బట్లర్ లు అతి శుభ్రంగా ఉండాలి. అందుకోసం రోజుకి రెండుసార్లు షవర్ బాత్ తీసుకోవాలి. రోజుకి నాలుగుసార్లు బ్రష్ చేసుకోవాలి. పొరబాటున కూడా ఉల్లి, వెల్లుల్లి తినకూడదు. షాంపేన్ బాటిల్ ఓపెన్ చేసేటప్పుడు కార్కుని "థాప్" మని శబ్దం వచ్చేలా కాకుండా, "హిస్" మనే శబ్దం వచ్చేటట్లు మృదువుగా తియ్యాలి.
ప్రవర్తన గురించి , మంచి దుస్తుల గురించి కొంతవరకు కళల గురించి, సాహిత్యం గురించి, వైన్స్ గురించి, పళ్ళు ఫలాల గురించి, కూరగాయలు, వంటలు, వడ్డనా - ఇలాంటి విషయాలన్నిటి గురించి కూడా తెలుసుకుని ఉండాలి!
అవన్నీ తెలుసుకున్నాడు తను.
కానీ తను నేర్చుకున్న వాటితో ఈ కొత్త రాజాగారు ప్లీజ్ అయ్యేటట్లు లేడు! ఎందుకనో మరి!
బట్లర్ యంగ్ హజ్బెండ్ ఇంకేదో సేవ చేయడానికి రాజా మీదకి వంగబోతుంటే , బలవంతంగా అతన్ని ఆపేశాడు రాజా.
"నా పనులు నేను చేసుకోగలను" అన్నాడు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నట్లు.
యంగ్ హజ్బెండ్ దిక్కుతోచానట్లు ఎస్టేట్ మేనేజర్ జస్వంతరావు వైపు చూశాడు.
"నిరుత్సాహపడకు! కాస్త ఓపిక పట్టు!" అన్నట్లు సైగ చేశాడు జస్వంతరావు.
కుదేలయిపోయినట్లు కూర్చున్నాడు యంగ్ హజ్బెండ్.
ఈలోగా -
అకౌంటెంట్ లక్ష్మీపతి అన్నాడు.
"సర్! చిల్లర ఖర్చులకి బ్రీఫ్ కేసు నిండా కొత్త కరెన్సీ వచ్చింది. మీరెలా ఖర్చు పెట్టమంటే అలా ఖర్చు పెడతాం!"
"అలాగా! అయితే ఒక్కసారి కారు ఆపండి!" అన్నాడు రాజా.
కారు పేవ్ మెంట్ పక్కన ఆగింది.
పేవ్ మెంట్ మీద కూర్చుని యాక్టివ్ గా ఆడుక్కుంటున్నాడు అభిజీత్. అతనే రాత్రిళ్ళు రాజా ఇంట్లో గడిపే బిచ్చగాడు.
"అమ్మా! తల్లే! కళ్ళు లేని కబోదినమ్మా! ధర్మం చెయ్యండి తల్లే!"
"ఇలారా!" అన్నట్లు సైగ చేశాడు రాజా.
కార్లో కూర్చుని ఉన్నది తమ రాజనేనా కాదా అన్నట్లు అనుమానంగా చూస్తూ దగ్గరికి వచ్చాడు అభిజీత్.
"అతనికి ఒకటి ఇవ్వండి" అన్నాడు రాజా, అకౌంటెంట్ తో.
"ఒక రుపాయా?" అన్నాడు అకౌంటెంట్.
"కాదు"
"వంద అంటారా?"
"కాదు"
అర్ధం చేసుకున్నట్లు తల పంకించి బ్రీఫ్ కేసులో నుంచి ఒక వంద రూపాయల కట్టతిసి, అడుక్కుతినే అభిజీత్ కి ఇచ్చాడు. అకౌంటెంట్.
అభిజీత్ కనుగుడ్లు వాటి సాకెట్లలో నుంచి బయటికి వచ్చినంత పని అయింది!
రాజా జస్వంతరావు వైపు తిరిగి, "నేనెవరో అతనికి చెప్పండి!" అన్నాడు.
గొంతు సవరించుకుని, గంభీరంగా చెప్పాడు జస్వంతరావు. "రాజా ఆఫ్ రాణీపూర్! శ్రీ శ్రీ శ్రీ రాజశేఖర సింహా!"
