Previous Page Next Page 
ప్రేమ పురాణం పేజి 17


    
    "నేను కాఫీ, టీ, డికాక్షన్, విస్కీ, బ్రాందీ ఏం తాగను."
    
    "మరి నీ ప్రేయసి గురించి దిగులుగా సాడ్ సాంగు పాడుకుంటున్నప్పుడు ఏం చేస్తావ్? నశ్యం పీలుస్తూ 'ప్రేయసీ! ప్రేయసీ' అని పాడతావా?" అన్నాడు చంద్ర చిరాగ్గా.
    
    "కాదు! ఉసిరికాయ పచ్చడి తింటూ 'జిందగీ! జిందగీ' అని పాడుకుంటా. మొహంచూడు."
    
    "ఎవరి మొహం?"
    
    "నీ మొహమే లేకపోతే నాకు ప్రేమా, చీమా, దోమా ఏంటోయ్! పూటెట్లా గడుస్తుందా అని ప్రతిరోజూ లాటరీకొడుతుండే శాల్తీని పట్టుకుని ప్రేమా గీమా అంటావేం?"
    
    "ఒరే! ఒరే! ఆగు! ఆగు!"
    
    "ఏమిటి?" అన్నాడు శేషు.
    
    "సితార! సితార!"
    
    "నేను రోజుకి నలభైసార్లు చూస్తూనే వుంటా"
    
    "అబ్బ! ఎంత బావుంటుందో అని నీకనిపించదురా?"
    
    "ఎందుకనిపించదూ! కనిపించినప్పుడల్లా అనుకుంటా అబ్బ! ఎంతబావుందో" అని.
    
    హఠాత్తుగా ఏదో గుర్తొచ్చినట్లు శేషు వైపు క్రూరంగా చూశాడు జెయ్ చంద్ర.
    
    "ఏం ఒళ్లెలా వుంది?"    

    "ఏం! ఏమయిందిప్పుడు?"
    
    "ఇంకా ఏం కావాలీ? నా సితార నీ కళ్ళకి అందంగా కనబడుతుందా?"
    
    "నీతో చచ్చే చావే వచ్చిందే!"
    
    "ఏం?"
    
    "ముందుకుపోతే గొయ్యీ, వెనక్కిపోతే నుయ్యిలా వుంది నా పరిస్థితి."
    
    "ఏం?"
    
    "సితార అందంగా వుందన్నా నీకు కోపం వస్తుంది. అప్పలమ్మలా వుంటుందన్నా నీకు కోపం వస్తుంది. ఎట్లా చావను?"
    
    "అందగత్తె అనో, అప్పలమ్మ అనో ఎందుకనుకోవాలీ? నీ అక్కలా వుంటుందనుకో" అని ఉచిత సలహా ఇచ్చాడు జెయ్ చంద్ర.
    
    "అక్కెలా అవుతుంది? సితార నాకంటే చిన్నది."
    
    "పోన్లెద్దూ! ఎవరు చూడొచ్చారు. అయినా నువ్వేమో మిక్కీమౌస్ లా పొట్టిగా, పీలగా వుంటావు. సితారేమో గజ్జలగుర్రంలా భారీగా వుంటుంది. అంచేత మీ అక్కన్నా జనాలు నమ్మేస్తారు."
    
    "నాకు అంతకంటే సింపుల్ పద్దతి ఒకటి తోచింది."
    
    "ఏమిటది?"
    
    "సితారని సింపుల్ గా నా చెల్లెలనుకుంటే పోలా?"
    
    "ఎవరి చెల్లెలు?" అడిగాడు జెయ్ చంద్ర అనుమానంగా.
    
    "నా చెల్లెలే"
    
    "బెస్టు" అన్నాడు జెయ్ చంద్ర.
    
    ఒక్కక్షణం తీవ్రంగా ఆలోచించాడు శేషు. "పచ్చిమిరపకాయలకారం బదులు ధనియాలపొడి నూరితే ఎలా వుంటుందా అని ఆలోచిస్తున్నా" అన్నాడు హఠాత్తుగా.
    
    "ఓర్నిన్ను మిరపకాయల కారంలో నూరి, ధనియాలపొడి బస్తాలో కుక్కి మూసీనదిలో ముంచెయ్యా! నేను నా సితార కోసం తపించిపోతుంటే ఈ టీ స్టాలు డైలాగులేమిట్రా మధ్య. ఇదే ఫైనల్ వార్నింగ్. ఖబడ్దార్! జాగ్రత్త! బీ కేర్ ఫుల్" అన్నాడు జెయ్ చంద్ర కోపంగా.
    
