కుటుంబరావుగారు మోహంలో ఏ భావం కనపడనీయకుండా శ్రీహర్ష వైపు తిరిగి "శ్రీహర్షా! రేపు ఫోన్ చెయ్యి ఆ విషయం కనుక్కొని చెప్తాను" అంటూ లోపలికెళ్ళి పోయారు.
శ్రీహర్షకి అర్ధం అయింది. గొడవ జరుగుతుండగా తను అక్కడ ఉండడం ఆయనకి ఇష్టం లేదని.
ఎవ్వరు తన ఉనికిని గమనించట్లేదని భావించి, మెల్లగా బయటికి వచ్చేశాడు.
తను చూసుకోలేదు గానీ, తనతో బాటే బయటికి వచ్చింది లావణ్య.
కాసేపు నడిచాక గమనించాడు శ్రీహర్ష.
"మీరూ వచ్చేశారే" అన్నాడు.
"అవును కాసేపు అలా నడుద్దామని."
రెండు నిమిషాలు మౌనం.
"అసలు నాన్నగారికి ఏమి తెలియదు" అంది లావణ్య.
ఆశ్చర్యంగా చూశాడు శ్రీహర్ష.
"నిజం చెప్పాలంటే, అయన చేసిన తప్పేమిటో ఇప్పటికి నా కర్ధం కాలేదు."
"లేకపోతే ఏమిటండి? నర్సయ్యగాడి పాంటు లాంటిదే కుట్టించుకుంటే రేపట్నుంచి వాడూ అయ్యగారితో సమానంగా రొమ్ము విరుచుకుని నడవడూ? నూట అయిదు, నూట పది పెట్టి ఆ వెధవ క్లాత్ కొనకపోతేనేం. లక్షణంగా రేమాండ్స్ లో మీటరు రెండొందలకు తగ్గని సూటింగులు తీసుకోమని నేనూ అమ్మా ఇప్పటికి లక్షసార్లు చెప్పం. అలాంటి క్లాత్ అయితే నరసయ్యలూ, సన్నాసులూ కొనుక్కోలేరుగా. ఉహూ! వినిపించుకోరే!"
శ్రీహర్ష సైతం మాట్లాడలేదు. ఎంత విచిత్రమైన స్వభావాలు. ఇంకోళ్ళు వేసుకున్న లాంటి బట్టలు వేసుకోవడానికి కూడా నామోషినా?
అంతలోనే ఎదురుగుండా ఒకమ్మాయి వచ్చింది. ఫారిన్ నైలేక్సు చీరే కట్టుకుని ఉంది.
లావణ్య ఆ చీరే మీద నుంచి చూపులు మరల్చుకోలేక , ఆ అమ్మాయి దాటి పోయిన తర్వాత కూడా తల వెనక్కి తిప్పీ చాలాసేపు చూస్తూనే ఉండిపోయింది. ఆ అమ్మాయి ఇంకో నాలుగడుగులు నడిచి, రోడ్డుపక్కన ఆపి ఉన్న కారెక్కింది.
"ఏమిటి చూస్తున్నారు?" అన్నాడు శ్రీహర్ష.
"ఆ అమ్మాయి చీరె . అబ్బ! ఎంత బావుందో ఎక్కడ నుండి తెప్పించుకుందో! నాకు దొరికితే బావుండు."
నవ్వొచ్చింది శ్రీహర్షకి.
"ఇంకోళ్ళు వేసుకున్న రకం బట్టలు మీ నాన్నగారు వేసుకుంటే మీ క్కోపం వచ్చింది. మీరేమో మరి ఆ అమ్మాయి చీరే లాంటిది కొనుక్కోవాలనుకుంటున్నారు. తమాషాగా ఉంది."
"బావుంది. నర్సయ్యా, ఈ అమ్మాయి ఒకటే నేమిటి? మన తాహతుకు చెందిన వాళ్ళని మనం అనుకరించడంలో తప్పులేదు. అనుకరించడమే కదా ఫేషనంటే"
"కానీ మనకంటే తక్కువ వాళ్ళని అనుకరించకూడదు- వాళ్ళలో మంచి వున్నా అది నేర్చుకోకూడదు. అవునా?"
"వాళ్ళ దగ్గర నేర్చుకునేదేముంటుంది? అన్నీ అసహ్యమైన అలవాట్లు."
"బీదవాళ్ళంటే సానుభూతి ఉన్నట్లు లేదు మీకు."
"సానుభూతి లేకేం! అలాగని నేత్తికేక్కించుకోవడం నా కిష్టం ఉండదు."
"ఎలాగూ బయటి కొచ్చాం కాబట్టి కాఫీ తాగుదామా?"
"మహా భాగ్యం" అన్నాడు శ్రీహర్ష.
అటో పిలిచింది లావణ్య. "హొటల్ పార్క్ లేన్" అంది.
అయిదు నిమిషాల్లో పార్క్ లేన్ ముందు దిగారు.
వినయంగా పెద్ద అద్దాల తలుపులు తెరచి పక్కకి నిలబడ్డాడు డోర్ మాన్.
లోపలికెళ్ళి కూర్చుని కట్ లెట్స్, హాట్ డాగ్స్ ఆర్డరిచ్చింది లావణ్య.
ప్లేటు చుట్టూ టొమాటో, కెరట, ఉల్లిపాయ ముక్కలూ, చిప్సూ, వాటి మధ్యలో బంగారు రంగులో ఉన్న రెండు చిన్న బన్నుల మధ్య హాట్ డాగ్. దాన్ని చాకుతో కట్ చేస్తూ,
"మనం ఖరీదైన హోటళ్ళకె ఎందుకొస్తామో తెలుసా శ్రీహర్ష?" అంది.
"పదార్ధాలు రుచిగా, శుచిగా ఉంటాయను"
"అదొక కారణం. అసలు కారణం ఏమిటో తెలుసా? బయట కాఫీ తాగితే నలభై పైసలయ్యేది ఇక్కడ రెండ్రుపాయలవుతుంది. అందుకని అలగాజనమంతా దిన్లోకి రారు. వాళ్ళు రాకుండా ఉండాలనే ఇలాంటి హోటల్సులో రెట్లు చాలా ఎక్కువగా పెట్టేస్త్తారు."
"మిస్ లావణ్యా! నేను నలబై పైసల కాఫీ తాగే మాములు మనిషినే. మీకు తెలుసో, తెలియదో?" అన్నాడు శ్రీహర్ష.
"అందుకే శ్రీహర్షా మీరు కాస్త మారాలి. మీ పద్దతులు మార్చుకోవాలి. నా కోసం."
"మిస్ లావణ్యా! మీరు నా కోసం కాస్త మారాలి."
"ఏమిటి?"
"నాకు బీదవాళ్ళంటే జాలి. బీదరికాన్ని చూసి జాలి పడాలి గానీ అసహ్యించుకోకూడదని నా ఉద్దేశం."
"హు! మీకు తెలియదు శ్రీహర్షా! చనువిస్తే నెత్తిమీదికెక్కిపోతారు ఇలాంటి జనం. ఒక పరిధిలో ఉంచాలి వీళ్ళని" అని ఒక్కక్షణం ఆగి "బీదవాళ్ళంటే జాలి మీకే కాదు. నాకూ ఉంది. నర్సయ్యకి ఆ పాంటు కొనుక్కోవడానికి డబ్బిచ్చింది నేనే" అంది.