Previous Page Next Page 
డైమండ్ రాజా - ఆఠీన్ రాణీ పేజి 16

 

    అక్కడ ఒక సౌముందు నిలబడి స్వీటు ఏదో తయారు చేసే సన్నాహంలో ఉన్నాడు భీంసెయిన్.


    "ఏం భీంసెయిన్! ఏమిటి చేస్తున్నావ్?" అన్నాడు తాన్ సెయిన్.


     "స్పెషల్ రాజ్ పుటానా స్వీటు!" అన్నాడు భీంసెయిన్.


    "వారేవా! ఏమేం కలుస్తాయి ఇందులో?"


    బాదం, పిస్తా, అంజూర్, ఖర్జూర్, కిస్మిస్, పచ్చకర్పూరం, చక్కర, తేనే, పెరుగు, పాలు, కేసర్, రోజ్ ఎసెన్స్.


    "వారేవా! చెబుతుంటేనే నా నోరు ఊరుతుంది. "తయారవగానే నాకు కాస్త రుచి చూపించు!" అని వెళ్ళిపోయాడు తాన్ సెయిన్.


    తాన్ సెయిన్ వెళ్ళిపోగానే తనలో తను అనుకున్నాడు వంటవాడు భీంసెయిన్.


    "సరే! రోజ్ ఎసెన్సు....అయిందా - ఇంకపోతే అసలైనది" అని జేబులోంచి చిన్న ప్యాకెట్ తీసి, "పాషాణం" అనుకుని దాన్ని స్వీటులో కలిపాడు.


    పాషాణం అంటే అది అతి తీవ్రమైన విషం!!

 

                                                                    * * *


    మొరటుగా మీనాక్షి పమిటని పట్టుకుని లాగాడు దేశ్ పాండే అనుచరుడు రాంనారాయణ్.


    "అక్కా!" అంది మీనాక్షి తనకు తెలియకుండానే టీవి వైపు చూస్తూ.


    టీవిలో డాక్టరు లత పాడుతూనే ఉంది.


    "నినువినా.....రఘువరా...భోచేవారెవరురా?


    అలనాడు గజేంద్రుడు మొసలి బారినపడినప్పుడు విష్ణుమూర్తి అల వైకుంటపురము నుండి సిరికింజెప్పక అపళంగా వచ్చేసి తన భక్తుడిని రక్షించినట్లు , ఇప్పుడు కూడా ఎవరన్నా వచ్చి తనని రక్షిస్తే ఎంత బాగుంటుంది!


    మీనాక్షి అలా అనుకుంటూ ఉండగానే ........


    పట్టాలు తప్పిన ఎక్స్ ప్రెస్ ట్రెయిన్ , రైల్వే ట్రాక్ కి దగ్గరలోనే వున్న దేశ్ పాండే ఇంటివైపు దూసుకురావడం మొదలెట్టింది.


    ఆ ఇంట్లోనే బందీగా ఉన్న మీనాక్షి మీదికి రాంనారాయణ్ కీచుకుడిలాగా రాబోతుండగా -


    ఇంటిని సమిపించేసింది ఇంజను.


    "చచ్చిందిర గొడ్డు!" అన్నాడు గంగారాం.

 

    "అరె ఇస్కి!" అన్నాడు యాకూబ్.


    ఇద్దరూ మొహమొహాలు చూసుకుని, కిందికి దూకేద్దాం అనుకుంటూ ఉండగానే ..........కాంపౌండ్ వాల్ ని బద్దలు చేసుకుని బంగళాలోకి వచ్చేసింది ఇంజను ........ఇంటి గోడని కూలగొట్టి లోపలికి వెళ్ళిపోయింది. ఇంజను తాలూకు కౌఫేండర్ ఒక్కసారిగా రాంనారాయణ్ మోకాళ్ళకి తగిలింది.


    "చచ్చాన్రోయ్!" అని కేకపెట్టి, వెనక్కి చూశాడు రాంనారాయణ్. యముడి వాహనంలా ఉన్న ఇంజన్ ని చూడగానే అతని కళ్ళలో అపనమ్మకం, ఆశ్చర్యం రెండూ వంతులు వేసుకుని కనబడ్డాయి. అతనికి ఒక్కసారిగా బుర్ర గిరగిర తిరిగినట్లయింది. "అమ్మే" అని కీచుగొంతుతో కేకపెట్టి తన చుట్టూ తనే రెండు సార్లు ప్రదక్షణం చేసి, ధన్ మని బోర్లా బొక్కలా మీనాక్షి కాళ్ళదగ్గర పడ్డాడు.


    తన కర్తవ్యం తను నిర్వర్తించినట్లుగా, అప్పుడు ఆగింది ఇంజను.


