తను అనవసరంగా ప్రతిమ వెనకబడి ఫూలయిపోతున్నాడేమో అనిపించింది అతనికి. రోషంతో మొహం జేవురించింది. ఏం? తనకేం తక్కువ? తను "వూ" అంటే తన కాళ్ళు కడిగి, లక్ష రూపాయల కట్నంతో కూతుళ్ళని అంటగట్టడానికి లక్షమంది తండ్రులు రెడీగా ఉన్నారు.
కోరి ఆ అమ్మాయిని చేసుకోవాలనుకోవడం వల్లనే తను చీప్ అయిపోయాడా?
షిట్!
ఇంక అలా చులకనైపోకూడదు తను! ఈ అమ్మాయి కాకపోతే ఈ అమ్మాయి కంటే లక్షరెట్లు అందంగా ఉండే పిల్లని ముల్లోకాలూ గాలించి చేసుకుంటాడు. ష్యూర్ థింగ్!
'అబద్దం' అంది అతని మనసు. 'ప్రతిమకంటే అందమైన అమ్మాయా? మూడు లోకాలు కాదు, ముఫ్ఫై లోకాలు వెదికినా నీకు కనబడదు. నిజం! కనబడదు"
శ్రీరాంకి కణతలు పగిలిపోతున్నట్లు అనిపించింది. అవును! తన మనసుకి తనే అబద్దం చెప్పుకోలేడు! ప్రతిమ అంత అందగత్తె ఇంకెక్కడా ఉండదు గాక ఉండదు.
తలనొప్పి! జీసస్! తలనొప్పి!
"సౌందర్యా!" అని అరిచాడు.
"సౌందర్యా! గెట్ మీ కాఫీ కాఫీ ఇవ్వు! త్వరగా!"
అతని మాట పూర్తవక ముందే, పేపర్ కప్పుతో ప్రత్యక్షమయ్యే సౌందర్య రాలేదు.
"సౌందర్యా! హెల్! ఎక్కడున్నావ్? గెట్ మీ కాఫీ"
అనిల్ వచ్చాడు గదిలోకి.
"సౌందర్య ఇంకా రాలేదు, బాస్" అన్నాడు.
"వై! పన్నెండవుతూంది! ఈ ఆఫీసులో డిసిప్లిన్ మంటలో కలిసిపోయిందా?" అన్నాడు శ్రీరాం అతనికి క్షణక్షణానికీ చిరాకు పెరిగిపోతూంది.
శ్రీరాంని అంతటి చికాకు మూడ్ లో ఎప్పుడూ చూడలేదు అనిల్.
శ్రీరాం తనని తాను అదుపులోకి తెచ్చుకున్నాడు.
"సారీ అనిల్! అరిచేస్తున్నాను కదూ? తలనొప్పి....స్ల్పిట్టింగ్ హెడ్డేక్! నీ దగ్గర యాస్పిరిన్ ఏమన్నా ఉందా? లేకపోతే తెప్పించు!"
అనిల్ బయటి కెళ్ళాడు.
అయిదు నిమిషాల తరవాత స్ప్రింగ్ డోర్ దగ్గర మెత్తటి అడుగుల శబ్దం.
సౌందర్య లోపలి కొచ్చింది. ఆమె చేతిలో టాబ్లెట్లూ, మరో చేతిలో కాఫీ కప్పూ.
"వచ్చావా? ఎందుకింత లేటు?" అన్నాడు శ్రీరాం, చిరాకంతా ఆమె మీద చూపించేస్తూ.
సౌందర్య టాబ్లెట్లూ, కప్పు అతని ముందు పెట్టి, మాట్లాడకుండా కుర్చీలో కూర్చుంది.
ఆటను టాబ్లెట్ వేసుకుని కాఫీ తాగాడు.
అప్పుడు చెప్పింది సౌందర్య. "అమ్మ చచ్చిపోయింది." అంది మామూలుగా.
చాలా సాధారణమైన విషయం చెబుతున్నట్లు ఉంది ఆమె గొంతు. మొహంలో ఏ భావమూ కనబడటం లేదు.
షాక్ తిన్నట్లు చూశాడు శ్రీరాం. "ఏమిటీ? మీ అమ్మగారు..."
