తలెత్తి అతనివైపు చూసింది సౌమ్య.
"ఏమిటి?" అంది.
"కంపెని కొంటున్నా సౌమ్యా, ఫార్మాన్యూటికల్స్ ఇండస్ట్రి అంటే మందుల తయారి, బంగారు బాతులాంటి బతులాంటి ఇండస్ట్రి. తక్కిన వ్యాపారాల్లో నూటికి రెండు వందలు వచ్చిందంటే చాలా గొప్ప సౌమ్యా. కానీ మందుల తయారీలో మాత్రం నూటికి నాలుగొందలు వచ్చిందంటే అది చాలా మామూలు అన్నమాట. నూటికి రెండువేల లాభం వచ్చే మార్గాలు కూడా ఉన్నాయి సౌమ్యా. ఈ బిజినెస్ లో."
అనాసక్తిగా చూసింది సౌమ్య.
మళ్ళీ అన్నాడు శశికాంత్ "అలాంటి ఇండస్ట్రిని కూడా నడపలేక నష్టాల్లోకి లాగేశాడు సౌమ్య ఒక ప్రబుద్దుడు. అతని పేరు పరమహంస. పరమ అసమర్ధుడు.
ఏమి మాట్లాడకుండా వింటోంది సౌమ్య.
నేను దివాళా తీసినట్టు ప్రకటించి వీళ్ళందరిని ముంచేయ్యగా వచ్చిన డబ్బు లెక్క చూస్తే నలబై లక్షలు తేలింది సౌమ్య. దానికి నీ లాటరి టిక్కెట్టు తాలూకు పదిలక్షలు కలుపుదాం. బ్యాకు లోనులూ, అవీ ఇవి కలిపి తిమ్మిని బొమ్మి చేసి, మొత్తానికి ఆ కంపెనీని కొనేస్తాను.
దివాలా తీసిన వెంటనే మళ్ళీ నా పేరుతొ కంపెని కొంటె బాగుండదు కదా.
అందుకని ఈ కంపెనీని నీ పేరుతొ కోనేస్తాను.
నీ మెడలో నేను తాళికట్టేశాను సౌమ్య. ఇప్పటికే నువ్వు నా భార్యవి అయినా మీ వాళ్ళు చాదస్తంగా అందరిముందు ఆర్భాటంగా మళ్ళీ పెళ్ళి చేస్తామంటున్నారు. దానికి నాకేం అభ్యంతరం లేదు.
"మన పెళ్ళినాటికి ఈ ఇండస్ట్రి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి అయిపోతాయి. పెళ్ళి కానుకగా నేను నీకు ఈ ఫ్యాక్టరిని ఇస్తాను సౌమ్యా."
"ఆర్ యూ హాపీ?" అన్నాడు శశికాంత్.
తల ఎత్తితే , తన కంటిలోని నీటిపొర అతని కంటపడుతుందేమోనని భయపడి, తలవంచుకునే ఉండిపోయింది సౌమ్య.
"సత్యా ఫార్మాన్యూటికల్స్" ని సౌమ్య పేరుతొ పరమహంస దగ్గరనుంచి కొనేయ్యడానికి ఫార్మాలిటిస్ అన్ని దాదాపు పూర్తి అయ్యాయి.
మిగిలిపోయిన కొన్ని విషయాలు పైనలైజ్ చెయ్యడానికిగానూ, ఒక స్టార్ హొటల్లో బిజినెస్ లంచ్ వెళ్ళారు శశికాంత్, పరమహంస.
తనతో బాటు సౌమ్యని కూడా తీసుకెళ్ళాడు శశికాంత్.
తేజస్విని తన వెంటబెట్టుకుని వచ్చాడు పరమహంస. అతన్ని అంతకుముందు చూడలేదు శశికాంత్.