"ఆ డబ్బుతో పెట్టుబడి పెట్టి పైకిరమ్మని చెప్పండి అతనికి! మళ్ళీ ఎక్కడన్న అడుక్కుంటూన్నట్లు కనబడితే శిరచ్చేదం చేయిస్తామని చెప్పండి!" అన్నాడు రాజా, నవ్వాపుకుంటూ.
"విన్నావుగా!" అన్నాడు జస్వంతరావు, ముష్టి అభిజీత్ తో.
"అభీజీత్ ఆశ్చర్యంతో తల మునకలైపోతూ , నోరెళ్ళబెట్టి కళ్ళప్పగించి చూస్తూ వుండగా - కార్లు కదిలి ముందుకు ఉరికాయి.
"అకౌంటెంట్ గారూ!" అన్నాడు రాజా.
"సర్!" అన్నాడు అకౌంటెంట్ సమర్యడగా.
'దార్లో కనబడిన ప్రతి దానయ్యకి ఒక వంద చొప్పున పందారం చేసుకుంటూపొతే ఈ పదివేల కోట్లూ ఎన్నాళ్ళలో కరిగిపోతుంది?" అన్నాడు రాజా తేలిగ్గా.
గుణించి , అకౌంటెంట్ చెప్పాడు.
"నిమిషానికి రెండువేల ఐదువందల చొప్పున ఖర్చు పెట్టిన కూడా మీ ఆస్తి కరగడానికి 75 సంవత్సరాలు పడుతుంది. అంటే - అప్పటికి దాదాపు మీకు వందేళ్ళు వచ్చేస్తాయి. కానీ ఈ లోపల మీ ఆస్తి కూడా పెరుగుతూనే వుంటుంది. గనక మీ జన్మలో ఈ ఆస్తి తరగడం అసంభవం - మీరు జూదంలోనో, రిస్కు వ్యాపారాలలోనో డబ్బు పెడితే తప్ప!" అన్నాడు అకౌంటెంట్.
"గుడ్! అలా అయితే కనబడ్డ ప్రతి కబోదికి ఒక వంద రూపాయలనోటు చొప్పున పంచండి!" అన్నాడు రాజా.
అకౌంటెంట్ ఒక గుటక మింగి, "యస్సర్!" అన్నాడు.
గంటన్నర తర్వాత కార్లు రాణీపూర్ పాలెస్ చేరుకున్నాయి.
రాణీపూర్ పాలెస్ ని రాజస్తాన్ లోని ఉదయ్ పూర్ పాలెస్ మోడల్లో కట్టారు. కోట గుమ్మం రెండు ఏనుగులంత ఎత్తు వుంది.
కోటగుమ్మం దగ్గరే "రాచపరివారం" అందరూ నిలబడి వున్నారు.
అందరికంటే ముందు నిలబడి వుంది అలివేలు మంగ - ఉరఫ్ అయేషా, ట్రస్టీ సద్గుణం గారి కూతురు.
అచ్చం ఒక అప్సరసలా ఉంది తను. లేటస్ట్ ఫ్రెంచి ఫ్యాషన్ ప్రకారం కుట్టిన డ్రెస్సు, దానిమీద తెల్లని మింక్ కోటు అపరిమితమైన ఖరీదు వుంటుంది ఆ మింక్ కోటు!
అయేషా వెనకే నిలబడి వున్నాడు సద్గుణం - అయేషా తండ్రి - రాజా విక్రమదేవరావు ఆస్తులకి ట్రస్టీ.
"చెప్పిందంతా గుర్తుందిగా! జాగ్రత్త! దొరికిన ప్రతి అవకాశం సక్రమంగా ఉపయోగించుకో! రాజా నీవాడు కావాలి!" అన్నాడు సద్గుణం! అయేషా చెవిలో గుసగుసగా.
అదే టైంలో -
ఆదుర్దాగా గోళ్ళు కొరుక్కుంటూ అటూ ఇటూ చూస్తున్నాడు సుందరం.
ఏడీ?
వీడేడీ?
తన ముద్దుల కొడుకు సామంత్ ఏడీ?
