Previous Page Next Page 
జీవనయానం పేజి 17


    ఖమ్మముపుర చరిత్ర:

 

    ఖమ్మం పురానికి అధిష్టాన దేవత శ్రీ లక్ష్మీనరసింహస్వామి. వారి ఆలయం గుట్టమీద ఉన్నది. ఖిల్లా దగ్గర ఉన్నది. నరసింహస్వామి ఇక్కడే అవతరించి హిరణ్యకశిపుని వధించాడనే ఒక వదంతి ఉన్నది. అయితే అది సరికాదు. నరసింహస్వామి అవతరించింది కర్నూలు జిల్లాలోని అహోబిలంలో నరసింహుడు తెలుగు దేవర. నేను రచించిన శ్రీమద్భాగవతాన్ని అంకితం సమర్పిస్తూ "తెలుగు దేవర సింగన వెలుగు వేల్పు" అన్నాను.

 

    ఏది ఎట్లున్నావదంతినిబట్టే దీనికి "స్తంభాద్రి" అని పేరు వచ్చినది. అంటే స్తంభముగల కొండ అని అర్థం. కాని నరసింహస్వామి గుట్టమీద స్తంభం లేదు. ప్రఖ్యాతుడయిన హరిభట్టు "శ్రీమహిత స్తంభాచల" అన్నారు. అయితే ఆ పేరు ఎక్కువ కాలం నిలిచినట్టు లేదు. గుట్టకు మెట్లు ఉండడాన "కంబముమెట్టు పురము" అన్నాడు మరొకచోట హరిభట్టు.

 

    క్రీ.శ. 591లో మహాదేవశర్మ ఈ ప్రాంతానికి అధికారిగా ఉండేవాడు. 950లో ఓరుగల్లు నుంచి గుప్తధనం తెచ్చిన రంగారెడ్డి, లక్ష్మారెడ్డి, వెలమారెడ్డి ఖమ్మం మెట్టును ఆక్రమించుకున్నారు. ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్న దుర్గం - ఖిలా నిర్మించారు. 1006లో వారు దుర్గ ప్రవేశం చేశారు. వారి వంశం వారు 1424వరకు పాలించారు.

 

    తెలుగువారి కాకతీయ సామ్రాజ్యం పడిపోయింది. కాపానాయుడు, ప్రోలానాయుడు ఖమ్మంమెట్టు చేరుకున్నారు. ఆంద్ర సామ్రాజ్యం పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. కాని సఫలీకృతం కాలేదు. షితాబుఖాను అను బిరుదము గల సీతాపతి రాజు ఖమ్మం  దుర్గాన్ని ఆక్రమించుకొని పాలించాడు. 1526లో కుతుబ్ షా హీలు అతనిని ఓడించి ఆక్రమించుకున్నారు. శ్రీకృష్ణదేవరాయలు జయించిన దుర్గాల్లో "గంబంబు మెట్టు గ్రక్కన గదల్చె" అని ముక్కు తిమ్మన "పారిజాతాపహరణం"లో పేర్కొన్నాడు. ఖుతుబ్ షాహీల పక్షాన ఖమ్మం దుర్గాన్ని పాలించిన జఫరుద్దౌలా అతి క్రూరుడు. అతనిని ప్రజలు ధ్వంసుడు అన్నారు. ఆ తరువాత ఖమ్మం ఆసఫ్జాహీల పాలనలోకి వచ్చింది. దుర్గం మాత్రం - జఫరుద్దౌలా వంశీయులకే కావచ్చు - జాగీరుగా ఉండిపోయింది.

 

    ఖమ్మం పట్టణంలో "హరిభట్టు" అనే ఒక విద్యత్కవి నివసించినాడు. అతడు పోతనామాత్యునివలె నరాంకితమునకు విరుద్ధుడు. అతడు అష్ట ఘంటావధాన పరమేశ్వర బిరుదాంకితుడు. హనుమత్ప్రసాదలబ్ధవరప్రసాద సహజ సారస్వత వేత్త.

 

    ఈ మహాకవి సంస్కృత - ఆంధ్రములలో అఖండ పాండిత్యం కలవాడు. తెలుగులో మత్స్య, వరాహ, నృసింహ పురాణాలను, భాగవతంలోని 6 వ, 11 వ  12 వ స్కంధాలను రచించాడు. సంస్కృతంలో "రతిరహస్యం" అనే గ్రంథం రచించాడు. దానిని గద్వాల సంస్థానాధీశుడు సోమ భూపాలుడు 1769లో ఆంధ్రీకరించాడు. జర్మనువాడయిన స్మిత్ "రతి రహస్యం" అనే గ్రంథాన్ని జర్మనీలోకి అనువదించాడు.

