Previous Page Next Page 
వెన్నెల మెట్లు పేజి 16

 

    ప్రతిమ వెనకనే పరిగెత్తుకు వచ్చింది సుందరమ్మ. టవల్ కట్టుకుని బాత్ రూంలోకి వెళ్ళబోతున్న శంకర్ కూడా వచ్చాడు.
    
    "ఏమిటీ? ఏమిటీ? ఏమయిందీ?" అంది సుందరమ్మ కీచు గొంతుతో.
    
    కేశవరావు ఉగ్రనరసింహావతారం ఎత్తినట్లు ఉన్నాడు.
    
    "ఈ త్రాష్టుడు, ఈ పుండాకోర్....నామీద...." పోలీస్ రిపోర్ట్ ఇచ్చాడు, అనబోయి సకాలంలో ఆగిపోయాడు కేశవరావు. తన ఉద్యోగం వూడబోతున్నట్లు ఇంట్లో ఆడంగులకి తెలియడం ఆయనకి ఇష్టంలేదు.
    
    శ్రీరాం కళ్ళు  రోషంతో చింతనిప్పుల్లా ఎర్రబడ్డాయి. పెదిమలు బిగుసుకుపోయాయి. తన మెడమీద వున్న కేశవరావు చేతిని పూచికపుల్లలా తోసేసి, పెద్ద పెద్ద  అంగలు వేసుకుంటూ వెళ్ళిపోయి కార్లో కూలబడ్డాడు అతను. ఫెడేల్మని డోర్ వేశాడు. మరుక్షణంలో రెండు గజాలు ముందుకు దూకి, వేగం పుంజుకుని వెళ్ళిపోయింది కారు.
    
    ప్రతిమ దిగ్భ్రమ చెంది చూస్తోంది.
    
    "ఏమంటాడు? పిచ్చి పిచ్చిగా ఏమన్నా వాగాడా?" అంటున్నాడు శంకర్.
    
    కేశవరావు ఎవరికీ జవాబు చెప్పకుండా కుర్చీలో కూలబడిపోయాడు. ఆయనకి గుండెదడ తగ్గేసరికి పావుగంట పట్టింది.
    
    శ్రీరాం శ్రీరాం అంటే ఈ ముదనష్టపు వెధవేనా? అక్కడ తన ఉద్యోగానికి ఎసరుపెట్టి పొట్టమీద కొడతాడూ? ఇక్కడ తన కూతుర్ని ఎగరేసుకుపోయి తన నోటిముందు కూడు లాక్కుంటాడూ? వీణ్ణి పరపర కోసి కాకులకూ, గద్దలకూ వేసినా పాపం ఉందీ? అయినా ఆగర్భ శత్రువులాగా ఎక్కడ బడితే అక్కడ తనకు ఎదురు నిలుస్తున్నాడేమిటి వీడు?
    
    "ఏమిటా శివాలెత్తిపోవడం? మాకూ చెప్పి ఏడిస్తే కదా తెలిసి చచ్చేది?" అంది సుందరమ్మ.
    
    "వీడు పరమ లుచ్చాగాడే! వీడి వెధవ్వేషాలన్నీ నేను బాగా ఎరుగుదును. ఏ ముఖం పెట్టుకుని నా కూతుర్ని చేసుకుంటానని వచ్చాడూ? కాళ్ళిరగ్గొడతాను ఈసారి నా ఇంటివైపు వచ్చాడంటే."
    
    హతాశురాలైపోయింది ప్రతిమ. తండ్రి ఆగ్రహానికి కారణమేమిటో ఆమెకి అంతుబట్టలేదు. శ్రీరాం ముందునుంచే తెలిసినట్లూ, అతనితో తనకి దీర్ఘశతృత్వం ఉన్నట్లూ మాట్లాడుతున్నారాయన. మరి ఆ సంగతి శ్రీరాం తనతో ఎందుకు చెప్పలేదూ?
    
    ఆమెకంతా అయోమయంగా ఉంది.
    
    ఆ సాయంత్రమంతా ఎవ్వరితో మాట్లాడలేదు ప్రతిమ. గదిలోకి వెళ్ళిపోయి లైటు వేసుకోకుండా కళ్ళకి చెయ్యి అడ్డం పెట్టుకుని, పడుకుని వుండిపోయింది. సుందరమ్మ గద్దించినా లేవలేదు.
    
    ప్రతిమ లేవలేదు కాబట్టి వాళ్ళ పొయ్యిలో వెచ్చగా పడుకున్న పిల్లి కూడా లేవలేదు. అందువల్ల ఆ రోజు వాళ్ళింట్లో విస్తళ్ళు కూడా లేవలేదు. అందరూ పస్తు ఉండిపోయారు.
    
    ప్రతిమ మీద అంతలా ఆధారపడి వున్నారు ఆ ఇంట్లో వ్యక్తులు. ఆమె పనిపాటలూ, ఆమె సంపాదనా లేకపోతే బుడుంగున మునిగిపోయేటట్లు వుంది ఆ సంసారనౌక.
    
    తల్లీ, తండ్రీ మాట్లాడుకుంటున్న మాటలు అప్రయత్నంగానే ప్రతిమ చెవిలో బడుతున్నాయి.
    
