"ఇంకెవరూ?" అంది వసుంధర.
చాలా ఇబ్బందిగా అనిపించింది శ్రీహర్షకి. తను రావడం ఆమెకు ఇష్టం లేదని తెలుస్తూనే ఉంది.
"హై!" అని లావణ్య గొంతు వినబడింది ఇంతలో.
తిరిగి చూశాడు.
మెడ మీద నుంచి చెయ్యి ఊపుతోంది.
ఆ ప్రయత్నంగా తనూ చెయ్యి ఊపాడు శ్రీహర్ష.
వసుంధర కనుబొమ్మలు ముడిపడ్డాయ్.
"లోపలికి వచ్చెయ్యండి" అంది లావణ్య.
వసుంధర లావణ్య వైపు చిరాగ్గా చూసింది.
"క్లబ్బులో మెంబర్ షిప్ సంగతి ఇవాళ తేలుస్తుందన్నారు రావుగారు."
"మీ పేరేమిటి?"
"శ్రీహర్ష"
"మీ సంగతేనా నిన్న లావణ్య ఏదో చెబుతోంది? ఏ క్లబ్ మెంబర్ షిప్"
చెప్పాడు శ్రీహర్ష.
"దాన్లోనా! మీకా!" 'వాజమ్మవి. నీకు దాన్లో ప్రవేశం ఎలా దొరుకుతుంది?" అన్న గొంతుతో అడిగింది.
"రావుగారు ఇప్పిస్తానన్నారు."
"మీ రావుగారు తలుచుకుంటే కోతిని మిస్ ఇండియా చేయించగలరు. ఎవరికేం చెయ్యడానికైనా అయన సిద్దమే. అడగనివాడిది పాపం!"
తను కోతిని కాననీ, కాస్తో, కూస్తో ప్రయోజకత్వం ఉన్నవాడేనని, అయినా క్లబ్బులో చేరుస్తానని రావుగారే తనంతట తానే అన్నారనీ- అన్నీ చెప్పెయ్యాలనిపించింది శ్రీహర్షకి.
కానీ అతను చెప్పలేదు. పరిస్థితులు అతనికి నిగ్రహాన్ని నేర్పాయి.
నవ్వి ఊరుకున్నాడు.
"లోపలికి వెళ్ళండి" అంది వసుంధర. పెదకాపుగారు పాలేరుని ఇంట్లోకెళ్ళి మిగిలిన చద్దేన్నం తినెయ్' అని పర్మిషనిస్తున్నట్లు.
శ్రీహర్షకి అవమానాలు కొత్తకాదు. లక్షల ఆస్తిని తాతతండ్రులు తగలేసి తనని నడిరోడ్డు మీద నుంచోపెట్టినప్పట్నుంచి అతనికవి అలవాటే.
అయినా ఎప్పటికప్పుడే కొత్తగా, దుర్భరంగా ఉంటుంది ప్రతి ఇన్సల్టు.
అర్జెంటుగా తనూ గొప్పవాడై పోవాలి. వీళ్ళందరితో సమానంగా, లక్షలూ, కోట్లు సంపాదించేయాలి. బంగళాలు, కంపెనీలు షేర్లు కొనేయ్యాలి.
"ఎప్పుడు? ఎప్పుడు?
జమిందారు కేశవరావుగారి మునిమనవుడు, జానెడు స్థలమైనా తనకంటూ లేకుండా మిగిలాడు.
స్థలాలు కొనాలి, పొలాలు కొనాలి.
జమిందారీలు పోయినా, జమిందారులా బతకాలి.
తన వంశంలో ఉన్న బలహీనతలు తనకి అంటలేదు.
తనకు తాగుడోద్దు, ఆడవాళ్ళు వద్దు. అన్యాయాలు వద్దు.
కాని విలాసవంతమైన జీవితం కావాలి. ఫ్లాషిగా ఉండే కార్లు కావాలి. పుష్కలంగా డబ్బుండాలి.తన పేరు నలుగురూ చెప్పుకోవాలి. తన వల్ల నలుగురు బతకాలి.
అన్నిటికన్నా మించి-
అందమైన భార్య తోడుండాలి.
లావణ్యలాంటి అందమైన అమ్మాయి.
"బయటే నిలబడిపోయారేం?" అంటూ వచ్చేసింది లావణ్య.
అదే సమయానికి గేట్లోంచి కారొచ్చింది. దాన్లోంచి కుటుంబరావుగారు దిగారు.
అయన కారు దిగగానే ఆయనేసుకున్న ప్యాంటు మీద పడింది వసుంధర దృష్టి.
చాక్ లెట్ రంగు డబుల్ నిట్ పాంటు.
పరీక్షగా దాన్ని చూసి, తర్వాత నర్సయ్య వైపు చూసింది.
నర్సయ్య కూడా అచ్చం అలాంటి పాంటే వేసుకుని ఉన్నాడు. అయితే అది కొద్దిగా మాసింది. అదొక్కటే తేడా.
వసుంధర మొహం కోపంతో జేవురించింది.
"ఇదేనా మీరు మొన్న కుట్టించుకున్న పాంటు?" అంది.
"అవును ఏం?" అన్నారు కుటుంబరావుగారు. ఆయనకి అర్ధం అయిపొయింది. నౌకరు నర్సయ్య వేసుకున్న పాంటులాంటిదే తనూ వేసుకున్నాడు. వసుందర దృష్టిలో అది మహాపరాధం.
"నర్సయ్యా! ఎక్కడ కొన్నావేంటి పాంటు!" అంది సీరియస్ గా. భయపడిన నర్సయ్య ఏం మాట్ల;మాట్లాడకుండా నిలబడిపోయాడు.
"ఈసారి నువ్వు బట్టలు కొనుక్కునే టప్పుడు అయ్యగార్ని కూడా వెంట బెట్టుకేళ్ళీ ఇలాంటి చౌకరకం ఎక్కడ దొరుకుతాయో చూపించు. అవే కొని డబ్బు అదా చేస్తారాయన" అంది దురుసుగా.