Previous Page Next Page 
మానవత పేజి 16


    మూడు జతలు సాగిపోతున్నాయి వేరువేరుగా. దూర దూరంగా. వేరువేరు గమ్యాలకు!


                                                          12


    ఫాదర్ జాన్ ఇంటికి వచ్చారు. ఎదురుగా చర్చి కనిపించింది. చర్చి చుట్టూ నీళ్ళు నిలిచాయి. గోడలను చాలావరకు ముంచింది వరద. ఇప్పుడు తీసింది. అయినా బురద కనిపిస్తూంది గోడలకు_గజం మేరకు. ఫాదర్ చూచారు. చేతులెత్తి మొక్కారు. "క్షమించు ప్రభూ! పాపులం, నిన్ను వదిలి వెళ్ళిపోయాం. చర్చికి వెల్లవేయిస్తాను. మొత్తం కడిగిస్తాను. కొత్తగా చేస్తాను, పాపులం ప్రభూ, క్షమించు" అన్నాడు. పాల్ చూస్తున్నాడు, వింటున్నాడు. "వరద వచ్చినప్పుడు అటు చూడలేదు. వరద పోయింది వేడుకుంటున్నాడు" అనుకున్నాడు. అయినా మాట్లాడలేదు. ఇంట్లో అడుగుపెట్టారు. ఇంటినిండా బురద, మట్టి మేట పెట్టింది. "మురికిగా వున్నా ఇదే నయం. ఎలా గడిపాం రాత్రి _ విశ్వాసం లేనివాళ్ళతో? ఛీ ఛీ అసహ్యం. ఏం జనం వాళ్ళు? ఎలా వున్నాం వాళ్ళల్లో?" అన్నారు ఫాదర్.
    "నాన్నా! వాళ్ళు మనకు రక్షణ కల్పించారు. నిన్ననేకదా వాళ్ళను మెచ్చుకున్నారు!" పాల్ అడిగాడు.
    "ఆపదలో అనేక మాటలంటాం, అవన్నీ లెక్కలోకి వస్తాయా? విశ్వాసంలేని వెధవలు? ఛీ ఛీ!"
    "మానవ సేవకు విశ్వాసం కావాలా? మనం వద్దన్నా చెట్లు పండ్లనిస్తున్నాయి! మేఘం వర్షిస్తూంది. సూర్యుడు ఎండ కాస్తున్నాడు. వాటికేం విశ్వాసం వుంది?"
    "నోర్ముయ్! ఏమిటా వెకిలి ప్రశ్నలు! నాస్తికులు అవుతున్నారు. ఈ కాలపు పిల్లలే అంత! నువ్వన్నది తప్పు. చాలా తప్పు, లెంపలేసుకో" అని లోనికి సాగిపోయారు ఫాదర్ జాన్. అర్థం కానట్లు తండ్రిని చూస్తూ నుంచున్నాడు డాక్టర్ పాల్.
    గోడకు క్రీస్తుపటం వుంది. అది నిర్మలంగా వుంది. అతడు అందరికీ అభయం ఇస్తున్నాడు. అతడు శత్రువును ప్రేమించమన్నాడు. దూషించిన వారిని దీవించమన్నాడు.
