బహుశా ఈ దేశంమీద దేవుడికి బాగా కోపం కాబోలు.
అందుకే ఇలాంటి నాయకులని మన దేశం మీదకి వదిలాడు.
రచన వాళ్ళ నాన్న అస్సలు పేరు వెంకటి.
రాజకీయాల్లోకి వచ్చాక ఆయన వెంకటేశ్వరరావు అయ్యాడు.
అతని తండ్రి తరఫునగానీ, తల్లి తరఫునగానీ ఎలిమెంటరీ స్కూలు చదువు పూర్తిచేసిన వాళ్ళెవరూ లేరు.
కేవలం ఈ దేశ విద్యార్ధుల దౌర్భాగ్యవశాత్తూ ఆయన నానా గడ్డికరిచి ఎట్టకేలకు 'ఎడ్డుకేసన్ మినిట్టర్' పదవిని దొరకబుచ్చుకున్నాక-
తనకి పుట్టిన కూతుళ్ళకి రచన, సాహితి, కవిత అని పేర్లు పెట్టాడు.
ఆ ముగ్గురు కూతుళ్ళకీ పొట్టకోస్తే అక్షరం ముక్క రాకపోయినా వెంకటి సారీ! వెంకటేశ్వరరావు మాత్రం పట్టువదలని విక్రమార్కుడిలా పెద్దకూతుర్ని డాక్టర్ చేసిపారేశాడు.
(దయచేసి ఎలా అని అడక్కండి! ప్లీజ్! అన్నీ తెలిసి కూడా మీరు ఎందుకలా....?)
వెంకటి తన రెండో కూతుర్ని ఇంజనీర్ ని చేశాడు.
(ఎలాగో మీకర్ధమయ్యే వుంటుంది పూర్తిగా ఈ పాటికి.)
ఇప్పుడీ మూడో కూతురు రచన. రచనకి కాలేజీలైఫంటే ఇష్టం.
అందులోనూ జెయ్ చంద్రవున్న కాలేజీ అట్ మాస్ ఫియర్ అంటే అమితమైన యిష్టం.
అదితప్ప-
రచనకి కాలేజీ చదువంటే కంపరం.
పుస్తకాలని చూస్తే పేడపురుగుల్ని చూసినంత అసహ్యం.
పాఠాలు చెప్పే లెక్చరర్ లు, చెవి కోస్తే అరుస్తున్న మేకల్లా కనబడతారు ఆ అమ్మాయి కళ్ళకి.
ఆమెకి చదువుమాట అలా వుంచి ఉత్తరాలు రాయడం కూడా రాదు.
(ప్రేమలేఖలు మాత్రం ప్రాక్టీసు చేసింది -- ప్రేమలేఖలు రాయడం ఎలా అనే పుస్తకం పక్కన పెట్టుకుని.)
ఆ పుస్తకంలో వున్న మోడల్ వుత్తరాలన్నీ కాపీకొట్టి జెయ్ చంద్రకి రోజుకో ప్రేమలేఖ చొప్పున లెక్కలేనన్ని ప్రేమలేఖలు రాసేసింది కూడా.
కానీ దాని తాలూకు ఎఫెక్టు మాత్రం నిల్!
దరిమిలా రచన ఆ పుస్తకాల షాపుకెళ్ళి ఆ పుస్తకం వాడిమొహాన కొట్టేసి, డబ్బు వాపస్ తెచ్చేసుకుంది కూడా.
ఆశించిన రిజల్టురాలేదని.
నిమ్మీ, షీలా, రచనా-
ఈ ముగ్గురి ఆలోచనలకీ, ఆశలకీ, ఆశయాలకీ, వగైరా వగైరాలకి కేంద్రం మన జెయ్ చంద్ర.
కానీ అతని కంటికి వీళ్ళు ఆనరు.
ఎంచేతంటే అతని లోకమంతా సితారదే.
అయితే సితారకేమో అతని పేరు చెబితేనే ఒళ్ళంతా భగ్గుమంటుంది.
అద్గదీ సెటప్పు.
ఈ తికమక మకతిక ఇలా వుండగా-
అక్కడ.....విశేష్ ఉరఫ్ శేషుగారింట్లో....