    "అంత ఎగిరిపడ్డారేమిటి మీరూ? అసలేం జరిగిందీ చెప్పరేం?"
    
    "ఏముందీ చెప్పడానికి? వీడుత్త ఆవారాగాడు. రోజుకో అమ్మాయిని ఆ కార్లో ఎక్కించుకుని బుర్రుమని పోతుంటే ఇదిగో నా తల వెంట్రుకలెన్ని వున్నాయో అన్నిసార్లు చూశాను." అన్నాడు కేశవరావు, సునాయాసంగా అబద్దం ఆడేస్తూ.
    
    "శివ శివా! ఇంకా నయం! ముందే మీకు తెలియబట్టి కానీ, లేకపోతే కొంప ముంచేసేవాడు. "వీడి హడావిడిలో అసలు సంగతి చెప్పడం మరిచేపోయాను, ఇందాక జగన్నాధం కబురంపితే వెళ్ళాను, జగన్నాథం గుర్తున్నాడా? వాడేనే."
    
    "ఏ జగన్నాధం? బెజవాడలో..."
    
    "ఆ వాడే! రోజూ వచ్చి నా దగ్గర పీకె అడుక్కుని వెళుతుండేవాడే - వాడే, ఆ జగన్నాధమే ఇవాళ మినిస్టరుట! వెళ్ళగానే కావిలించుకుని.
    
    'చూడు కేశవా! నీ ఎంగిలి చుట్టలు కాల్చి ఇంతవాన్నయానూ, ఎలాగైనా నీతో చుట్టరికం కలుపుకోవాలిసిందే, నీ కూతురు నీ కొడుక్కి పెళ్ళాం కాబోతూందీ, మరింక నోరెత్తకూ' అని వూదరగొట్టేశాడు"
    
    "మినిస్టరయ్యాడూ? అంతేలెండి. ఎన్ని వెధవ పనులు చేస్తే అంత గొప్పవాళ్ళయిపోతున్నారు ఈ రోజుల్లో. ఇంతకీ పిల్లని చూడ్డానికి వస్తారట్నా?"
    
    గొంతుకేదో అడ్డం పడ్డట్లు ఉక్కిరి బిక్కిరయ్యాడు కేశవరావు. తరవాత తేరుకుని ---        
    
    "చూడటం లేదూ, గీడటం లేదూ - నేనూ అదే చెప్పాను. 'ఒకసారి లాంఛనంగా వచ్చి చూడువయ్యా' అని వాడు ఆ మాటని ఏకులా తీసిపారేసి - 'నీతో నాకు సంబంధం ముఖ్యంకానీ, పిల్ల ముఖ్యంట్రా కేశవా?' అని ఎగిరిపడ్డాడు. రెండేళ్ళలో వాళ్ళ అబ్బాయి లండన్ నుంచీ తిరిగి రాగానే పెళ్ళి చేసేద్దామన్నాడు."
    
    "అట్టాగా" అంది సుందరమ్మ ఆవలిస్తూ.
    
    పక్క గదిలోంచి వింటున్న ప్రతిమకి అవన్నీ కోతలుగా అనిపించాయి కానీ, నిజాలనిపించలేదు.
    
    ఎందుకు నాన్నగారికి శ్రీరాం అంటే అంత అయిష్టం?
    
    అతను నిజంగా తిరుగుబోతా?
    
    ఉహు....నమ్మబుద్దెయ్యటం లేదు ఎందుకో?
    
    మరి, శృతి చెప్పిందే నిజమా? తను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోవడం ఇష్టంలేదా?
    
    ఇంత అసహ్యంగా గొడవ జరిగాక, ఇంక శ్రీరాం తన మొహం చూడ్డానిక్కూడా ఇష్టపడడేమో!
    
    నాన్నగారి ప్రవర్తన తనకే ఇంత సిగ్గు కలిగిస్తుంటే, పాపం అతను ఎంత ఫీలయి ఉంటాడో! ఛీ ఛీ!
    
    అతన్ని ఒక్కసారి వెంటనే కలుసుకుని, "ఐయ్యామ్ సారీ! టెర్రిబ్లీ సారీ!" అని చెప్పగలిగితే ఎంత బాగుండు!
    
                                                              * * * * *
    
    నిన్నటి ఆ సంఘటన జరిగిన దాదాపు పదహారు గంటలు గడిచినా, ఇంకా కేశవరావు చెయ్యి తన మెదమీదే ఉన్నట్లు అనిపిస్తూంది శ్రీరాంకి.
    
    గాడ్డామిట్!
    
    తనని మెడ పట్టుకు గెంటుతాడా? బాస్టర్డ్! వాడి మెడ కోడిపిల్ల మెడలా విరిచెయ్యగలడు తను!
    
    కానీ అతనా అమ్మాయికి తండ్రి అయిపోయాడు! అందుకే బతికిపోయాడు. అదే ఇంకోడయి ఉంటే రక్తం కళ్ళజూసి, ఏ ఎముక నా ఎముక విరిచేసి ఉండును తను!
    
    ఈ లంచగొండి మనిషి ప్రతిమకి తండ్రా! మైగాడ్! ఎలాంటి వాడికి ఎలాంటి కూతురు!

 Previous Page Next Page