Previous Page Next Page 
ముగ్ధ పేజి 19

 

     -ఇలాంటివెన్నో అందమైన జాగ్రత్తలు తీసుకుంటాడు జయాధ్యక్ష.
    
    "బాటిల్ తెచ్చాను. కాసేపు కాలక్షేపం చేద్దామా? ఆ అమ్మాయి రాగానే వెళ్ళిపోతాను" జయధ్యక్షకు ఎదురుగా కూర్చున్న అతని ఫ్రెండ్ అన్నాడు.
    
    "డ్రింక్ ప్రోగ్రాంని ప్రస్తుతానికి స్కిప్ చేద్దాం. ఆ అమ్మాయి ఇలా లోనికి అడుగుపెట్టగానే నువ్వలా బయటికెళ్ళిపో ఓ రెండు గంటల తర్వాత రా రాత్రంతా కాలక్షేపం చేద్దాం. ఓ.కే! ఎందుకో తెలుసా? ఒక ఆడపిల్ల మొట్ట మొదటిసారి ఒక ఆకుర్రాడి దగ్గర కొస్తున్నప్పుడు, ఆ కుర్రాడు ఎంత వెకిలి వెధవైనా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఫాస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ది బెస్ట్ ఇంప్రెషన్ అని వుత్తినే అనలేదు. అందుకన్న మాట!"
    
    "ఆ అమ్మాయి నీ ట్రీట్ మెంట్ చూసి రాత్రికి వుండిపోతే" ఫ్రెండ్ నవ్వుతూ అన్నాడు.
    
    "ఎంత టీనేజ్ అమ్మాయైనా మొదటిరోజు కుర్రాడి దగ్గర వుండదు భాయ్! అలా వుండిపోయిన అమ్మాయనుకొ, ఆ అమ్మాయి టీనేజ్ అమ్మాయి కాదన్నమాట" పెద్దగా నవ్వుతూ అంటూ, ద్వారబంధం దగ్గర మెరుపులా నిలబడిన అలకవేపు చూసి విస్తుపోయాడు.
    
    కళ్ళింతగా తెరుచుకుని, గబుక్కున లేస్తూ, పెదవులమీదకు నవ్వు తెచ్చుకుని-
    
    "వెల్ కమ మిస్ అలకా! వెల్ కమ్. అయిదుగంటలనుంచి వాచీ ముల్లవేపు చూడడంతోనే సరిపోతోంది తెల్సా?" అంటూ లోనికాహ్వానించాడు జయాధ్యక్ష. అతని మిత్రుడు నెమ్మదిగా పక్కనుంచి జారుకున్నాడు.
    
    "అన్న టైమ్ కే వచ్చానుగదా" గదినీ, గదిలోని సోఫాల్నీ చూస్తూ ఓ సోఫామీద కూర్చుంది అలక.
    
    "మీరన్న టైమ్ కే వచ్చారు. కానీ నా ఆత్రుత ఆగదుకదా. రెండోసారి మిమ్మల్ని ఎంత త్వరగా చూస్తానా అనే ఆరాటం ముళ్ళలా పొడుస్తుంటే వాచి ముళ్ళవేపు చూస్తూ కూర్చున్నానన్నమాట" మగ్ లోని చల్లటి నీళ్ళను గ్లాసులో పోసి ఆమెకిస్తూ అన్నాడు జయాధ్యక్ష.
    
    నవ్వుతూ ఆ గ్లాసందుకుంది. ఆమె నీళ్ళు తాగుతున్నప్పుడు ఆమెను చూసీ చూడనట్టుగా చూస్తున్నాడు జయాధ్యక్ష.
    
    ఒకమ్మాయిని చూసి చూడనట్లుగా, చూస్తున్నట్లుగా ఆ అమ్మాయి పసికట్టేటట్టు చూస్తేనే ఆ అమ్మాయి బాగా ఆనందిస్తుంది. ఆ విషయంలో ఎక్స్ పర్టు జయాధ్యక్ష.
    
    "మీరు వినే వుంటారు యంగ్ లేడీ కాస్మోటిక్స్ కంపెనీ పేరు బొంబాయి హెడ్డాఫీసు ఆ కంపెనీ చీఫ్ పి.ఆర్.ఓ.ని నేను టూర్స్ తప్పనిసరి ఎన్నోసార్లు తిరుపతొచ్చాను నేను. ఈ  సారి మాత్రం దేవుడు నన్ను కరుణించాడు. నా ప్రార్ధన వేస్ట్ కాలేదు" సూటిగా అలక కళ్ళవేపు చూస్తూ అన్నాడు జయాధ్యక్ష.
    
    మొట్టమొదటి సిటింగ్ అప్పుడు మగవాడు స్త్రీ కళ్ళవేపు తరుచూ సూటిగా చూస్తుండాలి. అలా చూసినపుడే తన అందం ఆ పురుషుడ్ని ఆకర్షిస్తోందని స్త్రీ తెలుసుకుంటుంది. ఆనందిస్తుంది. అలక కళ్ళు దించుకుని "ఏం?"; అంది.
    
    "ఇంత అపురూపమైన అందగత్తెతో పరిచయం ఏర్పాటు చేశాడు కదా!"
    
    ఇలాంటి మాటకు స్త్రీ రెస్పాన్స్ ఒకటే మీకు బాగా పొగడ్తలు వచ్చు' ప్రపంచంలో ఏ దేశంలోనైనా, భాష వేరయినా భావం ఇదే అదే మాట అంది అలక.
    
