Previous Page Next Page 
సామ వేద సంహిత పేజి 17

     

                  యస్య నిః శ్వసితం వేదా యోవేదేభ్యో2ఖిలం జగత్|
                    నిర్మమే తమహం వన్దే విద్యాతీర్ధ మహేశ్వరమ్ ||

                                             అరణ్యకాండ
                                          ఆరవఅధ్యాయము
                                          మొదటి ఖండము   

   
ఋషులు :- 1. భరద్వాజుడు. 2. వసిష్ఠుడు. 3,6. వామ దేవుడు. 4. సునశ్శేపుడు. 5. గృత్సమదు. 7,8. అమహీయుడు.
   
1.    వజ్రహస్త, సుందర హను ఇంద్రా! మేము ఆశించినదియు, ద్యులోక భూలోములను పూరించునదియు, ప్రశంసనీయము, బలదాయకము, తృప్తికరము అగు అన్నమును మాకు అందించుము.
   
2.    ఇంద్రుడు స్థావర, జంగమ ప్రపంచమునకు ప్రభువు. అతడు భూమి మీద ఉన్న సమస్త సంపదలకు స్వామి. దాతలకు అధిక ధనము అందించును. అట్టి ఇంద్రుడు ప్రశంసణీయ ధనము మాకు అందించును గాత.
   
3.    ఇది హవిస్సు. తేజోయుతము. ఇంద్రస్తోత్రయుక్తము. యజమానికి స్వర్గదాయి. ఇంద్రుని బహుళ ధన దానయోగ్య.
   
4.    వరుణదేవా! మా తలలకు కట్టిన నీ పాశములను పైకి జరిపి వదులు చేయుము. కాళ్ళకు కట్టిన పాశములను క్రిందకు జరిపి వదులు చేయుము. నడుమునకు కట్టిన పాశమును తొలగించుము.
   
    అదితి పుత్ర వరుణా! మేము శునశ్శేపులము మేము నిన్ను గూర్చి వేయు వ్రతము బాధారహితము, దోషరహితము అగును గాక.
   
5.    సోమమా! నీవు పవిత్రమున శుద్దము చేయబడుదువు. నీ సాయమున మేము సంగ్రామములందు శౌర్య పరాక్రమములు ప్రదర్శించగలము.
   
    మిత్రావరుణులు, అదితి, సముద్రము, ద్యులోక, భూలోకములు మాకు ధనము నిచ్చి వర్ధిల్లచేయుదురుగాక.
   
6.    దేవతలారా! సోమము దాతలందు అద్వితీయము. అది మా కోరికలు తీర్చునట్లును, మాకు ఫలములు ప్రసాదించునట్లును చేయండి.
   
7.    సోమమా! నీవు మాకు ధనములు ప్రసాదించు దానవు. మేము ఇంద్రుని, మిత్రుని మరుత్తులను యజించుటకుగాను ధారగా విచ్చేయుము.
   
8.    ఇది సోమ రూప అన్నము. ఇది మానవులకు, లోకములకు చెందినది. మేము దీనిని పంచగోరుచున్నాము. పంచుచున్నాము.
   
9.    నేను అన్నమును. అగ్ని వరుణాది దేవతల కన్న ముందు ఉండినదానను. నేనే అమృతమును. నేనే ఋతమును. ఎవడు నన్ను దానము చేయుచున్నాడో వాడు సకల ప్రాణులను రక్షించుచున్నాడు. అన్నము దానము చేయని వానిని నేను మ్రింగుదును.
   
                                              రెండవ ఖండము
   
ఋషులు :-1. శ్రుతకక్షి. 2. అరురుచి. 3,4,5. మధుచ్చందుడు. 6. గృత్సమదుడు. 7. నృమేధ. పురుమేధులు.
   
1.    ఇంద్రదేవా! నల్లని, ఎర్రని, రంగురంగుల ఆవులందు ప్రకాశమానమగు తెల్లనిపాలను ఏర్పరచినావు. అందుకు మేము నిన్ను కీర్తించుచున్నాము.
   
