Previous Page Next Page 
అక్షరయజ్ఞం పేజి 17

  

       అప్పుడు రాత్రి పదిగంటలవుతోంది.
   
    మాధుర్ పిచ్చెక్కినట్లు తిరుగుతున్నాడు..... ఇప్పుడు తనెంతో కొంత సంపాదిస్తే తప్ప తన తల్లిదండ్రుల్ని పోషించుకోలేడు. అలా ఆలోచిస్తూ రాత్రి పదకొండు గంటలకు ఓ చిన్న హోటల్ లోకి వెళ్ళి నిస్త్రాణగా ఓ మూల కూర్చుండిపోయాడు.
   
    బాగా ఆకలేస్తోంది. కళ్ళు తిరుగుతున్నట్లుగా వుంది. ఏదో ఒకటి, ఎంతో కొంత తింటే తప్ప అడుగుకూడా వేయలేడు.
   
    తెగించి నాలుగైదు ఐటమ్స్ కి ఆర్దరిచ్చాడు.
   
    పావుగంటలో అన్నీ వచ్చేశాయి.
   
    ఆకలిముందు ఆలోచన నిలబడలేకపోయింది.
   
    ఆత్రంగా పావుగంటలో అన్నీ ఖాళీ చేశాడు.
   
    ఆకలి తీరాక ఆలోచన మొదలైంది- బిల్లు ఎలా పే చేయాలి!
   
    కేష్ కౌంటర్ కేసి చూశాడు...
   
    అక్కడ ఓ వ్యక్తి సీరియస్ గా డబ్బు లెక్కేసుకుంటూ కనిపించాడు. అతడి ముందో టేబులుంది. దానిమీద నాలుగు పెద్ద పెద్ద ప్లేట్స్ లో వివిధ రకాల ఐటమ్స్ సర్దివున్నాయి.
   
    అంతలో సర్వర్ బిల్లు తెచ్చిచ్చాడు.
   
    దాన్ని ఓసారి చూసి సీరియస్ గా లేచి కౌంటర్ దగ్గరకు వెళ్ళాడు.
   
    బిల్లిస్తాడేమో అని అతను మాధుర్ కేసి చూశాడు.
   
    "ఈ బిల్లులో పదిన్నర రానుంది. మీ హోటల్ ఐటమ్స్ చాలా బావున్నాయి..."
   
    మాధుర్ ప్రశంసకు ఆ హోటల్ యజమాని పరమానంద భరితుడయ్యాడు. అంతలోనే అతడి కళ్ళల్లో లీలగా గర్వం తొణికిసలాడింది.
   
    దానికోసమే.... ఆ భావం అతడి ముఖంలో పలకాలనే మాధుర్ అలా మాట్లాడాడు.
   
    "ఈ చుట్టుప్రక్కల ఎవరూ మనతో పోటీగా ఐటమ్స్ వండించలేరు. మంచి నికార్సయిన యాపారం. మన దగ్గర మోసాలు, గీసాలు వుండవు..." అతను గొప్పగా చెప్పాడు.
   
    "నిజమే... మీరన్నది అక్షరాల నిజం. హోటల్ వ్యాపారంలో అంత నిజాయితీగా వుండటం చాలా అరుదు. ఇప్పుడు రాత్రి పదకొండు గంటలు దాటిపోయింది.
   
    మాధుర్ ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అతనికి అర్ధంకాక.... "ఇంతకీ ఏమంటావు..?" అన్నాడతను.
   
    "ఎంతో రుచిగా, శుచిగా వండించినా మీ వంటకాలింకా మిగిలిపోయాయి. రేపటికివి పనికిరావు... ఎందుకిలా జరుగుతోందంటారు?...."
   
    అప్పుడాశ్చర్యపోయాడతను.... అతనికీ మాధుర్ మాటలు నిజమే అనిపించాయి.
   
    తెలియదే అన్నట్టు అతను పెదాలు విరిచాడు.
   
    "ఎందుకో నేను చెప్పనా?..."
   
    "ఊ... చెప్పు..."
   
    "ఏ వ్యాపారానికైనా పబ్లిసిటీ ఆక్సిజన్ లాంటిది. అది కరువయింది నీ వ్యాపారానికి... అది సరిగ్గా చేయగలిగితే సాయంత్రానికే నీ ఐటమ్స్ అన్నీ ఖాళీ అయిపోతాయి..."
   
