ఏదో జీపు వచ్చి ఆగిన శబ్దం విన్పిస్తే చెప్పడం ఆపింది ముగ్ధ.
అందులోంచి దిగిన ఇన్ స్పెక్టర్ చేతుల్ని వెనక్కి పెట్టుకుని నడుచుకుంటూ వస్తున్నాడు.
వాళ్ళుముగ్గురూ తమవేపు వస్తున్న ఇన్ స్పెక్టర్, ఆ వెనకవున్న పోలీస్ కానిస్టేబుల్స్ వేపు ఆశ్చర్యంగా చూసారు.
"ఆ ఇన్ స్పెక్టర్ కి సుపీరియారిటీ కాంప్లెక్స్ వుందంటావా" గొణిగింది అలక.
"మీరేనా యూనివర్సిటీ అమ్మాయిలు? మీతోపాటు వచ్చిన నాలుగో అమ్మాయినేనా కిడ్నాప్ చేసారు?" భీకరంగా వుంది ఆ ఇన్ స్పెక్టర్ గొంతు. ముగ్గురూ తలూపారు.
"మరి ఆ విషయాన్ని మాకెందుకు రిపోర్టుచేయలేదు?" ఇన్ స్పెక్టర్ ప్రశ్నకు వాళ్ళ ముగ్గురి దగ్గర సమాధానంలేదు. ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు.
"ఆ... వాళ్ళు ఈ కాటేజీల్లోనే ఎక్కడో ఒకచోట వుంటారు. నానుంచి ఆ అరవింద్ ఎక్కడికి తప్పించుకని పారిపోలేడు. బైదిబై మీ ఫ్రెండ్ కేం జరగలేదులెండి. తిరుమలని మొత్తం సీల్ చేసాం. అన్ని దారుల్లోనూ పోలీసులు కాపలా కాస్తున్నారు. సెర్చింగ్ స్టార్టయింది. పోలీసులు అన్ని కాటేజీల్ని వెతుకుతున్నారు. మీలో ఒకరు మా ఆవెనక స్టేషన్ కు రండి. కంప్లయింట్ నోటు చేసుకుంటాం."
నాలుగు వేపులా పరిశీలనగా చూస్తూ అన్నాడు ఇన్ స్పెక్టర్.
ముగ్ధ లేచి నిలబడింది. ఇన్ స్పెక్టర్ ముందుకి కదిలాడు. ఐదు నిమిషాల తర్వాత జీప్ కదిలింది. మళ్ళీ అరగంట తర్వాత ముగ్దని ఆ కాటేజ్ ముందు డ్రాప్ చేసేసి పోలీస్ జీపు వెళ్లిపోయింది.
"ఏమిటే ఈ గొడవ? ఈ కిడ్నాప్ వ్యవహారం ఏమిటి?" కంగారుగా అడిగింది సురభి, ముగ్దని.
"ఆ ఎదురుగుండా కాటేజ్ లోనే నీలిమ వుందని చెప్పేస్తే సరిపోయేది కదా" అసహనంగా అంది అలక.
"చెప్పేస్తే సరిపోయేది. ఆ కిడ్నాప్ చేసినవాడు ఎలాంటివాడో తెలీదు కదా" ముగ్ధ ఏదో చెప్పబోతుండగా ఫోన్ మోగింది.
వెంటనే రిసీవర్ ఎత్తింది ముగ్ధ.
"ఆ.... నేనే నీలిమను పోలీసులు వచ్చివెళ్ళారుకదూ ఇన్ స్పెక్టర్ ఏమడిగేడు."
"నా చేత కంప్లయింట్ రాయించుకున్నాడు. సెర్చింగ్ ప్రారంభమయింది. కాటేజ్ లన్నీ వెతుకుతున్నారు. నీకేం ప్రమాదంలేదు కదా..."
"నాకేం ప్రమాదం లేదుగానీ, అరవింద్ ఇక్కడనుంచి తప్పించు కోవడానికి మన కోపరేషన్ కావాలి. ఈ కాటేజ్ చుట్టుపక్కల పోలీసులున్నారా? జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చెప్పండి. మరో ఐదు నిముషాల తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తాను" ఫోన్ పెట్టేసింది నీలిమ.
వెంటనే ముగ్గురమ్మాయిలూ లేచి, ఆ కాటేజీలకొచ్చే మూడు దార్లనూ నిశితంగా పరిశీలించారు. అక్కడకు ఓ కిలోమీటరు దూరంలో మాత్రం పోలీసులు హడావుడిగా తిరుగుతున్నారు.
మళ్ళీ ఐదు నిమిషాల తర్వాత ఫోన్ మోగింది.
"పోలీసుల సెర్చింగ్ మొదలయింది. ఈ కాటేజీల దగ్గర లేరు. కానీ దూరంగా కాంటిన దగ్గరున్నారు" చెప్పింది ముగ్ధ.
"అయితే... మేం ఈ కాటేజ్ లోంచి మన కాటేజ్ లో కొస్తాం. బీ కేర్ ఫుల్."
పది నిమిషాలు గడిచాయి.
75వ నెంబర్ కాటేజ్ తలుపులు తెరచుకున్నాయి. అందులోంచి మొదట నీలిమ బయటకొచ్చింది. ఆ తర్వాత అరవింద్. అరవింద్ చేతిలో చిన్న సూట్ కేసు గబగబా ఇద్దరూ నడుచుకుంటూ అమ్మాయిలున్న కాటేజ్ దగ్గరకొచ్చారు. అరవింద్, నీలిమ లోనకెళ్ళారు.
