3. ఆ పురుషుడు వేల తలలవాడు. వేల కనులవాడు. వేల పాదములవాడు. అతడు సమస్త భూమండలమందు వ్యాపించగా పదివ్రేళ్ళంత మించినాడు.
(దశాంగులమ్ =రెండు బెత్తలు లేక జానెడు.)
4. అతడు ఈ లోకములను తాకకుండనే పైకి లేచినాడు. ఈ సమస్తము అతని ఒక అంశము మాత్రమే. అతడు మరల మరల అవతరించుచున్నాడు. అతడే విశ్వవ్యాప్తమై ఉన్నాడు. అతడే చేతనాచేతనములందు వ్యాపించి ఉన్నాడు.
5. దృశ్యమానమగు సమస్తము అతడే అగును. పుట్టినది, పుట్టనున్నది అతడే అగును. ఈ సమస్త భూతములు అతనిలో పాతికవంతు అగును. మిగిలిన ముప్పాతిక ప్రకాశాత్మక అమృతత్వము అగును.
6. భూత, భవిష్యత్, వర్తమానములు ఆ పురుషుని మహిమ వలననే కలుగుచున్నవి. అతని మహిమ అంతకన్న గొప్పది అతడు అమృతత్వమునకే ప్రభువు. ప్రాణులను జీవింపచేయుటకు మాత్రమే అన్నము అగుచున్నాడు.
7. ఆ మహాపురుషుని నుండి బ్రహ్మాండము ఉత్పన్నమైనది. ఆ బ్రహ్మాండము మీద ఒక పురుషుడు జన్మించినాడు. అతడు వివిధ ప్రాణులను కల్పించినాడు. అతడు అప్పుడు భూమిని కల్పించినాడు. తదుపరి ఆ ప్రాణులకు రూపములు ఏర్పరచినాడు.
8. ద్యావాపృథ్వులారా! మీరు మంచి పోషకులని మాకు తెలియును. మీరు అపరిమిత ధనములను అన్ని దిశలందు వర్ధిల్లచేయండి. మాకు సుఖములు కలిగించండి. మమ్ము పాపముల నుండి విముక్తులను చేయండి.
9. ఇంద్రా! నీ గడ్డము, మీసములు హరితములు. నీవు 'హరి' అశ్వుడవు. గోవులను పూజించు కవులు ప్రసిద్దుడవగు నిన్ను స్తుతించుచున్నారు.
10. బంగారపు వర్చస్సు, గోవుల వర్చస్సు, సత్యపు వర్చస్సు, వేదముల వర్చస్సు మాకు కలుగునుగాత.
11. ఇంద్రా! నీవు స్తుతించు వారిని ఆశీర్వదించువాడవు. నీవు బలములకు ఈశ్వరుడవు. మాకు శత్రువులను అణచగల బలమును ప్రసాదించుము. మా యజ్ఞమునకు చాలునంత ధనమును, బలమును కలిగించుము. మమ్ము బాధించదలచు శత్రువులను హతాశులను చేయుము.
12. గోవులారా! మీరు విశ్వ సమస్త రూపములు ధరించండి. వృషభములు, వత్సముల సహితముగా పాడి కలిగి వర్ధిల్లండి. విశాల విశ్వము మీకే చెందును గాక. ఈ భూమి మీద జలములు సుఖముగా త్రాగగలవి అగును గాక. మీరు వర్ధిల్లండి.
అయిదవ ఖండము
ఋషులు : 1. శతంవైఖానసులు. 2. విభ్రాణుడు. 3. కుత్సుడు. 4-6. సర్పరాజ్ఞి. 7-14. ప్రస్కణ్వుడు.
1. అగ్నీ! మా ఆయుష్యములను పెంచుము. అన్నములను, బలములను మా ముందుకు పంపుము. కుక్కలవంటి రాక్షసులను దూరమున పీడించుము.
2. సూర్యదేవా! యాజమానికి నిరాటంక ఆయువు ప్రసాదించుము. ఈ సోమము మధుయుక్తము. దీనిని మరింత పానము చేయుము. నీవు వాయుప్రేరణతో జగములను రక్షించుచున్నావు.
సూర్యుడు ప్రజకు వర్షము కలిగించును. పోషించును. ప్రకాశించును.