    "నిజమేననుకోండి. కానీ ఎలా?" అతను సాలోచనగా అన్నాడు.
   
    "పదిన్నర రూపాయలెక్కువా? పదివేలు ఎక్కువా?"
   
    "పదివేలే ఎక్కువ..." అతను చప్పున అనేశాడు.
   
    "నీకు ఏ ఎమౌంట్ కావాలి?' మాధుర్ ఒక క్రమపద్దతిలో అతన్ని తన మార్గంలోకి తెచ్చుకుంటున్నాడు.
   
    "నాకేంటి.... ఎవరికయినా పదివేలే కావాల్సి వస్తుంది."
   
    "సరే... ఇప్పుడు నన్ను పదిన్నర బిల్లు పే చేయమంటారా? లేక పదివేలు ఖరీదు చేసే ఐడియా చెప్పమంటావా?"
   
    అతనో క్షణం అనుమానంగా చూశాడు మాధుర్ కేసి.
   
    బిల్లు ఎగ్గొట్టేందుకు టోకరా ఇస్తున్నాడా తనకు?
   
    మాధుర్ మొఖంలో కనిపిస్తున్న నిజాయితీకి అతను తన ఆలోచనల్ని మార్చుకుని-
   
    "నిజంగా ఆ పనిచేస్తే నేనే మీకు ఎదురు డబ్బులిస్తాను... నా వ్యాపారం నీ ఐడియా మూలంగా అభివృద్ధి చెందితే జీవితాంతం నీకు ఋణపడి ఉంటాను."
   
    సరీగ్గా వీరిద్దరి మధ్యా ఇక్కడ సంభాషణిలా నడుస్తుండగా, అదే హోటల్ లో వారికి కొంత దూరంలో గంగాధరరావు వీరిద్దర్నీ పరిశీలిస్తూ వారి మాటలు వింటూ కూర్చున్నాడు.
   
    "నాగరికత ప్రభావానికి మన వేషభాషల్లోనే కాదు... ఆహారపు అలవాట్లలో, తినుబండారాల విషయంలో చాలా మార్పులొచ్చాయి. ఎన్ని మార్పులొచ్చినా మన సంప్రదాయ తినుబండారాలు తమ ప్రాముఖ్యతను కోల్పోవు. కనుక నీ తినుబండారాలు తేలిగ్గా అమ్ముడుపోతాయి. నువ్వు చెయ్యవల్సిందల్లా నీ హోటల్ పేరు వ్రాసిన బోర్డును తిరగరాయించాలి!"
   
    "తిరగరాయించాలా? ఏం వ్రాయించాలి?" అతను ఆసక్తిగా అడిగాడు.
   
    గంగాధరరావు కూడా మాధుర్ ఎం చెబుతాడోనని ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు.
   
    "ఇదే వీధిలో కుడివేపు అరకిలోమీటరు దూరంలో ఉమెన్స్ కాలేజీ వుంది. ఎడంవేపు అరకిలో మీటరు దూరంలో జెంట్స్ కాలేజీ వుంది. ఈ రెంటి మధ్య మీ హోటల్ మీ వ్యాపారం పెరగలేదు."
   
    ఆ యిద్దరూ భరించలేని ఉద్వేగంతో ఎదురుచూస్తుండగా-
   
    "కులమత ప్రసక్తిలేని యువతీ యువకులేక్ ఈ హోటల్ లో ప్రవేశం! కృత్రిమమైన ఆహారపదార్ధాలలాగే మీ ప్రేమా కృత్రిమం కాకూడదు. స్వచ్చమైన ప్రేమికులకు మరెంతో స్వచ్చమైన సాంప్రదాయ తినుబండారాలు యిక్కడ దొరుకుతాయి.
   
    మీ ప్రేమను మీ ప్రియుడికో, మీ ప్రియురాలికో మాటలద్వారా తెలియపరచడానికి మీకు సిగ్గు, బిడియం, జంకు, భయం, టెన్షన్ అడ్డొస్తే మీ ప్రేమ ఆగిపోనక్కర్లేదు. మా తినుబండారాలు మీ ప్రియుడికో, ప్రియురాలికో అందించడం ద్వారా మీ ప్రేమను ఎంతో సున్నితంగా, తీయగా, పుల్లగా, కారంగా, ఉప్పగా తెలియపర్చుకోవచ్చు. భాషకందని భావాన్ని గుండెకందని గుబులును, మనస్సు కందని మమతానురాగాల్ని మా స్వచ్చమయిన పదార్ధాల ద్వారా తెలియపర్చుకోండి.
   
