"నా సహాయం కోరూ, అంటారు అంతేనా?" అనిల్ మాట పూర్తిచేసింది దీప.
"అంతే అనుకో తప్పా?"
"తప్పులేదు. నాపై ఎందుకో యింత... అదే శ్రద్ధ."
"నువు నాకు నచ్చావ్ కాబట్టి"
"నచ్చటమా?"
అనిల్ రెండు గుటకలు మింగి... "నచ్చటమంటే అదే... నచ్చటమే, అంటే ముక్కుసూటిగా మాట్లాడటం ధైర్యం, అప్పుడప్పుడు గడుసుదనం, ఒక్కోసారి గాంభీర్యం అబ్బో నీలో చాలా వున్నాయిలే. ఆ సుగుణాలన్నీ నాకు నచ్చాయి" అన్నాడు.
వస్తున్న నవ్వుని ఆపుకుంది దీప.
అనిల్, పార్వతమ్మ, ఎన్నో విషయాలలో ఆదుకున్నారు, సహాయం చేశారు, సలహా లిచ్చారు, సానుభూతితో అర్ధంచేసుకున్నారు. తన సమస్యని అనిల్ తో చెప్పటంలో తప్పులేదు. సహృదయంతో వింటాడు, తోచింది చెపుతాడు.
దీప వివరంగా అనిల్ తో చెప్పింది.
"ఇంతవరకూ వచ్చింది కాబట్టి మీ బావ ఏమయినా చేయవచ్చు. పిల్లలు లేరు కాబట్టి విడాకులు కొరకై చూడొచ్చు. ఎవతినన్నా మూడో కంటికి తెలియకుండా పెళ్ళాడవచ్చు. మీ అక్క జీవితాంతం ఇక్కడే వుండవలసి రావచ్చు. ఇది చిక్కు సమస్యే కనబడే లోపం మీ బావలో వుంటే ముందరి కాళ్ళకు బంధం వేయవచ్చు."
"బావలో లోపం లేకేమి, ఉన్నదే బావలో"
"ఏమిటా లోపం?"
"బావ ధర్మమా అని అక్క మాతృవియోగానికి దూరం అయింది."
"ఫరవాలేదు. వివరంగా చెప్పు దీపా!"
"అక్కకి తరుచు కడుపులు పోతుండేవి. కారణం పెద్దగా ఎవరికి తెలియదు. ఇప్పుడు కొత్తగా వచ్చిన డాక్టరమ్మ కనిపెట్టింది. అక్కతో చెప్పింది. మా భార్యాభర్తలిరువురు మందులు తినాలి. పూర్తి ఆరోగ్యం పొందిందాకా పిల్లలమాట తలపెట్టవద్దు. మీలో ఉన్నవ్యాధి తగ్గిస్తా ననుకోండి, మళ్ళీ మీ భర్తద్వారా మీ కొచ్చి మొదటికే వస్తుంది. అంటూ ఎన్నో జాగ్రత్తలు, ఏవేవో సలహాలు ఇచ్చింది. అక్క అర్ధం చేసుకోలేదు, వినిపించుకోలేదు."
"వ్యాధి అంటే...!" అనిల్ అర్ధోక్తిగా ఆగిపోయాడు.
"అర్ధంకాలేదా?" దీప నెమ్మదిగా అంది.
"సిఫిలిస్, గనేరియా...అదే సుఖవ్యాదులంటారు..."
"ఊ."
"సరే, తర్వాత ఏమయింది?"
"ఎప్పటిలా శ్రద్ధగా మందులు పుచ్చుకున్నా అక్కకి ఎబార్షన్ అయింది. కాకపోతే కడుపు కోయాల్సి వచ్చింది. పాడయిపోయిన గర్భకోశాన్ని తీసివేయవలసి వచ్చింది."
"దీపా! ఇంక చాలు. మీ బావకి మీ అక్కచేత ఘాటుగా ఓ లెటర్ రాయించు. ఏమనంటే..., "మీ బెదిరింపు లెటర్ నా వద్ద వుంది. నేను తల్లిని కాకపోవటానికి కారణం మీరు. డాక్టర్ సాక్ష్యం వుంది. మర్యాదగా నన్ను తీసుకెళ్ళండి. పిచ్చిపిచ్చి పనులు చేయటానికి ప్రయత్నిస్తే నేనే ముందుగా మిమ్మల్ని కోర్టుకెక్కిస్తాను" ఇలాంటి లెటరు మీ అక్క బావకి రాసిందనుకో, అతను కొండదిగి వస్తాడు. మీ బావ రాసిన లెటర్ భద్రంగా వుంచు, తను స్వయంగా రాసిన ఆ లెటర్ తనకే ముప్పని జీవితాంతం భయపడతాడు, జాగ్రత్తగా వుంటాడు. పెళ్ళాన్ని బెదిరిస్తూ లెటర్ రాయటం నేరం అని మీ బావకి తెలియదో లేక లెటర్ చూసి భయపడి కాళ్ళ బేరానికి వస్తారనుకున్నాడో మొత్తానికి అతి తెలివితో అగాధంలో పడ్డాడు" వివరంగా చెప్పాడు అనిల్.