2.    ఆదిత్యుడు ఉషస్సంబంధి. అతడు స్వయంప్రకాశకుడు. సర్వమును ప్రకాశము చేయువాడు. లోకములకు వర్షము వలన అన్నము, బలము కలిగించుటకు గర్జించును. సూర్యుడే ఓషధులకు గర్భము కలిగించుచున్నాడు. పంటలు పడించుచున్నాడు.
   
3.    ఇంద్రుడు వజ్రధారి. ఆభరణధారి. అతడు అశ్వములను ఒక చోట నిలుపగలడు. మాటమాత్రమున వానిని రథములను పూన్చగలడు.
   
4.    ఇంద్రా! నీవు ఉగ్రుడవు. నీ రక్షణలు ఉగ్రతమములు. మమ్ము సాధారణ యుద్దములందును, వేల ఆయుధముల యుద్దములందును రక్షింపుము.
   
5.    'ప్రథ' వసిష్ఠ పుత్రుడు. 'సప్రథ' భరద్వాజ పుత్రుడు. నేను ప్రథను నా తండ్రియగు వసిష్ఠుడు అనుష్టుప్ ఛందోయుక్తము, హవి కలిగించునది అగు రథంతార సామమును ధాత మరియు విష్ణువు నుండి పొందినాడు.
   
6.    వాయుదేవా! నియుతులను వాహనముల మీద విచ్చేయుము. వెలగొందు సోమము విధి విహితముగా సిద్దపరచినాము. నీవు సోమముగల వారి ఇంటికి చేరుదువు కదా!
   
7.    ఇంద్రా! నీ కన్న ముందు ఏమున్నది? నీవు అనాదివి. ధనవంతుడవు. నీవు వృత్రుని వధించినపుడే ప్రకటితమైనావు. అప్పుడే నీవు భూమిని వెలువరించినావు. దృఢపరచినావు. అట్లే ద్యులోక అంతరిక్షములను స్థిరపరచినావు.
   
                                              మూడవ ఖండము
   
ఋషులు :- 1,5,7,10. వామదేవుడు. 2,3. గోతముడు. 4. మధుచ్చందుడు. 6. గృత్సమదుడు. 8,9. భరద్వాజుడు. 11. హిరణ్యస్తూపుడు. 12,13. విశ్వామిత్రుడు.
   
1.    పరమేష్టి దివి యందు ద్యోతమానుడై ఉన్నాడు. అతడు నా యందు బ్రహ్మ తేజమును పెంచి స్థిరపరచును గాత. నాకు కీర్తి కలిగించి స్థిరపరచును గాత. యజ్ఞమందలి హవిస్సులను పెంచి స్థిరపరచునుగాత.
   
2.    సోమమా! నీకు క్షీరములు కలుగును గాక. అన్నములు కలుగును గాక. బలములు కలుగును గాక. నీవు అమృతమవై అన్ని దిశలందు వర్ధిల్లుము. స్వర్గమునందు మాకు అన్నము కలిగించుము.
   
3.    సోమమా! నీవే సకల జగములందు ఓషధులు కలిగించినావు. నీరు కలిగించినావు. గవాది పశువులను కలిగించినావు. విశాల అంతరిక్షమును వ్యాపింపచేసినావు. అంధకారమును అంతము చేసినావు. వెలుగులను పెంచినావు.
   
4.    అగ్ని పురోహితుడు. దేవ యజ్ఞములకు ఋత్విజుడు. హోత. రత్నదాత. అతనిని ఆరాధించుచున్నాము.
   
5.    అగ్నిదేవా! అంగిరసులు తొలుత నిన్ను స్తుతించుటకు శబ్దములు కనుగొన్నారు. పిదప స్తుతి సాధనలగు ఛందస్సులను కనుగొన్నారు. తదుపరి స్తుతులు రచించినారు. అప్పుడు జనులు ఉషస్సును స్తుతించినారు. వెలుగొందు సూర్యుని స్తుతించినారు. దీప్తివంతమగు వాణిని స్తుతించినారు. ఆవిధముగ స్తుతులు ఆవిర్భవించినవి.
   
6.    ఒక జలము ఆకసము నుండి కురియును. రెండవది భూమి మీద ఉండును. అవి రెండు కలియును. నదులుగా మారి పారును. సముద్రమున చేరును. సాగర మధ్యపు బడబాసలమును తృప్తిచెందించును. ఆ జలములకు పౌత్రుడు నిర్మలమై దీప్తమంతమై, శుద్దమై మనకు దగ్గరలో లభించును.
   
