అప్పటికి M.B.B.S. లేదనుకుంటా. L.M.P. డాక్టర్లు ఇద్దరు ఉండేవారు.
ఆ కాలంలో జరిగిన ఒక విచిత్ర సంఘటన ఉంటంకించాలి:
ఒక ఆయుర్వేద వైద్యునికి ఇంగ్లీషు వైద్యం మీద మోజు గలిగింది. ఒక రోగికి ఇంజక్షను ఇచ్చాడు. ఆ రోగి చేయి పడిపోయింది. అతడు సర్కారుకు షికాయతు చేశాడు. ఆ కేసు బాబె - హుకూమత్, అంటే మంత్రిమండలిదాకా పోయింది. ఆ వైద్యుడు నైజాం రాజ్యంలో ప్రాక్టీసు చేయరాదని ఫర్మాన్ జారీ అయింది. ఆ వైద్యుడు చాల తెలివయినవాడు. ఖమ్మం వదిలాడు. సికిందరాబాదులో ప్రాక్టీసు పెట్టాడు. అప్పుడు సికిందరాబాదు బ్రిటిషువారి ఆధీనంలో ఉండేది.
ఇది వైద్య విధానంలో మారుతుండిన నమ్మకాలకు ప్రతీక.
ఊరి మొత్తంలో రెండే కార్లుండేవి. అయిదారు సైకిళ్లు ఉండేవేమో! సైకిలు ఉన్న వాళ్ళలో రామానుజాచార్యుల మామయ్య ఒకడు. వారు సైకిలు మీద మా ఇంటికి వచ్చినపుడల్లా అది ఎక్కాలని నా ఉబలాటం! దాన్ని ముట్టుకోనివ్వకపోయేవాడు మామయ్య. ఒక వింత సంఘటనలో నేను సైకిలు ఎక్కగలిగాను.
ఒకనాటి రాత్రి తాతయ్య, నాయన, నేను, అన్నయ్య భోజనాలు చేస్తున్నాం. మగవారి భోజనాలు అయింతరువాత ఆడవాళ్లు భర్తల ఎంగిలి విస్తళ్లలో భోజనాలు చేసేవారు. మగవారితో సహా పంక్తిన భుజించే అర్హత వారికి లేకుండేది.
మా అమ్మ వడ్డిస్తున్నది. చల్లమిరపకాయ నాకు వడ్డించబోయింది అమ్మ. వాడు తినలేడు అని మా నాయన వారించారు. నేను తినగలను అని సవాలు చేశాను. కాయమొత్తం ఒకేసారి తినాలి, రూపాయి ఇస్తా అన్నాడు నాయన. నేను అలాగే అన్నాను. చల్లమిరపకాయ వేయించుకున్నాను. మొత్తం తిన్నాను. పప్పుముద్ద నమిలాను. చెంబుడు నీళ్లు తాగాను.
అది చూచి మా నాయనకు ఆశ్చర్యం అయింది. మా తాతయ్యకు భయం అయింది. మా అమ్మ నన్ను ఎత్తుకుని బెల్లం తినిపించింది.
తెల్లవారి రూపాయి అడిగాను. రూపాయి వాస్తవంగా పెద్ద మొత్తం. మా నాయనకు బుద్ధి పుట్టలేదు. రామానుజాచార్యుల మామయ్యను పిలిపించాడు. వారు నన్ను ఏం కావాలని అడిగారు. సైకిలు ఎక్కించాలి. రబ్బరు బూట్లు కొనిపెట్టాలి అన్నాను. అప్పుడు వారు సైకిలు ఎక్కించుకొని ఖస్ఫా బజారు తీసికెళ్ళారు. అదొక మహాదానందం! ఇప్పుడు రాకెటు ఎక్కినా, చంద్రునిమీద వాలినా అంత ఆనందం ఉండదు. పావలా పెట్టి రబ్బరు బూట్లు కొనిపెట్టారు. ముప్పావలా మా నాయనకు తిరిగి ఇచ్చారు.