    "అరె ఇస్కి! జిందగీనా? ఇది ఇంగ్లీషు సిన్మానా?" అన్నాడు యాకూబ్ నోరెళ్ళబెట్టి.


    తనకి మళ్ళీ గండం గడిచిందని గ్రహించింది మీనాక్షి. ఆమె ఆశ్చర్యానికి పట్టపగ్గాలు లేకుండా పోయాయి.


    రెండుసార్లు ఇలా ఎవరో తనని బలాత్కారం చెయ్యడం .......అంతలోనే ఏదో ప్రమాదం జరిగి, ఆ ప్రమాదం వల్లనే తను గండం గడిచి బయట పడటం, అదొక అద్భుతంగా , దేవుడిలీలగా తోచింది మీనాక్షికి.


    ఆ భావనకి తగినట్లే.......


    ఇక్కడ టీవిలో డాక్టర్ లత పాడుతూ ఉండడం .........చాలా అర్ధవంతంగా ........కేవలం తన కోసమే దేవుడిని ప్రార్దిస్తున్నట్లు.....ఆ పాట....బ్రోచేవారెవరురా........


    అయితే........


    దేవదూతలా రెండుసార్లు కూడా పరోక్షంగానే తనని ఆదుకున్న డైమండ్ రాజా అనే ఒక వ్యక్తీ ఉన్నాడని మాత్రం ఆమెకి తెలియదు.


    మరోసారి టీవి స్క్రీన్ వైపు చూసింది మీనాక్షి.


    డాక్టర్ లత అప్పుడే పాడటం ముగించి, ప్రసన్నంగా కెమెరావైపు చూస్తోంది.


    "థాంక్స్ లతక్కా ! అని స్క్రీన్ మీద కనబడుతున్న లతకి చెప్పి, అర్జెంటుగా అక్కడి నుంచి బయటికి పరిగెత్తింది మీనాక్షి .


    సరిగ్గా ఆమె వెళ్ళగానే లోపలికి వచ్చాడు డైమండ్ రాజా. అక్కడ ఎవరికయినా , ప్రమాదం జరిగిందేమో అన్న ఆదుర్దాతో అటూ ఇటూ చూశాడు. అందరూ క్షేమంగానే ఉన్నారని తెల్చుకున్నతర్వాత గుండెలనిండా గాలి పీల్చుకున్నాడు. అతని చేతుల్లో పసిపాపలాగా ఇంకా అలాగే ఉంది అయేషా! రైల్లో నుంచి గాల్లో దూసుకువచ్చి డైమండ్ రాజా చేతుల్లో పడిన అయేషా ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేదు. అతని చేతుల్లో నుంచి దిగే ప్రయత్నం కూడా చెయ్యకుండా, గువ్వపిట్టలా అలాగే ఒరిగిపోయి ఉంది.


    "అరె ఇస్కి! హీరో లెక్క చోక్రిని కూడా బచాయించాడు! పూరా ఇంగ్లీషు సిన్మా లెక్కనే ఉంది!" అన్నాడు యాకూబ్. ఆశ్చర్యంతో ఉక్కిరిబిక్కిరైపోతూ.


    ఆ లోగా జస్వంతరావు కూడా అక్కడికి వచ్చాడు.

    
    అప్పుడు స్పృహ వచ్చినట్లయింది రాజాకి. తన చేతుల్లో ఉన్న అయేషాని కిందికి దింపాడు.


    ఈలోగా ప్రయాణికులందరూ అక్కడ గుమిగూడడం మొదలెట్టారు. వాళ్ళతో గంగారాం, తను ఎంత అలర్టుగా వుండి ఎలా సడెన్ బ్రేక్ వేసింది, ఎలా ప్రమాదాన్ని తప్పించింది చెబుతున్నాడు.


    యాకూబ్ మాత్రం "అరె మాస్టర్! అల్లా తుమ్ కు భలా కరేగా!" అని మొదలుపెట్టి, స్తోత్రపారాలు వల్లిస్తున్నట్లు డైమండ్ రాజా సాహసాన్ని గురించి చెప్పడం మొదలెట్టాడు.


    మిలమిలమెరుస్తున్న కళ్ళతో ఆరాధనా పూర్వకంగా రాజా వైపు చూస్తోంది అయేషా.


    ఆ తర్వాత అంది.........


    "వాట్స్ యువర్ నేమ్ మిస్టర్ ?"


    "డైమండ్ రాజా" అన్నాడు రాజా క్లుప్తంగా.


    "డైమండ్ రాజానా!" అంది అయేషా చిత్రంగా చూస్తూ.


    "ఈయన ఎవరనుకున్నావ్?" అన్నాడు జస్వంతరావు అయేషాతో.


