అసలు తింటే కదా అరగడానికి!" అన్నాడు తేజస్వి , డొక్కలెండుకుపోయి వున్న చిన్నిని చూస్తూ.
గొణుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు వరదరాజులు.
వెంటనే చిన్నిని దగ్గరకు తీసుకుని వీపు నిమిరాడు తేజస్వి.
"బర్ఫీ తింటావా చిన్నీ?"
"ఓ అన్నాడు చిన్నీ కళ్ళు తుడుచుకుంటూ, సంతోషంగా.
తేజస్వి తెచ్చిన మిఠాయిల వాసన అప్పటికే అక్కడంతా కమ్మగా వ్యాపించింది. అది [పసికట్టేసి , ఫోలోమంటూ వచ్చి అతనిమీద పడిపోయారు తక్కిన పిల్లలందరూ కూడా.
తినుబండారాలు వాళ్ళందరికీ పంచి, వాళ్ళు ఆవురావురుమని తింటుంటే ఆప్యాయంగా చూస్తూ ఉండిపోయాడు తేజస్వి.
నోట్లో మిఠాయి పెట్టుకుని నములుతూనే,ఆపకుండా తెజస్వితో ఏదేదో చెబుతున్నాడు చిన్నీ. నిన్న మధ్యాహ్నం చిన్నీ మిగతా పిల్లలతో కలిసి ఆడుకుంటుంటే నిద్రపోతున్న వరదరజులకి నిద్ర చెడిపోయిందట. కోపం వచ్చి చిన్నిని చావగోట్టాడుట.
తరువాత తాడుతో కట్టేశాడు చిన్నిని. నిన్న మధ్యాహ్నం నుంచి దూడలా అలాగే ఉన్నాడుట చిన్నీ. నిన్నరాత్రి అన్నం కూడా తినలేదట.
విని, ఓదార్చాడు తేజస్వి.
ఉన్నట్లుండి ఏదో గుర్తు వచ్చింది చిన్నికి- ఆనందంగా అన్నాడు. "బాంబే బాబాయ్" ఈసారి వచ్చినప్పుడు ఎలుగుబంటి కధ చెబుతానంటివే!"
నవ్వి చిన్నిని ఒళ్లో కూచోబెట్టుకుని ఎలుగుబంటి కధ చెప్పడం మొదలెట్టాడు తేజస్వి. పిల్లలందరూ అతని చుట్టూ గుమిగూడి , చెవులప్పగించి కధ విన్నారు.
కధ పూర్తయ్యాక , "వచ్చేవారం ఏం కధ చెబుతావు బాబాయ్?" అన్నాడు చిన్నీ ఆత్రంగా.
తేజస్వి చిన్నిని ముద్దు పెట్టుకున్నాడు.
వచ్చే వారం జిత్తుల మారి గుంటనక్క కధ చెబుతాను సరేనా?"
మరి బాంబే బర్ఫీనో? మళ్ళీ తెస్తావా?"
"ఓ తప్పకుండా? బోలేడంతా తెస్తాను. ఇక నేను వెళ్ళిరానా?"
అతను వెళ్ళిపోతాననగానే పిల్లలందరూ అయిష్టంగా మొహం పెట్టారు. నవ్వి, వాళ్ళందరిని పేరుపేరునా పలకరించి, బయటకు వచ్చి స్కూటర్ స్టార్ట్ చేశాడు తేజస్వి.
అతను ఆఫీసు కి వచ్చి రాగానే పరమహంస దగ్గరినుంచి పిలుపు వచ్చింది.
పరమహంస ఛాంబరులోనికి వెళ్ళాడు తేజస్వి.
"ప్లీజ్ సిట్ డవున్" అన్నాడు పరమహంస తేజస్విని చూడగానే కూర్చుని అయన వైపు చూశాడు తేజస్వి. పొద్దుటి టెన్షన్ తగ్గిపోయి తేటగా కనబడుతోంది పరమహంస మొహం. కాస్త ఉల్లాసంగా కూడా కనబడుతున్నాడు అయన.
"మిస్టర్ తేజస్వి" అన్నాడు పరమహంస గొంతు సవరించుకుని. "ప్రొద్దున్నే కదా మనం డిస్కస్ చేశాం. కంపెని నష్టాలతో నడుస్తోంది, వీలైనంత పొడుపు చెయ్యాలి. అందుకని స్టాఫ్ ని తగ్గించాలని."
'కానీ, ఆ ప్రపోజల్ కి నేను ఒప్పుకోలేదే?" అన్నాడు తేజస్వి ముక్తసరిగా.
చిన్నగా నవ్వాడు పరమహంస. 'నాట్ నేసేసరి ' యంగ్మాన్! ఆ ప్రపోజల్ ఇకలేదు.
'మరి?" అన్నాడు తేజస్వి.
"ఒక్క దెబ్బతో అన్ని సమస్యలూ సమసిపోయే సొల్యుషన్ కనిపెట్టాను నేను."
"ఏమిటది?"
ఒక్క క్షణం ఆగి - 'కంపెని అమ్మేయ్యడం' అన్నాడు పరమహంస.
'వాట్?' అన్నాడు తేజస్వి నివ్వెరపోయి. సో! అలా జరగడానికి వీల్లేదు. నెవర్!"
"మిస్టర్ తేజస్వి! నేను నా అసమర్ధత వాళ్ళ కంపెనీని నష్టాలతో నడిపి, మీ అందరికి కష్టాలు కలిగించడం కన్నా కంపెనీని సమర్దులేవరికైనా అమ్మేయ్యడం మంచిదనే అభిప్రాయం కలిగింది.
కాసేపు నోట మాటరాకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు తేజస్వి.
కొద్ది నిమిషాల తర్వాత మళ్ళీ పరమహంసే అన్నాడు.
'నష్టాలతో నడుస్తున్న నా కంపెనీని కొనేయ్యడానికి ఎవరన్నా ముందుకు వస్తారని నేను ఉహించలేదు తేజస్వి. దిసీజ్ రియల్లీ ఏ గాడ్ సెంట్ అపర్చ్యునిటి , నాకు పెద్ద రిలీఫ్ గా ఉంది ఇది' అన్నాడు కర్చీఫ్ తో నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుంటూ.
ఆయన్ని చూస్తే జాలి వేసింది తేజస్వికి. మంచిగా బతకబోయి చెడిపోయిన పెద్దమనిషి అయన. కానీ కంపెనీని బాగుపరచాలంటే దాన్ని అమ్మేయ్య్డం తప్ప వేరే దారి లేదా? కొద్దిసేపు ఆగి అన్నాడు తేజస్వి 'కంపెనీని కొంటానని ఆఫర్ చేసింది ఎవరు?
8
"నేను ఒక కంపెనీని కొనేస్తున్నాడు సౌమ్యా" అన్నాడు శశికాంత్ సౌమ్యతో.
తను సుబ్రహ్మణ్యం గారి ఇంటి వసారాలో కూర్చుని ఉన్నాడు. అతనికి కొంచెం దూరంలో కూర్చుని ఉంది సౌమ్య. ముభావంగా ఉంది ఆమె.
'విన్నావా? అన్నాడు శశికాంత్.