బండ్లు ఆ ఇంటి ముందు ఆగాయి. మా నాయన శిష్యులు వచ్చారు. వారి మనుషులు వచ్చారు. సామానులు దించారు. నాకూ మా అన్నయ్యకు అడావుడి. మేము చెంబు, తప్పేలా చేరవేశాం. ఇంటినిండా సామాను పరుచుకుంది. ఇంక సర్దుకోవాలి. చూడమ్మగారు వచ్చారు. వారి ఇంటికే సాపాటుకు రమ్మన్నారు.
చూడమ్మలు చాలామంది ఉన్నారు. అది వైష్ణవనామం. శూడిక్కుడుత్తనాచ్చి యార్ - దానికి సంక్షిప్తం చూడమ్మ. తన తలలో పెట్టుకొని సమర్పించిన అమ్మ అని ఆ అరవ పేరుకు అర్థం. దానికి సంస్కృతం "ఆముక్త మాల్యద" - ఆ పేరిట శ్రీకృష్ణదేవరాయలు ఒక మహాకావ్యం రచించాడు. అది వారి పాండిత్యంకే కాక -వారి లోకజ్ఞతకూ నిదర్శనం.
తమిళ ప్రాంతపు శ్రీవిల్లిపుత్తూరు. వైష్ణవ మహానుభావుడు విష్ణుచిత్తుడు. వారికి తులసివనంలో ఒక పసిపాప లభించింది. ఆమె ఆండాళు. విష్ణుచిత్తునకు రంగనాథుని కైంకర్యమే వృత్తి. వారు రోజూ పూలు తెచ్చి సాయంకాలం మాలలు అల్లి ఉంచేవారు. అండాళు వాటిని తన తలలో ముడుచుకుని - బావిలోని నీటిలో తన రూపం చూసుకుని మురిసి- మళ్లీ యథా స్థానంలో ఉంచేది. అలా ఆమె ముడుచుకుని తీసిన పూలను విష్ణుచిత్తుడు రంగనాథునికి అర్పించేవారు - ఆ విషయం తమకు తెలియకనే!
ఒకనాడు విష్ణుచిత్తుడు అండాళు పూలు ముడుచుకోవడం చూచాడు. వారించారు. వేరే పూలు తెచ్చారు. మాలలు కట్టారు. స్వామి వారికి సమర్పించడానికి తీసికెళ్లారు. స్వామి వాటిని స్వీకరించలేదు. ఆండాళు ధరించిన పూలే తమకు ఇష్టం అన్నారు. ఆనాటి నుంచి ఆండాళు ముడుచుకొని తీసిన పూలనే రంగనాథునికి సమర్పించారు. అందువలన ఆమె పేరు శూడిక్కుడుత్త నాచ్చియార్ - ఆముక్త మాల్యద అయింది.
ఆండాళు 30 పాశురాలుగల తిరుప్పావై రచించింది. పాశురం అంటే పద్యం. తిరుప్పావై తమిళ సాహిత్యానికి మకుటాయమానం. ఆ గ్రంథాన్ని అనుసరించే వైష్ణవులు "మార్గశిర" మాసంలో "మార్గళి" నిర్వహిస్తారు. ఆమె కవిత్వం అత్యంత సుందరం అయింది. "మదినిరయంద నన్నాళాళ్" - మనసును మురిపించే వెన్నెల రోజులు అంటుంది.
చూడమ్మగారు మాకు దగ్గరి బంధువు - నా భార్య కమలకు అమ్మమ్మ అవుతుంది. అంటే, సాక్షాత్తు కమల అమ్మమ్మకు స్వంత అక్కగారు. చూడమ్మగారు ఆత్మవిశ్వాసం, స్వాభిమానంగల వ్యక్తి.
చూడమ్మగారి అత్తగారిది హైదరాబాదు దగ్గరలోని బహద్దూర్ గూడెం. ఆమె భర్త మంచి వ్యవహర్త. ఇండ్లు,తోటలు, దొడ్లు కలవాడు. వారు అకాల మృత్యువాత పడినారు. ఆమె వయసులోనే విధవ అయింది. అక్కడివారు ఆస్తులన్నింటినీ కాజేశారు. ధైర్యంగా ఎదిరించింది. ఓడింది. ఆస్తులన్నింటినీ వదిలింది. ఆత్మ విశ్వాసంతో ఖమ్మానికి - తన తమ్ముడు రత్నమాచార్యులగారి దగ్గరకు వచ్చింది. వారి దగ్గరగా ఉండలేదు. ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నది. స్వతంత్రంగా పూటకూళ్ళు - అంటే, భోజన హోటలు - పెట్టింది.