"ఇవాళ పొద్దున్నే! చాలా హాయిగా, సులభంగా ప్రాణాలు వదిలేసింది అమ్మ రాత్రి పడుకున్నది మళ్ళీ లేవలేదు. అంతే! ఈజీ డెత్! నాకు చాలా రిలీఫ్ గా, సంతోషంగా ఉంది, శ్రీరాం సాబ్!"
శ్రీరాం సౌందర్యని పరీక్షగా చూశాడు. ఆమె మొహం చాలా తేటగా ఉంది.
"అవును, శ్రీరాం సాబ్! బాధల నుంచి విముక్తి చెందింది అమ్మ. ఇకనుంచి ప్రతిరోజూ డాక్టర్లు ఆమె శరీరానికి నాలుగైదు పంక్చర్లు చేసి ఇంజెక్షన్లు పొడవనక్కర్లేదు. ఆక్సిజన్ టెంట్ అక్కర్లేదు. గ్లూకోజ్ అక్కర్లేదు. "ఆమె గొంతు కొద్దిగా వణకడం మొదలెట్టింది. "ఈ నరకయాతననని తప్పించుకుని వెళ్ళిపోయింది మా అమ్మ. " అని, "వెళ్ళిపోయింది!" అంది హఠాత్తుగా స్వరం పెంచుతూ.
ఆ తరువాత మొహాన్ని చేతుల్లో దాచుకుని పెద్దగా ఏడవడం మొదలెట్టింది.
ఆ అమ్మాయి, తల్లి పోయిన షాక్ లో హిస్టీరికల్ గా ప్రవర్తిస్తూందని గ్రహించాడు శ్రీరాం.
"అమ్మ చచ్చిపోయింది! అమ్మ చచ్చిపోయింది! చచ్చిపోయింది!" అంటూంది సౌందర్య వివశురాలై వెక్కిళ్ళు పెడుతూ.
"సౌందర్యా!"
"అమ్మ! అమ్మ!" అని కలవరిస్తూంది సౌందర్య. ఆమె చూపులు శూన్యంగా ఉన్నాయి.
శ్రీరాం సందేహించకుండా సౌందర్య చెంపమీద బలంగా కొట్టాడు - "సౌందర్యా! ఇటు చూడు!"
ఉలిక్కిపడి, చెంప తడుముకుంది సౌందర్య. మత్తులోనుంచీ బయటపడ్డ దానిలాగా చూసింది.
"లే! వెళదాం!" అంటూ కారు తాళం చెవులు అందుకున్నాడు శ్రీరాం.
అనిల్ కూడా వాళ్ళతో పాటు కారెక్కాడు.
దగ్గరుండి సౌందర్య తల్లి అంత్యక్రియలు జరిపించిన తరవాత, ఆ అమ్మాయిని మామూలు మనిషిని చెయ్యడానికి రెండ్రోజులు పట్టింది శ్రీరాంకీ, అనిల్ కీ.
* * * * *
శ్రీరాంకి క్షమాపణ చెప్పుకోవాలని తహతహలాడిపోతూంది ప్రతిమ. కానీ ఆ తరవాత మూడు రోజులయినా శ్రీరాం కనబడలేదు.
"శృతీ! నువ్వు మీ కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అతనికి నా తరపున అపాలజీ చెప్పు ప్లీజ్!" అంది ప్రతిమ.
శృతి పెదవి విరిచింది. "శ్రీరాం వాళ్ళ ఇంటికి రెండు సార్లు వెళ్ళాను. అతను వేళకి ఇంటికి రావడంలేదు. వాళ్ళ ఆఫీసులో పనిచేసే అమ్మాయి మదర్ చనిపోయిందిట. ఇతను ఆ హడావిడిలో ఉన్నాడుట" అంది.
ఒక్కసారి అతనితో "సారీ!" అని చెబితే కానీ ప్రతిమకి మనశ్శాంతి దొరికేటట్లు లేదు. అతను తన భర్త అవుతాడా, కాడా అన్నది వేరే సంగతి. కానీ తన వల్ల ఒక సాటి మనిషి అంతటి దుర్భరమైన అవమానం పొందటం ఆమె మనసుని కలిచివేస్తూంది.
ఆ రోజు అంత గొడవ జరిగాక కూడా అతను ఏమీ మాట్లాడకుండా కోపాన్ని మింగేస్తూ వెళ్ళిపోగలిగాడు! గ్రేట్!
అదే అన్నది శృతి కూడా.