 

    శ్రీకృష్ణదేవరాయలు - హరిభట్టు కవితా వైభవాన్ని గుర్తించాడు. హరిభట్టు తనకు అంకింత ఇవ్వకున్నా "చిన్నపల్లె" అనే గ్రామాన్ని "శ్రీరామ సముద్రం" గా మార్చి హరిభట్టుకు ఆగ్రహారంగా సమర్పించాడు.

 

    ఖమ్మం మెట్టును హరిభట్టు పురం అనవచ్చు. ఖమ్మం పురానికి అక్షరఖ్యాతి కలిగించినవాడతడు.

 

    రాజులనేకాని కవులను గుర్తుంచుకునే సంస్కారం మనకు లేదు!

 

    ఖమ్మం మెట్టుకు ఒకవైపు ముని+ఏరు = మునేరు ప్రవహిస్తుంది. దీని మీద కమానులుగల వంతెన ఉన్నది. వేసవిలో సహితం చిన్న పాయ ఉంటుంది. ఆ రోజుల్లో ఖమ్మం కొత్త బజారు దాహం మునేరు తీర్చేది. నీటిని బళ్లమీద తీసికెళ్లి కాణీకి బిందె చొప్పున అమ్మేవారు.

 

    మునేరు కాలువకు దగ్గరలో గుంటు మల్లేశ్వరస్వామి ఆలయం ఉంది. ఈ స్వామి రెడ్డి రాజులకు ఇలవేల్పు. బహుశః లక్ష్మారెడ్డి - రంగారెడ్డి - వెలమారెడ్డి ఆ దేవాలయాన్ని కట్టించి ఉంటారు.

 

    ఆ ఆలయం ముందు, ఒక గొప్ప ఊడలమర్రి ఉండేది. ఎవరో ధర్మాత్ముడు దాని చుట్టు ఒక విశాలం అయిన వేదిక నిర్మించాడు. ఒకరు మంచి బావి తవ్వించారు. పేదలు - ముఖ్యంగా భిచ్చగాళ్లు ఆ మర్రికింద ఉండేవాళ్ళు. వారిలో బైరాగులు తంబురా శ్రుతి పెట్టి శ్రావ్యంగా తత్వాలు పాడేవారు. రాత్రిపూట వంటలకు వరుసగా పొయ్యిలు ఉండేవి. అలా మండడం ఒక అందమైన దృశ్యం జ్వాలా తోరణంలా ఉండేది.

 

    ఆ మర్రి ఇప్పుడు లేదు. నా మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది. "మర్రిచెట్టు" అని ఒక కథ రాశాను.

 

    ఖమ్మానికి ఒక పక్కన నరసింహస్వామి గుట్ట ఉంది. మరొక పక్కన చెక్కు చెదరని దుర్గం - ఖిలా - ఉంది. ఆ ఖిలా బావి నీళ్లే ఆ ప్రాంతం వారికి మంచినీళ్లు.

 

    ఆ రోజుల్లో ఖిలాలోను - గుట్ట మీదనూ పులులు ఉండేవి. ఖిలా పక్కన శివాలయం ఉంది. ఆ ఆలయంలో పూజ చేస్తున్న బ్రహ్మడిని పులి పంజాతో పుర్రె బద్దలు చేసి చంపింది.

 

    ఇవికాక ఎనిమిది హనుమదాలయాలు - ఒక వేంకటేశ్వరాలయం - ఒక రామాలయం అప్పటికి ఉన్నాయి.

 

    సైకిలు సవారి:

         

    మేము గుంటి మల్లన్న బజారులోని విశాలం అయిన గృహంలో స్థిరపడ్డాం. మా తాతయ్య మాత్రం ఇరుకు ఇరుకు గాను - బలవంతంగానూ ఉన్నారు.

 

    ఖమ్మం గూడూరు వలె సుప్తగ్రామం కాదు. ఇది వ్యాపార కేంద్రం. కంకర రోడ్ల మీద నిరంతరం దుమ్ము లేపుతూ బండ్లు పోతూండేవి. లారీ అనే పదం అప్పటికి తెలియదు.

 

    గూళ్ళలో దీపాలు పెట్టటం లేదు. లోకల్ ఫండ్ - అంటే ఎన్నికలు లేని మున్సిపాలిటీ వారు - దీపాలు పెట్టేవారు. అక్కడక్కడా స్తంభాలకు గాజు పంజరాలుండేవి. సాయంత్రం కాగానే ఒకడు కానట్లో వెలుగుతున్న చిమ్మీలు - బుజానికి నిచ్చెన వేసుకొని వచ్చేవాడు. కావడిలో అన్ని చిమ్మీలు వెలుగుతుంటే నేలకు దిగిన నక్షత్రాల్లా ఉండేవి. అతడు కావడి దింపుకునేవాడు. స్తంభానికి నిచ్చెన వేసేవాడు. ఒక చిమ్మీని గాజుపంజరంలో పెట్టి, మూసి వెళ్ళిపోయేవాడు.