ఖమ్మం చుట్టుపట్ల ఉన్న కరణాలూ, వైష్ణవులు కచ్చేరీ, అంటే ఆఫీసు పనుల మీద ఖమ్మం వచ్చేవారు. ఆ రోజుల్లో భోజనాల విషయంలో కుల నియమాలు గట్టిగా పాటించేవారు. వారికి చూడమ్మగారి పూట కుళ్లే శరణ్యం. అలా వచ్చిన వారు చూడమ్మ గారికి పావలా ఇచ్చి పోయేవారు. ఆమె మధ్యాహ్నానికి వారికి సంతృప్తిగా భోజనం పెట్టేది. ఆ వచ్చిన వారు పూట కూళ్ళకు వచ్చినట్లు కాక బంధువుల ఇంటికి వచ్చినట్లు భావించేవారు.
చూడమ్మగారు అందరినీ తమ బంధువులుగానే భావించేవారు. పేదవారిని అనేకమందిని ఆమె పోషించారు.
చిన్నగూడూరులో అన్నం - పాలు - కూరగాయలు అమ్మడం పాపంగా భావించేవారు. బస్తీలలో దిక్కులేని విధవలు మాత్రమే అన్నం అమ్ముకునేవారు. శ్రీనాథుడు "విశ్వస్త వడ్డించగా" అన్నాడు. అంటే - విధవరాలు వడ్డించిందని అర్థం. గురజాడవారి కన్యాశుల్కంలో పూటకూళ్ళమ్మ కూడా విధవరాలే! ఆంద్ర కేసరి టంగుటూరి ప్రకాశంగారి విధవ తల్లి ఒంగోలులో పూటకూళ్లు పెట్టి కొడుకును చదివించింది. అంటే, అన్నం అమ్ముకోవడం విధిలేని దశలోనే జరిగింది!
ఇప్పుడు అన్నం అమ్ముకోవడం ఒక పెద్ద పరిశ్రమగా మారింది. శ్రీమద్భాగవతంలో చెప్పిన కలియుగ లక్షణాల్లో అట్టి "శూలాన్యధికో భవంతి" - హోటళ్ళు ఎక్కువ అవుతాయి. అని చెప్పడం జరిగింది. ఈ యుగం లక్షణాలను వ్యాసుడు ఎంతో ముందుగా దర్శించాడు.
శ్రీ మద్భాగవతం పన్నెండవ స్కందంలో నేను అనువదించిన వానిని ఉటంకిస్తాను.
"కలికాలమున దినదినమునకు ధర్మము, సత్యము, శౌచము, క్షమ, దయ, ఆయువు, స్మృతి లోపించును. ధనమున్నవాడే ఆచారవంతుడు, గుణవంతుడు, బలవంతుడు, ధర్మపరుడు, న్యాయపరుడు, సర్వనియంత అగును. పెళ్లిళ్లలో కులము, యోగ్యత, శీలము చూడరు. వరునకు కన్య, కన్యకు వరుడు నచ్చిన వివాహములగును. నిజాయితి లోపించును. మోసము చేయగలవాడు. అబద్ధము లాడగలవాడు వ్యవహార దక్షుడగును. స్త్రీ విలువ - శీలముపై కాక, ఆమె రతి కౌశల్యముపై ఆధారపడి ఉండును. బ్రాహ్మణుని బ్రాహ్మణత్వము బ్రహ్మజ్ఞానము వలన కాక - జందెము వలన వ్యక్తమగును. బ్రహ్మచారులుగాని, సన్యాసులుగాని ఆశ్రమ ధర్మములను పాలించరు. వేసిన వేషముతో. తృప్తి చెందెదరు. వాగినవాడు పండితుడగును. అసాధుత్వమే సాధుత్వము. అసౌజన్యమే సౌజన్యము, స్వేకారమే వివాహమగును. దూరముగా ఉన్న బురదగుంట తీర్థము, వెంట్రుకలు పెంచుట లావణ్యము, కడుపు నింపుకొనుట పురుషార్థము, కుటుంబ పోషణే ఘనకార్యము, యశస్సు కోరుటే ధర్మ సేవనము అగును. ఇట్టి దుష్ట జనులే లోకమంతటను నిండియుందును."
ఇది ఈ కాలమునకు ఎంత వరకు అన్వయించినది పరిశీలించాలి. సామాజిక శాస్త్రంలో భారతీయులు చేసినంత కృషి, ఏర్పరచిన ఆచారములు, చేయించిన ఆచరణలు మరొకరు చేయలేదు. ఇది గ్రహించడానికి మనం ముందుగా పాశ్చాత్య బంధనాలను పటాపంచలు చేసుకోవాలి. ఆ బంధాలు మన ఆలోచనలకు సంకెళ్లు వేశాయి!
చూడమ్మగారు విధవరాలు, పేదరాలు, పూటకూటి ఇంటిది, బంధుత్వంతో మమ్ములను భోజనానికి ఆహ్వానించింది. మేము సహితము ఆమె అంతస్తును గురించి ఆలోచించలేదు. స్థిరపడేవరకు వారి వేంటనే భోజనాలు చేశాం.