    మూతిముడుచుకుని మిరపకాయలకారం నూరడంలో మునిగిపోయాడు శేషు.
    
    అక్కడి అల్మార్లో త్రేతాయుగంనాటి ట్రాన్సిష్టరు ఒకటి వుంది.
    
    కానీ ట్రాజెడీ ఏంటంటే ఆ ట్రాన్సిస్టర్లో వచ్చే కార్యక్రమాలేంటో ఎవరికీ ఓ పట్టాన అర్ధంకావు, అంతుబట్టవు.
    
    "అదేంటీ? బుర్రకథా?" అన్నాడు జెయ్ చంద్ర కాసేపు విని భరించలేక.
    
    "కాదు! తెలుగులో వార్తలు" అన్నాడు శేషు.
    
    అతనికింకా కోపం పోలేదు. అందుకే యమా సీరియస్ గా వున్నాడు.
    
    కాసేపు గడిచాక యింకేదో సౌండు రావడం మొదలెట్టింది రేడియోలో.
    
    కాసేపు విని "ఘంటసాల పాటేనా అది?" అడిగాడు జెయ్ చంద్ర అనుమానంగా.
    
    "కాదు"
    
    "మరి"
    
    "సుశీల గొంతు"
    
    మళ్ళీ కాసేపు గడిచింది.
    
    "ఇప్పుడొస్తున్న పాటేమిట్రా? బృందగానమా?"
    
    "కాదు. వయొలిన్ వాద్యం"
    
    భక్తిగా శేషువైపు చూశాడు జెయ్ చంద్ర.
    
    "నిన్ను నిజమగా మెచ్చుకుని మేకతోలు కప్పాలోయ్"
    
    "ఎందుకూ?"
    
    "ఈ రేడియో చేస్తున్న రణగొణ ధ్వనుల్లో ఏది ఏదో కరెక్టుగా కనిపెట్ట గలిగినందుకు."
    
    "కొన్ని నేను కనిపెట్టలేను" అన్నాడు శేషు చాలా నిజాయితీగా.
    
    "అంటే?" అన్నాడు జెయ్ చంద్ర ప్రశంసాపూర్వకంగా.
    
    శేషు ఏదో చెప్పబోయేలోగానే పక్కింటి పార్వతీశంగారు పరుగు పరుగున వచ్చాడు. ఆయనకి ఎప్పుడూ పరుగులే. వాకింగ్ కూడా పరిగెడుతూనే చేస్తాడు.
    
    ఆయనవచ్చీ రాగానే ఆసక్తిగా రేడియో వినడం మొదలెట్టేశాడు. ఆ రేడియో తనదైన సహజ ధోరణిలో గుడగుడగుడ కిడికిడిటకటకలాంటి శబ్ధాలు అనేకానేకం చేస్తుంది.
    
    ఆ దెబ్బతో టెంపరరీగా సితారని గురించి మర్చిపోయాడు జెయ్ చంద్ర.
    
    ఇక్కడ కాసేపు కథ ఆపుదాం.    

    అసలు నేను జెయ్ చంద్ర గురించి పూర్తిగా చెప్పడం మర్చిపోయాను.
    
    వాళ్ళు రేడియో వినే కార్యక్రమంలో మునిగి వున్నారు కాబట్టి -
    
    (ఆ కార్యక్రమం ఏమిటో జెయ్ చంద్రకి ఇంకా అంతుబట్టనేలేదు. అది వేరే సంగతి!)
    
    ఈలోగా మనం అతని ఫ్లాష్ బ్యాక్ ని చూడ్డం బెస్టు!
    
    జెయ్ చంద్ర ఒక నవయువకుడు. అతని వయసు ఇరవై ఏళ్ళు. ఎత్తుఆరడుగుల ఒక్క అంగుళం. రంగు ఛామనఛాయ. ఛాతీ నలభైఅంగుళాలు. నడుము ముఫై అంగుళాలు. బరువు డెబ్బైకిలోలు. తండ్రిలేడు. ఉన్నప్పుడు ఆయన పేరు రామారావుగారు. లేనప్పటిపేరు లేటు రామారావుగారు.

 Previous Page Next Page