    ముకుందంగారు ఇంట్లో అడుగుపెట్టారు. ఇంటి నేల సాంతం బురదతో నిండింది. అడుగుపెడ్తే అంటుకుంటూంది. అడుగు గుర్తుపడుతున్నది. ఇల్లంతా జిబజిబగా ఉంది. నిలబడ వీలుకానట్లుంది. ఇంటిని చూచారు ముకుందంగారు. "ఇలా ఉన్నా ఇక్కడే బావుంది. ఆ కిరస్తానీలతో ఎలా గడిపామో రాత్రి! ఛీ ఛీ స్నానం చేయాలి. ఇంకా ఆ వాసన వదల్లేదు. ఏమిటలా వాణ్ణి పూసుకు తిరుగుతావు?" అన్నారు.
    జానకి ఆశ్చర్యపోయింది. రాత్రే మెచ్చుకున్నాడు వాళ్ళను తండ్రి. ఇప్పుడు ఈసడించుకుంటున్నాడు. స్నానం చేస్తాట్ట! స్నానం చేస్తే పోతుందేమో! ఆ మాటే అడిగింది _ మనసులో అనుకున్నట్లు కాకున్నా _ కాస్త మెత్తగా.
    "ఆపదలో అనేకం అంటాం. అవన్నీ పాటిస్తామా? అవసరం వస్తే గాడిద కాళ్ళు పట్టుకోవాలి. వసుదేవుడంతటివాడు పట్టుకున్నాడు. అలా అని గాడిదను నెత్తిన పెట్టుకుంటామా? ఊరేగుతామా?"
    "నాన్నా! గాడిద మనిషికి సాయం చేసిందనుకో. మరిచిపోతామా? అలాంటప్పుడు గాడిద మనిషికన్న మిన్న కదా?"
    "గాడిద గాడిదే! మనిషికి సాయం చేయడమేమిటి? బరువులు మోయడం దాని పని. అయ్యో మరిచాను. దేవుని గది కూలింది కదా! నా రామచంద్రుడేమైనాడో! పద పద" అని దారితీశాడు.
    దేవుని గది కూలింది. కూలిందంటే గోడలు కూలాయి. కప్పు గుంజలమీద నిలిచి ఉంది. గోడ కూలిన మట్టిలో ఉన్నాయి విగ్రహాలు. జానకి మట్టి తొలగించింది. విగ్రహాలు బయటికి తీశారు ముకుందంగారు. "స్వామీ! అపచారం జరిగింది. మన్నించు స్వామీ! నిన్నిలా వదిలి వెళ్ళిపోయాం. ప్రభూ మన్నించు, ఆపదలో అన్నీ మరచాం. నిన్నూ మరచాం, క్షమించు ప్రభూ! క్షమించు" అని లెంపలు వాయించుకున్నారు. జానకి పెదవి కదల్లేదు. మనసులో ఏం ప్రార్థించిందో మనకు తెలీదు. విగ్రహాలను భక్తిగా బయటికి తీసింది. శ్రద్ధగా తోమింది. వేరే గదిలో అమర్చింది.
    రెండు సెమ్మెలు వెలుగుతున్నాయి.
    సీతా రామలక్ష్మణులు తళతళమంటున్నారు.
    సీత చిరునవ్వు చిందిస్తూంది.
    రాముడు అభయం ఇస్తున్నాడు_అందరికీ.
    అతడు కరుణామూర్తి. కాకాసురునే రక్షించిన దయా సాగరుడు.
    జానకి భజన ప్రారంభించింది.
    ముకుందంగారు తాళం వేస్తున్నారు.
    రమాదాసి ఇల్లు కడుగుతూంది. మురికిని పారదోలుతూంది.


