14. దుర్గములందు ఉండు ఉద్యోగుల వ్యయము : రెండు లక్షల నలబై రెండు వేల నలబై.
15. రాజంతఃపుర వ్యయము : ఒక లక్షా ముప్పయ్ ఒక్కవేల రెండు వందల ఎనభై తొమ్మిది.
16. మహారాణి సిద్దేశ్వరి మహాదేవి స్వంత ఖర్చులు : నాలుగు లక్షల పాతికవేలు.
17. (ఈ ఎంట్రీ కొట్టి వేసి ఉంది): -
18. యువరాజు ప్రచండభైరవుడి స్వంతఖర్చులు :రెండు లక్షల ఎనభై వేలు.
చదివి ప్రశ్నార్ధకంగా జస్వంతరావు వైపు చూశాడు రాజా.
"మహారాణి పేరుకి, యువరాజు పేరుకి మధ్య ఒక పేరు కొట్టేసి ఉండటం గమనించావా?" అన్నాడు జస్వంతరావు.
"అవును" అన్నాడు డైమండ్ రాజా.
ఇంకో ఫర్మానా చూపించాడు జస్వంతరావు.
దసరా వేడుకుల సందర్భాలో ఏలాంటి ఏర్పాట్లు చెయ్యాలో, రాచకుటుంబీకులకి జరగవలసిన మర్యాదలు, లాంచనాలు అన్ని సవిస్తరంగా రాసి వున్నాయి.
అందులో కూడా మహారాణి, పేరుకి, యువరాజు పేరుకి మధ్య వున్న ఇంకో పేరుని ఎవరో కసిగా కొట్టేసినట్లు కనబడుతోంది.
ఇంకో రెండు పురాతన పత్రాలు చూపించాడు జస్వంతరావు.
వాటిల్లో కూడా ఒక పేరు కొట్టేసి వుంది.
"వీటన్నిటిని చూసి నువ్వేం గ్రహించావ్!"
"సింపుల్! ఒక పేరు ప్రతి పత్రంలోను కొట్టేసి వుంది" అన్నాడు రాజా.
"ఆ పేరు కొట్టేసి వున్న పత్రాలు అన్నీ ఒక్కసారిగా నీకు చూపించడం వల్ల నీకు కనిపెట్టడం తేలిక అనిపించింది గాని - ఎస్టేట్ తాలూకు లక్షోపలక్షల పత్రాలలో ఈ విషయాన్ని గ్రహించడానికి నాకు ఎన్నో ఏళ్ళు పట్టింది" అన్నాడు జస్వంతరావు.
"సో?" అన్నాడు రాజా.
మార్తాండ సింహుడి పరిపాలనలో ఎవరో ఒక వ్యక్తీ తాలూకు స్మృతి చిహ్నాలని కూడా మిగలకుండా రూపుమాపాలనే ప్రయత్నం అతి తీవ్రంగా జరిగినట్లు అనిపిస్తుంది. ఆ విషయాన్నే దృష్టిలో పెట్టుకుని శోధించగా , ఎస్టేట్ పేపర్స్ లో ఇది నాకు దొరికింది. " అని శిధిలావస్థలో వున్న ఇంకో పత్రం చూపించాడు జస్వంతరావు.
అన్నాపంతులు అనే ఒక బ్రాహ్మణ పూజారి మహారాజావారి దివ్య సముఖమునకు రాసుకున్న విన్నపాలు తాలూకు పత్రం అది. కరక్కాయ సిరా అక్కడక్కడ వెలిసిపోయినట్లు ఉంది.
చదవడం మొదలెట్టాడు రాజా.