    "అరె! జస్వంతరావు అంకుల్! మీరూ ఇక్కడే ఉన్నారా? చెప్పండి! ఇతను ఎవరూ? హూ ఈజ్ దిస్ హేండ్సమ్ హీరో?"


    "వీరు మన రాణీపూర్ ఎస్టేట్ కి కొత్త యజమాని..........రాజా విక్రమదేవారావుగారికి వారసుడు! రాజా రాజశేఖర సింహా!


    "వ్వాట్?" అంది అయేషా.


    "అవును,!" అని జరిగింది అంతా చెప్పాడు జస్వంతరావు.


    అద్భుతగాదని వింటున్నదానిలా , తెరచిన నోరు మూయడంకూడా మర్చిపోయి, అలాగే ఉండిపోయింది అయేషా.


    అయితే డైమండ్ రాజా ఇదేమీ పట్టలేదు! అక్కడ అందరూ సురక్షితంగా ఉన్నారని తేల్చుకున్న తర్వాత, జస్వంతరావు చెయ్యి పట్టుకున్నాడు రాజా.


    "ఓకే! లెటజ్ గోటు ద హాస్పిటల్!" అన్నాడు త్వరత్వరగా. కనీసం తను ఎవరూ అని అడగకపోవడంతో తన మిస్ ఇండియా టైటిల్ కి అసలు విలువే లేకుండా పోయినట్లనిపించింది అయేషాకి.


    జస్వంతరావు చెయ్యి పట్టుకుని, గుంజుతూ , హాస్పిటల్ వైపు పరిగెత్తడం మొదలెట్టాడు రాజా.


    జస్వంతరావు కూడా అదే స్పీడ్లో అతన్ని అనుసరించాడు.


    "అరె ఇస్కి!" ఇంతమందిని బచాయించాడు గాని, ఒక్క పూలహారం కూడా వేయించుకోకుండా బోయిందీ! అరె ఇదే మినిస్టర్లయితే నాలుగు దినాలు టీవి రేడియో పేపర్లలో హంగామా చేసి ఉంటారు!" అంటున్నాడు యాకూబ్.


    అప్పటికి, అతని మాటలు వినబడనంత దూరం వెళ్ళిపోయాడు రాజా, జస్వంతరావు.


    హాస్పిటల్ కి వెళ్ళారు ఇద్దరూ.


    నేరుగా సూపరింటెండెంట్ దగ్గరికి వెళ్ళిపోయాడు రాజా.


     వెళుతూనే అతనితో ఒకే మాట చెప్పాడు.


    "చూడండి సారూ! నేను మంచివాళ్ళకి మహా మంచివాడిని! చెడ్డవాళ్ళకి మహా చెడ్డవాడిని! నాతొ మంచిగా వుండదలుచుకుంటారో, చెడ్డగా వుండదలుచుకుంటారో అది మీ ఇష్టం!"


    డైమండ్ రాజాతో మంచిగానే ఉండదలుచుకున్నాడు సూపరింటెండెంట్.


    అతి నిర్లక్ష్యంగా ఉన్న రాజా ప్రవర్తన, అతని గెడ్డం, అతని గెటప్, అతను ఇచ్చిన వార్నింగ్ ఒక ఎట్టుకాగా-


    అప్పటికే హాస్పిటల్ కి చేరుకొని ఉన్న రాణీపూర్ ఎస్టేట్ తాలూకు సిక్స్ డోర్ మెర్సిడిస్ కారూ, దానితో బాటే వచ్చిన కాడిలాక్ కారూ - రెండు అంబాసిడర్లు - వాటిల్లో నుంచి దిగిన ఎస్టేట్ తాలూకు మందీ మార్బలం, వాళ్ళలో ఒక అకౌంటేంటూ- అతని చేతిలో ఖరీదైన బ్రీఫ్ కేసూ- ఆ బ్రీఫ్ కేసుని అతను తనకి కనబడేలా తెరవడం - అందులో నీట్ గా ప్యాక్ చేసివున్న సరికొత్త వందరూపాయల కట్టలు.


    ఇవన్ని కలిపి హాస్పిటల్ సూపరింటెండెంట్ ని మహా మంచిబాలుడు రాముగా మార్చేశాయి.


    "పోస్ట్ మార్టామ్ రిపోర్టు సంగతి జాగ్రత్త! ఉన్నది ఉన్నట్లు రాయాలి - ఒక్క అక్షరం పొల్లు పోకూడదు" అన్నాడు రాజా.


    బుద్దిగా బుర్ర ఆడించాడు సూపరింటెండెంట్.


    తర్వాత జస్వంతరావు వైపు తిరిగాడు డైమండ్ రాజా.