3. సూర్యుడు చిత్రవిచిత్రుడు. అతని కిరణములు కాంతి పుంజములు. అవి మిత్ర, వరుణ, అగ్నులకు నేత్రములగుచున్నవి. అట్టి విచిత్ర సూర్యుడు ఉదయించినాడు!
ఉదయించిన సూర్యుడు ద్యావా, పృథ్వి, అంతరిక్షములను తన వెలుగులతో నింపినాడు. అతను స్థావర, జంగమాత్మక విశ్వమునకు చైతన్యము కలిగించుచున్నాడు.
4. సూర్యుడు సాగువాడు. వెలుగులు నింపువాడు. అతడు ఉదయాద్రిన ఉదయించినాడు. తల్లి వంటి భూలోకమునకు చేరినాడు. పిదప తండ్రి వంటి ద్యావా, అంతరిక్షములకు చేరుచున్నాడు.
5. ఈ సూర్యుని దీప్తులు ప్రాణ వాయువును పైకి చేర్చి క్రిందకు దింపుచు దేహము నందు సంచరించుచుండును.
ఈ మహాసూర్యుడు, అంతరిక్షమును ప్రకాశవంతము చేయుచున్నాడు.
6. సూర్యుడు పగటి ముప్పది గడియలు ఎంతో తేజస్సున వెలుగును. ఇది నిశ్చయము. అప్పుడు వేదవాణి సూర్యుని స్తుతించుచున్నది.
7. విశ్వచక్షువగు సూర్యుని చూచి దొంగల వంటి నక్షత్రములు రాత్రితో పాటే నిష్క్రమించును.
8. అగ్నులవంటి ప్రకాశమానములగు సూర్య కిరణములు జనులను క్రమక్రమముగా వీక్షించుచున్నవి. (సూర్యుడు క్రమక్రమముగా ఎదుగుచున్నాడని.)
9. సూర్యదేవా! నీ మార్గము అన్యులకు దుర్గమము. నిన్ను విశ్వ జనులు దర్శించుచున్నారు. నీవు చంద్రుడు మున్నగు జ్యోతులకు కాంతిని ఇచ్చుచున్నావు. సకల విశ్వములను వెలిగించుచు ప్రకాశించుచున్నావు.
10. సూర్యదేవా! నీవు దేవతలముందు ఉదయించుచున్నావు. నరులముందు ఉదయించుచున్నావు. విశ్వములముందు ఉదయించుచున్నావు. స్వర్గముముందు ఉదయించుచున్నావు.
(అందరికి సూర్యుడు తమ ముందే ఉదయించినట్లనిపించును. అతడు అందరికి సమానముగ ఉదయించును.)
11. పావక, అనిష్ట నివారక సూర్యా! నీవు సకల ప్రాణి జాలమును పోషించుటకు వారిని ఏకంటితో చూచుచున్నావో దానిని మేము స్తుతించుచున్నాము.
12. సూర్యదేవా! నీవు రాత్రింబవళ్ళను కొలతలు వేయుచు, ప్రాణి జాలమును వీక్షించుచు విశాల ద్యులోక, అంతరిక్షములందు ఉదయించుచున్నావు.
13. సర్వ ప్రేరకుడగు సూర్యుడు శోధించునవియు, రథమును చక్కగా నడుపుననియునగు సప్తాశ్వములను రథమునాకు కట్టినాడు. ఆ రథము మీద యజ్ఞమునకు విచ్చేయుచున్నాడు.
14. సప్తత్వా హరితో రథే వహన్తి దేవ సూర్య!
శోచిష్కే శం విచక్షణ.
సూర్యదేవా! నీవు సర్వ ప్రకాశకుడవు. తేజస్సే కేశములుగా కలవాడవు. నిన్ను సప్తాశ్వములు వహించుచున్నవి.
దాశరథి లక్ష్మణాచార్య బుచ్చమాంబల పౌత్రుండును, విద్వాన్ దాశరథి వేంకటాచార్య వేంకటాంబల పుత్రుండను, బహు గ్రంథ కర్తయునగు దాశరథి రంగాచార్య విరచిత శ్రీమదాంధ్ర వచన సామవేద సంహిత యందలి పూర్వార్చిక సమాప్తము.
సర్వేభవన్తు సుఖినః