చేతులు నలుముకుంటూ అన్నాడు బదరీ నారాయణ్.
"మేంసాబ్ కి కోపం రాకపోతే ఒక్కమాట మనవి చెయ్యాలని వుంది."
మాట్లాడకుండా చూస్తోంది వైశాలి.
"భగవంతుడి అనుగ్రహంవల్ల నేను కూడా నలుగు డబ్బులు వెనకేసుకున్నాను. మీలాంటి వాళ్ళ ప్రాపకం వుంటే ఇంకాస్త పైకి పోవాలని వుంది"
"అంటే?"
"మీరు గొప్పవారు! మీరు కొత్తగా ఏదైనా వ్యాపారం అదీ పెట్టదలచుకుంటే - ఉదాహరణకి ఏ వజ్రాల గనులు కొని త్రవ్వకం సాగించడమో అనుకుందాం - నన్ను కూడా ఒక చోటా పార్ట్ నర్ గా కలుపుకోమని ప్రార్ధన!" అన్నాడు తెగించి.
నవ్వింది వైశాలి "ఇంకేమైనా చెప్పాలా?"
ఒక్క గుటకవేసి గుడ్లప్పగించి చూస్తూ అన్నాడు బదరీ నారాయణ్ "ఆ మాణిక్ లాల్ మీకు ఏమేం చేస్తానన్నాడో దానికి రెట్టింపు నేనే చేస్తాను. వాడు నమ్మదగిన మనిషికాదు. మురిక్కాలువలో బతికే పందికొక్కు గుణం వాడిది. నేను..."
అతని వాక్యం పూర్తికాకుండానే కట్ చేసేస్తూ "మళ్ళీ మంచి నగలు ఎప్పుడొస్తాయి మీ దగ్గరికి? మొన్న చూపించిన రకం సాదాసీదా నగలు కాదు. చాలామంచివి వచ్చినప్పుడు నాకు కబురు చెయ్యండి" అంది వైశాలి.
"త్వరలోనే వస్తాయి మేడం!" అన్నాడు బదరీ నారాయణ్ హీనస్వరంతో.
ఆమె నిర్లక్ష్యం అతనికి ఆమె మీద వున్న నమ్మకాన్ని మరింత పెరిగేటట్లు చేసింది.
ఒకసారి వాచ్ చూసుకుని, అతని వైపు "ఇంక వెళ్ళు!" అన్నట్లు చూసింది వైశాలి.
తప్పదని గ్రహించి, మాట్లాడకుండా దణ్ణం పెట్టి బయటకు వచ్చేశాడు బదరీ నారాయణ్. అతనికి ఉక్రోషంగా వుంది. ఊళ్ళో వాళ్ళంతా కలిసి తన సొమ్మంతా దోచుకుపోతున్నట్లు దుగ్దగా వుంది.
వజ్రాల గనులు!
ఉన్నాయని తేలిపోయింది!
లేవని అతను కూడా లేదు వైశాలి!
కానీ ఎక్కడున్నాయి అవి? ఎలా తెలుసుకోవడం? ఎవరు చెబుతారు?
అలా ఆందోళనగా ఆలోచిస్తూ వుండగా హఠాత్తుగా స్ఫురించింది అతనికో పేరు.
మెకానిక్!
ఆ పేరు గుర్తురాగానే చాలా మెంటల్ రిలీఫ్ కలిగినట్లు అనిపించింది అతనికి.
మెకానిక్ కి చెబితే చాలు, ఎవరి దగ్గరనుంచి అయినా, ఎలాంటి రహస్యాన్ని అయినా సరే కక్కించగలడు!
రకరకాల పద్దతుల ద్వారా!
ఆ రాత్రికి పిల్లిలాగా మెకానిక్ బంగళాకి బయలుదేరి వెళ్ళాడు సేఠ్ బదరీ నారాయణ్. మెకానిక్ ని కలుసుకోవడం కోసం అతను బయట వరండాలోనే గంటసేపు వెయిట్ చెయ్యాల్సి వచ్చింది. గంట తర్వాత ఒక టీనేజ్ అమ్మాయి, మొహంలో అలసట కనబడుతూ వుండగా, జుట్టు సరిచేసుకుంటూ బయటికి వెళ్ళిపోయింది.
ఆ తర్వాత పది నిమిషాలకు రెండు చేతుల్లో రెండు విస్కీ గ్లాసులు పట్టుకుని వచ్చాడు మెకానిక్. ఒక గ్లాసు బదరీ నారాయణ్ కి ఇచ్చాడు. అదే అతని పలకరింపు. అతనికి సేఠ్ బదరీ నారాయణ్ అంతకుముందు ఒక సందర్భంలో పరిచయం!
కూర్చున్న తర్వాత, చెప్పమన్నట్లు చూశాడు మెకానిక్.
చిన్న గొంతుతో చెప్పడం మొదలెట్టాడు సేఠ్ జీ.
వైశాలి అనే ఓ స్మార్ట్, డాషింగ్ గర్ల్ వుంది. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంది. యాభైవేలు అంటే ఆమె దృష్టిలో చిల్లర ఖర్చు. ఆమె బిజినెస్ మాగ్నెట్ మహాజన్ గెస్ట్ హవుస్ లో వుంటోంది. కాబట్టి ఆమె మహాజన్ కి ఏదో విధంగా దగ్గర మనిషి అయివుండాలి. తన ఉద్దేశ్యం ఆమె ఏదో మంచి రకం గ్రానైట్ దొరికే గని ఏదో కనిపెట్టిందని, బహుశ ఆ గనులున్న స్థలం యజమానికి ఇంకా ఆ విషయాలన్నీ తెలిసి వుండకపోవచ్చు. బహుశా చాలా చౌకలో ఆమె ఆ స్థలాన్ని కొట్టేస్తూ వుండవచ్చు కూడా.
