Previous Page Next Page 
ఖజురహో పేజి 18


    ఆశ ఉత్తర ధృవం విధి దక్షిణ ధృవం!
    
    మనిషి రెండింటీ మధ్యా ఎగిసిపడే కెరటం.
    
    కిరణ్ పెదవులపైన బాధతో కూడిన నిర్లిప్తమైన నవ్వు వెలిసింది. సముద్రం లోకి వెళ్తే బెస్తవాడు ప్రతిసారీ వెనక్కితిరిగి వస్తాననే ఆశతోనే వెళతాడుగదా! ఆ ఆశే మనిషిని ముందుకు నడిపిస్తుంది.
    
    ఈ ప్రపంచంలో ప్రేమకంటే అందమైనదీ, మధురమైనదీ మరొకటి లేదు. స్వార్ధం, గర్వం, అహం దరిచేరనిదే నిజమైన ప్రేమ.
    
    "చాయా! నాకు కొంచెం టైం ఇవ్వు నువ్వు కావాలనుకున్న జీవితాన్ని నీకు అందించడానికి నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తున్నాను" అన్నాడు.
    
    "ఓ.కే! నేనిప్పుడేం తొందరపెట్టానని? అంతదాకా పెళ్ళి ప్రసక్తి తీసుకురాకు మరి" విసుగ్గా అంది.
    
    చాయ అతనికి దగ్గరగా జరిగి భుజంమీద తలవాల్చి "దూరంగా వుండకు. ఇలా అంటుకుపోయి వుండు. సరేనా" అని నవ్వింది.
    
    "ఫిజికల్ గా కాదు" కిరణ్ స్వరం పెంచి అన్నాడు.
    
    చాయ మామూలుగా సర్దుకుని కూర్చుంది.
    
    "నీకేం కావాలనుకుంటున్నావో నాకు అర్ధం కావడంలేదు కిరణ్" అంది.
    
    కిరణ్ ఆమెకి వివరిస్తున్నట్లుగా- "చూడు! నా చాయ ప్రతిక్షణం నేను తన గురించి ఆలోచిస్తున్నట్లుగానే తనూ నా గురించి ఆలోచించాలనీ, ఒకరికోసం ఒకరన్నట్లుగా కలసిమెలసి బ్రతకాలనీ! ఒకరి ఆనందంకోసం ఒకరు ప్రయత్నించాలనీ, ముఖ్యంగా నిర్లక్ష్యం ఆ నిర్లక్ష్యాన్ని త్యజించాలి.....ప్లీజ్....ఐ కేర్ యూ అన్నట్లు వుండు చాయా...." అన్నాడు.
    
    చాయ కొద్దిగా నవ్వి- "నీకు కావల్సిందేమిటో నాకు తెల్సింది కిరణ్" అంది.
    
    కిరణ్ ఆశగా చూశాడు.
    
    "నీకు కావాల్సింది ఈ చాయ కాదు. నీ వెనకాలపడే నీ చాయ.....యస్! నీతోపాటు నడిచి నువ్వు తల వూపినప్పుడల్లా తల ఊపే నీ నీడను నేను కాలేను. సారీ..... అలాంటి ఆశలతో నాతో స్నేహం చేయకు" తెగేసి చెప్పేసింది చాయ.
    
    "చాయా!" కిరణ్ ఆమె చేతిని పట్టుకుని "అలా మాట్లాడకు ప్లీజ్ నీకేం కావాలంటే అది చేస్తాను. నన్ను ఒంటరివాడ్ని చేస్తానని మాత్రం అనకు ఆ మాట నాకు మరణదండనలాంటిది బికాజ్ ఐలవ్ యూ....ఐ లవ్ యూ." అన్నాడు అర్దింపుగా.
    
    చాయ దీనంగా వున్న అతని ముఖాన్ని జాలిగా చూసింది.
    
    అమిత బలవంతుడిని కూడా ప్రేమ అనే భావన బలహీనుడ్ని చేసి ఆడించగలదని ఆమెకి ఆ నిముషంలోనే తెలిసినట్లయింది.
    
    సోక్రటీస్ నవ్వుతూ విషాన్ని ఎలా త్రాగగలిగాడో....? గాంధీజీ మొండిగా ఎలా పోరాడగలిగాడో? థెరిసా నిస్వార్ధంగా సేవలు ఎలా అందజేయగలిగిందో అలాగే ప్రేమను నమ్మిన ప్రతి ఒక్కరూ తమ లక్ష్యం వైపు అచంచల విశ్వాసంతో అడుగులు వేస్తారు. ఆ లక్ష్యం విశ్వశాంతికై ఎగురవేసే విజయపతాకం కావాలి. అదే విజయాన్ని తాండవింపజేసే మరో ఉద్విగ్నప్రభంజనంగా మారితే....అంతా క్షేమమే.
    
