అప్పుడు వాళ్ళిద్దరూ ఓ తండ్రి కూతుళ్ళలాగో, మేనమామ మేనకోడలు లాగో వున్నారు.
"ఓ.కె ఫ్రెండ్స్ థాంక్యూ ఫర్ యువర్ కోపరేషన్ సీయూ మీ ఫ్రెండ్ ని ఓ అరగంటలో వదిలేస్తాను." చేతిలో హేండ్ స్టిక్ పట్టుకుని, ముసలి వ్యక్తిలాగే ముందుకు నడిచాడు అరవింద్ ఆ పక్కన నీలిమ.
ముగ్ధ, అలక, సురభి, వెళుతున్న ఆ ఇద్దరివేపు ఆశ్చర్యంగా, సంభ్రమంగా చూస్తున్నారు. ఇద్దరూ రోడ్డుమీద కొచ్చారు. ఆ రోడ్డు అక్కడ రెండుగా విడిపోయింది. ఒకరోడ్డు కేంటిన్ వేపు వెళ్తే, రెండో రోడ్డు సరిగ్గా బస్టాండు దగ్గరకు తీసికెళ్తుంది.
"ఈ రోడ్లో కొండ కిందకు వెళ్ళే బస్సులోస్తాయి. మధ్యలోనే బస్సాపి నేనెక్కుతాను. పోలీసులకు గనక నేను దొరకకాపోతే, కొండ కిందకు దిగగానే, నేను ఫోన్ చేస్తాను. లేకపోతే రేపటి పేపరు చూడండి. ఓ.కే"
ఆ మాటల్ని వింటూ మౌనంగా నడుస్తోంది నీలిమ.
ఓ పది నిమిషాలు నడిచారు. వెనకనుంచి దేవస్థానం బస్సు వస్తోంది. చెయ్యెత్తి ఆపమన్నట్టుగా సంజ్ఞ చేసింది నీలిమ.
బస్సాగింది.
"ఓ.కే. నీలిమా, థ్యాంక్స్ నా ఫోన్ నెంబరూ, ఎడ్రసూ ఇచ్చాను కదా. హైదరాబాద్ వస్తే కలవండి. ఒక వేల నేను తిరుపతిలో వుంటే, మిమ్మల్ని కలుస్తాను...." గబగబా అనేసి బస్సెక్కేసాడు అరవింద్.
వెళ్తున్న బస్ వేపు చూస్తూ నిల్చుంది నీలిమ.
"అరవింద్ భలే గమ్మత్తయిన మనిషి వండర్ బాయ్" అకస్మాత్తుగా నీలిమ పెదవుల మీదకో నవ్వొచ్చింది.
ఈ విచిత్రమైన స్వయంవరంలో తను ఎన్నుకున్న వ్యక్తి అరవింద్.
* * * * *
"ఇప్పుడు అరవింద్, నీలిమ పక్కపక్కన నడుస్తున్నప్పుడు చూసావుకదా. అరవింద్ ఇంటిమేట్ జోన్ లోకి వెళ్లిపోయినట్టుంది కదూ నీలిమ" ముగ్దని అడిగింది సురభి.
"కరెక్ట్ నేనూ అదే ఆలోచిస్తున్నాను. నీలిమ రాగానే మనకు అరవింద్ గురించే చెప్తుంది చూడు" ముగ్ధ అంది.
అదే సమయంలో రోడ్డుని దాటి కాటేజ్ వేపు వస్తోంది నీలిమ.
"అరవింద్ వెళ్లిపోయాడా?" ఆత్రంగా అడిగింది అలక.
"ఒక అరగంట తర్వాత కాని ఏ విషయమూ మనకు తెలీదు." అంటూ కుర్చీలో చేరబడింది నీలిమ.
అరగంట గడిచింది.
నలుగురు అమ్మాయిలూ ఫోన్ వేపే చూస్తున్నారు.
నీలిమకు మరీ! ఆత్రంగా వుంది.
సరిగ్గా ఓ గంటన్నర తర్వాత పోలీస్ జీపొచ్చి ఆ కాటేజ్ ముందు ఆగింది.
ఇన్ స్పెక్టర్ పరుగు పరుగున వచ్చాడు.
"నన్నో అరగంట క్రితం వదిలేసి, ఆ వ్యక్తి వెళ్ళిపోయాడండి".
నెమ్మదిగా చెప్పింది నీలిమ.
"మారావిషయం వెంటనే మాకెందుకు రిపోర్టు చెయ్యలేదు" కోపంగా అడిగాడు ఇన్ స్పెక్టర్.
"ఎన్నిసార్లు ఫోన్ చేసినా పోలీస్ స్టేషన్లో ఎవరూ ఫోన్ లిఫ్ట్ చెయ్యడంలేదు." టక్కున అబద్దం ఆడింది ముగ్ధ.
"అందరూ బయటుంటే, స్టేషన్లో ఎవరుంటారమ్మా ఆ కేంటీన్ దగ్గరే వుంటానని చెప్పాను గదా" విసుక్కుని ఎంత వేగంతో వచ్చాడో అంతే వేగంతో జీపు దగ్గర కెళ్ళాడు ఇన్ స్పెక్టర్ ఏ గొడవ జరగనందుకు అమ్మాయిలందరూ ఊపిరి పీల్చుకున్నారు.
అరవింద్ క్షేమంగా తిరుపతి టౌన్ చేరివుంటాడా? లేదా?
