Previous Page Next Page 
జనపదం పేజి 16

 

    గల్లుమని గజ్జెలు మ్రోగాయి. గడీ ముందు కచ్చడం ఆగింది. ఎవరో అధికారి వచ్చాడనుకున్నారు పోలీసులు. అ టెన్షన్లో నుంచున్నారు. దిగింది రాముడే అయిన క్షణం గురించలేదు. గుర్తించి టక్కుమని సలాం కొట్టాడు సుభేదార్. ప్రతి నమస్కారం చేసి కరచాలనం చేశాడు రాముడు. ఇద్దరూ కుర్చీలో కూర్చున్నారు. బండి మనిషి పెట్టె బెడ్డింగు తెచ్చి బంకుల్లో పెట్టాడు. పెట్రోమాక్సు లైట్లు జండాలతో పాటు పేకలు కూడా తెచ్చి పెట్టాడు. వెళ్ళిపోయాడు. సుభేదారుకు సిగరెట్టు అందించి తాను సిగరెట్టు కాల్చాడు రాముడు. "ఊళ్ళ ఎట్లున్నది?" అడిగాడు రాముడు.
    "అలాగే ఉంది" ఊర్దులో సమాధానం చెప్పాడు సుభేదారు. తరువాత సంభాషణ ఊర్దులోనే జరిగింది.
    "ఏం చేయాలా? వాళ్ళు వస్తూనే వున్నారు. ప్రజలు ఇంకా వారికి సహాయం చేస్తూనే ఉన్నారు. సరేగాని ఏమో చాలా సామాను తెచ్చారు?" సుభేదారు అడిగాడు.
    "తెలీదా? గాంధీజీ విగ్రహం ప్రతిష్టించాలి. ఏర్పాట్లు చేయడానికి వచ్చాను. పనులు చాలా ఉన్నాయి. ఎలా జరుగుతాయో భయం ఏమీ లేదు కదా?"
    "భయం లేకుంటే మేమెండుకూ! అయినా మేమున్నాం కాబట్టి భయం లేదు. ఊళ్ళో అందర్నీ పట్టి చేయింతాం. ఏం ఊరో ఇంత సార బొట్టాన్న దొరకదు."
    "ఎందుకు దొరకదు? దుకాణం పెడ్తున్నాగా. నేనే పెట్టా!"
    "ఏమీ! మీరే పెట్టారూ!! బాగుంది. పేకముక్కలు కూడా తెచ్చినట్లునారు. బాగానే పోద్దుపోతుంది. ఏం ఊరో ఒక్కనికీ పేకరాదు."
    "నేర్పాలి నేర్పుదాం. పట్నం నుంచి కొంచెం తెచ్చాను. మంచి సరుకు లేవండి"
    'ఏర్పాట్లకు ప్రారంభోత్సవం పదండి."
    ఇద్దరూ గదిలోకి వెళ్ళారు తాగడానికి. తరవాత కొందరు వచ్చారు. తాగుడు ఆయిం తర్వాత పెకాటతో తెల్లవారింది.
    తెల్లావారిం తరవాత ఏర్పాట్లు మొదలైనాయి. మార్గాలు చదును చేయించడానికి ఊళ్ళో వాళ్ళ వీపులు చదును చేశారు. గ్రామం మొత్తాన్ని కదిలించారు. హాహాకారాలు లేచాయి. అయినా పనులు సాగుతూనే ఉన్నాయి. గాంధీ జయంతి మరి? పట్నం నుంచి తాపీ పనివారు వచ్చారు. గద్దె కట్టారు. ఊరు నిండా తోరణాలు వెలిశాయి. ఖద్దరు జండాలు గర్వంగా ఊగసాగాయి. లౌడ్ స్పీకర్ కూడా వచ్చేసింది. వచ్చే జీపులకు , పోయే కార్లకు విరామం లేదు. ఊరు పోలీసులతో నిండిపోయింది. తెల్లవారితే గాంధీ జయంతి.
    గాంధీ జయంతి రానే వచ్చింది. బలరామయ్యగారూ ఉదయాన్నే దిగారు. ఏర్పాట్లన్నీ చూచారు. రాముణ్ణి మెచ్చుకున్నారు. సారాయి దుకాణం ప్రారంభించాల్సిన స్థలం చూశారు. అందంగా అలంకరించబడింది. తోరణాలు కట్టారు. జండాలు చెక్కారు. బల్లలు, కుర్చీలు వేశారు. బలరామయ్యే దాని ప్రారంభోత్సవం చేయాల్సింది బాగుందనుకున్నాడు. రాముని వీపు చరచాడు.
