపారముందా?" అన్నాడతను వ్యాపారం అన్న పదాన్ని నొక్కి పలుకుతూ.
నవ్వాడు శ్రీమంత్.
"నాకా! లేదు, లేదు."
"మరి బాంబేలో ఖాదర్ వాళ్ళంతా ఎలా తెలుసన్నా?"
"చూడు! బార్ లో కూర్చుంటే గురుదేవుల దగ్గరనుంచి గూండాగాళ్ళదాకా అందరూ తగుల్తారు. అలాగే పరిచయం."
"కొలువు దొరికితే చేస్తావా అన్నా?"
నొసలు ముడివేసి చూశాడు శ్రీమంత్.    
"ఎక్కడ?"
"అది మళ్ళా చెప్తాను. పైసలు బాగానే వస్తాయి? తినుడు, తాగుడు లెక్కలేదు."
నిశ్చలంగా చూశాడు శ్రీమంత్.
"ఏంపని?"
"నువ్వు చెయ్యగలవన్నా? గుండెలుంటే చాలు."
"నాకున్నది ఒకటే గుండె! కానీ ఛాతీ నిండా గుండె ఉందని చెప్పాడు డాక్టర్. ఇంతకీ ఏంపని? జేబులు కొట్టడమా" అన్నాడు చులకనగా, చిరాగ్గా చూస్తూ.
మహేష్ నొచ్చుకున్నట్లు చూశాడు.
"చదువుకున్నోడివి. నీకలాంటి పనులు చెప్తారా అన్నా! నీకు తగిన పనులే చెప్తారు!"
"ఎవరు?"    
"నిన్ను ఎట్లా కలవాలన్నా మళ్ళా!"
"రాజా జానీ కేఫ్ తెలుసా? అక్కడికొస్తుంటాను సాయంత్రంపూట."    
"మళ్ళీ వస్తానన్నా!"
నిర్లక్ష్యంగా చెయ్యివూపి, టీకప్పు అందుకున్నాడు శ్రీమంత్. కప్పులో లత మొహం కనిపించింది అతనికి. రెండు గుక్కల్లో టీ తాగేసి టెలిఫోన్ ఎక్స్ ఛేంజ్ వైపు నడవడం మొదలెట్టాడు. లతకి బాగా కోపమొచ్చి ఉంటుంది. చాలా అలిగి ఉంటుంది. తను జులాయి రౌడీ కాడని ఆమెకి నచ్చజెప్పాలి. ఎలా నచ్చజెప్పగలడు? పెళ్ళిముహూర్తానికి జైల్లో పడ్డవాడి మాటలు నమ్ముతుందా ఏ అమ్మాయైనా?
ఆరోజున క్రికెట్ బాటుతో అతని నెత్తిన తనెందుకు కొట్టవలసి వచ్చిందో, అసలు ఆ దెబ్బ తిన్న వ్యక్తి నిజస్వరూపమేమిటో... ఇదంతా లతకి తెలియదు. తను చెప్పగలిగితే... కానీ నమ్మించేలా ఎలా చెప్పగలడు?
శ్రీమంత్ ను కొద్దిగా నిస్పృహ ఆవరించింది.
టెలిఫోన్ ఎక్స్ చేంజ్ గేటు దగ్గర కాపలా ఉన్నతను శ్రీమంత్ ను ఆపాడు.
"ఎవరు కావాలి?"
"లత - ఆపరేటర్."
"పాస్ తీసుకోండి" చెప్పాడతను, నలిగిపోయిన అతని బట్టల వైపు చూస్తూ.
అతని చూపులని చదివాడు శ్రీమంత్. సందేహిస్తూనే పాసులిచ్చే కౌంటర్ దగ్గరకెళ్ళి, "లతను కలుసుకోవాలి" అన్నాడు. కావాలనే ఇంగ్లీషులో మాట్లాడుతూ.
ఆయన అతన్ని ఎగాదిగా చూసి, "ఫోన్ చేసి మాట్లాడండి" చెప్పాడు ఫోన్ ని చూపిస్తూ.
నెంబరు కనుక్కుని రింగ్ చేశాడు శ్రీమంత్.
లత ఆ రోజు డ్యూటీకి రాలేదుట.
"బ్లడీ హెల్!" తిట్టుకుని బయటకొచ్చాడతను.
"హై! బిగ్ బాస్!" అని వినబడింది బెన్సన్ గొంతు.
"ఎలా ఉన్నావురా" అన్నాడు శ్రీమంత్.
"నేను ఓకే! కానీ.... సారీ. నీ గరల్ ఫ్రెండ్ హఠాత్తుగా మాయమైపోయింది."
శ్రీమంత్ చూపు తీవ్రంగా మారింది.
"బెన్సన్! నువ్వెందుకూ పనికిరావు. లతని జాగ్రత్తగా కనిపెట్టి ఉండమని చెప్పాను నేను. గంగిరెద్దులా తల ఊపావు. ఇప్పుడు....లతకేమన్నా జరిగి ఉంటే...లేదా రాష్ గా ఏదన్నా అఘాయిత్యం చేసి వుంటే...మైగాడ్!"
"సారీ శ్రీమంత్! లత వాళ్ళ మామయ్య వాళ్ళింట్లో ఉండటం లేదు.... అబ్బే!...అదికాదు. లతకి ఏమీ కాలేదు. మామయ్య వాళ్ళింట్లో మాత్రం ఉండటం లేదు. ఎక్కడుంటోందో తెలియదు. వారం రోజులనుంచీ డ్యూటీకి రావటంలేదు. నిన్ననే వచ్చింది" అని కాస్తాగి, సంశయంగా చూస్తూ, "నిన్న తన కోసం ఎవరో కుర్రాడు వచ్చాడు ఎక్స్ చేంజికి. చాలా హాండ్సమ్ గా, అమితాబ్ బచన్ లా ఉన్నాడు. ఇద్దరూ ద్వారకాలో కాఫీ తాగారు. తర్వాత ఆటోలో ఎటో వెళ్ళిపోయారు. వాళ్ళని ఫాలో కాలేకపోయాను" అన్నాడు బెన్సన్ ఇబ్బందిగా.
లత కులాసాగానే ఉన్నందుకు శ్రీమంత్ మనసు తేలిక పడింది.
కానీ వాళ్ళ మామయ్య వాళ్ళింటిలో లేదా? ఎక్కడికెళ్ళింది? ఎక్కడ ఉంటోంది?

 Previous Page Next Page