దీపని వంటరిగా కలవాలనే మన్ మోహన్ చెరువుకి వచ్చాడు. దీప మన్ మోహన్ అక్కడికి వస్తాడని ఊహించలేదు. కాని... ఇప్పుడొచ్చింది తనకోసమే అని గ్రహించింది. చప్పుడు చేస్తూ బిందెని చెరువులో ముంచింది. మన్ మోహన్ చూసి చివ్వున లేచి దగ్గరికొచ్చాడు.
"దీపా!"
"ఊ"
"కోపం వచ్చిందా దీపా?"
"ఎందుకు కోపం! ఎవరిమీద కోపం! పేద వారికోపం సామెత వినలేదా?"
"కోపం లేదంటే సరిపోయిందా! ముఖం చూస్తూంటే తెలియటం లేదా, మాట తీరు తెలియటం లేదా?"
బిందె నింపుకుని గట్టుమీద కెక్కింది దీప. బిందె నడుంకి చేర్చుకుంది. "ముఖం చూసి భావాలు గ్రహించగల నేర్పు ఎప్పటినుంచి సంపాదించావు మనూ?" అని ముందుకు అడుగులేసింది.
దీపకి మన్ మోహన్ అడ్డం వచ్చి నుంచున్నాడు. "నీతో మాట్లాడాలి దీపా! కాసేపు కూర్చుని వెళ్ళు" అన్నాడు.
"ఇంటికి రా మాట్లాడుకుందాం. ఇక్కడే కూర్చుని మాట్లాడాలనేముంది?"
"ఉహు, ఇక్కడ మాట్లాడాల్సిన విషయాలే. మాట విన్నంత మాత్రాన వచ్చే నష్టం లేదుగా! ప్లీజ్ దీపా, ప్లీజ్ అంటున్నాకదా అంటూ మన్ మోహన్ దీప నడుంన వున్న బిందె గట్టిగా పట్టుకున్నాడు.
"ఏం మాట్లాడాలి?"
"చెపుతా కూర్చో!" అని బిందె తీసి కింద పెట్టాడు మన్ మోహన్.
"నాలుగు రోజులక్రితం నువ్వొచ్చినప్పుడు అమ్మ ఏమంది దీపా"
"నువ్వే అడగాల్సింది."
"అడిగాను. సరిగా చెప్పలేదు."
"ఆహా... రెండు నెలల క్రితం ఓ రోజు మీ ఇంటికొచ్చాను. నీకు పెళ్ళిచేయాలని వుందని నీవు యిప్పుడప్పుడే పెళ్ళి చేసుకోనన్నానని చెప్పి, సాంప్రదాయ, అందం, ఐశ్వర్యం అన్ని ఉన్న పిల్లని చూసి మనూకి పెళ్ళిచేయాలని అంది అత్తయ్య. "నీ విష్టపడిన పిల్లని మనూ ఇష్టపడక, మనూ ఇష్టపడ్డ పిల్లని నీవు ఇష్టపడకపోతే మనూ ఇష్టానికి వదిలేస్తావా? కాదని అడ్డం తగులుతావా, అత్తయ్యా!" అని నే అడిగాను. ఇలా నీ పెళ్ళి మాటలు మధ్య జరిగాయి. ఈ తఫా నీవు ఊరి నుండి రాగానే అత్తయ్య పెళ్ళి విషయంలో బలవంతం చేయటంతో నన్ను పెళ్ళిచేసుకుంటా నని బైటపెట్టావు, అదే వచ్చింది."
"ఏమొచ్చింది?"
"ఇవాల్టికి నాలుగు రోజుల క్రితం మీ ఇంటికి వచ్చినప్పుడు అత్తయ్య సరిగా మాట్లాడలేదు. నీ మనసేదో నే మార్చినట్లు నిష్టూరంగా మాట్లాడింది. మనం చాటుగా ఎన్నాళ్ళనుంచో ప్రేమించుకుంటూ పెళ్ళిదాకా వెళ్ళామని, నీకు ధైర్యంలేకపోయినా నేను ప్రోత్సహించి నిన్ను ప్రేరేపించినట్లు అంది. అంతేకాదు మనూ! నేనంటే అత్తయ్యకి చాలా ఇష్టం, ప్రేమట. కూతురుగా తలచిందిట గాని కోడలుగా వూహించలేదుట. మనూకి ఇప్పుడిప్పుడే పెళ్లిచేయను, ఇప్పుడప్పుడే వాడికి పెళ్లేమిటి, నీకు పెళ్ళి కుదిరితే డబ్బు సాయం చేస్తాను అంది. ఇలాంటివే నాలుగు మాటలంది అంతే."
"తర్వాతేం జరిగింది?" మన్ మోహన్ ఆత్రుతగా అడిగాడు.