"అబ్బాయ్! నువ్వింక పరమనెంటుగా యిక్కడే తిష్ట వేసేట్లున్నావు కాబట్టి మనం మంచి సెడూ హోల్ మొత్తం యిప్పుడే మాట్లాడేస్కోవాలి. అంత్యనిష్ఠూరం కంటే ఆదినిష్ఠూరం మేలన్నారు" అన్నాడు శేషు.
"ఏ విషయం గురించి అంటావ్?" అన్నాడు జెయ్ పరధ్యానంగా.
అతని దృష్టి అంతా సితార వుండే డాబా యింటి పోర్షనుమీద వుంది.
"అన్ని విషయాల గురించీనూ" అన్నాడు శేషు.
"సరే! చెప్పి ఏడు" అన్నాడు జెయ్ విధిలేనట్లు.
"మొదటివిషయం యీ ఇంటి అద్దె నేను భరించగలనుగానీ, నీ తిండి ఖర్చు మాత్రం నేను పెట్టుకోలేను. నీపోట్ట నువ్వే పోషించుకోవాలి. నీ సాపాటు అరేంజ్ మెంటంతా నీదే. నీ కుక్క సంగతి కూడా డిటో"
"సరే!"
"ఊర్కే సరే అనేస్తే కుదర్దు. ముద్ద ఎక్కడ్నుంచి వస్తుందో చెప్పు."
"నా గొడవ నేను చూసుకుంటాలేవోయ్. లేకపోతే పస్తు పడుకుంటా సరేనా?"
"నేను భోజనం చేస్తుంటే నువ్వు శాపనార్ధాలు పెడుతూ చూస్తుంటే నాకు బావుండదు. ఇవాళ ఒక్కరోజుకీ నాతోపాటు తిను. రేపట్నుంచీ తిప్పలు నీవి. నీకు పాతనిమ్మకాయ యిష్టమేనా? లేకపోతే ఉసిరికపచ్చడి వెయ్యమంటావా? రేయ్! మా ఇంట్లో నూనె, నెయ్యీ వుండవు. మజ్జిగ మాటే ఎత్తకూడదు. పచ్చడిమెతుకులే పంచభక్ష్యాలని తినెయ్యాలి. అర్ధమైందా?" అన్నాడు శేషు.
"ఓర్నీ పచ్చడ్ని పారెయ్యా! తిండి తప్ప నీకీ ప్రపంచంలో వేరే గొడవ పట్టదట్రా?"
"పాలూ, మీగడా, పెరుగుతో పెరిగినవాడివి! నీకేం తెలుస్తుంది ఆకలి బాధ. రెండ్రోజులు పోనీ, ఉసిరిక పచ్చడి నూరేస్తున్నా."
"నీకు దణ్ణం పెడతా! నన్నొదిలెయ్యరా నా సితార గురించి ఆలోచించుకోనీ."
"సరే నీ యిష్టం. పోనీ పచ్చిమిరపకాయలకారమూనూ, కరివేపాకు పొడి చేసేస్తా. ఏమంటావ్?"
"ఆనూరేదేదో నీ ఒక్కడికోసమే నూరుకో"
"నీకో?"
"నాకొద్దు"
"డొక్కమాడితే దోవలోకి వస్తావ్. ప్రేమ కూడూ, గుడ్డా పెట్టదురోయ్. గుర్తుందుకో."
"ఫర్లే"
"దటీజ్ యువర్ ఫ్యూనరల్" అన్నాడు శేషు.
(అతనికి వచ్చిన ఇంగ్లీషు తిట్టు అదొక్కటే అని మళ్ళీ మనవి చేస్తున్నాను.)
"ఒరేయ్! సాధించడం మానేసి ఒక్క సిగరెట్ ఇవ్వరా" అన్నాడు జెయ్ చంద్ర జాలిగా.
"నేను సిగరెట్లు కాల్చనుగదా, అప్పుడప్పుడు నశ్యం పీలుస్తా...నశ్యం డబ్బీ యివ్వనా?" అన్నాడు శేషు ముక్కు ఎగబీలుస్తూ.
"నువ్వు సరిగ్గా నూటపాతికేళ్ళ క్రితం పుట్టాల్సినవాడివిరా. పోనీ కాఫీ అన్నా వుందా?" అన్నాడు జెయ్ చంద్ర.