శ్రీహర్ష సంతోషంగా లావణ్య వైపు చూశాడు.
"నాకు తెలుసు. మీరు చాలా మంచి అమ్మాయి."
"థాంక్స్" అంది లావణ్య.
కట్ లెట్ మీద టొమాటో కెచప్ ఓంపుకుంటూ , "కాఫీ" అని ఆర్డరిచ్చింది లావణ్య.
* * *
మర్నాడు కుటుంబరావుగారికి ఫోన్ చేశాడు.
"అన్నీ అరేంజ్ చేశాను మై డియర్ బోయ్. నువ్విప్పుడు మా క్లబ్బ్ మెంబరువి. సాయంత్రం జల్సాగా క్లబ్బుకొచ్చేయ్! తీరిగ్గా మాట్లాడుకుందాం" అన్నారాయన.
ఆరింటికల్లా క్లబ్బుకెళ్ళిపోయాడు శ్రీహర్ష. ఇంకా ఎక్కు మంది జనం రాలేదు.
లాన్ లో రాజేష్ కూర్చుని ఉన్నాడు. శ్రీహర్షని చూడగానే చెయ్యి ఊపి రమ్మన్నట్లు సైగ చేశాడు.
దగ్గర కెళ్ళి కూర్చున్నాడు శ్రీహర్ష.
"మీ మెంబర్ షిప్ ఓకె అయింది కదూ?"
"అవును"
"వెల్ కమ్ టూ ది క్లబ్."
"థాంక్స్"
రాజేష్ నవ్వాడు. "ఇక నుంచి కొత్త కొత్త పరిచయాలూ, కొత్త కొత్త స్నేహాలూ- అన్నట్లు లావణ్య ఎలా పరిచయం అయింది మీకు?"
"అదంతా పెద్ద కధ. చెప్పమంటారా?"
"కధలంటే నాకిష్టం, చెప్పండి."
శ్రీహర్ష చెప్పాడు. రాజేష్ విలాసంగా కాలు ఉపుతూ విన్నాడు.
"లావణ్యకి చాలా పొగరు. తొందరగా ఎవరితోనూ ఫ్రెండ్ షిప్ చేసుకోదు. మీతో చాలా తొందరగా పరిచయం పెరిగిపోయినట్లుందే?"
"మీతో కుడా అలాగే నా పరిచయం పెరిగిపోవాలని కోరుకుంటున్నాను."
"గుడ్! పాలిష్ డ్ గా మాట్లాడి మనుష్యుల్ని వశం చేసేసుకుంటారు. అదన్నమాట మీ టెక్నిక్. ఓకె మిస్టర్ శ్రీహర్షా! నన్ను కూడా ఇవాళ నుంచి మీ ఫ్రెండ్ గా పరిగణించండి" అంటూ చెయ్యి అందించి షేక్ హాండ్ ఇచ్చాడు.
ఇంతలో ఎర్ర నైలాన్ షర్టూ, తెల్ల గేబర్టిన్ పాంటు వేసుకుని, ఖారా కిళ్ళి నములుతూ ఒక వ్యక్తీ ప్రవేశించాడు.
అటూ ఇటూ చూసి "ఇక్కడున్నావా?" అంటూ రాజేష్ దగ్గరికి వచ్చాడు. "లోపల అడిగాను లాన్ లో కూర్చుని ఉన్నావన్నారు. ఏం కధ? ఇంకా బుడ్డి ఓపెన్ చెయ్యలేదు?"
నవ్వాడు రాజేష్. తర్వాత శ్రీహర్షని చూపిస్తూ "కొత్త మెంబరు. శ్రీహర్ష. శ్రీహర్షగారూ! ఇతను వాసు. క్లబ్బులో చాలా పాత మెంబరు. వృత్తి వ్యాపారం హాబీ సంఘసేవ. అందుకే అనాధ శరణాలయం ఒకటి పెట్టాడు.
"సర్లే! కొత్తళ్ళ ముందు ఊరికే నన్ను పొగిడేయ్యకు. సిగ్గేస్తుంది- " అంటూ నవ్వి "ఇంతకీ సరుకెప్పుడిస్తావయ్యా మొగుడా?" అంటూ రాజేష్ భుజం మీద తట్టాడు.
"నన్ను పదిసార్లు హెచ్చరించావంటే నాకు వళ్ళు మండుతుంది. నేను ఎప్పుడు డెలివరి ఇస్తే అప్పుడు తీసుకోవాలి. అంతవరకూ మాట్లాడ్డానికి వీల్లేదు."
"ఏమి రుబాబురా బాబూ" అనుకుంటూ వాసు వెళ్ళడానికి వెనక్కి తిరిగి, నాలుగడుగులు వేసి, అంతలోనే గుర్తొచ్చినట్లు "వస్తా శ్రీహర్ష సాబ్! దయించండి" అంటూ వెళ్ళిపోయాడు.
"ఇతను అనాధశరణాలయం పెట్టాడా?" అన్నాడు శ్రీహర్ష ఆశ్చర్యంగా.
"అవును"
"ఆశ్చర్యంగా ఉంది. మనిషి మోటుగా, అనాగరికంగా కనబడుతున్నాడు కదూ, అలాంటివాడిలో ఉన్నత భావాలుండడం......"
"అకారాల్ని చూసి మోసపోకండి మిస్టర్ శ్రీహర్షా! ఎర్ర చొక్కాలేసుకున్న వాళ్ళంతా రౌడీలు కాదు- నాలాగా ఫ్యాషన్ బుల్ సూట్లు వేసుకున్న వాళ్ళందరూ పెద్దమనుష్యులు కారు. ఏమంటారు?" అన్నాడు రాజేష్ సిగరెట్ వెలిగిస్తూ.
రాజేష్ వైపు ఒక్కసారి చూసి అతని సూటు ఇండియాలో కుట్టినది కాదని తక్షణం గ్రహించాడు శ్రీహర్ష. అవును- అతను డబ్బున్న వాడు. సూట్లు పారిస్ లో కుట్టించుకోగలడు. తలుచుకుంటే మాసిన బట్టలు స్యుయార్కులో ఉన్న లాండ్రికి పంపగలడు.
డబ్బు! డబ్బు!
డబ్బు ఏం చెయ్యలేదు?
ఏం చేయించలేదు?
"అదిగో హీరోయిన్" అన్నాడు రాజేష్ నవ్వుతూ. శ్రీహర్ష తిరిగి చూశాడు.
లావణ్య, వాళ్ళమ్మా, నాన్నగారూ.
అందరూ శ్రీహర్షకి కంగ్రాట్స్ చెప్పారు - వసుంధర తప్ప.
క్లబ్బులో చేరడం వల్ల లాభాలు అప్పుడే కనబడుతున్నాయి శ్రీహర్షకి. అక్కడ పరిచయమైనా ఇద్దరు ముగ్గురితో మాట్లాడుతుంటే, మాటల్లో రెండు కాంట్రాక్టులు దొరికాయి.
"రేపు నాన్నగారూ, అమ్మా బాంబే వెళుతున్నారు. మా ఇంటికొస్తే చక్కటి డిన్నర్ సర్వ్ చేస్తాను. రండి." అంది లావణ్య, శ్రీహర్ష ఒక్కడే ఉన్నప్పుడు.