"స్వస్తి శ్రీ శ్రీ శ్రీ శ్రీ అరి వీర భయంకర, చండప్రచండ, రాయరగండ, సూర్యతేజ సమాన, సాక్ష్యాట్ వైష్తవంశ సంభూతులైన శ్రీ శ్రీ శ్రీ శ్రీ శ్రీ మార్తాండసింహ మహారాజులుంగారి దివ్య సముఖమునకు భరద్వాజస గోత్రికుడునూ, కిష్టాపంతుల చయనులగారి ద్వితీయ పుత్రుడునూ అగు అన్నాపంతులు సేయంగల విన్నపములు ..........తమ కటాక్షవీక్షణ ప్రసారముచేత ఈ గ్రామములోని యావన్మందియునూ సుభిక్షంగా నుండిరి........" ఉత్తరం మొత్తం అలా ఏవేవో స్తోత్ర పాఠాలు విన్నపములు, ఉన్నాయి. అంతే!
"ఏమిటది ?" అన్నట్లు ప్రశ్నార్ధకంగా జస్వంతరావు వైపు చూశాడు.
జస్వంతరావు చెప్పటం మొదలెట్టాడు.
"ఆ పత్రం పూర్తిగా లేదు! నిజానికి సగం చిరిగిపోయి న పత్రం ఇది! లక్షోపలక్షల పత్రాలు తిరగవేయగా నాకు ఇంకో కాగితం ముక్క కనబడింది. అది దీని తాలూకు రెండో సగం!" అని ఇంకో పత్రం అందించాడు జస్వంతరావు.
దాన్ని చదవడం మొదలెట్టాడు రాజా.
అందులో ఇలా ఉంది.
"...........యువరాణులుంగారు అయిన శ్రీ శ్రీ శ్రీ శ్రీ రాజనందినిదేవి, తమకు ప్రభువులు దయచేయు వార్షిక భత్యం మొత్తం మూడు లక్షల రూపాయలను తమ స్వంతమునకు వెచ్చించక, మా గ్రామమునకు ఇలవేల్పు అయిన శ్రీ వేణుగోపాలస్వామివారికి కైంకర్యము చేయునటుల అనతించిరి గనుకను, అందులకు మా ఊరి ప్రజానీకము యావత్ మందిని మహదానందము పొందినవారై యువరాణి వారిని చిరంజీవులుగా ఆశీర్వదించి , వారు మక్కువపడిన యుఅవకిశోరము శ్రీ శౌరి నాయకుడితో మా గ్రామములోని శ్రీ వేణుగోపాలస్వామివారి సన్నిధిలోనే కళ్యాణమాడునట్లు శుభాశిస్సులు తెలియజేయుచుండిరి. మంగళం మహాత్!!"
విజిలేశాడు రాజా.
"సో! మీరు చెప్పిన రాజమ్మ, శోరీల కదా , వాళ్ళిద్దరూ ప్రేమించుకోవడం, శౌరి దేశభక్తి , అతను ఇంగ్లీషు వారిమీద తిరగబడటం, బ్రిటీష్ వారికి తోత్తయిన రాజు మార్తాండ సింహుడు వాళ్ళిద్దరికీ దేశ బహిష్కార శిక్ష విధించడం - ఇదంతా నిజమేనన్నమాట. రాజ్యం నుంచి ఆమెని బహిష్కరించిన తర్వాత రాజమ్మ - ఉరఫ్ రాజనందిని పేరు కూడా ప్రతాలలో ఎక్కడా లేకుండా చేసే ప్రయత్నం జరిగిందన్నమాట! అందుకే రాజనందిని అని రాసివున్న ప్రతిచోటా దానిని కొట్టేశారు! యామ్ ఐ కరెక్ట్?" అన్నాడు రాజా.
"అవును! శౌరి, రాజమ్మల సంగతి నేను ఈ విధంగా కనుక్కోగలిగాను. ఇంక నువ్వు వాళ్ళ సంతానం అని ఎలా తెలిందో అదంతా ఇంకో పెద్ద కధ........దానికి ఇప్పుడు టైం లేదు......నువ్వు తక్షణం రాణీపూర్ పాలెస్ కి రావాలి" అన్నాడు జస్వంతరావు.