తనకు కాస్తో కూస్తో తెలివితేటలు వున్నాయి కాబట్టి ఇదంతా పసికట్టగలిగాడు.
అంతేగానీ, వజ్రాల మాట ఎత్తలేదు సేఠ్ జీ. వజ్రాలున్నాయని మెకానిక్ కి తెలిస్తే, అవి తనదాకా రావు.
నిశ్చలంగా ఇదంతా వింటున్నాడు మెకానిక్. అతని మొహంలో ఏ భావమూ కనబడటం లేదు.
కానీ, వైశాలి అన్న పేరు వినగానే అతని మైండు అలర్టుగా అయిపోయింది.
వైశాలి!
వైశాలి ఎగెయిన్!!
వైశాలితో తనకు ఒక అనుభవం అయింది!
ఉత్త అనుభవం కాదు అది!
పరాభవం!!
ఆడపులి మళ్ళీ వేటకు బయలుదేరి, ఒక జంతువుని ఎన్నుకుని మాటువేసి వున్నట్లు ఈసారి ఈ సేఠ్ బదరీ నారాయణ్ ని విక్టిమ్ గా చెయ్యడానికి కొత్త ఎత్తు ఏదో వేస్తోందా వైశాలి?
ఈజ్ ద టైగ్రజ్ గెట్టింగ్ రెడీ ఫర్ అనదర్ కిల్?
సేఠ్ బదరీ నారాయణ్ మాటలు వింటూనే ఆలోచిస్తున్నాడు మెకానిక్.
తనని దెబ్బ కొట్టింది వైశాలి. దెబ్బతిన్నా కూడా ఆమె తెలివితేటలు మాత్రం తనకి నచ్చాయి. ఆమెని తన కాళ్ళ దగ్గరికి రప్పించుకుని తనివితీరా ఆమె అందాలను అనుభవించాక ఆమె తెలివితేటలనే తన సరికొత్త ఆయుధంగా మార్చుకుని పనులు సాధించదలుచుకున్నాడు.
దెబ్బతిన్న ఆవేశంలో కలిగిన ఆలోచన అది!
కానీ ఆవేశం తగ్గాక తనకి సెకెండ్ థాట్స్ వచ్చాయి.
ఆ అమ్మాయి తెలివితేటలని తను అతిగా అంచనా వేస్తున్నాడేమో అని అనిపించింది. ఆమె వేసిన ప్లాన్ కేవలం ఫ్లూక్ అయి వుండవచ్చు. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ అఫెయిర్ అయి వుండవచ్చు. తను ఆమె ఒంపుసొంపుల మైకంలో పడిపోయి చదరంగం ఆట ఓడిపోయి వుండవచ్చు.
ప్రతిసారీ ఇంత బ్రిలియంట్ గా ఎత్తులూ, ఎత్తులకి పై ఎత్తులూ వేయగాలదా ఆ అమ్మాయి?
అలా అనిపించిన తర్వాత ఒక నిశ్చయానికి వచ్చాడు మెకానిక్. ఇంకోసారి టెస్ట్ చేసి చూడాలి ఆ అమ్మాయిని.
ఈ టెస్ట్ లో కూడా ఆ అమ్మాయి తన తెలివితేటల్ని నిరూపించుకుంటే -
అప్పుడింక ఆమెని తను వశపరుచుకోవడం తప్పదు!
హర్ ఫేట్ విల్ బీ సీల్డ్!
వైశాలిని ఎలా టెస్ట్ చేయాలో తను నిర్ణయించుకునే లోపలే ఈ సేఠ్ బదరీ నారాయణ్ వెదుక్కుంటూ తన దగ్గరికే వచ్చాడు.
అనదర్ విక్టమ్ ఆఫ్ వైశాలీ!
గుడ్! ఇదే వైశాలికి రెండో టెస్టు.
సాలోచనగా తల పంకించి "నీకు ఏం కావాలి?" అన్నాడు మెకానిక్ బదరీ నారాయణ్ తో.
ఆత్రంగా అన్నాడు బదరీ నారాయణ్. "ఆ గ్రానైట్ గనులు ఏమిటో, ఎక్కడున్నాయో ఆ వివరాలన్నీ నాకు కావాలి"
"ఎందుకు?"
"నన్ను పార్టనర్ గా చేర్చుకోమని అడిగాను. ఒప్పుకోలేదు వైశాలి. అందుకని వైశాలి కంటే ముందే నేను ఆ స్థలాన్ని కొనేస్తాను."
"నాకేం వస్తుంది?"
"అది మీరే చెప్పాలి" అన్నాడు సేట్ బదరీ నారాయణ్ బలహీనంగా నవ్వుతూ తను చేసే పనులకి ఎప్పుడూ థానే రేటు నిర్ణయిస్తాడు మెకానిక్.
మెకానిక్ పెదవి కదిపేటంతలోనే ఫోన్ మోగింది.
రిసీవర్ ఎత్తాడు మెకానిక్.
"హలో గుర్తున్నావా?" అంది ఒక స్త్రీ కంఠం.
బిగుసుకుపోయాడు అతను.
ఆ గొంతుని తను ఈ జన్మలో మర్చిపోలేడు!