"దర్జాగా డ్రెస్ చేసుకువచ్చి ఆ రాజా చూస్తుండగానే ఈ అయేషా వెంటపడరా! అని నెత్తి నోరూ కొట్టుకుని మరీ చెప్పాడు తను. తన కొడుకుతో, ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అన్నారు. రాజా మొదటిసారిగా ఏం చేస్తే అదే అతని మనసులో నిలిచి పోతుంది కదా.
రాజా చూస్తుండగా అయేషా వెనకపడాలి తన కొడుకు సామంత్. అతి చనువుగా నటించాలి.
"వీళ్ళిద్దరి మధ్య ఏదో వుంది!" అన్న అభిప్రాయం చూసే వాళ్ళలో కలగజేయాలి.
దాంతో రాజా వెంట అయేషా పడికూడా లాభం లేకుండా పోవాలి. కానీ - అందువల్ల తనకేం లాభం?
ఏం లాభం అంటే......
ఈ పదివేల కోట్ల రూపాయల ఆస్తీ తనకి దక్కకపోయినా కనీసం ఈ సద్గుణంగాడికి దక్కకుండా ఉంటుంది!
అది చాలు!
అసలు తనని వదిలేసి తన పార్టనర్ ఒక్కడూ బాగుపడిపోవడం తను ఎలా భరించగలడు?
తనకి ఓ కన్ను పోయినా ఫర్లేదు - వాడికి రెండు కళ్ళు పోవాలి! అది తన పాలసీ! అదే తన సిద్దాంతం!
దేవుడా! దేవుడా! దేవుడా! రక్షించు!
ఈ సామంత్ గాడు ఇంకా రాడేం!
సుందరం అలా సైలెంటు గా లబలబలాడుతుండగానే -
ఆలస్యంగా బడికి వచ్చిన పిల్లాడిలా అర్జెంటుగా వచ్చేశాడు సామంత్.
యమా ట్రిమ్ముగా ఉన్నాడు అతను.
అతి ఖరీదైన లూయీస్ ఫిలిప్ షర్టు! జోడియాక్ టై, జియోవన్ని అరామి కోటు - కాళ్ళకేమో 6,999 రూపాయలు ఖరీదు చేసే బాలే ఇంటర్నేషనల్ రేంజ్ షూస్-
అలా ట్రిమ్ముగా వచ్చిన సామంత్ ని చూసి సంతోషించకపోగా తెగ తిట్టుకున్నాడు సుందరం.
"ఓరి వీడమ్మ ముండ మొయ్య! ఫాల్తూ వెధవ ప్యాంటు వేసుకోవడం మర్చిపోయాడు!" అని పళ్ళు కొరుక్కున్నాడు.
నిజంగానే ప్యాంటు వేసుకోలేదు సామంత్. అతనికి మతిమరుపు మరీ ఎక్కువ!
ఈలోగా -
రాజా కారు దిగాబోయాడు.
చటుక్కున ముందుకి దుసుకోచ్చేసింది అయేషా.
"ఆగండి! ప్లీజ్! ఒక్క నిమిషం!" అంది.
అనుమానంగా చూశాడు రాజా.
కారు అగినచోట కొద్దిగా బురద వుంది. రాజా కారులో నుంచి కాలు కిందికి పెడితే ,ఆ బురద అతనికి అంటుకుంటుంది.
అందుకని, తన భుజం మీద ఉన్న ఖరీదైన మింక్ కోటుని తీసి ఆ బురద మీద పరిచేసింది అయేషా. అలా చేశాక, విశాలంగా చేతులు జాపి వంగి రాజాకి అభివాదం చేసింది.
డబ్బు మహత్యం అంటే ఏమిటో అప్పుడు మొదటిసారిగా అర్ధం అయింది రాజాకి.
"ఇలాంటి మర్యాదలు నాకు నచ్చావు!" అన్నాడు రాజా క్లుప్తంగా. ఆ తర్వాత కొందపడి ఉన్న ఫర్ కోటుని, అయేషాని మార్చి మార్చి చూసి అన్నాడు. "ఇలా అమాయకపు జంతువులని హింసించి, వాటి బొచ్చుతో చేసిన దుస్తులు వేసుకునే వాళ్ళంటే నాకు తగని మంట! మిస్! ఈ బొచ్చు జంతువులమిద వుంటే బాగుంటుంది - మనుషుల మీద కాదు!" అన్నాడు.