    (ఈ జలముల పుత్రుడు మేఘము. పౌత్రుడు వర్షము.)
   
7.    రాత్రి భద్రయువతి. అదిగో వచ్చుచున్నది. చంద్ర కిరణములను కూడి వచ్చుచున్నది. ఈ భద్రరాత్రి సకల జగములను సుఖ నిద్ర పుచ్చుచున్నది.
   
8.    వైశ్వానరా! నీవు హవివంతుడవు. వరదుడవు. నేను నీ తేజస్సును స్తుతించుచున్నాను. అందుకే మా స్తుతి యాగములందు వైశ్వానరుని చేరింది. అగ్నిని చేరినది. అది నవ్యమై, జాతవేదియై, నిర్మలమై, చారుశీలమై సోమము దశా పవిత్రము నుండి వలె నా హృదయకుహరము నుండి వెడలినది.
   
9.    సమస్త దేవతలారా! నేను స్తుతించుచున్నాను. ఆకర్ణించండి. అపాన్నపాత అగ్నీ! భూలోక, ద్యులోకములారా! నా స్తుతులు వినండి. మనసున నిలుపుకొనండి. మీకు గిట్టని పలుకులు పలకను. మీకు రుచించునవే ఉచ్చరింతును. కావున మా దరికి చేరండి. మా వద్దనే సంబరపడండి.
   
10.    దేవతలారా! నాకు ద్యావాపృథ్వుల యశస్సు కలుగునుగాక. ఇంద్ర బృహస్పతుల యశస్సు కలుగును గాత. ఆదిత్యుని యశస్సు కలుగునుగాక. ఈ యశస్సులు నన్ను విడువకుండునుగాక. సభాయశస్సులు నాయందు చేరునుగాక.
   
11.    వజ్రహస్త ఇంద్రుడు చేసిన మహా పరాక్రమ కార్యములను - ఇదిగో ఇప్పుడే - చెప్పుచున్నాను. అవి ఏవి? అనిన వినండి :-
   
    మేఘమును బాదుత మొదటిది. వర్షము కురిపించుట రెండవది. కురిసిన నీటి నదులకు, తటములు నిర్మించి ప్రవహింపచేయుట మూడవది.
   
12.    నేను అగ్నిని. జాతవేదను - పుట్టుకతోనే సర్వము తెలిసినవాడను - నా నేత్రము ఘ్రుతమగును. నా నోట అమృతమున్నది. నేను ప్రాణమును. నేనే వాయురూపమున అంతరిక్షమున ఉన్నాను. నేనే అక్షయుడగు సూర్య రూపమున ద్యులోకమున అధిష్టించి ఉన్నాను. "అప్మీసర్వమ్" సమస్తము నేనే అయి ఉన్నాను.
   
13.    ఈ అగ్ని భూమియొక్క ప్రధాన స్థానమును రక్షించును. ఈ మహాగ్ని సూర్యుడు సంచరించు అంతరిస్ఖమును రక్షించును. అంతరిక్షమందలి సప్తమారుతములను రక్షించును. ఈ దర్శనీయ అగ్ని దేవతలకు ఆనందదాయక యజ్ఞమును రక్షించును.
   
                                               నాలుగవ ఖండము
   
ఋషులు : 1,2,8-12. వామదేవుడు. 3-7. నారాయణుడు.
   
1.    అగ్నిదేవా! నిన్ను ఋత్విజులు ప్రజ్వరిల్ల చేయుదురు. నీవు సర్వోపరి విరాజిల్లువాడవు. నీ నోరు ప్రకాశమానము. అందలి నాలుక హవిస్సులు భక్షించును.
   
    అగ్నిదేవా! నీవు దానములను పుట్టించువాడవు. మాకు అన్నమును, ధనమును, చూడడగు తేజస్సును ప్రసాదించుము.
   
2.    వసంతము రమణీయము. గ్రీష్మము రమణీయము. వర్షము రమణీయము. శరత్తు రమణీయము. హేమంతము రమణీయము. శిశిరము రమణీయము.

 Previous Page Next Page