Previous Page Next Page 
డాళింగ్ పేజి 17

 

    "ఈ మధ్య మీరు మీ లేటెస్ట్ హీరోయిన్ తో తిరుగుతున్నారట."
    ఆ ప్రశ్నకు విమల్ కు తల తిరిగిపోయింది.
    "ఎవరు చెప్పారు ........." కోపంగా అడిగాడు విమల్.
    "ఎవరు చెప్పారని కాదు .........నాక్కావలసింది నిజం."
    "ఆ హీరోయిన్ పేరు ..........మాధురి .........అవునా........"
    విమల్ కి ఏం మాట్లాడాలో అర్ధం కావడం లేదు.
    "ఎప్పటికప్పుడు అన్నీ తెలుసుకుంటున్నావన్నమాట........" ఆ మాట అనేసాక, అలా అనకుండా ఉండాల్సిందనుకున్నాడు.
    "అంటే......నేను విన్నది నిజమేనన్నమాట."
    "అంటే........అక్కన్నుంచి స్పివర్క్ చేస్తున్నవన్నమాట........"
    "ఏం కోపం వచ్చిందా..........ఎక్కడున్నా నా కళ్ళు మీమీదే ఉంటాయి. గుర్తుంచుకోండి. అవును గానీ .........ఆ అమ్మాయి బాగుంటుందా.........'
    సమాధానం చెప్పలేదు విమల్.
    "నాకన్నా బాగుంటుందా........."
    సమాధానం చెప్పలేదు విమల్.
    మాధురిలో వున్న ఎట్రాక్షన్ ఏవిటో........"
    సమాధానం చెప్పలేదు విమల్.
    "నాకు ఏవున్నాయో, తనలో కూడా అవ్వే వుంటాయి........అవునా?" సమాధానం చెప్పలేదు విమల్.
    "ఏం మాట్లాడరు .........కానీ ఒకటి గుర్తుంచుకో విమల్. నాదనుకునే వస్తువు, నేను కోరుకునే వస్తువు వేపు ఎవరు చూసినా , ఇంకెవరూ కోరుకున్నా ఫలితం దారుణంగా వుంటుంది. ఆ విషయం మీకు తెల్సు. ఆ పిల్లకు ఆ విషయం చెప్పండి. ఎక్కడున్నా, ఎలా ఉన్నా......నేను మీ చుట్టూనే ఉంటాను........ప్రతిక్షణం మీ వెంటే వుంటాను , నీడలా వెంటాడతాను.........గుర్తుంచుకొండి........గుడ్ నైట్........"
    టక్ ........మని ఫోన్ పెట్టేసిన చప్పుడు..
    విమల్ వంట్లోంచి ఏదో శక్తి జరజరమని పాదరసంలా జారి పోయింది. రిసివర్ని పక్కన పడేశాడు. అలా బెడ్ మీద "దబ్" మని పడిపోయాడు.
    అతని వంటినిండా చెమట్లు పట్టేసాయి.
    మెదడంతా వేడెక్కిపోయి కాలిపోతున్నట్లుగా వుంది.
    ఏదో చీకటి గుహలో దెయ్యాల లోకంలో, ఒక్కడూ నిరాధారంగా ఉన్నట్టుగా వుంది విమల్ మానసిక పరిస్థితి.
    అతని గొంతు తడారిపోయింది. గబుక్కున లేచి టేబుల్ మీదనున్న వాటర్ జగ్ లోంచి నీళ్ళు తీసుకుని తాగాడు.
    ఏదో దాహం తీరని దాహం జగ్ ఖాళీ అయిపొయింది.
    విసురుగా వచ్చి, బెడ్ మీద అడ్డంగా పడిపోయాడు.
    ఏవో, ఏవేవో ఆలోచనలు.
    చికాగ్గా, అసహనంగా వుంది.


                                                        *    *    *    *

    మాధురి క్కూడా నిద్రరావడం లేదు.
    "రిలేటివ్ స్ట్రేంజర్స్" విడియో లో ఇంగ్లీషు మూవీ అప్పుడే అయిపొయింది. ఆ సినిమాలో కేరక్టర్లు గమ్మత్తుగా ఆమె చుట్టూ తిరుగుతున్నాయి.
    పాకిస్తాన్ లో అమ్మాయి, ఇండియా అబ్బాయి ప్రేమ కధ. బోర్డర్ సమస్య. అతికష్టం మీద బోర్డర్ దాటడానికి ఆ అమ్మాయి ఇంటిని, తల్లిదండ్రుల్ని , బంధువుల్ని అందర్నీ వదులుకుని వంటరిగా అర్ధరాత్రి వచ్చేస్తుంది.
    బోర్డర్ మిషన్ గన్లతో సైనికుల కాపలా,
    వాళ్ళని తప్పించుకుని రావాలి.
    ఒక సంకేత ప్రదేశంలో ఇండియా కుర్రవాడు వెయిట్ చేస్తుంటాడు.
    పాకీస్తానీ సైనికులు ఆ అమ్మాయిని అడ్డుకుంటారు.
    వాళ్ళ పశుకామానికి ఆ లేత అమ్మాయి బలైపోతుంది.
    అనుకున్న సమయానికి, ఆ అమ్మాయి రాకపోవడంతో , ఓ క్రమంలో సంకేత స్థలంలో ఉన్న ఇండియా కుర్రావాడు బోర్డర్ దాటి వెళ్ళడానికి బయలుదేరాతాడు.
    సగం దారిలో వెళ్ళేటప్పటికి అతనికో నల్లటి బురఖా దొరుకుతుంది. ఆ బురఖా నిండా రక్తం మరకలు.
    అంతే.
    సినిమా అయిపోతుంది.
    ఆ సినిమాలోని ఆ హీరోయినే పదే, పదే మాధురికి జ్ఞాపకం వస్తోంది.
    చక్కని ప్రేమ కధ.
    రెండు దేశాల మధ్య సమస్య. ఆ సమస్యని ప్రేమతో నుదిపెట్టారు డైరెక్టర్.
    ప్రేమ.
    ప్రేమలో ఎంత గొప్పదనం వుందో?
    అలా ఒకరి కోసం , జీవితం త్యాగం చెయ్యడంలో ఎంత అనందం వుంది.
    ఆ అమ్మాయిని వెతుక్కోవడానికి వెళ్ళే ఆ అబ్బాయి కళ్ళల్లో ఎంత ఆరాధన వుంది.
    ఆ అరధనని ఎంత గొప్పగా పిక్సరైజ్ చేసారు?
    ఆ అమ్మాయి స్థానంలో తననూ ఊహించుకుంది మాధురి.
    అలా తనకోసం ఏ రెండు కళ్ళయినా వెతుకుతాయా!
    అంత ఆరాధన తను పొందగలుగుతుందా?
    అంతగా, బతుకంతగా ప్రేమించే మనిషి తనకు దొరుకుతాడా?
    సినిమాలు, డబ్బు ఆకర్షణ పేరు, పలుకుబడి జీవితం అంటే ఇదేనా?
    ఇది కాదు జీవితం.
    జీవితం అంటే ఇంకేదో వుంది.
    ప్రేమ.
    ప్రేమ ఒక అద్బుత సౌందర్య తీరం.

 Previous Page Next Page