"కొద్దిక్షణాలపాటు పరాకులో అసలు సంగతి పర్చిపోయాను. పాలెస్ కి వస్తే చంపుతామని, అది బెదిరింపు కాదని, హెచ్చరిక అని తెలియజేయడానికే భార్గవ్ ని చంపుతున్నామని వాళ్ళెవరో చీటీ రాసి భార్గవ్ జేబులో పెట్టారు కదు.......వాళ్ళ సంగతి ముఖ్యం! పదండి! తేల్చుకుందాం" అన్నాడు రాజా కసిగా.
సిక్స్ డోర్ మెర్సిడిస్ కారు అప్పటికే రెడీగా నిలబడి ఉంది.
అందులో ఎక్కారు రాజా, జస్వంతరావు.
కారు ఎక్కీ ఎక్కగానే......
డబ్బులవల్ల వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయో జీవితంలో మొట్టమొదటిసారిగా అర్ధం అయింది రాజాకి.
ఏం జరిగిందంటే.........
డైమండ్ రాజా కారుని సమీపించేలోగానే -
వినయంగా కారు డోర్ ని తెరచి పట్టుకున్నాడు బట్లర్ అయిన ఫ్రాన్సిస్ యంగ్ హజ్బెండ్. అతను ఆంగ్లో ఇండియన్. అనేకమైన ఇంగ్లీషు పేర్లు మనకి చాలా చిత్రంగా వినబడతాయి! అండర్ టేకర్ (అంత్యక్రియలు చేయించేవాడు) ఉడ్ (కొయ్య) ఉడ్ హవుస్ , అండర్ హిల్ (కొండకింద) వైట్ , నైట్ లాక్ బేకన్ (పంది మాంసం) వగైరావగైరాలు.
సర్ ఫ్రాన్సిస్ యంగ్ హజ్బెండ్ అనే ఒక ఇంగ్లీషు భోగోళిక శాస్రజ్ఞుడు ఉండేవాడు. అయన పేరే పెట్టారు మన బట్లర్ కి.
డైమండ్ రాజా కారు దగ్గరికి రాగానే, నడుం దగ్గర నుంచి ముందుకు వంగి, అభివాదం చేశాడు బట్లర్ యంగ్ హజ్బెండ్. కార్లో ఎక్కి కూర్చున్నాడు రాజా. రాజాతో బాటే "ఆస్థానవైద్యుడు" కూడా కారు ఎక్కి రాజా భుజం దగ్గర అయిన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టు కట్టాడు.
సీట్లో వెనక్కివాలి, కర్చీఫ్ తో నుదురు తుడుచుకోబోయాడు రాజా.
తక్షణం "అలోవ్ మీ సర్! " అని తనే ఒక ఫ్రెష్ కర్చీఫ్ తీసి నుదురు తుడిచాడు బట్లర్ యంగ్ హజ్బెండ్.
"థాంక్యూ!" అన్నాడు రాజా, అంటూనే , రేగిపోయిన తన జుట్టుని రెండు చేతులతో వెనక్కి తోసుకోబోయాడు.
"ఆలోవ్ మీ సర్! అంటూ ఒక పాకెట్ కొంబ్ తీసి రాజా తల దువ్వాడు యంగ్ హజ్బెండ్.
ఈ కొత్త యజమాని తరహ అతనికి బొత్తిగా అర్ధం కాలేదు!
తన పాట యజమాని, లేట్ విక్రమదేవరావుగారికి తనే కుడిభుజంలా ఉండి, అన్ని పర్సనల్ పనులూ చేసి పెడుతూ వుండేవాడు. అందుకు తగిన మెప్పు లభించేది కూడా!
షర్టు దులుపుకోబోయాడు రాజా.
తక్షణం, యంగ్ హజ్బెండ్ తన అలవాటు కొద్ది అలర్ట్ అయిపోయి రాజాని ఫర్నిచర్ దుమ్ముదులిపినట్లు దులపడం మొదలెట్టాడు.
ఉరిమి చూశాడు రాజా.
దాంతో వెనక్కి తగ్గాడు యంగ్ హజ్బెండ్.