 

    ఇళ్లలో కిర్సనాయలు లాంతర్లు - బుడ్లు ఉండేవి. ఊకతో వెలిగించే కుంపటి ఊసేలేదు. అగ్గిపెట్టెలు వాడేవారు. పాలు - కూరగాయలు అమ్మేవారు. పాడి ఉన్న ఇండ్లు తక్కువ ఉన్నా, అమ్ముకునేవారు కాని, ఉచితంగా ఇచ్చేవారు కారు.

 

    గూడూరులోవలె వడ్లు దంచుకోవడం - పప్పులు విసురుకోవడం - నూనె గానుగ పట్టించడం లేవు. ఖమ్మంలో ధాన్యం మిల్లులు - నూనె మిల్లులు ఉండేవి.

 

    అవి వేరు శనగ కొత్తగా వస్తున్న రోజులు. వేరు శనగ చాల ప్రమాదకరం అయిందని ఎవరూ ముట్టుకునేవారు కారు. దీనివల్ల ఉన్న ప్రమాదాన్ని వివరించేవారు. "వేరు శెనగమ్మో వేరు శనగమ్మా!" అని బుర్రకథలు చెప్పేవారు. రాసుల కొద్ది పడివున్నా వాటిని అంటుకునేవారు కాదు. కోతులు తింటే పిచ్చి ఎక్కింది. అనుకునేవారు. వేరుశనగ నూనె వాడేవారు కారు. నువ్వులనూనె - మరలో పట్టింది, వాడేవారు. నెయ్యి గూడూరులో వలె మంచిది దొరికేది కాదు. నీళ్లకు మాత్రం బావులు - చాదలే. పంపులు - లైట్లు అనే పదాలు అప్పటికి తెలియవు.

 

    గూడూరులోవలె ఉచితంగా గాని - వినిమయ పద్ధతిలో కాని దొరికే పదార్ధం ఏదీ లేదు. అన్నీ డబ్బు పెట్టి కొనాల్సిందే! ఖమ్మంలో ద్రవ్య వినియోగం విచిత్రం అయింది. ఇది నిజాం రాజ్యం. అందువల్ల నిజాం కరెన్సీ మాత్రమే చెల్లాలి. ఏడు నిజాం రూపాయలకు ఆరు బ్రిటిషు రూపాయలు. ఇదీ మారక విలువ.

 

    ఖమ్మం బెజవాడకు దగ్గర. లావా దేవీలు ఎక్కువ బెజవాడతో ఉండేవి. కాబట్టి ఖమ్మంలో "కాణుల చెలామణి సాధారణంగా ఉండేది. ఈ కాణి విలువ నిజాం పైసన్నరా, రెండు పైసలూ ఈ వ్యాపారంలో లక్షలు ఆర్జించిన వారున్నారు.  

 

    ఖమ్మం నాణేల మీద చార్ మినార్ బొమ్మ - బ్రిటిషు నాణేల మీద రాజు లేక రాణి బొమ్మ ఉండేవి. నిజాం నవాబు ముస్లిము. ఇస్లాం ప్రకారం ప్రతిమలు - బొమ్మలు నిషిద్ధం. అందువల్ల చార్ మినార్ బొమ్మ. ఉభయ నాణేల పరిమాణం ఒకటే. రూపాయికి పదహారు అణాలు. అణాకు పన్నెండు పైసలు. విలువ మాత్రం నిజాం నాణెంది తక్కువ.

 

    ఆ రోజుల్లో ఖమ్మం మొత్తంలో పిండిమిల్లు ఉండేది కాదు. ఇళ్లలో విసుర్రాళ్ళు - రోళ్ళు - రోకళ్ళు - రుబ్బురాళ్ళతోనే పని. చాలకాలం తరువాత చేగొమ్మ వారి కొట్లలో ఒక పిండిమిల్లు పెట్టారు. కాని అది సరిగా నడిచేది కాదు.

 

    వైద్యవిధానం ఆయుర్వేదమే. కాని, గూడూరులో వలె నిరాడంబరం కాదు. అత్యంత ఆడంబరం. వైద్యంలో మా తాతయ్యను మించినవారు ఖమ్మంలో లేరు. అయితే మా తాతయ్య విరక్తులయినారు. ఎంత చెప్పినా వారు వైద్యం చేయలేదు. అప్పుడప్పుడూ వైద్యులు మా తాతయ్య సలహాకోసం వచ్చేవారు. అది కూడా వారికి అంత నచ్చేది కాదు.

 Previous Page Next Page