"ఓహ్, నాకీ ఆలోచన తట్టలేదు. మీరు ప్రతిసారీ నాకు...
"రుణ పడుతున్నానా?"
"కాదు అనిల్."
"మరేమిటీ?"
"అది మాటలతో చెప్పలేనిది."
"ఊ... నాకర్ధం అయింది."
"ఏమిటర్ధమయింది?"
"అది మాటలతో చెప్పలేనిది!" దీప అన్నట్లే అన్నాడు అనిల్.
ఇద్దరికీ నవ్వొచ్చింది. అనిల్ వద్ద దీపకి చనువుంది. అది శృతి మించనంతవరకే. పెద్దగా తమాషా మాటలుకూడా వాళ్ళ మధ్య ఎప్పుడూ దొర్లలేదు. అతిచనువు ప్రదర్శించానేమో అని దీప సిగ్గుపడింది; అతిగా పోలేదు కదా అనుకున్నాడు అనిల్. ఆ తర్వాత చదువు సరీగా సాగనేలేదు. తనే పాఠం చెపుతున్నాడో అనిల్ కి తెలియలేదు. చెపుతున్నది అర్ధమవుతున్నదో లేదో దీపకి తెలియలేదు. ఆ పూటకి చదువయిపోయింది. దీప పుస్తకాలు సర్దుకుంది.
"దీపా!" ఏదో చెప్పాలని పిలిచాడు అనిల్.
"ఊ!" అంది దీప.
"ఏంలేదులే వెళ్ళు" ముఖం పక్కకు తిప్పుకున్నాడు అనిల్.
అనిల్ చాలాసార్లు సహాయం చేశాడు. ఇప్పుడు సలహా ఇచ్చి మరో సహాయం చేశాడు. తను ఏ విధంగా కృతజ్ఞత చెప్పుకోవాలో, ఏం మాట్లాడాలో, మాటకు మాట చెప్పగలిగిన దీపకి మాటలే కరువయ్యాయి. అనిల్ ఏమయినా చెపుతాడేమో అని దీప ఆగింది. దీప వెళ్ళక పోవటం చూసి అనిల్ తల ఎత్తి దీప కళ్ళలోకి సూటిగా చూశాడు. అనిల్ చూపుల్లో తన చూపులు కల్సిన దీప కంగారుపడింది. చేతిలో వున్న పుస్తకాలు జారి కిందపడ్డాయి. దీపకన్నా ముందే అనిల్ వంగి పుస్తకాలు తీశాడు. దీప చేతికిచ్చాడు.
"పరధ్యానంగా వుంటే పొరపాట్లు జరుగుతాయి. చూశావా పుస్తకాలు కిందపడ్డాయి."
"అందివ్వటానికి మీరున్నారుగా అనిల్."
"ఆ...!"
"ఊ..."
నవ్వుకుంటూ దీప గబగబ గుమ్మం దాటింది.
"బజారులో పుస్తకాలు పారేసుకునేవ్! ఏరివ్వటానికి రారు" దీప కినబడేటట్లు బిగ్గరగా అన్నాడు అనిల్.
"నాకు తెలుసు. బజారులో జాగ్రత్తగానే నడుస్తాను. మరో సారి పుస్తకాలు పారేయను. ఓ వేళ జారవిడిచినా మీముందు జారవిడుస్తాను. ఏరి నా చేతి కందిస్తారు." అంతకన్నా బిగ్గరగా అని దీప వెళ్ళిపోయింది.
"గడుగ్గాయి" అని దీప వెళ్ళినవైపు చూస్తూ నుంచున్నాడు అనిల్.
14
మంచినీళ్ళకోసం దీప చింతల చెరువుకి సాయంత్రం బిందె పుచ్చుకొచ్చింది. మన్ మోహన్ చెరువులో కాళ్ళు పెట్టుకుని చేత్తో నీళ్ళు గిలక్కొడుతూ కూర్చునివున్నాడు. మన్ మోహన్ ఊరినుంచి వచ్చి వారం దాటింది. ఊరునుంచి రాగానే రెండుసార్లు దీపని కల్సుకున్నాడు. నాలుగురోజుల నుంచి ఒకరినొకరు కల్సుకోలేదు.