చూడమ్మగారికి సంతానం లేదు. ఆమె చెల్లెలు రాగమ్మగారి కూతురు సింగరమ్మకు పెంచుకున్నది. సింగరమ్మత్తయ్య చాల అందంగా ఉండేది. ముట్టితే మాసిపోతుంది. అనిపించేది. ఆమె ఆనాటికే స్నోలు, పౌడర్లు, సబ్బులు వాడేది. అది మాకు విచిత్రం. అప్పటికే ఆమెకు పెళ్లయింది. వారు మాకు వరుసకు మేనమామ. ముఖాన స్ఫోటకం మచ్చలతో అనాకారి కాకున్నా అత్తయ్యకు తగినవాడు కాడు.
సింగరమ్మత్తయ్యకు నేనంటే ఎంతో ఇష్టం. ఆమె నన్ను ఎత్తుకొని ముద్దులాడేది. అదేదో మహదానందంగా ఉండేది. ఎప్పుడూ ఆమె ఒడిలోనే ఉండిపోవాలనిపించేది. అందువల్ల స్థిరపడిన తరువాత సహితం ఎక్కువ సింగరమ్మత్తయ్య దగ్గిరే ఉండేవాణ్ణి. అప్పటికి నాకు ఇంకా పుట్టు వెంట్రుకలు తీయలేదు. అత్తయ్య నాకు జడవేసి, కాటుక పెట్టి "నువ్వు రంగమ్మవు" అని నన్ను ముద్దులాడేది. ఆమె ముద్దుల్లో నేను పరవశం అయ్యేవాణ్ణి.
అత్తయ్య నాకు సబ్బు రాయడంగాని, స్నో పౌడర్లు వేయడంగాని చేసేది కాదు. ఎంచాతంటే, మావాళ్ల దృష్టిలో అవి బ్రాహ్మలు వేసుకునేవి కావు. బోగం వాళ్లు వేసుకునేవి! అందుకే అత్తయ్యను వాళ్లు దూరంగా ఉంచేవాళ్లు. నన్ను అక్కడికి వెళ్లనిచ్చేవాళ్లు కారు. అయినా నేను దొంగతనంగా పోయేవాణ్ణి. ఆమె ఒడిలో ఒదిగిపోయేవాణ్ణి.
చూడమ్మ అమ్మమ్మ ఇంటికి తరచువెళ్లడానికి మరొక కారణం ఉంది. వాళ్ల వాకిట్లో కూర్చుంటే వచ్చే పోయే బస్సులు కనిపించేవి. అప్పుడు ఖమ్మం నుంచి రెండు బస్సులు సూర్యాపేటకు, రెండు బస్సులు వరంగల్లుకు వెళ్లడం - రావటం జరిగేది. అవీ చిన్నవిగా ఉండేవి. అన్నయ్యా, నేనూ వచ్చే పోయే బస్సులను చూచి మురిసిపోయేవాళ్ళం.
అప్పుడు బస్సుల డిపో సరిగ్గా స్టేషను పక్కనే ఉండేది. R.T.D. రైల్వేకు అనుబంధంగా ఉండేది. అందువల్ల దానికి N.,S.R,. R.T.D. అని పేరు. అది నిజాం స్టేట్ ట్రాన్స్ పోర్టు డిపార్ట్ మెంట్ పూర్తిగా ప్రభుత్వ సంస్థ. బహుశా రవాణాను జాతీయం చేసిన తొలి ప్రభుత్వం నిజాముదే కావచ్చు.
ఇక్కడ NSRను గురించి కొంత వివరించాలి: ఇంగ్లీషు కంపెనీవారు నిజాంలో రైల్వే లైను వేస్తామన్నారు. పెట్టుబడి ప్రభుత్వానిది, పని ఇంగ్లీషు కంపెనీ చేస్తుంది. మహబూబ్ ఆలీఖాన్ నిజాం నవాబు అందుకు అంగీకరించలేదు. రైలు అంగ్రేజు ప్రాంతం నుంచి తెలివి తేటలు మోసుకొని వస్తుందని అతని భయం! అయితే అది వ్యక్త పరచలేక, నష్టాలు రావచ్చు అన్నాడు. ఇంగ్లీషువారు నిజామును తలతన్నినవారు, వదులుకుంటారా? నిజాముకు నష్టం రాకుండా కొంతకాలం వరకు గ్యారంటీ ఇచ్చారు. అందువల్ల అది N.G.S.R. అంటే, నిజామ్స్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే అయింది. గ్యారంటీ పీరియడ్ అయిపోయింతరవాత N.S.R అయింది. బహుశః ప్రభుత్వం నిర్వహించిన రైల్వే కూడా ఇదే మొట్టమొదటిది కావచ్చు.