    "సో! ఇంక మీదారి మీది! నా దారి నాది!" అన్నాడు షేక్ హాండ్ ఇస్తూ.


    నిర్ఘాంతపోయాడు జస్వంతరావు.


    "అదేమిటి?" అన్నాడు.


    "అదంతే! నాకు ఇంక చాలా పని ఉంది. ఇక్కడ భార్గవ్ పోస్ట్ మార్టెం రిపోర్టు సంగతి చూడాలి. అక్కడ పోలీసులు కేసు రిజిస్టర్ చేసుకునేటట్లు చూడాలి. మా లోకాలిటి కెళ్ళి మా వాళ్ళకి ధైర్యం చెప్పాలి - ముఖ్యంగా భార్గవ్ తల్లి శాంతమ్మకి!"


    "అవన్నీ మనవాళ్ళు చూసుకుంటారు. మీరు అర్జెంటుగా ఎస్టేట్ కి వచ్చి మీ ఆస్తులు స్వాదీనం చేసుకోవాలి. లేకపోతె కొంపలు మునిగిపోతాయ్" అన్నాడు జస్వంతరావు.


    "ఓహో!" అన్నాడా డైమండ్ రాజా విసుగ్గా -


    "మీ ధోరణి ఏ మాత్రం మారినట్లులేదే! ఎస్టేట్ లు ఏమిటి? ఆస్తులు ఏమిటి? అంతా హంబగ్!"


    "నో యాంగ్ మాన్! నేను చెబుతున్నవి అక్షర సత్యాలూ - " అన్నాడు జస్వంతరావు స్ధిరంగా.


    "నేను నమ్మలేను" అన్నాడు రాజా.


    "బట్ ఇటీజ్ ట్రూ!" అన్నాడు జస్వంతరావు ఒత్తిపలుకుతూ -


    హటాత్తుగా అన్నాడు రాజా.


    "నేనే వారసుడినని మీకేమిటి నమ్మకం? అసలు మీకెలా తెలిసింది?" తర్వాత "ఒక్కసారి ఇటువైపు రా!" అన్నాడు.


    ఇద్దరూ ఒక వైపుకి నడిచారు.


    కోటు జేబులోంచి ఒక ప్లాస్టిక్ కవర్ తీశాడు జస్వంతరావు. అందులో కొన్ని పురాతనమైన పత్రాలు ఉన్నాయి.


    పసుపచ్చాగా మారిపోయి, తాకితే, విరిగిపోయేటంత పెళుసుగా కనబడుతున్నాయి అవి.


    వాటిమీద కరక్కాయ సిరాతో రాసిన అక్షరాలూ కనబడుతున్నాయి. ఒక పత్రం తీసి రాజాకి అందించి , "చదువు!" అన్నాడు జస్వంతరావు.


    పాతకాలపు కలిపిరాత! చదవడం చాలా కష్టంగా ఉన్నా కూడా కుడబలుక్కుంటూ చదివాడు డైమండ్ రాజా. అది మార్తాండ సింహుడి జమానా తాలూకు జమా ఖర్చుల లిస్టు.

 

                (రూపాయలలో)


    
    1. మహారాజు మార్తాండసింహుడి స్వంత ఖర్చులు : ఒక లక్ష.


    2. మత విషయమలు - దానములు : ఒక లక్ష.


    3. దర్బారు ఖర్చులు : ఆరు లక్షలు.


    4. ప్రభుత్వోగుల జీతములు : ఒక కోటీ ముప్పయ్ మూడు లక్షల పన్నెండు వేల ఎనభై రూపాయలు.


    5. ఐయిరోపియ సైనికులకు - ఆకస్మిక యుద్దములకు : ఎనభై నాలుగువేల నాలుగువందల ఇరవై ఎనిమిది.


    6. యుద్ద సామాగ్రి : తొంభై ఆరువేల ఎనిమిది రూపాయలు.


    7. ఆయుధములు : ఇరవై ఎనిమిది లక్షల ముప్పయ్ అయిదువేల ఏడువందల తొమ్మిది.


    8. అశ్వికదళము : పద్దెనిమిదివేల తొమ్మిది.


    9. లేఖకులకు జీతములు : రెండు లక్షల ఎనభై అయిదువేల ఆరు వందల పన్నెండు.


    10. దేవాలయములకు : అరవైనాలుగువేల ఎనిమిది వందల ముప్పయి అయిదు.


    11. అంతపుర పండుగలకు : పదివేల ఐదువందల యాభై.


    12. అన్న సత్రములకు : ఎనిమిది వేల ఐదువందల ఒకటి.


    13. వేగుల మరియూ, వార్తాహారులు : తొమ్మిదిలక్షల ఎనిమిదివేల ఐదువందల ఒకటి.

 Previous Page Next Page