    సాయంకాలానికల్లా పట్నం నుంచి నాయకులూ దిగారు. లౌడ్ సీకర్లో సినిమా పాటలు సాగేయి. ఊరి వాళ్ళకు అంతా వింతగా ఉంది. పిల్లలు సభా స్థలి చుట్టూ తిరగడం గంతులు వేయడం సాగించారు.
    నాయకులు గదిలో దిగారు . వారితో పాటు శివరావు దిగాడు. వారికీ ఫలహారాల ఏర్పాట్లు జరిగాయి. మాటలు, ముచ్చట్లు, చర్చలు గడీ ప్రాంతం సంబరం నింపుకుంది. ఇలాంటి ఏర్పాట్లు చేసినందుకూ, పల్లెల్లో గాంధీ విగ్రహం పెట్టిస్తున్నందుకు నాయకులంతా బలరామయ్యను అభినందించారు. తీవ్రమైన చర్చ జరిగిం తరువాత సారాయి దుకాణపు ప్రారంభోత్సవమే మొదలు జరగాలని నిర్ణయించబడింది. నాయకులంతా అక్కడకు చేరారు. వారితోనే నిండిపోయిందా ప్రదేశం వెండి కత్తెర తో రిబ్బన్ కత్తిరించాడు బలరామయ్య. కరతాళధ్వనులు మిన్నుముట్టాయి. దేశాభివృద్ధికి సారాయి దుకాణాలు చాలా అవసరమనీ ఊరూరా , ఇంటింటా ఈ దుకాణాలు ఏర్పాటు కావడానికి నిరంతర కృషి జగరగాలనీ , చిన్న ఉపన్యాసం ఇచ్చారు బలరామయ్యగారు.
    నాయకులంతా గాంధీజీ విగ్రహం దగ్గరికి చేరుకున్నారు. జనం ఎక్కువగా లేరు. ఏ కొద్ది మందో ఉన్నారు. ఊళ్ళో వాళ్ళందరినీ రావలసిందని మైక్ లో నాయకులు విన్నవించారు. అయినా ఇంకా ఇండ్లలో చాలా మంది ఉన్నారని గ్రహించాడు శివరావు. పోలీసులకు సైగ చేశాడు. ఊరు ఖాళీ చేయించి సభాస్థలిని నింపారు పోలీసులు. సభాస్థలి జనంతో కిటకిట లాడసాగింది. జనానికి భక్తీ వచ్చేసింది. మౌనంగా కూర్చున్నారు. కాని భక్తీ ఎక్కువైన చంటిపిల్లలు ఏడవసాగారు.
    ఒక పెద్ద నాయకుడు వేదిక మీద లేచి నుంచున్నాడు. బలరామయ్య ఆ నాయకునికి పూలదండ వేశాడు పెద్దది. చప్పట్లు కొట్టారు అందరూ. అతడు పూలదండ తీసి బల్ల మీద పెట్టాడు. ఒక్కసారి కలయజూశాడు. చేతులు జోడించి నమస్కరించాడు. తరువాత గాంధీజీ విగ్రహానికి మొక్కాడు. ఆ తరువాత ఆవిష్కరించాడు. ముసుగు తొలగించాడు. చప్పట్లు వినిపించాయి. లైట్ల వెలుగుకు విగ్రహం జిగేలుమన్నది.
    విగ్రహం బలరామయ్యదిలా కనిపించింది జనానికి.
    గాంధీజీ అలాగే వుండేవాడేమో అనుకున్నారు.
    నాయకునికీ అలాగే అనిపించిందేమో , ఎగాదిగా చూచాడు. వేదిక మీదికి వచ్చి ఉపన్యాసం ప్రారంభించాడు.
    "భాయియో ఔర్ బహానో!"
    "ఇది గాంధీజీ విగ్రహం ఉన్నది. గాంధీజీ శాన గొప్ప మనిషి ఉన్నడు. మహాత్ముడు ఉన్నడు. అసల్ అయన దేముడు ఉన్నడు. అంగ్రేజోళ్ళను ఎల్లగొట్టే తందుకు పుట్టిండు ఎల్లగొట్టిండు. అవతారం చాలించిండు. గాంధీజీ స్వరాజ్యం తెచ్చిండు. మన దేశం వాండ్లు రాజ్యం చేయాలన్నడు చేస్తున్నరు. నైజాం నవాబు పోయిండు. ఇప్పుడు బలరామయ్య మీకు లీడర్. అయన చెప్పింది ఇనలె. చెయ్యమన్నది .....
    "ధన్ ' మని పేలింది.