    Eye it
    Try it
    Buy it
    And it Express you feeling.
   
    హోటల్ పేరు 'లవర్స్ కార్నర్' అని పెట్టండి. నాలుగే నాలుగు రోజుల్లో మీ హోటల్ కిటకిటలాడకపోతే మీ బిల్లుకు డబుల్ పే చేస్తాను. ఓ...కే..."
   
    హోటల్ యజమాని ఆశ్చర్యంతో నోరెళ్ళబెట్టేస్తే, గంగాధరరావు ఓ విధమైన గగుర్పాటుకు లోనయ్యాడు.
   
    "నిజానికి నా దగ్గర పైసా లేదు ఆకలితో కళ్ళు తిరిగిపోతుంటే శోషవచ్చి పడిపోతానేమోనని యిలా చేశాను. నేనేదో తీసుకువస్తానని మా అమ్మా, నాన్న ఆశగా ఎదురుచూస్తుంటారు. మీ హోటల్ లో ఏదో ఒకపని చేస్తాను. ఇద్దరికీ సరిపడే భోజనం యిప్పిస్తారా?"
   
    మాధుర్ కళ్ళు తడిదేరాయి   
   
    హోటల్ యజమాని నోట మాటరాక అలాగే చూస్తుండిపోయాడు. అతని గుండె కలుక్కుమంది.
   
    దాన్ని మరోలా అర్ధం చేసుకున్న మాధుర్ "నిజమే చెబుతున్నాను.... దయచేసి నన్ను నమ్మరా? కావాలంటే మీరు నాతో వచ్చి నా కోసం ఎదురుచూసే మా అమ్మను, నాన్నను చూస్తారా...? నిజంగా నేనలాంటి వాడిని కాదు! మేం ఒకప్పుడు బాగా బ్రతికినవాళ్ళమే...." అన్నాడు భారంగా.
   
    మాధుర్ గొంతులో ధ్వనించిన జీరను అర్ధం చేసుకున్న యజమాని చటుక్కున కౌంటర్ లోంచి లేచి వచ్చి "నిన్ను నేను అనుమానించటం లేదు బాబూ! ఆశ్చర్యపోతున్నాను. ఇంకా ఈ కాలంలో నిజాలు చెప్పేవారు, నిజాయితీపరులున్నారా అని ఆశ్చర్యపోతున్నాను. నిన్ను నమ్ముతున్నానయ్యా! ఈ దేశంలో కమ్యూనిజాన్ని కమర్షలైజ్ చేసుకొని బ్రతికే బడాచోరులున్నారు. కన్నతల్లిని కూడా అవసరమైతే తమ అభివృద్ధి కోసం అమ్మే వెధవలున్నారు. అలాంటి వాళ్ళు ఎందరో తినేసి బిల్లు లెగ్గొట్టి దౌర్జన్యం చేసి, స్లోగన్స్ అరిచి వెళ్ళిపోయిన వారిని చూశాను. అందుకే బాబూ నిన్ను నమ్మడానికి కొద్దిగా టైమ్ పట్టింది....." అని సర్వర్ కేసి చూస్తూ "రెండు భోజనాలు పార్శిల్" అన్నాడు పెద్దగా.
       
    "నా ఐడియా పిచ్చిగా వుందా? కేవలం బిల్లు ఎగగొట్టడానికే ఆ ఐడియా యిచ్చానా?"
   
    మాధుర్ గిల్టీగా ఫీలవుతున్నట్టు అతను గమనించి "లేదు- నివురు గప్పిన నిప్పులాంటి నీ మేధస్సుని ఎవరూ గుర్తించలేదే అని బాధపడుతున్నాను. ఇంక నువ్వేం ఫీలవద్దు. త్వరగా భోజనం తీసుకొని వెళ్ళు..." అన్నాడతను ఆర్ద్రత నిండిన గొంతుతో.

 Previous Page Next Page