    కిరణ్ ముఖంలోని పట్టుదలని ఆమె ముచ్చటగా చూసింది.
    
    "కిరణ్ ఐ లైక్ యూ" అంది.
    
    కిరణ్ ముఖంలో వెలుగు కొట్టొచ్చినట్టు కనబడింది.
    
    "చాయా" అన్నాడు ఆనందంగా.
    
    "ఆ పక్కకి కాసేపు ఆపు, వానలో తడుద్దాం" అంది.
    
    కిరణ్ కి ఈసారి పెద్దగా ఆశ్చర్యం కలగలేదు. ఆమె ఇష్టాలూ, ఆలోచనలూ ఎంత విలక్షణంగా వుంటాయో అతనికి ఇప్పుడిప్పుడే అర్ధం అవుతోంది.
    
    బయట కుంభవృష్టిగా వాన కురుస్తోంది. కారు ఆగిపోయింది.
    
    చాయ నవ్వి- "ఆపుతావో లేదోనని టెస్టు చేయడానికి అడిగాను. కారు పోనీ! ఈ వానలో తడిస్తే ఇంకేమైనా వుందా?" అంది.
    
    "నేను ఆపలేదు. అదే ఆగిపోయింది" తాపీగా చెప్పాడు కిరణ్.
    
    "ఆ!" అరిచింది కంగారుగా.
    
    ఇద్దరూ కారు దిగి తొయ్యాల్సి వచ్చింది.
    
    అందమైన అమ్మాయితో నడవడం అతనికి భయాన్నే కలిగించింది. దూరంగా ఓ కారు గ్యారేజీ కనిపించింది.
    
    "అదిగో షెడ్డు...... ఇంక నావల్లకాదు! వాళ్ళని పిలుచుకో" నుదురు, చేతులు చున్నీతో తుడుచుకుంటూ అంది చాయ.
    
    కిరణ్ వెళ్ళి ఓ మనిషితో వచ్చి కారు తోసుకుంటూ తీసుకెళ్ళాడు.
    
    కిరణ్ మెకానిక్ షాపులో చాయ కోసం ఓ కుర్చీ వేయించాడు. ఎక్కడ్నుంచో వేడివేడి టీ కూడా తెప్పించాడు.
    
    "ఇంకా ఎంతసేపు?" చిరాగ్గా అడుగుతూ తలెత్తింది.
    
    "దో బజే తక్ హో జాయేగా! ఠండీ లగ్ రేక్యా" వెకిలిగా నవ్వుతూ అడిగాడు షెడ్డు ఓనరు.
    
    చాయ అతన్ని నిశితంగా చూసింది.
    
    ఎత్తుగా, దృఢంగా వున్నాడు సర్దార్జీ అనుకుంటా! జుట్టు నడినెత్తిమీద ముడిగా వేసుకున్నాడు. కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి. మాట ముద్ద ముద్దగా తాగినవాడి మాటలా వుంది.
    
    అసిస్టెంట్ కుర్రాడు కారు క్రింద పడుకుని రిపేర్ చేస్తుంటే కిరణ్ అక్కడే నిలబడి టెన్షన్ తో చూస్తున్నాడు.
    
    "కప్ డే బద్ లో" సర్దార్జీ చాయ ఒంటిని చూపులతోనే నమిలేస్తూ అన్నాడు.
    
    చాయకి కాస్త భయం వేసింది.
    
    "కిరణ్! ఎంత సేపవుతుంది?" అడిగింది.
    
    కిరణ్ అసహ్యంగా పెదవి విరిచి తెలీదన్నట్లు సైగ చేశాడు.
    
    "చోలీకే పీచే క్యాహై..... చున్ రీకే నీఛే క్యాహై" రేడియోలోంచి పాత అసందర్భంగా వినిపిస్తోంది.
    
    సర్దార్జీ వెకిలిగా నవ్వుతూ పాటకి దరువు వేస్తున్నాడు.
    
    చాయ లేచి నిలబడింది. ఆమెకి అడుగు తీసి అడుగు వేయడానికి రాకుండా బట్టలు వంటికి అంటుకుపోయాయి. మీదనున్న చున్నీ తీసి గట్టిగా పిండుతూ ముందుకి వంగింది.

 Previous Page Next Page