"ఏమి జరగలా! ప్రేమ గురించి పెళ్లి గురించి మనూతో ఎప్పుడూ మాట్లాడలేదు. మనూ అన్నదానికి మనూకే జవాబివ్వాలి. మనూతోనే మాట్లాడాలి, నాతో కాదు. మీ అబ్బాయి పెళ్ళిగురించి నువ్వు చూసుకో అత్తయ్యా! నా పెళ్ళిగురించి వృధాగా డబ్బు...జాలి... ఖర్చుపెట్టకు, అని ప్రశ్నకు జవాబిచ్చి వచ్చేశాను. మాటకు మాటకూడా అప్పగించాననుకో. అంటే మెత్తని మాటలకు మెత్తగాను; గట్టిగాను మాట్లాడాను అంతే." మామూలు విషయంలా చెప్పింది దీప.
"తొందర పడ్డావ్ దీపా!" బాధగా అన్నాడు మన్ మోహన్.
"తొందరపడ్డానా?"
"అమ్మ పెద్దది. పూర్వకాలం మనిషి. మనకన్నా వాళ్ళకే పట్టుదల జాస్తీగా వుంటాయి. వాళ్లేమన్నా విని మనం నెమ్మదిగా మాట్లాడితే వాళ్ళకి కోపం రాదు. మనకి అడ్డంకు వుండదు.
"అలాగా! ఇంత చిన్న విషయం నాకు తెలియదు సుమా!"
"నీకంతా ఎగతాళిగా వుంది అర్ధంచేసుకోవేం?"
"ఈ మాట మీ అమ్మ అంది."
"ఆ తొందరే మొదటికే మోసం వచ్చేది."
"మనూ! తొందర గురించి నిదానం గురించి నువ్వు నాకు బోధించనక్కరలేదు. నువ్వు మీ అమ్మతో ఏం మాట్లాడావో నాకు తెలియదు. కాని.... మామూలుగా నేను మీ ఇంటికొస్తే పనిగట్టుకు పదిమాటలనటం ఏమన్నా బాగుందా? అమ్మ దగ్గర అమ్మెమ్మె అనే వాడివి. నువ్వు తొందర పడ్డావ్ అని నీతులు చెప్పటానికి వచ్చావా?"
"కోప్పడకు దీపా! నీకు నేనంటే ఇష్టంలేదా! ప్రేమ లేదా?"
"ప్రేమ వేరు, ఇష్టం వేరు"
"ఆ రెండూ వున్నాయా లేవా! ముక్కుసూటిగా జవాబు చెప్పు!"
"ప్రేమ చాలా రకాలుగా వుంటుంది. ఇష్టం పలువిధాలుగా వుంటుంది. ఏ విధంగా అనే వివరం చెప్పినా నీ కర్ధంకాదు. చిన్నప్పటి నుంచి ఒకరికొకరం బాగా తెల్సు. కాబట్టి ఆ రెండూ నీపై నాకున్నాయి."
"ప్రతి మాటకి రెండర్ధాలు చెపుతావు. నీతో మాటలు కాలయాపన, అసలు విషయాని కొస్తాను. నన్ను పెళ్లిచేసుకుంటావా లేదా?"
"మీ అమ్మ ఏమందో నిజం చెప్పు. దీనికి కరెక్ట్ జవాబు చెపుతాను."
"ఆ పెద్దవాళ్ళేమంటారు నూతిలో దూకుతాం, గోతిలో దూకుతాం అని బెదిరిస్తారు. లేకపోతే నా ఆస్తిలో చిల్లిగవ్వ ఇవ్వం అంటారు. అదే అంది అమ్మ నేనేం మాట్లాడలేదు.
"మంచి పని చేశావ్! పోనీ ఓపని చేద్దామా! ఈ మధ్య మేమో గేదెని కొన్నాం. ఊళ్ళోదాని పాలు అమ్ముతున్నాం. మరో గేదెని కొనాలని అనుకుంటున్నాం, మనం పెళ్లిచేసుకుని పాల వ్యాపారం పెడదాం. హాయిగా బ్రతకలేక పోతామా ఏమిటి."
మన్ మోహన్ ముఖం ముడుచుకు పోయింది. "నీకు కోపం వస్తుందని ఊరుకున్నా దీపా! ఇదేంపని! పాలమ్మటం... గేదెలని కాయటం... ఊళ్ళో ఏమనుకుంటున్నారో తెలుసా. దీప పదిమంది మగవాళ్ళపెట్టు, మగాలేదు. చిన్నమాటంటే పది మాటలని దులిపేస్తుంది అన్నారు."
"అరెరె, ఈ విషయాలన్నీ నాకు తెలియదు సుమా! నా గురించి ఇంకేమనుకుంటున్నారు మనూ?" దీప కావాలని అమాయకంగా ముఖంపెట్టి అడిగింది.
మన్ మోహన్ కి ప్రోత్సాహం వచ్చింది.
"దీపా! మీనాన్న అందరితో చెప్పారుట. నీకు నీ బావకు వివాహం చేస్తున్నానని, విన్నవాళ్ళు ఎందుకని అడిగారుట. మీ అక్కకు పిల్లలు పుట్టరని... మీ బావకు నీవన్నా నీకు మీ బావన్నా ఇష్టం అని... అక్కచెల్లెళ్ళు కలిసే ఉంటారు. తొందరలోనే వివాహం జరుగుతుంది వాళ్ళిద్దరికి అని ఊరంత అనుకుంటున్నారు మీ నాన్న చెప్పిందాన్నిబట్టి."