Previous Page Next Page 
అగ్నిసాక్షి పేజి 19

 

    అయి ఉండవచ్చు.

 

    అదే సమయంలో తేజస్వి కూడా సౌమ్య వైపు చూశాడు. కొద్ది సెకెండ్ల సేపు నిశ్చలంగా, ఆమెని అంచనా వేస్తున్నట్లు చేశాడు.

 

    ఈ అమ్మాయి తమ అందరికి బాస్. కనీసం టెక్నికల్ గా , పేపరు మీద. ఈ అమ్మాయి ఈ ఇండస్ట్రికి ఓనరు కాబోతోంది.

 

    కానీ ఫర్ అల్ ప్రాక్టికల్ పర్పసేస్ , ఈ శశికాంత్ యజమానిగా ఉంటాడు. అది అర్ధమవుతూనే ఉంది.

 

    సౌమ్య ఇండస్ట్రికి యజమానురాలు.

 

    సౌమ్యని పెళ్ళి చేసుకుని శశికాంత్ ఆమెకి యజమాని కాబోతున్నాడు. ఆమెతో బాటు ఈ ఇండస్త్రికి కూడా.

 

    కానీ ఇక్కడేదో మతలబు ఉంది. ఈ శశికాంత్ గురించి తను విన్నాడు. దివాలా తీశానని ప్రకటించి , దగ్గరి వాళ్ళందరిని ముంచేసి, దాదాపు యాభై లక్షలు వెనకేసుకున్నడుట.

 

    ఆ డబ్బుతో తనే కొత్త ఇండస్ట్రి కొనలేడు కాబట్టి , తనకి కాబోయే భార్య పేరుతొ కొంటున్నాడన్నమాట!

 

    వెరి సింపుల్ ట్రిక్!

 

    సో దట్ సేటిల్స్ ఇట్! ఇతనికి న్యాయాన్యాయాలు, మంచి చెడ్డలు అంటే అంత పట్టింపు లేదన్నమాట! తన పని పూర్తి కావడం అతనికి ముఖ్యం.

 

    "చిన్న నా పొట్టకు శ్రీరామరక్ష" అనుకునే స్వార్ధం.

 

    పరమహంసకి, ఇతనికి మధ్య పదివేల మైళ్ళ వ్యత్యాసం ఉంది.

 

    న్యాయాన్ని నడివీధిలో అమ్మి నిలదొక్కుకుంటున్నాడు ఈ శశికాంత్!

 

    తెలిసో, తెలియకో కంపెనీని ఇతనికి అమ్మేశాడు పరమహంస. కన్నకుతూరికి సరైన సంబంధం తెచ్చి పెళ్ళి చెయ్యలేక , ఎవరో దారినపోయే దానయ్య చేతిలో పెట్టేసి చేతులు కడుక్కున్న కడు దరిద్రుడయిన తండ్రిలా.

 

    ఇంతకీ ఈ సౌమ్య ఎలాంటిది? ఈమె కూడా అతని లాంటిదేనా?

 

    ఎందుకో అలా అనిపించడంలేదు ఆమెని చూస్తుంటే. పేరుకి తగినట్లే సౌమ్యంగా కనబడుతోంది. కొంచెం దిగులుగా ఉంది మొహం.

 

    ఎందుకని?

 

    మళ్ళీ శశికాంత్ వైపు చూశాడు తేజస్వి .

 

    మనిషి అంగుళం అంగుళంలోనూ అహంభావం కనబడుతోంది. ఇతని చేతుల్లో చిక్కుకుంటున్నాయి తన అసోసియేషన్ మెంబర్ల జీవితాలు. ఇతను పరమహంస లాంటి మనిషి కాదు. పరమ స్వార్ధపరుడు.

 

    ఇన్నాళ్ళు పరమహంసలాంటి మనిషి దగ్గర తను అనుసరించిన సంప్రదింపులు, సలహాలు అనే టెక్నిక్స్ ఇతని దగ్గర పని చెయ్యవు. అది ముందే తెలిసిపోతోంది.