వానర స్తంభాద్రి:
ఖమ్మంమెట్టులో చాలవరకు పెంకుటిళ్లు. గూడూరు గూనకు ఖమ్మం పెంకుకు భేదం ఉంది. గూడూరు గూన కుమ్మరి సారెమీద చేస్తారు. కుమ్మరివారే చేస్తారు. అది గుండ్రంగా ఉంటుంది. దానిని చేతిలోకి తీసుకొని సగానికి విరక్కొడితే గూన అవుతుంది. ఖమ్మం పెంకు కుమ్మరిసారి మీద తయారు కాదు. మట్టితో బిళ్లలు చేస్తారు. వాటిని ఒక దుంగమీద వంచుతారు. పెంకు సిద్ధం అవుతుంది. దానిని మధ్యకు పగుల కొట్టాల్సిన పనిలేదు. అయితే గూన, పెంకు రెండూ కాలుస్తారు.
ఖమ్మం మెట్టులో కోతులు ఎక్కువ. ఇంటి మీద పెంకులుండనీయవు. ఊడపీకుతాయి. అందువల్ల ఇళ్ల కప్పుల మీద రేగు కంప పరిచేవారు. వేసవి కాలంలో బండ్ల మీద రేగు కంప అమ్మేవారు. వేసవిలో ఇళ్లు కప్పించేవారు. కప్పించడం అంటే పెంకులు తీసి మళ్ళీ పేర్చడం.
పెంకులు పేర్చడం ఒక క్రమ పద్ధతిలో జరుగుతుంది. రెండు వరుసల పెంకులు తల క్రిందులుగా ఒక్కొక్కటీ ఒక కాలువలా పేరుస్తారు. ఈ రెంటిమీద ఒక వరస పెంకులు బోర్లించి పేరుస్తారు. అందువల్ల రెండు వరసల సందు పూడుతుంది. అలా ఎన్నివరుసలయినా కప్పవచ్చు. అలా పెంకు కప్పడం పూర్తి అవుతుంది. అప్పుడు రాగోలతో కంపదొంతరలు తీసి కప్పుమీద పరుస్తారు. తరువాత తాళ్లు పెట్టి జారిపోకుండా కడ్తారు. ఆ విధంగా కంపవేయడం వల్ల కోతుల చేతులకు గుచ్చుకుంటాయి. పెంకు కదలించలేవు. వర్షంవస్తే ప్రతి పెంకూ ఒక కాలువ అవుతుంది. వాన ధారలు అనేకం రాలుతుంటాయి.
వర్షధారలు అనేకం!
ఒకే రీతి - ఒకే లయ!
కప్పు కింద నిలిచి రెండు చేతులతో అన్నయ్యా, నేను వాటిని పట్టడం - కిలకిలా నవ్వడం. అన్ని ఇండ్ల ముందు నుంచి రాతితో కట్టిన మురికి కాలువలుండేవి. వాటిలో వాననీరు వేగంగా ప్రవహిస్తుంది. కాగితపు పడవలు అందులో వేస్తే వేగంగా కొంత దూరం సాగి మునిగేవి. అలా పోయినప్పుడు అదొక మహదానందం!
అసలు బాల్యమే ఆనందం!
మిగతా బతుకంతా పోయిన బాల్యాన్ని వెతుక్కోవడమే!
మొగల్ చక్రవర్తి జహంగీర్ - అతని బేగం నూర్ జహాఁ కవులు. కవితా ప్రియులు. ఆమె పేరులోనే కవిత ఉంది! నూర్ అంటే వెలుగు. జహాఁ అంటే లోకం. నూర్ జహాఁ అంటే లోకాలకు వెలుగు. అంత అందకత్తెట ఆమె!
షహిన్ షా - అతని భేగం మేడమీద నుంచున్నారు. పురవీధిని తిలకిస్తున్నారు. ఒక పండు ముదుసలి - షేర్వానీ - తల పాగాతో - నడుం వంగి - నేలను చూస్తూ - చేతులు ఆడిస్తూ సాగిపోతున్నాడు.
"భేగం! అతడేమిటి అలా వంగి ఉన్నాడు? నేలమీద దేన్నో వెదుక్కుంటున్నాడు" అడిగాడు జహంగీర్.
"హుజూర్! జీవిత భారానికి నడుం వంగి పోయింది! పోయిన బాల్యం దొరుకుతుందేమోనని వెదుకుతున్నాడు" అన్నది నూర్ జహాఁ.
భేగం కవితా వివరణకు జహంగీర్ పొంగిపోయాడు.
దొరుకుతుందేమోనని బాల్యం వెదుకసాగాడు.
"బచ్చఎన్ క జమానా భీక్యా ఖూబ్ జమానా థా"
"బాల్యంలో కాలం ఎంత అందమయింది!" అంటాడు ఒక ఉర్దూకవి.