"ఇతనెవరు?" అన్నట్లు ప్రశ్నార్ధకంగా చూస్తున్న శశికాంత్కి సమాధానం చెబుతున్నట్లు నవ్వుతూ- "దిసీజ్ మై ఫ్రెండ్ అండ్ షో - బొత్. ఈ యంగ్ మాన్ నాకు మిత్రుడు. శత్రువు కూడా! ఇతను మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ కి సెక్రటరి. ఇతనొక థింక్ టాంక్. ఆలోచనలకు రిజర్వాయరు లాంటివాడు. నేను గనుక మొదటినుంచి ఇతన్ని సంప్రదించి పనులు చేసి ఉంటే కంపెని ఇంత దురవస్థకు వచ్చేది కాదని నాకు అనిపిస్తోంది. ఇప్పుడు- అంతా అయిపోయాక" అని చిన్నగా నవ్వాడు పరమహంస. 'బట్ అబ్సల్యుట్ లి నో రిగ్రట్స్! బిజినెస్ చేయడానికి నేను తగినవాణ్ణి కాను. ఈ టెన్షన్ లో నుంచి బయటపడి హాయిగా , నిశ్చితంగా రిటైర్డ్ లైఫ్ గడపాలని ఉంది నాకు. ఈ కంపెనీని మీ ఫియాన్సి మిస్.........?"
"సౌమ్య" అన్నాడు శశికాంత్.
"ఆ! ఈ కంపెనీని మీరు ఈ అమ్మాయి పేరుతొ కొనేస్తున్నారు. ఆమె వెనుక మీరు నిలబడి మేనేజ్ చేస్తారు అన్నింటిని. మీ ఇద్దరి వెనుకా తేజస్వి ఉంటాడు. బిలివ్ మీ. అతను మీ కంపెని కి ఒక అస్సేట్ అవుతాడు."
ఒకసారి నిర్ధాక్షిణ్యం గా తేజస్వి వైపు చూశాడు శశికాంత్.
ఇతను.....పేరేమిటి.....తేజస్వి.......తేజస్వి సలహాలు తను తీసుకోవాలా?
ఇతను వర్కింగ్ క్లాస్ కి రిప్రేజేంట్టివ్!
వర్కింగ్ క్లాస్ ని ఎలా ట్రీట్ చెయ్యాలో , ఎంతలో ఉంచాలో తనకి తెలుసు. మేనేజ్ మెంట్ టెక్నిక్స్ తనకి తెలిసినంతగా మరెవ్వరికి తెలియవు.
ఈ తేజస్వి దగ్గర తను సలహాలు తిసుకోవడమేమిటి? నాన్సెన్స్!
తనే ఇస్తాడు ఒక సలహా - కంపెని పూర్తిగా తన చేతుల్లోకి రాగానే - ఈ తేజస్వికి-
"లుక్ బస్టర్"! బెటర్ ప్యాక్ యువర్ థింగ్స్ అండ్ లీవ్ ది టవున్. మూటా ముల్లే సర్దుకుని చెక్కెయ్. లేకపోతే ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్ళు తాగిస్తాను. యూనియన్లూ, సమ్మెలు, చర్చలు, సలహాలు ఇవన్ని అంటే నాకు అలర్జీ. నాది ఎప్పుడూ వన్ మాన్ షో.
అందరూ నేను చెప్పినట్లు వినాలి.
అంతా నేను చెప్పినట్లు జరగాలి.
అంతే! మరో మాట లేదు అని-
పైకి మాత్రం ప్రసన్న వదనంతో - "తప్పకుండా మిస్టర్ పరమహంసా! వీరి సర్వీసెస్ మేము ఉపయోగించుకుంటాం" అన్నాడు.
అప్పటిదాకా తల వంచుకుని కూర్చుని ఉన్న సౌమ్య తల ఎత్తి యధాలాపంగా తేజస్వి వైపు చూసింది.
ఒక్కొక్క వ్యక్తిని చూడగానే ఒక్కొక్క రకం అభిప్రాయం ఏర్పడిపోవడం సహజం.
తేజస్విని చూడగానే సౌమ్యకి అనిపించింది- పైకి మాములుగానే కనబడుతున్నా చాలా స్ట్రాంగ్ కేరక్టర్ ఇతనిది, రాజి లేని మనస్తత్వం. ఎవరికి భయపడని స్వభావం అని.
ఎందుకు అలా అనిపించింది తనకు?
బహుశా, అతను రిప్రేజెంటేటివ్స్ అసోసియేషన్ కి సెక్రటరి అని ముందుగానే పరిచయం చెయ్యడం వల్లనా?