 

    ఈ శశికాంత్ ని డీల్ చెయ్యడానికి కొత్త స్ట్రాటేజీ కావలి తనకి.

 

    కానీ ఏమిటది?

 

    "వచ్చేవారం మా మ్యారేజ్!" అన్నాడు శశికాంత్. పెద్దసైజు ఇన్విటేషన్ కార్డ్ తీసి పరమహంసకి ఇస్తూ. రెడీగా కొన్ని కార్డులు ఉన్నా కూడా కావాలనే అతను తేజస్వికి కార్డు ఇవ్వలేదు.

 

    "కంగ్రాచ్యులేషన్స్" అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చాడు పరమహంస.

 

    చిరునవ్వుతో తను కూడా కరస్పర్శ కోసం చెయ్యిజాచాడు తేజస్వి.

 

    కానీ అతని చేతిని అందుకోలేదు శశికాంత్. అది గమనించనట్లు నటిస్తూ "పెళ్ళికి తప్పకుండా రావాలి" అన్నాడు పరమహంసతో.

 

                                                                              9

 

    పెద్ద ఫంక్షన్ పేలెస్ లో చాలా ఆర్భాటంగా జరిగింది పెళ్ళి. శశికాంత్ అంటే మనసులో ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా, అతనికి భయపడి పెళ్ళికి వచ్చారు చాలామంది. అతనితో ఎప్పుడు ఏ అవసరం వస్తుందో తెలియదు. తను మర్యాదలు పాటించడు శశికాంత్. "ఫార్మాలిటిస్ అంటే నాకు అయిష్టం" అని చెబుతాడు అందరికి. అలాగే వుంటాడు కూడా. కానీ అది ఎదుటి వాళ్ళకి సంబంధించినంత వరకే. తన పట్ల ఎవరన్నా చుపవలసినంత మర్యాద చూపకపోతే మాత్రం మనసులో పెట్టుకుంటాడు. మరచిపోడు.

 

    మేము చాలా నిర్మొహమాటంగా ఉంటామని అనుకునేవాళ్ళు చాలా మందిలో కనబడుతుంది ఈ స్వభావం. ఎదుటివాళ్ళతో చాలా నిర్మొహమాటంగా ఉండగలరు వాళ్ళు. కానీ ఎదుటివాళ్ళు ఉన్నది వున్నట్లు మాట్లాడినా, తోచింది తోచినట్లు చేసినా భరించలేరు.

    
    అలాంటి స్వభావమే శశికాంత్ ది కూడా.

 

    ఇవాళ అతని పెళ్ళికి వెళ్ళకపోతే అతను డైరీలో రాసుకుని మరి గుర్తు పెట్టుకుంటాడు - అన్న బెంగతోనే ఎక్కువమంది వచ్చారు.

 

    [పైగా - అప్పటికే అందరికి తెలిసిపోయింది- శశికాంత్ నిజంగా దివాలా తియలేదని, లక్షనంగానే ఉన్నాడని, దివాలా తీసినట్లు నటించి, మరిన్ని లక్షలు వెనకేశాడనీను.

 

    అతనితో అవసరాలు ఉంటాయి. తప్పవు.

 

    అందుకని - తిట్టుకుంటునే వచ్చారు పెళ్ళికి చాలామంది.

 

    "ఆడపెళ్ళివారి వైపు, మగపెళ్ళి వారి వైపూ కూడా ఖర్చులన్ని తనే భరించాడు శశికాంత్. డబ్బు నీళ్ళలా ఖర్చు పెట్టాడు. తను దివాలా తీశానని నిజంగానే ఎవరైనా నమ్మి ఉంటె - వాళ్ళు దురభిప్రాయం దూరమై పోయేలా విచ్చలవిడిగా డబ్బు వెదజల్లాడు.


    ఆ రోడ్డులో ట్రాఫిక్ జామ్ అయిపోయేటన్ని కార్లు వచ్చి ఆగాయి. ఫంక్షన్ పాలెస్ ముందు.

 Previous Page Next Page