తను ఎక్కడ తప్పు చేశాడో అతనికి బొత్తిగా అర్ధం కాలేదు. లేట్ విక్రమదేవరావుగారు తన సర్విసెస్ ని తెగ మెచ్చుకునేవారు కూడా! ఈ కొత్త రాజాగారికి మాత్రం ఎందుకో తన సేవలు నచ్చడం లేదు.
తను డిగ్రీ పూర్తీ చేశాక లండన్ లో ఐవొర్ స్పెన్సర్ బట్లర్ స్కూల్ లో చేరి శిక్షణ పొందాడు.
అక్కడ ట్రైనింగ్ ఫీజు దాదాపు రెండు లక్షల రూపాయలు! ఆ స్కూల్లో ట్రైనింగ్ అయినవాళ్ళకి నెలకి పదినుంఛి పదిహేను వేల రూపాయలదాకా జీతం ఇస్తారు. దానితో బాటు ఫ్రీగా రూము, భోజనం, కారూ కూడా ఇస్తారు. ఒకవేళ మార్షల్ ఆర్ట్స్ కూడా నేర్చుకుని ఉండి బాడీగార్డ్ డ్యూటీ కూడా చేయగలిగితే, నెలకి పాతికవేల పైనే ఆదాయం వచ్చే ఆస్కారం ఉంది. ఇక్కడ ట్రైనింగ్ అయిన బట్లర్ లు సాధారణంగా రాజుల దగ్గరా, రాణుల దగ్గరా పని చేస్తుంటారు.
తను బట్లర్ స్కూల్లో నేర్చుకున్న విషయాలు ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నాడు యంగ్ హజ్బెండ్.
అసలు బట్లర్ అంటేనే బాటిల్స్ (డ్రింక్స్) తెచ్చి అందించేవాడు అని అర్ధం.
బట్లర్ ని ఉంచుకోవడం మల్టీ మిలినియర్లకు ఒక స్టేటస్ సింబల్!
యంగ్ హజ్బెండ్ బట్లర్ స్కూల్లో నేర్పించిన స్పెషల్ లెసన్స్ ఏమిటి?
వాళ్ళ ట్యుటర్ ఒకరోజు యంగ్ హజ్బెండ్ ని అడిగాడు.
"ఇదిగో యంగ్ హజ్బెండ్ ! మీ యజమాని భార్య ఊరికెళ్ళింధనుకో! పొద్దున్నే నువ్వు మీ యజమాని గారికి బెడ్ కాఫీ ఇవ్వడానికి ఆయనగారి గదిలోకి వెళ్తావు. ఆయనగారి పక్కలో ఆయనగారి పక్కనే పరాయి స్త్రీ ఒకామె పడుకుని ఉంటుంది. అప్పుడు నువ్వేం చేస్తావ్?"
"కాఫీ ట్రే బెడ్ పక్కనే ఉన్న టేబుల్ మీద పెట్టేసి, విండో కర్టెన్లు ఓపెన్ చేస్తాను సర్!"
"ఆమె పూర్తిగా నగ్నంగా ఉండి, నీకు గుడ్ మార్నింగ్ చెబితే?"
"ఆమె కళ్ళలోకి మాత్రమే చూస్తూ , గుడ్ మార్నింగ్, మేడమ్!" అని చెబుతాను సర్!"
"వంకర చూపులు చూడవు కద!"
"నెవర్ సర్!"
"గుడ్! బట్లర్ లు ప్రవర్తించవలసిన పద్దతి అదీ!"
అలాంటి పాఠాలు 86 ఉన్నాయి వాళ్ళ సిలబస్ లో. పొద్దున్నే వచ్చిన న్యూస్ పేపర్ ని ఏమాత్రం మడతలు లేకుండా జాగ్రత్తగా ఇస్త్రీ చేసి ఫ్రెష్ గా యజమానికి అందించడం, వైన్ ఒక పద్దతి ప్రకారం సర్వ్ చెయ్యడం, గెస్ట్ లెవరన్నా తప్పతాగేస్తే వాళ్ళని సమర్యడగా ఇంటికి పంపించెయ్యడం......వగైరా.....వగైరా.