ఫోన్ చేస్తానన్నవాడు ఇంతవరకూ ఫోన్ చెయ్యలేదు?
దారిలోగానీ పోలీసులు పట్టుకోలేదు గదా? ఎన్నెన్నో ప్రశ్నలు?
ఏదో భయంగా వుంది నీలిమకు.
-సాయంత్రం అయిదు గంటలైనా అరవింద్ దగ్గర్నించి ఫోన్ రాలేదు. ఆ భయం మరీ ఎక్కువైంది. కాటేజ్ వరండాలో ముగ్గురూ కూర్చుని సీరియస్ గా ఆలోచిస్తున్నారు.
గజిబిజిగా తిరుగుతున్న వ్యక్తి మాత్రం నీలిమ.
"నేను జయాధ్యక్షను కలిసొస్తాను." కుర్చీలోంచి లేస్తూ అందరికీ వినబడేటట్టు అంది అలక.
"విష్ యూ ఆల్ ది బెస్ట్." సురభి టక్కున అంది.
"మళ్ళీ ఎన్ని గంటలకొస్తావ్. నువ్వు ఎర్లీగా వస్తే అందరం కల్సి డిన్నర్ చేద్దాం" ముగ్ధ అంది.
"ఒక గంటలో వచ్చేస్తాను" హుషారుగా హేండ్ బ్యాగ్ తీసుకుని మెట్లు దిగింది అలక.
అలక ఒంటరిగా జయాధ్యక్ష దగ్గరకెళ్తుంటే ముగ్గురమ్మాయిల్లో ఏదో తెలీని అలజడి చోటు చేసుకుంది.
కానీ రోడ్డుమీద నడుస్తున్న అలక మనసు మాత్రం పురి విప్పిన నెమలిలా వుంది.
* * * * *
గెస్ట్ హౌస్ లో జయాధ్యక్ష ఆత్రంగా అలక కోసం ఎదురుచూస్తున్నాడు. మొట్టమొదటిసారి ఇష్టపడిన మగవాడి దగ్గరకెళ్ళే టీనేజ్ అమ్మాయిలు అన్న టైముకన్నా ముందే మీటింగ్ పాయింట్ కొస్తారు. ఆ విషయం బాగా తెల్సు జయాధ్యక్షకు.
మరి అలక ఇంతవరకూ రాలేదు. ఎందుచేత? రకరకాలుగా ఆలోచిస్తున్నాడు జయాధ్యక్ష.
తన అనుభవం ప్రకారం, తన అంచనా ప్రకారం మతో ఐదు నిమిషాల్లో అలక తన దగ్గరకొస్తుంది. అలక రాగానే ఏం చేయాలో, ఎలా ఆమెను సమ్మోహితురాల్ని చెయ్యాలో అప్పటికే నిర్ణయించుకున్నాడు జయాధ్యక్ష.
ఆడపిల్లలు ఏ మాటలకు లొంగిపోతారో, ఏ చేష్టలకు ఆకర్షణను ఇంకా పెంచుకుంటారో, వాళ్ళను ఎలా మెస్మరైజ్ చెయ్యాలో జయాధ్యక్షకు బాగా తెలుసు.
అతడికి అప్పటికే ఎంతోమంది ఆడపిల్లలతో సంబంధాలున్నాయి. అతనెక్కడ, ఎప్పుడుంటాడో, ఏం చేస్తుంటాడో ఎవరికీ తెలీదు. కానీ దేశంలోని ముఖ్యమైన పట్టణాల్లో అతనికి గర్ల్ ఫ్రెండ్స్ వున్నారు. అందులో పెళ్ళయిన వాళ్ళూ వున్నారు. అది విచిత్రం.
కానీ ఒకరి విషయం ఒకరికి తెలీకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. ఆ జాగ్రత్తల్ని అతని భాషలో చెప్తే, అందం కోసం తీసుకునే అందమైన జాగ్రత్తలు.
నువ్వు ఇష్టపడిన అమ్మాయిని ముందు జాగ్రత్తగా అబ్జర్వ్ చెయ్యి ఆ అమ్మాయి ఏ వర్గానికి చెందింధో నిర్ధారించుకోవడం ముఖ్యం, ఆ తర్వాత ఆ అమ్మాయి వయసు, ఇష్టాలు, దుస్తులు, ఫ్యాషన్ల పట్ల ఆ అమ్మాయికున్న అభిరుచి, నువ్వంటే ప్రత్యేకంగా ఎందుకు ప్రేమగాని, అభిమానంగానీ చూపుతుంధో తెలుసుకో.
ఏ వయసు వాళ్ళయినా స్త్రీలు మొట్టమొదట పొగడ్తలకు లొంగిపోతారు. ప్రేమలో ఇది మరీ ముఖ్యం. మరీ అతిగా పొగిడితే అసలుకే మోసం. మళ్ళీ నువ్వు పొగిడితే బావుణ్ణు అని అన్పించేటంత మాత్రమే నీ పొగడ్త వుండాలి. ఆ అమమయిని తప్ప, మరే అమ్మాయిని నువ్వు కన్నెత్తి చూడవు. పన్నెత్తి మాట్లాడవు అనే విషయం స్పష్టంగా ఆ అమ్మాయికి నీ చేష్టల ద్వారా తెలపాలి. అప్పుడు నిన్ను అభిమానించే అమ్మాయి ఎప్పుడూ నీ చుట్టూరానే తిరుగుతుంది.