"దుర్మార్గానికీ, దుఃఖాలకీ ఇవతలిగట్టున.
తొంగి తొంగి చూస్తున్నలోకం బాల్యం" అంటాడు మా అన్నయ్య - డాక్టర్ "దాశరథి" కృష్ణమాచార్య.
గూడూరు తామరల చెరువులో, ఖమ్మం ఊడల మర్రిలో బాల్యం దాచుకున్నాననే అపోహ నాది!
గూడూరులో చెరవుంది - తామరలు లేవు!
ఖమ్మంలో గుంటమల్లన్న గుడి ఉంది - ఊడల మర్రిలేదు.
నా బాల్యం వాటిల్లో దాచుకున్నాను! ఎక్కడ వెదకను? దొరకదని తేల్చుకున్నాను. తామరపూలు - మర్రిచెట్టు కథల్లో బాల్యం దాచుకున్నాను.
బాల్యం అంటే అంతే! ఆవేశంలో కొట్టుకుపోతాను. ఇండ్లమీద పెంకులు కప్పులను గురించి కదా చెప్పుతుంటిని!
కోతులు ఖమ్మం మెట్టు ప్రజలను నానా యాతనలు పెట్టేవి. ఇండ్ల కప్పులు ఉండనీయవు. చెట్టుకు కాయ దక్కనీయవు. ఇళ్లలోకి దూరి, తెలిసినట్టే అందుకొని చెట్టెక్కుతాయి! కోతులు నానా బాధలు పెట్టే ప్రాణులు.
అయినా ఒక వానర ప్రియుడు - వానర భక్తుడు - ఉండేవాడు. అతడు చిక్కా నరసింహం. బీటు బజారులో రైల్వే లైను ముందున్న వీధిలో ఉండేవాడు. అతడు జిలేబీలు పట్టుకొని కూర్చునేవాడు. కోతులు గుంపులుగా - మిత్రుని దగ్గరకివలె - వచ్చేవి. అతనికి హాని కల్పించేవి కావు. కనీసం బెదిరించేవి కూడా కావు. అతని చేతిలోంచి బుద్ధిగా జిలేబీలు తీసుకునేవి. అతని చుట్టు కూర్చొని తినేవి. కొన్ని మాత్రం జిలేబీలు అందుకొని ఇండ్ల కప్పుల మీదికి ఎక్కివి. జిలేబి ముక్క పడిపోతే దాని కోసం పెంకులు పెరికేవి. అందువల్ల చిక్కా నరసింహం అంటే జనానికి కోపం! అయినా ఎవరూ అతని మీదికి జగడానికి పోయేవారు కారు!
వానరుడు హనుమత్ స్వరూపుడు.
హరిభట్టు హనుమత్ ప్రసాదలబ్ధవరప్రసాదుడు.
ఈ ఊళ్లో ఎనిమిది హనుమద్దేవాలయాలున్నాయి.!
అంతేకాదు - జంతువుల విషయంలో కరుణ కనబరచడం భారత సంప్రదాయం. చీమలకు చెక్కర, పాములకు పాలు పోయడం మన సంప్రదాయం.
సకలభూత సమత్వమే యోగం.
విస్తళ్ళ ప్రస్తావన:
ఖమ్మం మెట్టులో ఇంటి పరిశ్రమ విస్తళ్లు కుట్టడం. పల్లెలలో మోదుగాకులు. అడవి నుంచి తెస్తారు. తోరణాలుగా గుచ్చుతారు. ఎండ పెడ్తారు. అలా ఎండిన మోదుగాకుల తోరణాలు ఎడ్ల బండ్లమీద ఖమ్మానికి తెస్తారు. ఆ తోరణాలను ఇంటి ముందే కొంటారు. తోరణాలు పెట్టుకునేంత విశాలంగా ఉండేవి ఇళ్లు. ఆ తోరణాల ఆకులు తడుపుతారు. దొంతరలుగా చేస్తారు. వాటి మీద విసుర్రాళ్లు పెడ్తారు. ఆ బరువుకు తెల్లవారేవరకు అవి అణుగుతాయి. ఆకులు విస్తళ్లు కుట్టడానికి అనువుగా అణుగుతాయి. అంతకుముందే చొప్పనుంచి చీరిపెట్టిన పుల్లలుంటాయి.