Previous Page Next Page 
క్లైమాక్స్ పేజి 16

తను ఇన్నాళ్ళనుంచి కలలుకంటున్న డబ్బు!
తను ఎన్నాళ్ళు గుమస్తాగిరి చేస్తే అంత డబ్బు గడించగలడు?
ఉసూరుమంది విశ్వనాధం ప్రాణం.
సూట్ విప్పి, కొక్కేనికి తగిలించాడు నారాయణమూర్తి. లుంగీ, బనీను తో సౌఖ్యంగా కూర్చుని, ఒక బ్రౌన్ కవరు తీశాడు. ఒక పెద్ద హోటల్లో పాక్ చేయించిన తినుబండారాలు నాలుగైదు రకాలు ఉన్నాయి ఆ కవర్లో.
నాకు సెండాఫ్ ఇవ్వడానికి వచ్చిన నా నలుగురు మిత్రులూ వాళ్ళు నా పార్ట్ నర్స్ అనుకోండి. వస్తూ వస్తూ ఇవన్నీ తీసుకొచ్చారు. వద్దన్నా వినిపించుకోలేదు. నేనేమన్నా బకాసురిడినా చెప్పండి ఇవన్నీ ఒక్కడినే కూర్చుని ఖాళీ చేసెయ్యడానికి? ఏదో వల్లమాలిన అభిమానం కొద్ది వాళ్ళు తెచ్చారు గానీ ............." అని నవ్వాడు నారాయణమూర్తి "మీరు నాకో ఉపకారం చెయ్యాలి. ఈ పూరీలు నేను తింటాను గానీ ఈ స్వీట్సు మాత్రం మీరు కొంచెం సాయం పట్టాలి.......ఏమంటారు?"
రసాలురుతున్న ఆ స్వీట్స్ ని చూడగానే నోరూరింది విశ్వనాధానికి. కానీ అంతలోనే ఒక అనుమానం కూడా తొంగిచూసింది.
అపరిచితులు అందించిన ఆహారం తిని స్పృహకోల్పోయి మోసపోయిన వాళ్ళు ఎందరో వున్నారు. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు కూడా.
అలాంటప్పుడు.........ముక్కు మొహం తెలియని ఈ మనిషి ఇచ్చిన స్వీట్సు తింటే.......
తన ఆలోచనకు తనకే నవ్వొచ్చింది విశ్వనాధానికి.
ఇతను ధనవంతుడు!
తను దరిద్రనారాయణుడు!
తనని మోసగిస్తే తనని చంపితే ఇతనికేమివస్తుంది?
తను ఇతన్ని చంపితే తనకి ఇతని డబ్బు వస్తుంది కానీ తనని చంపితే ఇతనికేమిటి.....?
ఒకసారిగా ఉలిక్కిపడ్డాడు విశ్వనాధం.
ఏమిటీ.......ఏం ఆలోచిస్తున్నాడు తను?
ఇతన్ని చంపితే తనకి ఆ డబ్బు చెందుతుందనా?
శివాశివా.......జన్మలో ఎప్పుడూ కూడా ఇంతటి పాపపు ఆలోచన రాలేదు తనకి! ఇవాళ ఎందుకు వచ్చింది? అనాలోచితంగానే, యధాలాపంగానే తను అలా అనుకుని వుండవచ్చు.
కానీ తన కడుపులో ఇంతటి పాపపుటూహాలు.......
"ఏమిటిలా వున్నారు?" అంటున్నాడు నారాయణమూర్తి ఆదుర్దాగా.
ఏం లేదన్నట్లు తల ఉపాదు విశ్వనాధం. తర్వాత నుదుటికి పట్టిన చెమటను తుడుచుకుని, చెయ్యి జాచి స్వీట్సు అందుకున్నాడు.
వద్దనుకుంటున్నా మళ్ళీ వచ్చింది ఆ ఆలోచన.
ఇతన్ని చంపితే ధనవంతుడయిపోతాడు . ఇతన్ని చంపితే తను.......
ఓరగా అటూ ఇటూ చూశాడు విశ్వనాధం. ఆ కేబిన్ లో నారాయణమూర్తి కాక తను ఒక్కడే వున్నాడు.
తలుపుకి అతి సమీపంలో వుంది ఆ కేబిన్.
తింటూ ఏదో చెబుతున్నాడు నారాయణమూర్తి. అన్యమనస్కంగా వింటున్నాడు విశ్వనాధం. పావుగంట తర్వాత, "పెట్టె చూస్తూ వుండండి. ఇప్పుడే వస్తాను."
అని లేచి నిలబడ్డాడు నారాయణమూర్తి.
తలపంకించాడు విశ్వనాధం.
నారాయణమూర్తి టాయిలెట్స్ వైపు నడిచాడు.
వడివడిగా ప్రవహిస్తోంది విశ్వనాధం వంట్లో రక్తం. ఎక్కువ సమయం లేదు - తక్షణ నిర్ణయం తీసుకోవాలి తను.
దయాదాక్షిణ్యాలు ఒకవైపు ........
ధనం ఒకవైపు......
కొద్దిక్షణాలు అతని మనసు అటూ ఇటూ ఉగిసలాడింది. కొద్ది క్షణాలు మాత్రమే!
తర్వాత ఒక నిశ్చయానికొచ్చి లేచి నిలబడ్డాడు విశ్వనాధం. పిల్లిలాగా టాయిలెట్స్ వైపు నడిచాడు.
ఒక టాయిలెట్ మూసి వుంది. అందులో వుండి వుండాలి నారాయణమూర్తి.
కంపార్ట్ మెంట్ తలుపు లాక్ చేసి వుంది.
లాక్ తెరిచాడు. తలుపు కూడా తెరిచాడు. ఒక్కసారి ఈదురుగాలి హొరున లోపలికి వచ్చింది.
తనని తాను బాలెన్స్ చేసుకుని, తలుపుదగ్గరే నిలబడ్డాడు విశ్వనాధం.
రెండు నిమిషాల తర్వాత టాయిలెట్ లో నుంచి బయటికి వచ్చాడు నారాయణమూర్తి. తలుపు దగ్గర నిలబడి వున్న విశ్వనాధాన్ని చూసి చిరునవ్వు నవ్వాడు "ఏమిటి ఇక్కడ నిలుచున్నారు మళ్ళీ?"
"అదేమిటి?" అన్నాడు విశ్వనాధం బయటికి చూపిస్తూ.
"ఏది?" అని తలుపు దగ్గరికి వచ్చి బయటికి మెడ సారించి తొంగిచూశాడు నారాయణమూర్తి.
అదే క్షణం రైలు ఒక వంతెన మీదికి ఎక్కింది.
చటుక్కున నారాయణమూర్తిని వెనకనుంచి తోసేశాడు విశ్వనాధం.
ఆ చివరిక్షణంలో గుర్తించాడు నారాయణమూర్తి తన మీద హత్యాప్రయత్నం జరిగుతోందని. ఒకచేత్తో తలుపుని పట్టుకుని, రెండో చేత్తో విశ్వనాదాన్ని పట్టుకోబోయాడు. అతను చాలా భారీ మనిషి, బలిష్టుడు.
మోకాలు ఎత్తాడు విశ్వనాధం. నారాయణమూర్తి పొత్తికడుపు మీద తన్నాడు.
విలవిల్లాడాడు నారాయణమూర్తి. అతని ఎడంచెయ్యి తలుపు పక్కన వున్న హండిల్ ని వదిలేసింది. రెండో చెయ్యి ఆధారం కోసం ప్రయత్నిస్తూ విశ్వనాధం నుదుటిని పైనుంచి కిందిదాకా వేళ్ళతో చీరేసింది.
ఇంకోసారి తన్నాడు విశ్వనాధం.
పెద్దగా కేక పెట్టి చీకట్లోకి జారిపోయాడు నారాయణమూర్తి. అతని చావుకేకను రైలు కూత తనలో కలిపేసుకుంది.
అతని శరీరాన్ని వంతెన కింద వున్న నది తనలో కలిపేసుకుంది.
నుదుటి మీద నుంచి ధారగా కారుతున్న రక్తాన్ని తుడుచుకుని అటూ ఇటూ చూశాడు విశ్వనాధం.