    సభాస్థలంలో పేలింది.
    వేదిక దగ్గర పేలింది.
    పోగమబ్బులా లేచింది.
    కల్లోలం చెలరేగింది. హాహాకారాలు బైల్దేరాయి  ఏమైంది? ఏం ప్రేలింది  ఎక్కడ? ఎందుకు? అది ఎవరికీ తెలియదు. అందరూ ప్రాణ రక్షణ కోసం పరిగెత్తారు. ఒకరిని ఒకరు తోసుకున్నారు. కొందరు పడ్డారు. లేచారు. పెద్దలు, నాయకులూ, పోలీసు అధికారులు గడీలో దూరి తలుపు బిగించుకున్నారు. ఊళ్ళో తలుపులన్నీ బిగుసుకున్నాయి. గడీలో జనం తనుస్తున్నారు. పోలీసులు భయం భయంగా కాపలా కాస్తున్నారు.
    గడీలో బలరామయ్య అన్నాడు. "మంది నెత్తికేక్కిన్రు మాదర్ చత్ లు"
    "ఔ చేతులుంటలేరు. సభల్నే జరిగింది అబ్బ ఎంత ధైర్నం!" అన్న పెద్ద నాయకుడు శివరావు వైపు చూశాడు.
    "కమీషన్లు వేశారు గదండీ. మరి జనం చేతిలో ఎలా ఉంటారు? మాకు శిక్షలు విధించండి. అణిగివుంటారు జనం" అన్నాడు శివరావు.
    ఒకరి ముఖాలు ఒకరు చూచుకున్నారు బలరామయ్య - వచ్చిన నాయకుడు.
    "ఏం చేద్దమంటావ్!' ఇద్దరూ ఒకేసారి అడిగారు శివరావ్ ను.
    "ఏం చేసేదేముంది! పేలిన పదార్ధం తీసి అనాలిసిస్ కి పంపుతాం. అక్కడ శాస్త్రజ్ఞులు తేలుస్తారు. అది ఎలా పేలింది? ఎందుకు పేలింది?"
    "అయితే అయ్యేదేమిటి?" బలరామయ్య ప్రశ్న.
    'అట్లయితే ఎట్లనయ్యా' నాయకుని ప్రశ్న.
    'అంతే అది రూల్సు"
    "ఇగో చూడు ఖానూన్! గేనూన్ చెప్పకు. ఏం చేస్తవో చెయ్యి. నిన్ను రక్షించే జమ్మేదారి మాది. ఏమంటారు?" నాయకుణ్ణి అడిగాడు బలరామయ్య.
    నాయకుని గుండెదడ ఇంకా ఆగలేదు. నాలుక పిడుచకట్టుకుపోతున్నది మంచినీళ్ళు తెప్పించుకొని తాగి అన్నాడు.
    "దేఖో శివరావ్ సాబ్! ఇగ నీమర్జీ , బారా ఖూన్ మాఫ్ ఎట్లన్నన్న చెయ్యి మనుషులు మన చేతులుండాలే. అ అంతే"
    "ఆ అలా ఆర్డర్ ఇవ్వండి. ఇగ చూడండి శివరావ్ ప్రతిభ' అని "కౌన్ హై అని కేక వేశాడు.
    నలుగురు పోలీసులు వచ్చి సలాం కొట్టారు.
    "అందరు లంజకొడుకాల్ను ఇళ్ళల్లోంచి లాక్కొని రండి. రానన్నవాణ్ణి చావకోట్టండి. తెలిసిందా? క్షణంలో జరగాలి. గందీబొమ్మ ముందు కూడాలి. బాంబు పేలుస్తారు! బాంబు! ! చూపిస్తా నా శక్తి" అన్నాడు.
    పోలీసుల బూట్లు టకటక లాడాయి. క్షణంలో గాంధీ బొమ్మ ముందు కేకలు, ఏడ్పులు, హాహాకారాలు, ఆక్రందనలు వినిపించాయి. శివరావుకు శివం వచ్చింది. పెద్ద కర్ర తీసుకొని జనంలో దూకాడు. "ఎవడ్రా బాంబు పేల్చింది?" అంటున్నాడు బాదుతున్నాడు. పోలీసులు లాఠీలతో బాదుతున్నారు. జనం ఏడుస్తున్నారు. మొత్తుకుంటున్నారు. తమకు తెలియదని చెబుతున్నారు. అయినా దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. రక్తం చిమ్ముతూనే ఉంది. ఎవ్వడూ ఒప్పుకోవటం లేదు. ఒప్పుకునేటట్లు లేరు.

 Previous Page Next Page