                                                          13


    జానకి స్కూలు నుంచి తిరిగి వస్తున్నది. వెనుక బెల్లు వినిపించింది, పక్కకు తప్పుకుంది. తిరిగి చూసింది, పాలు సైకిలు దిగాడు.
    "ఓహ్ మీరా! ఎవరో అనుకున్నాను, భయపడ్డాను"
    "అలాగా! ఇప్పుడైతే భయంలేదుగా"
    "ఇప్పుడెందుకూ భయం?"
    "ఏం! ఎందుకుండకూడదూ?"
    "మీరేగా"
    "నేనంటే భయంలేదా?"
    "ఎందుకుండాలి?"
    "మగవాణ్ణి కాబట్టి"
    "ఓహ్! అదా! మీ మగవాళ్ళంతా భయపెట్టాలని చూస్తారా?"
    "అబ్బే! అదేంలేదు, ఆడవాళ్ళు భయపడ్తారు. అంతకంటే లేదు, మేమేం పులులమా, సింహాలమా!"
    "పులులకేం, సింహాలకేం? అవేమంటాయి? పాపం అడవుల్లో వుంటాయి. మనిషినేమంటాయి? దాని దగ్గరికి పోయి పుల్ల పెడ్తే గుర్రుమంటాయి, వెకిలి వేషాలేస్తే మింగేస్తాయి, అబ్బో మీరలా కాదే! ఊళ్ళో వుంటారు, మనుషుల్లాగే కనిపిస్తారు."
    "మేం మనుషులం కామా?"    
    "ఛ, ఛ మగవాళ్ళు మనుషులా? ఎవరన్నారు? రక్కసులు! రాక్షసులు!! ఆడదాన్ని బతకనివ్వరే! చూడండి _ సింహాలు, పులులు, జంతువులు, పక్షులు_అన్నింటిలో ఆడ, మగా వుంటాయి. మగవి ఆడదానిమీద పెత్తనం చెలాయించవు, వేటి దారిన అవి ఏరుకుతింటాయి, కలిసి ఉంటాయి సుఖంగా. మగవాళ్ళలా కారు"
    "ఏమిటలా మగవారి మీద విరుచుకుపడ్తున్నారు! స్త్రీకి స్వాతంత్ర్యం కావాలి. ఆమె కలకాలం బానిసగా జీవించింది అది నేను అంగీకరిస్తాను.కాని అది మగజాతి మీద దుమ్మెత్తి పోయడంతో వస్తుందా అని ఆలోచించండి"
    "రాదు, ఒప్పుకుంటాను. మీరూ మగవారేగా! మీరూ భర్త కావలసిందేగా! మీ దృష్టిలో మీ స్త్రీకి స్వాతంత్ర్యం కలిగించటం అంటే ఏమిటో చెప్పండి"
    "ఆమె నాలాంటి మనిషి, ఆమెకూ నాకున్నట్లే కొన్ని కోరికలుంటాయి, భావాలుంటాయి, ఆలోచనలుంటాయి. ఆమె మనిషి. నేను మనిషిని, తోటి మానవుణ్ని గౌరవించినట్లు గౌరవిస్తాను. నాకు నేను ఎంత స్వేచ్చ కావాలనుకుంటానో అంత స్వేచ్చ ఆమెకూ ఉండాలి. నాకు నచ్చినవి ఆమెకు నచ్చాల్సిన పనిలేదు. ఇద్దరమూ భార్యాభర్తలం. కాబట్టి కొంత సర్దుకుపోవాలి. అందుకు ఇద్దరమూ యత్నించాలి. నేను ప్రయత్నిస్తాను. జీవితం మూన్నాళ్ళ ముచ్చట. ఈ మూన్నాళ్ళలో హాలాహలం సృష్టించడం నాకిష్టం లేదు. అమృతమే సృష్టిద్దాం అనుకుంటూ జీవితం సాగిస్తాను."
    పాల్ మాటలు జానకికి ఏదో ఆనందం కలిగించాయి. ఆమె గుండె నిండింది. పొర్లింది. ఆమెకు తెలియకుండానే మాటలు వచ్చేశాయి.
    జానకి పాల్ కళ్ళల్లోకి చూచింది. పాల్ జానకి చూపుల్ని కొల్చాడు.


                                                            14


    "పెండ్లి చేసుకుందాం"
    "ఎవరు చేస్తరు మన పెండ్లి?" అన్నాడు అమాయకంగా ఏసుదాసు.
    "అవు, పాదిరి చేస్తడా మన పెండ్లి?" అంది రమాదాసి.
    "అమ్మో! దుడ్డుకర్ర అందుకుంటడు. ఆ పెండ్లి చేస్తడు"
    ఇద్దరూ నవ్వుకున్నారు. గలగల నవ్వారు. గోదావరిలా నవ్వారు.
    "అయ్యగారు చేస్తరా మన పెండ్లి?"
    "అమ్మో! రోకలిబండ అందుకుంటడు. ఆ పెండ్లి చేస్తడు." అంది రమాదాసి.
    ఇద్దరూ మళ్ళీ నవ్వుకున్నారు. ముత్యాల్లా నవ్వారు. మల్లెపూలలా నవ్వారు.
    రమాదాసి ఆకాశాన్ని చూచిది.
    నింగి నీలంగా ఉంది, మబ్బులేదు. మసక లేదు.
    నీలపు వెలుగులా ఉంది, నిగనిగ లాడుతున్నది.
    "దాసూ!"
    "ఏం దాసీ"
    "ఆకాశం చూసినవా?"
    "చూసిన"
    "దానిదేం మతం?"
    "దానికేం మతం?"
    "దాసూ!"

 Previous Page Next Page