                                              14

నారాయణమూర్తిని నదిలోకి తోసేశాక, వాష్ బేసిన్ దగ్గర నీళ్ళతో మొహం కడుక్కున్నాడు విశ్వనాధం. ఇప్పుడతని మొహం మీద రక్తం కనబడటంలేదు. ఏదో గీరుకుపోయినట్లు నుదుటి మీద ఎర్రటి చార మాత్రం కనబడుతోంది. తర్వాత డబ్బు వున్న సూట్ కేసు తీసుకుని, రైలు స్టేషన్ లో ఆగగానే దిగిపోయి తన కంపార్ట్ మెంట్ లోకి ఎక్కాడు.
అది మొదలు!
అప్పటినుంచి కంటికి నిద్ర లేదు విశ్వనాదానికి. కన్ను మూస్తే చాలు, నారాయణమూర్తి చచ్చి దయ్యమై నానావిధరూపాలతో వచ్చి తనని పీడిస్తున్నట్లు పీడకలలు వచ్చేవి. అతను నిశ్చింతగా గుండెలమీద చెయ్యి వేసుకుని నిదురించి పదేళ్ళు దాటుతోంది.
ఇప్పుడు కూడా అంతే!
తనచేత చంపబడ్డ నారాయణమూర్తి వచ్చి తన కాళ్ళు పట్టుకుని బరబర ఈడ్చుకెళ్ళిపోతున్నట్లు భ్రమ కలిగింది విశ్వనాధానికి.
"ఎక్కడికి......ఎక్కడికి నన్ను లాక్కేళుతున్నావ్?" అన్నాడు కలవరిస్తున్నట్లు కీచుగొంతుతో.
"ఆపరేషన్ ధియేటర్లోకి, మీకేం భయం లేదు. మేమెందరం వున్నాం" అంది ప్రియంవద స్ట్రెచర్ పక్కన నడుస్తూ.
కానీ ఆ మాటలు విశ్వనాధం చెవులకి ఎక్కలేదు. మళ్ళీ మగత కమ్మేసింది అతన్ని.

 Previous Page Next Page