అరవింద్ వేపు ముగ్గురమ్మాయిలూ పరీక్షగా చూసారు.
"గుడ్డివాడు కాదే" ఆశ్చర్యంగా అంది అలక.
వారిద్దరి వెనక ముగ్గురమ్మాయిలూ లోనకు వెళ్ళారు.
"చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ ని పోలీసులు అరెస్టు చేసారు. అందుకే ఈ కిడ్నాప్ నాటకం మేంకూడా మీలా స్టూడెంట్స్ మే మీ కోపరేషన్ నాక్కావాలి. బహుశా పోలీసులు నన్ను పట్టుకోడానికి తీవ్రంగా గాలింపు ప్రారంభించొచ్చు. అంచేత ఇక్కడనుంచి నేనుబయట పడేవరకూ మీరు నాకు హెల్ప్ చేయాలి. ఒకపావు గంటలో పోలీసులు ఈ ఏరియాకి రావచ్చు. వాళ్ళని మీరు మిస్ గైడ్ చేస్తే చాలు నీలిమ కోపరేషన్ తో నేను తప్పించుకుంటాను. ఓ.కే." కంగారుగా చెప్పాడు అరవింద్.
రౌడీయో, దొంగో, ఛార్లెస్ శోభరాజో అనుకున్న ఆ కుర్రాడు కూడా యూనివర్శిటీ స్టూడెంట్ అనగానే ఆ ముగ్గురమ్మాయిల భయం తగ్గింది.
"మీరు బయట చిట్ చాట్ చేస్తుండండి చాలు." చెప్పాడు అరవింద్.
ముగ్ధ, అలక, సురభి మళ్ళీ మామూలుగా వచ్చి కూర్చున్నారు.
"పోలీసుల్నించి అరవింద్ ఎలా తప్పించుకుంటాడు?" సురభి అంది.
"చూద్దాం ఇదేదో సినిమాలా వుంది కదూ." అంది అలక.
అదే సమయంలో పోలీస్ జీప్ వచ్చి ఆగింది. ఇన్ స్పెక్టర్, పోలీసులూ గబుక్కున జీపుదిగి 75వ నెంబరు కాటేజ్ వేపు నడిచారు. ఆ కాటేజ్ లో మూలమూలల్ని వెతికి బయటికొచ్చి, ముగ్గురమ్మాయిల దగ్గర కొచ్చారు.
"కొంతమంది కుర్రాళ్ళు ఆ కాటేజ్ లో దిగారని దేవస్థానం వాళ్ళు మాకు ఇన్ ఫర్మేషన్ ఇచ్చారు. ఆ కాటేజ్ నుంచి ఓ అరగంటక్రితం ఎవరో బయటకు ఫోన్ చేసారట, కానీ ప్రస్తుతం ఆ కాటేజ్ లో ఎవరూ లేరు. మీ ఫ్రెండ్ ని ఆ అరవింద్ ఆ కాటేజ్ లోకి తీసికెళ్ళడం మీరు చూడలేదా?" అడిగాడు ఇన్ స్పెక్టర్.
"లేదు సార్ మా నీలిమను, ఆ అరవింద్ చేయి పట్టుకుని కేంటిన్ పక్క గార్డెన్ వేపు లాక్కుపోయాడు సర్." ముగ్ధ అమాయకంగా చెప్పింది.
ఇన్ స్పెక్టర్ ఆ ముగ్గురు ముఖాలవేపు నిశితంగా చూసాడు.
"ఐ.సీ. ఏ అనుమానం వచ్చినా ఆ కాంటిన్ దగ్గరే నేనుంటాను. ఒక్క అరగంటలో మీ ఫ్రెండ్ మీ దగ్గరుంటుంది. డోంట్ వర్రీ."
జీపెక్కాడు ఇన్ స్పెక్టర్ జీపు కదిలింది.
ముగ్గురూ ఊపిరి పీల్చుకున్నారు.
ఆ విషయం చెప్పడానికి లోనికెళ్ళింది ముగ్ధ.
గదిలోకెళ్ళిన ముగ్ధ, అరవింద్ రూపాన్ని చూసి ఆశ్చర్యపోయింది. పంచె, పల్లెటూరివాళ్ళు వేసుకునే జుబ్బా, జుత్తుకి, మీసాలకు అక్కడక్కడ తెల్లరంగు వేసుకున్నాడు.
యాభైఏళ్ల పల్లెటూరి వ్యక్తిలా వున్నాడు అరవింద్.
"ఎలా వుంది వేషం?" నీలిమ వేపు చూసి అన్నాడు అరవింద్.
"సుపర్బ్."
"బస్టాండ్ వరకు వచ్చి దిగబెడితే చాలు నేను తప్పించుకోగలను." అన్నాడు అరవింద్.
"అలాగే" ముగ్ధవేపు చూస్తూ అంది నీలిమ.
అప్పటికి సాయంత్రం అయిదు గంటలైంది.
శీతాకాలం కావడం వల్ల చలి మొదలైంది. దాంతోపాటు త్వరగా చీకటి పడింది.
"ఓ.కే. మనం బయటపడదామా" అరవింద్ అన్నాడు. అటూ ఇటూ నిశితంగా పరిశీలించి, కాటేజ్ లోంచి బయటికొచ్చాడు అరవింద్ - అరవింద్ పక్కన నీలిమ.