    "మీరబద్దం ఆడకండి. మీ ఫ్రెండ్స్ ఎవరూ ఈ మాట మీతో అనలేదా? అనకపోతే నేనంటున్నాను వినండి రెస్టారెంట్లో ఫాస్ట్ టైమ్ మిమ్మల్ని చూడగానే బ్రిగెట్టా జ్ఞాపకం వచ్చింది తెల్సా? హైదరాబాద్ సాలార్ జంగ్ మ్యూజియంలోని రెబెకా బ్యూటీ జ్ఞాపకం వచ్చింది తెల్సా?" అద్భుతమైన అందగత్తెలతో తనను పోల్చి పొగుడుతున్నపుడు స్త్రీ మాట్లాడలేదు మౌనంగా ఉబ్బితబ్బిబ్బవుతుంది.
    
    అలాంటి పరిస్థితిలోనే వుంది అలక.
    
    తనకు తెలిసిన ఒక్కొక్క బాణాన్ని వేస్తున్నాడు జయాధ్యక్ష ఆ ఉచ్చులోకి వెళ్లిపోతోంది అలక.
    
    ఎన్నెన్నో సరదా జోకులు చెప్పాడు. బొంబాయి యాడ్ వరల్డ్ లోని వింతలూ విశేషాలూ చెప్పాడు. తనకు పరిచయమున్న మోడల్స్ గురించి చెప్పాడు. యాక్టర్స్  గురించి చెప్పాడు.
    
    మధ్య మధ్యలో అలక అభిరుచులన్నిటినీ తెలుసుకుంటున్నాడు.
    
    "నా ప్రొఫెషన్ కి సంబంధించి నేనెంతోమంది అమ్మాయిల్తో డీల్ చెయ్యాల్సివుంటుంది. కానీ మీలాంటి అందాన్ని నేనెప్పుడూ చూడలేదు. మీరే గనక బొంబాయిలో వుంటేనా, రేఖ మీ కాలి గోరుకు సరిపోదు తెలుసా?" ఆ మాటంటూ ఆమె ముఖంవేపు చూశాడు.
    
    అలక పని అయిపోయింది. ఆ పొగడ్తతో కిందపడిపోయింది.
    
    అర్జంటుగా జయాధ్యక్షతో కలిసి ఇప్పుడే బొంబాయి వెళ్ళిపోవాలనుంది అలకకి.
    
    సంతోషపు అలలమీద వూగుతోంది అలక.
    
    నెమ్మదిగా గంటన్నర గడిచింది.
    
    "బాగా పొద్దుపోయింది. నే వెళ్తాను" వెళ్ళడానికి ఇష్టం లేక పోయినా అంది అలక.
    
    "మీ ఫ్రెండ్స్ బెంగపెట్టుకుంటారా? డిన్నర్ చేసి వెళ్దురుగాని" ఆ మాటకు ఏమనాలో తోచలేదు అలకకు.
    
    "మీరెన్ని రోజులుంటారిక్కడ?" అడిగింది అలక.
    
    "మీరుండమంటే ఎన్ని రోజులైనా వుంటాను."
    
    ఆ మాటకు సిగ్గుపడింది అలక.
    
    "ఉంటానన్నారు కదా! డిన్నర్ ఈ సారి వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుంటారు" లేచి నిలబడింది అలక.
    
    "ఓ.కే! మీ ఇష్టం మీరు కన్పించకపోయినా ప్రతి గంటకు మీ వాయిస్ విన్పిస్తే ఆనందిస్తాను మీరూ, మీ వాయిస్ రెండూ వుంటే మరీ ఆనందిస్తాను."
    
    సిగ్గుపడుతూ ద్వారబంధం వరకూ వచ్చి ఆగింది అలక.
    
    "నా కార్లో డ్రాప్ చెయ్యనా?"
    
    "నో థాంక్స్!"
    
    ఆ మాటంటూ అక్కడ నిలబడిన పోలీస్ ఇన్ స్పెక్టర్ని చూసి ఉలిక్కిపడింది అలక.

    ఈ సమయంలో ఇక్కడ పోలీస్ ఇన్ స్పెక్టర్? మధ్యాహ్నం తమ కాటేజ్ కి వచ్చిన ఇన్ స్పెక్టర్ అతను ఇన్ స్పెక్టర్ వెనుక ఓ నలుగురు పోలీసులు.
    
    "మిస్టర్ జయాధ్యక్ష! యూ ఆర్ అండర్ అరెస్ట్."
    
    జయాధ్యక్ష ముఖంలో ఒక్కసారి నెత్తురు ఇంకిపోయింది. అతను వెలవెలబోయాడు.
    
    "వాటీజ్ దిస్? మిస్టర్ ఇన్ స్పెక్టర్! ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు?" ఆ గొంతులో వెనకటి గాంభీర్యం లేదు.
    
    "ఎందుకో స్టేషన్ లో చెప్తాను. ముందు నడవండి" అలక వేపు అనుమానంగా చూస్తూ అన్నాడు ఇన్ స్పెక్టర.
    
    అలకకు ఏం చేయాలో తోచలేదు.
    
    కళ్ళముందే ఓ బంగారుకల కరిగిపోతున్నట్టుగా వుందామెకు. కళ్ళ ముందే ఊహల నెమలిపించం రెక్కలు రాలి, బూడిదలో కలిసిపోతున్నట్టుగా వుందామెకు.
    
    "మా బిజినెస్ లో ఇలాంటివి మామూలే డోంట్ వర్రీ మీరెళ్ళండి నేను రేపు ఉదయం వచ్చి కలుస్తాను" ధైర్యాన్ని తెచ్చుకుని అలకతో అన్నాడు.

 Previous Page Next Page